ప్రక్క గదిలో బల్లమీద అమర్చిన టిఫిన్ వాళ్ళకి మాత్రమే అని గ్రహించారు. అందరు కూచుని తింటున్నారు.
కవల పిల్లల దగ్గర తల్లి కూచుని ముచ్చట్లాడుతోంది.
"ఎందులో ట్రైనింగ్ పొందటాని కెళ్తున్నారు?"
"బ్రెయిన్ సర్జరీలో, దాన్ని న్యూరో సర్జరీ అంటారు"
"ఎన్ని సంవత్సరాలుండాలని?"
"ప్రస్తుతానికి రెండు .... నేను వెళ్ళగానే మంజును కూడా పిలిపించుకోటానికి ప్రయత్నం చెయ్యాలి... కానీ చాల సమస్యలున్నాయి?"
"అందులో - డబ్బు ఒక సమస్యనా?"
"లేదనుకోండి, స్కాలర్ షిప్ డబ్బు సరిపోతుంది....మిగుల్తుంది కూడా?" కుమార్ భార్య దెసచూచాడు.
"వీళ్ళద్ధర్నీ ఎక్కడుంచాలన్నదే గడ్డు సమస్య నాన్నగారూ....పాప మాతోనే వుంచుకోవచ్చు. వీళ్ళిద్దరు మరీ చిన్నవారు," దూరంగా మంచం మీద పడుకున్న కవలలవైపు చూచి దీర్ఘంగా నిట్టూర్చింది. అతను ఏమీ అనలేడు, క్షణం-దృష్టి కవలలవైపు నిలిపాడు. అతని ముఖంలో ఏ భావం ద్యోతకం కాలేదు.
టిఫిన్ ముగించి అంతా ఇవతల కొచ్చారు, అంతల్లోకి ఇరుగమ్మా, పొరుగమ్మా పోగయ్యారు. పెరటి గుమ్మంలోంచి వచ్చి వరండాలో నుంచున్నారు, వాళ్ళలో మంజును ఆప్యాయంగా చూచుకున్న దూరపుబంధువు కూడా వుంది.
వాళ్ళ రాక గమనించి మంజు మెల్లగా ఇవతలకొచ్చింది. అందరూ మౌనంగా మంజును ఎగాదిగా జూచారు. నమస్కరిస్తూ పేరుపేరునా పల్కరిస్తూ దూరంగానే నుంచుంది.
"ఏం మంజూ-మేమంతా గుర్తున్నామా?" ఒకామె నిశ్శబ్దాన్ని చేధించింది. మంజు మందస్మితవదనంతో అంది. అదే నేనూ అడగాలనుకున్నాను,' నువ్వెందుకు జ్ఞాపకం లేవూ? రోజుకో మారైనా అందరం కలసినప్పుడు నీమాటే అనుకుంటాము. మీ అమ్మ కంటతడి పెట్టని రోజు లేదనుకో.....ఒకామె జవాబు.
"చూడమ్మాయ్! ఈ మాత్రపు చదువుకున్న వాడిని మీ నాన్నగారు తేలేరనుకున్నావా?....ఒక్కసారి అందర్నీ కాదని వెళ్ళిపోయావు. ఇప్పటికీ మీనాన్న నలుగుర్లో తలెత్తుకు తిరగలేక పోతున్నారనుకో- ఏ శుభకార్యానికి వెళ్ళకుండా గడపదాటకుండా కాలం వెళ్ళ బుచ్చుతున్నారు....చేతులు కాలాక....ఆ బామ్మగారు పూర్తిచెయ్యకుండానే మరొకమ్మ అంది పుచ్చుకుంది.
"ఇంత సాహసంతో ఇల్లు విడిచిపోతావను కోలేదు. కబురు తెలిసిన తర్వాత మేము నమ్మితే ఒట్టు! ఇక్కడికొచ్చి పిన్నిని, బాబాయిని చూచాక నమ్మక తప్పలేదు... అంతా ఈమాయ దారి చదువులవల్ల వచ్చినచిక్కు. హాయిగా మామాటవిని ఆ కాకినాడ సంబంధం చెసినట్లయితే మీకింత తెగతెంపులుండేవి కావు హాయిగా సంసారం చేసికొంటూ పుట్టింటికొస్తూ పోతూ వుంటే ఎంత కళగా వుంటుందీ అట ఇల్లు...." మంజు తల్లితో ఆమె అంటోంది. మంజుకీ ధోరణి బొత్తిగా నచ్చలేదు.
