ముసలమ్మ ఆ కాగితం కేసి నిశ్చలంగా కొన్ని క్షణాలు చూసింది. ఆమె హృదయంలోని అల్ల కల్లోలం - ఇన్ని సంవత్సరాలుగా జీర్ణించుకున్న ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను దాటివేయవలసివచ్చిందే అన్న భీతి ఆమె ముఖంలో స్పష్ట మైంది. ఆ కాగితాన్ని చింపి ముక్కలు చేసి ఇంటికి పారిపోయి తలారా స్నానంచేసి మడి కట్టుకుని, వంటచేసి అందరికీ పెట్టి తను తినటమా - లేదా తన చిన్న కూతురికోసం -ఆమెకు పెళ్ళయే టంత వరకైనా జీవించి ఆ పిల్ల ముద్దు ముచ్చట్లు తీర్చి విశ్రాంతిగా వుండటమా? ఆమె ఎటు తేల్చుకోలేక సతమతమౌతోంది.
నెమ్మదిగా లేచి ఇవతల కొచ్చింది.
మంజు ఆమె ముఖంలోకి పరీక్షగా చూసింది. మంజుకు తెలుసు. ఇదెంత జటిల సమస్యనో? ఆచారాలవైపు మొగ్గుచూపి కొన్ని నెలల్లో ప్రాణం పోగొట్టుకోటానికి కూడా సిద్ధపడతారు. ఇలాంటి ఆడవాళ్ళు, కానీ - మాతృ హృదయం కన్నబిడ్డ సుఖాన్ని కాంక్షిస్తుంది. తనపని అయిపోయింది. కన్న కూతురు ఇంకా యౌవన ప్రాంగణంలో తప్పటడుగులు వేస్తోంది, ఆమెను పది లంగా ఒకరి చేతిలో పెట్టేవరకు ఆ మాతృ మూర్తి హృదయం శాంతికి దూరమౌతుంది. మంజుకు తెలుసు - ఆమె ఊహించుకో గల్గింది. ఆమె తప్పక కూతురికోసం త్యాగం చేస్తుంది. తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంది. అందరు డాక్టర్లలా కాకుండా తన భర్త మాతృత్వాన్ని మేల్కొలిపాడు? పుత్రికపట్ల ఆమె బాధ్యతల్ని గుర్తుచేశాడు. ఆరోగ్యం పొందటానికి విశ్రాంతి తీసుకోమంటే ఆమె నిరాకరిస్తుంది - కాని కూతురి కోసం ఆరోగ్యం కాపాడుకోమంటే తప్పక జాగ్రత్త పడుతుంది! అది గ్రహించిన ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు గ్రుడ్లప్పగించి కుమార్ వైపు చూస్తుండిపోయారు, అదేమాట, చూచిన డాక్టర్లు చెప్పారుగాని ముసలమ్మపట్టించుకోలేదు. సంవత్సరం ఇలాగే నెట్టుకొచ్చింది. కాని ఇక ఆరు నూరైనా ఈ డాక్టరు సలహా తప్పక పాటిస్తుందనుకున్నారు.
మంజు అందరిదెస సగర్వంగా చూచింది.
లావణ్య తోటలోంచి లోపలికొచ్చింది. మెడలో బంగారు గొలుసు దానికి వ్రేలాడుతున్న చిన్నక్రాప్ ను చూచి ఒకరిద్దరు ముక్కున వేలేసుకోడం మంజు కళ్ళ బడింది.
"ఏం ఏరు పెట్టారు?" ఎవరో అడిగారు
"లావణ్య"
"బావుందమ్మాయ్.....మరైతే తండ్రి మతమేనా!" అవహేళనగా అంది. మంజుకు కోపం తారాదువ్వలా లేచింది. కాని ఎప్పటి మాదిరిగానే శాంతించింది. తెచ్చి పెట్టుకున్న నవ్వుతో అంది "పోనీ నా మతంలోకి దింపుతాగానీ.... మీ కొడుక్కు చేసుకోరాదూ" ఆమె ముఖంలో కత్తి వేటుకు నెత్తురుచుక్కలేదు. ఇద్దరు ముగ్గురు చాటుగా నవ్వుకోటం మంజు గమనించింది. ఆమె శ్రోత్రియ కుటుంబంలో జన్మించింది. భర్త సోమయాజి. ఎంతో నిష్టగా ఆచారాలను పాటిస్తూ నిప్పులాంటి వాళ్ళం అనుకునేవారు. అలాంటి కుటుంబంలో ఒక్కగా నొక్క కొడుకు చెడబుట్టాడు. అతనికిలేని దుర్వ్యసనం ఒక్కటిలేదు అతి సాధారణమైన బ్రాహ్మణ కుటుంబాలుకూడా పిల్లనివ్వటానికి వెనుకాడారు. ముఫ్ఫై ఏళ్ళు దాటినా అతడికి పెళ్ళికాలేదు.....కాలేదన్నమాటే గానీ అతను అన్ని సుఖాలు" అనుభవిస్తున్నాడు. ఏ బీదపిల్లనైనా సరే చేద్దామనుకున్నారు కాని కాలంలో కలిసిరాక అతడికి పెళ్ళికాలేదు.
