"నాన్నగార్కి ఎలావుంది" టాక్సీలో కూచున్న తర్వాత అంది.
"బాగానే ఉన్నారు. గాయాలు మానుతున్నాయి.... కానీ ఇంకా" కోమా"లో ఉన్నారు....."
అతనికి గాయాలు తగిలి ఈ రోజుకు సరిగ్గా పదిరోజులయ్యాయి. రోజూ అతనికి స్పృహ వస్తుందేమో-అని ఆశతో ఎదురుచూస్తున్నారు....కానీ.....ఆ శుభ'గడియ కనుచూపుమేర దూరంలో లేనట్లుంది. కుమార్ రోజూవెళ్ళి ఓమాటు చూచివస్తున్నాడు కళ్యాణికి ధైర్యం చెబుతున్నాడు. చిన్నన్న వెళ్ళిపోయాడు. పెద్దన్న మాత్రం తోడుగా వుండిపోయాడు. తల్లి ఆవేదన రోజులు గడిచే కొద్ది అధికమవుతోంది. క్షుభిత హృదయంతో కన్నీరు కరువైన ఆమెను ఏదో నిరాశ. నిర్లిప్తత ఆవరించాయి. అంతులేని ఆవేదనతో ఆమె కృంగిపోతోంది.
స్నానం భోజనం ముగించుకొని వెంటనే హాస్పిటల్ కు వెళ్ళింది. కూతుర్ని కావలించుకుని ఆమె రోదిస్తోంది. ఆమెను ఓదార్చి తండ్రిదగ్గర కెళ్ళింది. అతను నిశ్చింతగా అన్ని బాధల కతీతంగా, నిద్రిస్తున్నట్లున్నాడు. ఎన్ని సంవత్సరాలకో తండ్రిని చూస్తోంది. వారిలో మార్పులేదు. కృశించిన శరీరం, కళా విహీనమైన ఆ ముఖంలోకి చూస్తుంటే మంజుకు కన్నీరు చెక్కిళ్ళ మీదుగా కారి పోతోంది. ఆఖరుసారిగా -ఆనాడు - తనతో అన్నమాటలు చెవిలో రొదజేస్తున్నాయి.
"నీకు నాకు ఏ సంబంధంలేదు. ఇక ఈ జన్మలో నీవు నన్ను చూడటంగాని, నేను నిన్ను చూడటం గాని జరుగగూడదు. ఈ క్షణంనుంచి మనం పరాయివారం."
కల్యాణి అక్కను ప్రక్కకు తీసుకెళ్ళింది" "బాబులు - పాప కులాసానే కదూ? రాత్రికి వస్తాను చూసేందుకు..." అని మొదలెట్టి తండ్రికి అపాయం తటస్థించినది మొదలు ఆక్షణం వరకు జరిగిన విషయాలన్నీ విపులీకరించింది.
"మీ బావరక్తం ఇచ్చారా? "మంజు సాలోచనగా అడిగింది.
"నా రక్తం కూడా సరిపోయింది-కానీ వారే ఇచ్చారు."
మంజు చెల్లి కళ్ళలోకి ఆప్యాయంగా చూస్తూ అంది." గర్భవతిని-నీ రక్తం ఎలా తీస్తారనుకున్నావు?"
బావకు ఎలా తెలుసు?"
"ఏమో ఊహించి వుండొచ్చా? లేదా నువ్వు స్త్రీవని నీ విషయం పట్టించుకుని వుండరు...సరేగాని ఇంత రహస్యందేనికి?"
"బావ ఎవ్వరికి చెప్పొద్దన్నారు. రక్తదానం విషయం నాకు. మరిదిగార్కి అమ్మకు తప్ప ఇక్కడ మరెవ్వరికి తెలియదు ఈ విషయం నాన్నకు అసలు తెలియకూడదన్నారు. అన్నయ్యకు కూడా తెలీదు మంజు అంతా విని మౌనం దాల్చింది, కుమార్ ఆంక్ష విధించటం ఎంతైనా సబబుగా వుంది.
మంజు వచ్చినమూడవరోజు పెద్దన్న కూడ వెళ్ళిపోయాడు. చేయవలసిన చికిత్సలు చేస్తూనే ఉన్నారుగాని అతనికి తెలివి రావటంలేదు. రోజూ డాక్టర్లు ఎంతో ఆశతో నిరీక్షిస్తున్నారు.