చెడామడా చీవాట్లు పెట్టాలన్నంత కోపం కూడా వచ్చింది! కానీ అతిప్రయత్నంతో సంభాళించుకొంది. పెళ్ళిమాట ఇప్పుడెందుకు? బిడ్డల తల్లివి. హాయిగా సంసారం చేసికొంటున్నాను. ఏదో చూచి పోదామని వచ్చాము, సాయంత్రానికి వెళ్ళిపోతాము, మావల్ల అమ్మ నాన్నగార్లకు మీకు ఏ విధమైన ఇబ్బందులు కల్గకూడదనే మా ఆశ. అమ్మకు ఇంతమంది ధైర్యం చెప్పే వాళ్ళున్నందుకు నా కెంతో సంతోషంగా వుంది. కృతజ్ఞురాలివి,"
గుమ్మడికాయ దొంగల్లా- అందరు ముఖాలు చూచుకుంటూ మౌనం దాల్చారు. ఒకరిద్దరు పైట కుచ్చిళ్ళు ఒంటికి దగ్గరగా అదుముకుంటూ మంజును తాకకుండా అతిజాగ్రత్తతో లోపలికెళ్ళి కిటికీలోంచి తొంగిచూచారు. మంజు హృదయాన్ని స్వాధీనంచేసికొన్న ఆ వ్యక్తి ఎలాంటివాడో? ఎంత అందగాడో? చూడాలన్న కాంక్ష అందరికి వుంది. మంజు గుమ్మంలోంచి తొలిగింది. అందరు బిలబిలమంటూ లోపలికెళ్ళారు.
"లోపలికి పిలవనా పిన్నీ!" అంది మంజు ఒకామె నుద్దేశించి, ఆమె మంజుకేసి నేరంచేసిన దానికి మల్లే చూచింది. ఒద్దులేమ్మా ఇక్కడి నించే చూస్తాను."
మంజు ఇక అక్కడ వుండదల్చుకోలేదు' ఈ ఆడవాళ్ళే అంత! ఏదో ఒకటి వాగుతుంటారు, ఎదుటివ్యక్తి ఎంతగా బాధపడ్తుందో అనికూడా ఆలోచించకుండా స్వేచ్చగా మాట్లాడుతారు. ఆమె హాల్లోకెళ్ళింది, కిటికీలోంచి చూస్తున్న ఆడాళ్ళ తాలూకు మగవాళ్ళంతా లోపలికొస్తున్నారు, అందర్నీ ఎరుగును తాను. చిరునవ్వుతో నమస్కరించి కూచుంది మంచం మీద.
సోఫాలో ఠీవిగా కూచుని గంభీరవదనంతో మెల్లగా నమ్రతతో మాట్లాడుతున్న కుమార్ ను చూచి అందరూ గ్రహించారు. అతని లోని ఏదో అయస్కాంత శక్తికి మంజు ఆకర్షింపబడింది. అవివాహితయైన ప్రతి స్త్రీ కాబోయే భర్త ఎలా వుండాలో ఊహించినట్లున్నాడతను.
విశేష మేమంటే- అతను డాక్టర్- అతన్ని చూడగానే రోగాలన్నీ రొదచేయటం ప్రారంభించాయి.
ఏ గాలికా చాపఎత్తే వ్యవహార దక్షత గల్గిన బామ్మగారు నెమ్మదిగా లోపలి కెళ్ళింది. మంజు దగ్గరకెళ్ళి రహస్యంగా అంది.
"మీ ఆయన నన్ను పరీక్ష చేస్తాడా అమ్మాయ్? గుండెలో పోటు, ఆయాసం...
మంజు గంభీరంగా అంది "డాక్టరుగారు పరీక్షచేస్తారు, మీరెళ్ళి అడగండి డాక్టర్లపనే అది".
"పోనీ- నువ్వు చేయరాదుటమ్మా" సందుచూచుకొని మెల్లగా హాల్లోకొచ్చిన మరొకావిడ అంది!
"వారికి బాగా అనుభవముంది.....ఏమండీ.....మామ్మగార్ని కాస్త చూడండి?"
* * *
సోఫాలో ఠీవిగా కూర్చుని, గంభీర వదనంతో మెల్లగా నమ్రతతో మాట్లాడుతున్న కుమార్ ను చూచి అందరు గ్రహించారు. అతనిలోని ఏదో అయస్కాంత శక్తికి మంజు ఆకర్షింపబడింది, అవివాహితయైన ప్రతి స్త్రీ కాబోయే భర్త ఎలా వుండాలో ఊహించినట్లున్నా డితను.
విశేష మేమంటే అతను డాక్టర్ - అతడ్ని చూడగానే రోగాలన్నీ రొదచెయ్యడం ప్రారంభించాయి.
ఏ గాలికా చాపఎత్తే-వ్యవహార దక్షత గల్గిన బామ్మగారు నెమ్మదిగా లోపలి కెళ్ళింది. మంజు దగ్గర కెళ్ళి రహస్యంగా అంది.
"మీ ఆయన నన్ను పరీక్ష చేస్తాడా అమ్మాయ్? గుండెలో పోటు, ఆయాసం..."
"మంజు గంభీరంగా అంది "డాక్టరు గారు పరీక్ష చేస్తారు. మీ రెళ్ళి అడగండి డాక్టర్ల పనే అది."
"పోనీ - నువ్వు చెయ్యరాదుటమ్మా" సందు చూచుకొని మెల్లగా హాల్లోకొచ్చిన మరొకావిడ అంది.