మంజు మాటల్లో ధ్వనించిన హేళన ఆమె గ్రహించుకుంది. అంతట్లోకి తల్లి వచ్చింది. "మధ్యాహ్నానికి ఏం వంట చెయ్యను?' తను కూచున్న జాగాలోంచి-వంగి చూచింది దూరంగా అవతలిగదిలో కూచున్న భర్తకేసి, అతను తిరిగి మగవాళ్ళతో మాట్లాడుకున్నారు, తల్లి వైపు తిరిగి అంది-
"తనను వాళ్ళ స్నేహితులు భోజనానికి రమ్మన్నారు. ఏదో సుళువుగా అయిపోయేది వండు "అదేవిటే రాక రాక వచ్చి -ఎక్కడో భోంచేయటమేమిటే? ఎవరు పిల్చారు?"
"డాక్టర్ గోపాలరావు, వాళ్ళిద్దరూ చాలా స్నేహితులు. ముందు అక్కడికే వెళ్ళాము .... వెళ్ళకపోతే చాలా నొచ్చుకుంటారు."
తల్లి ఏదో అనబోయి మౌనం దాల్చింది.
"వస్తాము" అంటూ ఒక్కొక్కరు మెల్లగా జారుకున్నారు.
మంజు హాయిగా ఊపిరి పీల్చింది.
"ఐతే ముందు అక్కడి కెళ్ళారన్న మాట. అలా చెప్పు..... కానీ - మంజూ ఇదేం బావులేదు?"
మంజు ముఖం కోపంతో రక్తవర్ణం దాల్చింది. మెల్లగా- ఉద్రిక్తయై అంది "ఔనమ్మా. అలా వెళ్ళటం బావులేదు. భోజనానికి వెళ్ళటం బాగులేదు.........కానీ......పరాయి వాళ్ళను సత్కరించినట్లు మీరు సత్కరించటం నాకేం బాగులేదు."
"అంటే! నీ అభిప్రాయం......." ఆమె ముఖం చిటపటలాడింది.
"ఆ అభిప్రాయాల కేమొచ్చిందిలే! అల్లుడిగా గౌరవించను చేతకాని మీ నించి ఇంతకన్నా నేనేం ఎక్కువ కోరలేదు. ఈ మాత్రపు ఆప్యాయత అందరు తమ డాక్టర్ల పట్ల చూపుతారు, ఇదేం కొత్త విషయం కాదు, ఆనాడు కష్టసమయంలో ఆదుకున్నారని ఈ మాత్రం గుర్తు కొచ్చాము. వారెళ్ళి భోంచేసి వస్తారులే........నీకెందు కంత ఆదుర్దా?"
గల్లి కళ్ళు వాల్చేసుకుంది ఆధారాలు కంపిస్తుంటే నెమ్మదిగా అంది "మీ నాన్నగారు కొద్దిగా మారారు. కళ్యాణి పట్టుబట్టింది దానికంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో సుమా?"
"అంటే నాన్నగారికి స్వతహాగా పుట్టిన బుద్ధి కాదన్నమాట?"
"ష్...........బిగ్గరగా అరవకు మరి.....ఎందుక్కాదూ? మనసులో మిమ్మల్ని పిలవాలనే.......పైకి చెప్పలేక.....తలవంపు లని - తన ఓటమి నంగీకరించవలసి వస్తుందని మౌనంగా వుండి పోయారు. కళ్యాణి పోరుపడలేక పోయారు ...ఆ నెపంతో తనకోర్కె నెరవేర్చుకోగల్గారు..... నాకు తెలుపే మంజూ - మీ ఆయనంటే అమిత మైన గౌరవం..."
