శారద మనస్సు బాధ పడిందని వదినామరదళ్ళు ఇంక చీర ప్రసక్తి తేలేదు. శకుంతల కూడా పరిస్థితి గమనించి ఉన్న కాస్సేపూ మంచిగానే మాట్లాడింది.
చాలా సేపు పిచ్చపాటి మాట్లాడి మధ్యాహ్నం మూడింటికి వెళ్ళింది శారద అంతవరకూ రమేష్ తన గదిలోనే కూర్చుని తను మొదలు పెట్టిన కొత్త నవల వ్రాసుకుంటున్నాడు. శారద వెళ్ళగానే చీర తెచ్చి రమేష్ కు చూపించింది వసుంధర. శారద సద్భుద్ది కి , మర్యాదకూ ఎంతో సంతోషించాడు రమేష్.
"ఒక్క సంగతి అడుగుతా , చెపుతావా వసూ?" అన్నాడు రమేష్.
"ఏమిటది?"
"ఎవరయినా చేసుకుంటా నంటే శారద పెళ్ళికి ఒప్పుకుంటుందా?"
"ఏం , శారదను చూస్తె మీకూ హేళనగా ఉందా? అన్నీ తెలిసిన మీరు కూడా ఆమె మనస్సు కి కష్టం కలిగించే మాటలు అందామను కున్నారా?"
"కాదు వసుంధరా. అసలు పెళ్ళికి ఒప్పుకుంటుందంటే ఉన్న సంగతి చెప్తాను. నేను హేళనగా మాట్లాడటం లేదు. మనస్పూర్తిగా శారద జీవితాన్ని తీర్చి దిద్దుదామనే అడుగుతున్నా."
"తనను ఎవరు చేసుకుంటారని అనేక సార్లు నాతొ బాధపడుతూ చెప్పింది. ఆ ముసలి తల్లి ఎన్నాళ్ళ ని బ్రతుకుతుంది? ఆవిడ పొతే శారద ఏకాకిగానే ఉండాలి గదా? ఎంత సంపాదించుకుని తన బ్రతుకు తాను బ్రతుకుతున్నా , లోకం ఊరుకోదు. వింతంతువయినా ఎంతో మర్యాదా, మన్ననా ఉంటాయి. కాని వివాహం చేసుకొని ఆడదానికి ఎంత నిప్పులాంటి దానికయినా గౌరవం ఉండదు. సంఘం ఆ వ్యక్తిని తప్పక పతితురాల్ని చేస్తుంది. పెళ్లి చేసుకోమంటే అలాంటి అనాకారినా అంటారు గాని, తమ తమ కాముకత్వానికి ఆమెను బలి చెయ్యాలంటే శారద అందచందాలు అడ్డు రావు. ఎప్పుడో ఒకప్పుడు ఆమెను వంచించి తీరుతారు. అదే శారద మనోవ్యధ." అన్నది వసుంధర.
"మనింటికి భోజనానికి వచ్చిన మా అసిస్టెంట్ మానేజరు రామారావుని చూశావుగా? భార్య పోయి సంవత్సరమైంది. నా కెందుకో ఆయనతో శారద విషయం సంప్రదించాలనే బుద్ది పుట్టింది. నీ ఉద్దేశ్యం?"
"ఒక అభాగ్యురాల్నీ ఒక ఇంటిదాన్ని చేస్తానంటే ఎవరు కాదంటారు, చెప్పండి?" అన్నది వసుంధర.
రెండు రోజులు గడిచాక రమేష్ , రామారావు ఇంటికి వెళ్ళాడు. ఎన్నడూ తన ఇంటికి రాణి రమేష్ ఎందుకు వచ్చాడో రామారావు కు అర్ధం కాలేదు. కుర్చీలో కూర్చున్న రమేష్ ముఖ కవళికలను బట్టి అర్ధం చేసుకున్నాడు.
"ఏం విశేషాలు రమేష్?"
"మీకు తెలీందేముంది? శారద విషయం...."
"ఓ. ఆరోజున మీ ఇంట్లో చూసిన అమ్మాయా?"
"అవునండీ."
"నేనూ రెండు మూడు రోజులు ఆలోచించాను. నా భార్య పోయి సంవత్సరం దాటినా, నాకు ఇంతవరకూ వివాహేచ్చ కలగలేదు. ఏనాటి ఋణానుబంధమో నాకు అనాకారి అయినా శారదను చేసుకోవాలని బుద్ది పుట్టింది. ఎందుకు గాను నాకు శారదను చేసుకోవాలని పించిందో అర్ధం కావటం లేదు. శారద కు ఇష్టమయితే ఆమెను చేసుకోవటానికి నాకేం అభ్యంతరం లేదు. ఒక్క విషయం . పెళ్లి ఎంత నిరాడంబరంగా జరిపిస్తే అంత సంతోషిస్తాను." అన్నాడు రామారావు.