ఇరవై రెండవరోజు మంజు హాస్పిటల్ లో వుంది. కుమార్ గబగబ వచ్చి శుభవార్త అందజేశాడు "మీ నాన్నగార్కి తెలివొచ్చిందట. దగ్గర మీ అమ్మగారుమాత్రం వున్నారట. ఒక సారి నువ్వు వెళ్తే....ఏమో.....ఒద్దు మంజూ.... షాక్ తో తిరిగి..." కుమార్ గడ్డ మునివేళ్ళతో రాచుకుంటూ మౌనం దాల్చాడు.
మంజుని పరుగుల మీద వెళ్ళి చూడాలని వుంది.....కానీ ఎలా సాధ్యం -ఆర్ద్రనయనాలను రాల్చేసుకుంటూ అంది. 'మీకు చూచిరండి. మీరు డాక్టరుగా పరిచయం చేయబడ్తారు నాకు తృప్తిగా వుంటుంది." కుమార్ వెళ్ళేసరికి గదిలో భార్యా భర్తలు తప్ప ఇంకెవరూ లేరు.
కుమార్ ను చూచి ఆమెలేచి నుంచున్నది. భర్తకు చేతి దగ్గరగా వంగి నెమ్మదిగా అంది. "మిమ్మల్ని జాగ్రత్తగా ఇక్కడికి తీసుకొచ్చిన డాక్టర్ గారు విరే భువనగిరి ఆసుపత్రిలో చికిత్స చేసింది విరే సమయానికి వీరుగాని లేకపోయి నట్లయితే మన గతి ఏమయ్యేదో, కుమార దగ్గరికి వచ్చి అతని చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.
ఒక్కక్షణం కళ్ళుమూసి తెరచాడు?
అతను మాట్లాడలేదు..... కానీ ఆ చూపు కృతజ్ఞతతో మిళితమై వుంది.
"ఏమైనా పుచ్చుకున్నారా?"
"ఆ....పుచ్చుకున్నారండీ - వేడిపాలు- ఏవో మందులు ఇచ్చి వెళ్ళాడు. కుమార్ తో ఆమె మాట్లాడటం అది ప్రథమం.
మంజుల రాలేదేం - అని అడగటానికి- మాటలు నోటిదాకా వచ్చి ఆగిపోయాయి.
"మీ కెలా వుంది? మీ రెక్కడున్నది-మీతో మాట్లాడుతున్న మేము ఎవరో మీకు తెలుసా?"
ఆమె భయంతో చటుక్కున కుమార్ వైపు చూసింది.
కుమార్ ఆమెను గమనించనట్లే వున్నాడు.
అతను ఏదో మాట్లాడాడు గానీ స్పష్టంగా అర్ధంకాలేదు.
నొప్పి వుందా?" కళ్ళు ఆర్పి "ఔనన్నట్లు సైగజేశాడు.
మీ అమ్మాయి కల్యాణి వచ్చిందా?"
లేదన్నట్లు కళ్ళు త్రిప్పాడు.
"మరేం ఫర్వాలేదు ప్రాజ్ఞులయ్యారు. ఇంకొన్ని రోజులు గడిచిన తర్వాత స్పష్టంగా మాట్లాడగలరు..... బాగా విశ్రాంతి తీసికోండి. దేని విషయం తొందర పడవద్దు. వెళ్ళొస్తాను."
అతను కుమార్ వైపు తదేకంతో చూచి ఏదో అన్నాడు.
"మీరేం తొందరపడకండి......తీరికగా అన్నీ చెప్పేద్దురుగాని, ఇంకా రెండు మూడు రోజుల్లో ఈ ఇరవై రోజులు దేవలోకంలో ఏం చేశారో చెప్పాలి...
అతని ముఖంలో క్వాచిత్కకంగా హాసరేఖ అలముకుంది.
కుమార్ అతని చేతిని క్షణం తనచేతితో పట్టుకుని వదిలేశాడు. వెళ్ళటానికి వెనుదిరిగాడు - కళ్యాణి వస్తోంది.
ఆమె ఏదో అనటాని కుద్యుక్తురాలౌతున్నట్లు గ్రహించి, పెదాలపై చూపుడు వ్రేలుంది తల ఆడించాడు.