"ఏం గౌరవం? ఏం భక్తి? డాక్టర్ అనేగా? నాకేం అర్ధంకాదు. మూడేళ్ళయిందేమో - ఒక జిల్లా బోర్డ్ ప్రెసిడెంట్ ప్రాణాల్ని రక్షించారు. ఓ వెండి కంచం, గ్లాసు ఇచ్చి చేతులు దులుపు కున్నారు. ఇంతేగా..."
ఆమె మాట్లాడలేదు. కూతురితో మాట్లాడ గల్గేటంత చాకచక్యం, ఓపిక తనలో లేవు. మౌనంగా లేచి వంటింటి వైపు వెళ్ళిపోయింది. "అండి".... "డాక్టర్ గారు" సంబోధనతో సంభాషణ సాగుతోంది, మగవాళ్ళంతా వెళ్ళిపోయి నట్లున్నారు.. మంజు భర్త ప్రక్కలో కూర్చుంటూ టైం- కాలేదూ? ఎదురు చూస్తుంటారేమో!" అంది.
కుమార్ గడియారం కేసి చూచాడు. లేచి నుంచున్నాడు.
"గోపాలరావు భోజనానికి రమ్మన్నారు.....టైం అయింది. వస్తాను" తండ్రి ఏదో అనే లోపల మంజు అంది "పదేళ్ళ స్నేహం కాదన లేక పోయాము, నేను వెళ్ళటం లేదు లెండి...మీరు త్వరగా వచ్చేయ్యండి. సామర్లకోటలో ఆగాలంటే ముందుగా బయలుదేరాలి"
"ఏమిటమ్మా- అంత తొందరే మొచ్చింది- సావధానంగా......"
"మీ మాట త్రోసిపుచ్చలేక వచ్చాము. నాకు టైంలేదు. పారీ కంపెనీలో స్నేహితుల్ని చూడాలి" కుమార్ జవాబిచ్చాడు.
"ఎవరో కాదు, మొన్న పురిటి కెళ్ళానే-ప్రమీల- వాళ్ళ పెదతండ్రి ఇంజినీరుగా వచ్చారు."
మంజు ఎక్కడి కక్కడ ఠపీమని జవాబిస్తూనే వుంది. వాడిబాణాల్లా ఆ వృద్ధుని హృదయాన్ని ఛేదిస్తున్నాయి కూడా!
"వాళ్ళుండమని మరీ బలవంతం చేస్తే రాత్రికి అక్కడే వుండిపోవాలని ఆశ"
ఆ మాట తండ్రి "అహం" అనే కవచాన్ని ఛేదించింది. అతను లేచాడు.
"ఐతే భోజనం కాగానే వచ్చెయ్యండి"
"ఏమో - ఒక పేషెంట్ ను పరీక్షించమన్నాడు........ మంజూ తయారుగా వుండు. నీవు కూడా ఎవర్నో చూడాలట కదూ? ఎవర్నైనా పంపుతాము" కుమార్ వెళ్ళిపోయాడు, అతను గేట్ దాటేంతవరకు గుమ్మంలో నుంచునే వున్నాడు.
మంజు ఎంతో ఆప్యాయంగా ప్రశ్నించింది "మీ ఒంట్లో కులాసానేకదూ నాన్నా?"
"ఆ......ఆ.... కులాసాగానే వుంది. కానీ ఈ రెక్క చూచావూ! ఎంత గుంటపడి పోయిందో. కాస్తనొప్పి చేస్తుంటుంది.........అంతే.
"మంజూ- ఓ పూటైనా భోజనానికి వీలులేకుండా చేశారు. మరీ ఒక్క రోజుకని ఇంత దూరం ఎలా వచ్చారమ్మా" నిష్టూరంగా మాట్లాడింది తల్లి.
మంజు ముఖకవళికలు కఠిన మయ్యాయి. పేలవంగా నవ్వింది.
"డాక్టర్ గారికి కృతజ్ఞత తెల్సుకోటానికి దినాలు ఎడ్తాయా నాన్నా? ఈ పూట ఆతిథ్యాన్ని స్వీకరించారు కదమ్మా- ఇంతకన్నా ఎక్కువ స్వీకరిస్తే మీకు లేనిపోని ఇబ్బందులు కల్గించ వలసి వస్తుంది."
"ఓ పది- పక్షం రోజులకని ఆహ్వానించాం కదా - నా ఉత్తరంలో స్పష్టంగా రాశాను కదా" తండ్రి నేరారోపణ చేశాడు.