రామారావును పదేపదే అభినందించి, నమస్కరించి వెళ్ళాడు రమేష్.
వసుంధర, కామాక్షి వెళ్లి శారద తల్లితో ఈ విషయం చెప్పారు. రెండో పెళ్ళని సంశయించ నక్కర్లేదని , చిన్నవాడే నని , నెలకు మూడు వందలు జీతమనీ చెప్పారు.
శారద తల్లికి ఇదంతా కలగా అనిపించింది. కూతురుకు పెళ్లవుతుందనీ , అందులో ఇంత త్వరలో అనుకోకుండా అవుతుందనీ ఆవిడ ఎప్పుడూ అనుకోలేదు. ఆ పరమాత్ముడే రామారావు లో ప్రవేశించి అతన్ని ఒప్పించాడా అనుకుంది.
శారద మనస్సు నిండు కుండ. కామాక్షి పాదాలకు నమస్కరించి "అంతా మీ ఇష్టం వదినా" అన్నది. అంతకన్న ఏమీ చెప్పలేక పోయింది. వసుంధర సంతోషానికి మేరలేదు. శారదను పదేపదే కవ్వించింది, నవ్వించింది.
ఒక సుముహూర్తాన రామారావు కూ, శారదకూ వివాహ మయింది. శారద తరపున వసుంధర, రమేష్ పెండ్లి పెద్దలయ్యారు. పెళ్లి నిరాడంబరంగా, సలక్షణం గా జరిగింది. శారద తల్లి సంతోషానికి మేరలేదు. ఆమెకు పెద్ద బరువు దింపినట్లయింది. తన జీవితానికి ఇంక దిగులు లేదనుకుంది. వసుంధర నూ, కామాక్షి ని ఆమె దేవతా మూర్తులు లా భావించింది.
శారద జీవితంలో జాజి మల్లెలు పూశాయి. రామారావు జీవితంలో ఆగిపోయిన స్టేషను నుంచి రైలు బయలుదేరి నట్లయింది.
21

శకుంతల పిల్లాడు యదా ప్రకారంగా కామాక్షి పెంపకం లోనే పెరుగుతున్నాడు. కామాక్షే నీళ్ళు పోసి, తలదువ్వి, బట్టలు కట్టి , అన్నం తినిపిస్తున్నది. రాత్రిళ్ళు కూడా కామాక్షి పక్కలోనే పడుకుని నిద్రపోతున్నాడు.
శారద వివాహమయిన తరువాత రమేష్ మళ్ళీ ఒకసారి ప్రసాదాపురం వెళ్లి పైకం అంతా లెక్క జూసి తెచ్చుకున్నాడు. మొత్తం పదివేల అయిదు వందలు వచ్చింది. రాఘవరావు ఫోర్జరీ కాంట్రాక్టు కాగితం యిదివరకే రద్దు చేసుకున్నాడు. ఇదంతా రామయ్య గారు కలుగాచేసుకోవటం నుంచే.
డబ్బు తీసుకుని నాలుగు రోజుల్లో రమేష్ వచ్చేశాడు. మర్నాడే బ్యాంకు లో డిపాజిట్ చేశాడు. ఈ రీతిగా ప్రసాదపురానికి , వాళ్ళకూ ఋణం తీరిపోయింది. తాతల నాటి నుంచి ఉన్న పొలం తన హయాం లో అమ్మవలసి వచ్చినందుకు రమేష్ మనస్సు కు కష్టంగానే ఉంది. కాని పరిస్థితులు అట్లా వచ్చినాయి.
కొంతమంది దృష్టి లో ఆస్తి పాస్తులు అమ్ముకోవడం తప్పని పిస్తుంది. బ్రతికి చెడిన వాళ్ళే ఆస్తులు అమ్ముకుంటారని వాళ్ళ ఉద్దేశం. సదుద్దేశ్యంతో అమ్ముకున్నా వాళ్ళ దృష్టి లో చెడి పోయినట్లే.