"వారికి బాగా అనుభవముంది....ఏమండీ....మామ్మగార్ని కాస్త చూడండి?"
అంతవరకు వెనక్కుతిరిగి చూడని కుమారీ ఒక్కసారి వెనుదిరిగాడు. మంజు దగ్గర నుంచున్న వాళ్ళిద్దర్నీ చూచి లేచి నుంచున్నాడు. బాగ్ లోని స్టెతస్కోప్ చేతిలోకి తీసికొన్నాడు, మంజు తండ్రి నుద్దేశించి అన్నాడు "మీరు కొంచెంసేపు అలా వెళ్తారా?" ఆయన లేచి లోపలికెళ్ళారు. మగవాళ్ళంతా ఆయన్ను అనుసరించారు.
ముసలమ్మనుకుర్చీలో కూర్చుండజేసి పరీక్షిస్తుంటే అందరు చూస్తున్నారు. కుమారి ప్రత్యేకంగా ఎవర్నీ చూడటంలేదు. ఏకాగ్రతతో గుండె కొట్టుకోవటం వింటున్నాడు. కొంచెంసేపు ఆగి ఆమెను ప్రశ్నించాడు.
"ఎన్నాళ్ళుగా మీకీనొప్పి వుంది?"
"ఏడాదిబట్టి"
"గుండె బాగానే వుంది.... కానీ చాల బలహీనంగా వుంది. మీరు బలమైన ఆహారం తీసికోవాలి. విశ్రాంతి అవసరం. మంచిగాలి వీచే స్థలంలో తిరగాలి- పడుకోవాలి కొన్ని మందులు రాసిస్తాను. అవి వాడండి......విశ్రాంతి చాలా ముఖ్యం..."
"అయ్యో నాయనా......ఇప్పుడెళ్ళి మడికట్టుకుని ముఫ్ఫైమందికి వండివెయ్యాలి, పనులన్నీ అలా వదిలేసి వచ్చాను, నాకు తీరికెక్కడనించి వస్తుంది డాక్టర్ గారూ?"
"ఉమ్మడి కుటుంబమా మీది?"
"ఔను బాబూ ముగ్గురు కొడుకులు, నేను, పెళ్ళి కావలసిన పిల్లా, విధవ కూతురు, వీళ్ళ సంతానం అంతా ఒకటిగానే వుంటాము."
"ఇంతమంది ఉన్నారు కదా? మీరు శ్రమ పడవలసినంత అవసరం ఏముంది? హాయిగా కాలుమీద కాలేసుకుని కూచోవచ్చునే?" మందహాసం చేస్తూ అన్నాడు.
"రామ-రామ కాలుమీద కాలేసుకూచుంటే కతికేందుకేమీ ఉండదండీ! అంతా చిన్నవాళ్ళు, అంతా కాపురాలకొచ్చి నాలుగైదు సంవత్సరాలు కూడా కాలేదు ..... వాళ్ళ చేతి వంట నే తినను బాబూ. అందుకే కష్టమో నష్టమో రెండు పూటలా చేతులు కాల్చుకుంటాను మరి. ఏం చెయ్యను- ఒక్కరికీ మడీ, శుచీ, శుభ్రతా సరిగ్గా తెలియవు. అందరు బస్తీ పిల్లలే, ఇన్నేళ్ళొచ్చాయి - ఒక్క పూటైనా వాళ్ళ చేతివంట తినకుండా గడువు కొచ్చాను.....ఇలాగే కాలం వెళ్ళిపోలే..."
ముసలమ్మకు "కీ" అయిపోలేదు. ఇంకా మాట్లాడేలా వుంది, కుమారి అడ్డుప్రశ్న వేశాడు. 'మీకీ బాధ తగ్గాలని లేదూ?"
"ఎందుకు లేదు, ఏదో మందులు వేసుకుంటూనే వున్నానండీ"

"విశ్రాంతి లేకుండా మందులు వాడితే లాభం లేదు. డాక్టర్ గా మీకు సలహా యిచ్చే బాధ్యత మాది, మీరు అన్ని పనులు మానుకోవాలి. పాలు పండ్లు బాగానే తీసుకోవాలి, ప్రాణం కంటే ఎక్కువేముంది? ఇంకా పెళ్ళికావలసిన అమ్మాయి కూడా వుందంటున్నారు. ఆమెకోసమైనా మీరు జాగ్రత్తపడాలి, మీ భోజనం విషయంలో ఏదో చేసికోవాలి - పని తగ్గించుకోవాలి కాని ఇంటి చాకిరీ మీరే చేస్తే కొన్ని రోజుల్లో మరీ గుండె బలహీనమై పోతుంది. శక్తి వుడిగిపోయాక మనం ఏమీ చేయలేము, నిస్సహాయులైపోతారు, ఇప్పటినించే మీ అమ్మయికోసమైనా జాగ్రత్త పడటం శ్రేయస్కరం, కుమార్ కాగితం మీద గబగబ ఏవో మందులు వ్రాసి ఆమె కిచ్చాడు.