"ఆ- రాశారు ..... హృదయపూర్వకంగా రాశారా నాన్నా? నిజంగా పదిరోజులుండాలని వచ్చినట్లయితే మనసారా ఆనందించి ఆహ్వానించే వారా?" తండ్రి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది.
ఆయన ముఖం తప్పించారు. కానీ అతని ముఖం బిగుసుకుపోవటం -భ్రుకుటీకరించటం మంజు గమనించింది. ఆయన పూర్వపు మనిషిలా మారిపోయారు. మంజు ధైర్యాన్ని కూడ గట్టుకుంది.
"నిజం చెబుతున్నాను, నువ్వు చేసిన పనికి ఈ నాటికి నాలోని కోపం చల్లారలేదు, నీ పై తప్ప ఇంకెవరి పై లేశమైన కోపం లేదు. డాక్టర్ కుమార్ నా ప్రాణాల్ని రక్షించిన దాత - అని కల్యాణి. భాస్కర్ చెప్పారు. నా ప్రాణాల్ని కాపాడారన్న అభిమానం-గౌరవం కృతజ్ఞత తప్పితే- ఇంకే విధమైన భావం నాలోలేదు, అతనికి నాకు మరే విధమైన సంబంధం లేదు. వైద్యడు, రోగి, మధ్య వున్న సంబంధమే మాది. ఈ మాత్రం దానికి అతడ్ని అల్లునిగా గౌరవించాలన్న విధి ఏమీలేదు. లక్షలాది డాక్టర్లలో ఇతనొకరు. ఇంత మందిలో ఇతనిచేత చికిత్స పొందాలని నా నుదుట రాసివుంది. అలా జరిగింది-విధివైపరీత్యం? అది కేవలం ఒక డాక్టరుగారుగా గౌరవిస్తాను. అంతేగాని అంతా మర్చిపోయి నిన్ను ఆయనను కూతురు -అల్లుడిగా మాత్రం ఏ పరిస్థితుల్లోకూడా ఆహ్వానించలేను, ఇంతకన్న ఎక్కువ ఆశించినా..."
మంజు కళ్ళు పెద్దవిగాజేసి అంది "నాన్నా- మీ నించి నేనేమీ ఆశించలేదు. ఆశించబోను. నాకు అష్టయిశ్వర్యాలు ఉన్నాయి. ఉత్తరంలోని ధోరణి గ్రహించాము. కేవలం మమ్మల్ని పరాయి వారిగానే ఆహ్వానిస్తున్నారని, మేం కూడా, ఆరోగ్యం పొందిన రోగుల ఇండ్లకు వెళ్ళి వారి ఆతిథ్యాన్ని స్వీకరించి, ఆనందించి వారి కృతజ్ఞత లు అంగీకరించి -వస్తున్నట్లే ఇక్కడి కొచ్చాము. డాక్టరుగా వారి నాహ్వానించావు. వారి భార్యగా నన్నురమ్మన్నావు. ఏ డాక్టరు మిమ్మల్ని ట్రీట్ చేసినా ఇలాగే చేసేవారు. ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు. అంతే, ఓ చిన్న తేడా మాత్రం వుంది. ఆ డాక్టరుకు ఏం చేసినా నిశ్చింతతో పవిత్ర భావంతో చేసేవారు.....ఇంతచేసినా మీలో తృప్తి ఉండదు. హృదయాంతర్భాగంలో దేన్నో జారవిడుచుకుంటున్నట్లన్న భావన సంరూఢితమై వుంటుంది. మీకు తృప్తిలేదు, మేమంతా త్వరగా గడప దాటాలని వుంది......ఇంకా వుంటే బావుంటుందని కూడా వుంది. ఈ సందడిమధ్య నలిగిపోతున్నారు. వెళ్తే-మీ అహందెబ్బతినదు. ఉంటే -మీ ఓటమి నంగీకరించక తప్పదు. ఇది మీ కసాధ్యమైన పని..... ఎందుకు నాన్నా - సాయంత్రానికి వెళ్తాము. మీ ఇద్దర్నీ చూచాము. అంతేచాలు. మామూలంగా మీరు బాధపడటం మాకిష్టంలేదు. మంజు ముఖం త్రిప్పేసుకుంది.
అతను గంభీరవదనుడై మౌనముద్ర వహించాడు, తల్లి నెమ్మదిగా వెనుదిరిగి వెళ్ళబోయింది.
అతను ఉన్నట్లుండి అన్నాడు"....విన్నావా? డాక్టరు గారు చెప్పారు. కళ్యాణి వాళ్ళు వేరు బోతున్నారట..."