నాగభూషణం బ్రతికున్నన్నాళ్ళూ , సెంటు భూమి తన చేతి మీదుగా అమ్మలేదు. పెద్ద కొడుకులు యిద్దరూ భాగాలు పంచుకోగానే అమ్ముకున్నారు. తండ్రి పోవటం తోనే పొలం తనూ అమ్మటం నుంచి అన్నయ్యల మార్గం లోనే నేనూ పోతున్నాను' అన్నాడు రమేష్. కామాక్షి తో. కామాక్షి మనస్సులో కుమిలిపోయింది.
ఇంక ప్రసాద పురం లో మిగిలింది ఒక్క పెంకు టిల్లు మాత్రమే. అది కూడా ధర వస్తే అమ్ముతానని రమేష్ ఆ ఊళ్ళో వాళ్లతో చెప్పి వచ్చాడు. కాని ఎవ్వరూ మొగ్గ లేదు. ఎప్పటి కయినా అదీ అమ్మేసేదేనని మనస్సులో నిశ్చయించు కున్నాడు రమేష్.
ఒకరోజున వసుంధర, రేమేష్ తో మాట్లాడ కుండా మంచం మీద అటు వైపుకు తిరిగి పడుకున్నది. రమేష్ మెల్లగా ఒంటి మీద చెయ్యి వేసి, "ఇటు తిరుగు , వసూ. నామీద అంత కోపం ఎందుకో?!" అన్నాడు.
వసుంధర ఇటు తిరగలేదు. వసుంధర ను తన వైపు కు తిప్పుకున్నాడు రమేష్. కంట తడి పెట్టింది వసుంధర.
"అదేమిటి వసూ? కంట తడి ఎందుకు?" అన్నాడు.
వసుంధర మాట్లాడలేదు.
"చెప్పవా, వసూ? చెప్పకపోతే నామీద ఒట్టే" అంటూ ఆమె కళ్ళు తుడిచాడు. "ఇంక చెప్పవూ" అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు.
"చెప్పమంటారా? చెపుతాను. మన మేం కానివాళ్ళమూ, గతి లేని వాళ్ళమూ కాదు. ఎంత వరకూ మన హద్దుల్లో మనం ఉండాలో అంత వరకూ ఉంటేనే మనకు గౌరవం ఉంటుంది.మితం తప్పితే కూరలో పురుగుని విదిలించి నట్లుగా లెక్కచెయ్యరు . ఒప్పుకుంటారా?" అన్నది వసుంధర.
"తప్పకుండా . ఇంతకూ ఏం జరిగింది?"
"ఈవాళ ఒక విషయం జరిగింది. శకుంతల పిల్లాడు మన యింట్లో ఆ పెట్టెల దగ్గర దొడ్డికి కూర్చుని యిల్లంతా చేశాడు. నాకు చెడ్డ అసహ్యం వేసింది. శకుంతల ను పిల్చి, "మీవాడు దొడ్డి కి కూర్చుని ఇల్లంతా చేశాడు. కాస్త శుభ్రం చెయ్యి శకుంతలా' అన్నాను. దాని కావిడ ఈసడింపు గా నవ్వుతూ, "వాడి పెంపుడమ్మను ఎత్తమందూ, వసుంధర మ్మా' అన్నది. అంతలోనే మీ అక్కయ్య వచ్చి "నేను బాగు చేస్తాలేవే, వసుంధరా. ఈ భాగ్యానికి మళ్ళీ శకుంతలను పిలవాలా?" అన్నారు. శకుంతల వినేటట్లు గానే. వెంటనే ఆ పిల్లవాణ్ణి దొడ్లో కి తీసుకెళ్ళి, వాడి ఒళ్ళంతా కడిగి, గదంతా బాగు చేశారు. శకుంతల జడ వేసుకుని, పూలు మాల కడుతూ ఇదంతా చూసి నా వైపు చూస్తూ నవ్వింది. ఇదేం బాగుంది చెప్పండి? పిల్లవాడు ముద్దు అయితే కావచ్చు. మాంసం తింటున్నామని ఎముకలు మెళ్ళో కట్టుకుని తిరగం కదా? అక్కడికి శకుంతల దృష్టిలో మీ అక్కయ్య మంచివారూ, నేను చెడ్డదాన్ని అయినట్లేగా? ఇదేమాత్రం సబబుగా ఉందొ మీరే ఆలోచించండి. పైగా శకుంతల అంటుంది, "ఏవమ్మా, వసుంధరమ్మా, రేపు నీకు బిడ్డడు పుడితే ఎత్తవా, వాడి దొడ్డి ని? ఏంది వసుంధరమ్మా , అట్లంటవ్ ?' అని. ఎంత లక్షణం గా ఉన్నదో ఆలోచించండి " అన్నది వసుంధర.
"నువ్వు చెప్పిందే నిజమైతే అక్కయ్య అట్లా చెయ్యటం తప్పే, వసుంధరా. పిల్లలు ముద్దయితే -- వాళ్ళ మల మూత్రాలు ముద్దు కావు. నేను మెల్లిగా అక్కయ్య కు నచ్చ చెప్తాను. నువ్వేమీ అనవాకు. తెలిసిందా?" అన్నాడు వసుంధర ను కౌగలించుకుని.
"ఇంకా ఎన్నాళ్ళు లెండి , ఈ స్వేచ్చ! మనమూ పెద్దవాళ్ళం కావటం లా? మనకూ.... అంటూ నవ్వింది వసుంధర.
"ఒహోహో! అప్పుడే అయిందీ అమ్మాయి గారి పని! మా చిట్టే! మా బంగారు పిచ్చికే! నీళ్ళోసుకున్నావా! ఓస లేని దానివయినావన్న మాట. వట్టి దానివి కాదు , గట్టి దానివి, సీరియల్ నెంబర్ వన్" అన్నాడు ఎగతాళి గా.
మరో నాలుగు మాసాలు గడిచినాయి . ఈ నాలుగు మాసాల్లో నూ వసుంధర వేవిళ్ళ తో సతమత మౌపోతున్నది. శకుంతల కు ఏ కానుపు కూ వేవిళ్ళు లేవు. వేవిళ్ళ వాళ్ళను చూస్తె శకుంతల కు పరిహాసం చెయ్యాలని పిస్తుంది.
"ఏం, వసుంధరమ్మా! నేనూ రెండు కానుపులు గంటిని. ఏ బిడ్డకి వేవిళ్ళు పడనైతిని. తోలీతనే ఇదేం పైత్యం తల్లీ! అంత వేవిళ్ళ మరీను! అంతా సోధ్యం" అన్నది. ఆ మాటకు ఎక్కడ లేని కోపమూ వచ్చింది వసుంధర కు.
"మీబోటి వాళ్ళు సునాయాసంగా , చడీ చప్పుడూ లేకుండా పదిమంది పిల్లల్ని అవలీలగా కనేస్తారు. నాబోటిడానికి నేలతప్పి నప్పట్నుంచీ వేవిళ్ళు ఎవరి తీరు వాళ్ళది" అన్నది వసుంధర కోపంతో.
"అంతేలే, వసుంధరమ్మా, అంతే పోనీ ఒక తూరి దవాఖానా కు పోయి డాట్టరమ్మకు చూపించుకో పోయావా, ఏం చెప్పేదో?" అన్నది శకుంతల.
శకుంతల మాట్లాడే ఈ మాటలకు వసుంధర కు మనస్సులో బాధగా ఉండేది. ఆవిడ మాటే ఆవిడకు గాని, అట్లా మాట్లాడినందువల్ల ఇవతల వాళ్ళు ఏమను కుంటారో ననే ఇంగిత జ్ఞానమైనా లేదేం అనుకుంది వసుంధర.
వసుంధర కడుపుతో ఉన్నప్పటి నుంచీ కామాక్షి, వసుంధర ను ఏ పనీ చేయ్యనివ్వటం లేదు. పని పాటలు చెయ్యకుండా కూర్చోవటం వసుంధర కు ఇష్టం లేదు.
అయిదో మాసం రాగానే రమేష్ చేత మామ గారికి ఉత్తరం వ్రాయించింది కామాక్షి. వసుంధర కూడా తల్లికి ఉత్తరం వ్రాసింది.
ఇప్పుడు కామాక్షి సంతోషానికి మేరలేదు. మేనల్లుడు పుడతాడని సంతోషం. శకుంతల పిల్లాడు రాగానే వాడితో , "ఏరా, బాబూ మా బాబుతో నువ్వు కూడా ఆడుకుంటావా? చక్కగా ఆడుకోండి . ఏం?" అనేది. వాడు ఏదో తెలిసినట్లు నవ్వేవాడు, గంతులేస్తూ. వాడిని ముద్దు పెట్టుకునేది కామాక్షి. వాడిని చూస్తినే కోపం వసుంధర కు. 'నాకు పిల్లలు పుట్టబోతున్నా యింకా ఈవిడకు పొరుగింటమ్మ పిల్లలంటే ముద్దే' అనుకునేదో మనస్సు లో వసుంధర .