కల్యాణి గ్రహించింది, కాని ఆ చూపులో బాధ, నిస్సహాయత తాండవం చేస్తున్నాయి. తను అతడ్ని "బావా అనకూడదు. తండ్రికి కొన్ని విషయాలు చెప్పకూడదు. వ్యవధి హృదయంతో గదిలో కెళ్ళి తండ్రికి దగ్గరగా వచ్చింది" ఇప్పుడు వెళ్ళిన డాక్టర్ గారి ధర్మమా అని నువ్వు మాకు దక్కావు నాన్నా....ఆమె తండ్రిని పలుకరించి ఏమేమో అడుగుతూ కబుర్లు చెబుతూ కూచుంది.
మరోనెల రోజులకు అతని ఆరోగ్యం కుదుట బడింది, కానీ ఈలోపుగా మంజుగాని, కుమార్ గాని అతన్ని చూడటానికి రాలేదు.
అతను వెళ్ళే రోజున బిల్లు చెల్లించి అందరికి పేరు పేరున చెబుతున్నాడు. అంతా వెళ్ళిపోయారు. ఒక్క డాక్టర్ మాత్రం ప్రిస్క్రిప్షన్ రాస్తున్నాడు. "డాక్టర్ - మీకు తెలుసా? నాకు మొదట చికిత్స చేసిన డాక్టర్? నెల రోజులైంది వారిని చూచి ఎక్కడుంటారు? డాక్టర్ కుమార్ అట-"
"వారు ఇక్కడ పని చేయరు. నెహ్రూ ఆసుపత్రిలో పనిచేస్తారు. వారి వైఫ్ డాక్టరు మంజుల కూడా అక్కడే పనిచేస్తారు.....చాల ఏబుల్ సర్జన్" అతని ముఖంలో కత్తి వ్రేటుకు నెత్తురు చుక్కలేదు......"అమ్మాయ్.....మంజుల- అంటే మీ అక్క మంజులేనా?'
కళ్యాణి, తల్లీ. భాస్కర్ లు ఒకరి ముఖాలొకరు చూచుకున్నారు.
"ఔను నాన్నా- అక్కయ్యే - డాక్టర్ కుమార్ అక్కయ్య భర్త" అతను ఏమని జవాబిస్తాడో - తిడతాడేమో అని ఎదురు చూచిన కళ్యాణి తండ్రి మౌనంగా కూర్చుని ఎటో చూడటం కొంత ఉపశమనం కల్గించింది.
రైలు కదలకముందు కళ్యాణితో అన్నాడు "చూడమ్మా- ఆ డాక్టరు గార్కి మా కృతజ్ఞతలు తెల్సు. స్వయాన రాలేకపోయానని మరీ మరీ చెప్పు." ఆమె కళ్ళలో కన్నీరు నిండింది.
కల్యాణి, భాస్కర్, బాబు రైలు కదిలిన తర్వాత సరాసరి కుమార్ దగ్గర కెళ్ళి ఆ మాట కాస్త చెప్పి వెళ్ళిపోయారు.
* * *
"నాన్న ఉత్తరం రాశారు" ఇక వారంలో కుమార్ అమెరికా వెళ్తాడనగా మంజుకు తండ్రి దగ్గరనించి ఉత్తర మొచ్చింది.
కుమార్ కనుబొమ లెగురవేసి "ఏమని?" అంటూనే ఉత్తరం అందుకున్నాడు. "అరె నాకు కూడా రాశారే.
ఉత్తరం సాంతం చదివి- "మరి వెళ్దామంటావా? నీ అభిప్రాయమేమిటి మంజూ."
"నాన్న స్వయంగా రాయటం ఆశ్చర్యంగానే వుంది. వ్రాశాక వెళ్ళకపోతే బాగుండదు- కానీ........" ఆమె అనుమానాన్ని పసిగట్టి అన్నాడు.
"వెళ్దాము కొన్ని గంటలు మాత్రం వుండి వచ్చేద్దాము. కొన్ని రోజులుంటేనే కదా- లేని పోని సమస్యలు ఎదురౌతాయి?"
వస్తున్నట్లు వైర్ ఇచ్చి ప్రయాణానికి సిద్ధమయ్యారు,
హోల్డాలు- టిఫిన్ బాస్కట్ తో దిగిన కూతుర్ని-అల్లుడిని చూచి వారు విస్తుపోయారు. అంతేకాదు ప్రయాణం చేసి వచ్చిన వేషం కాదది, ఇద్దరు, పాపలు భార్యా భర్త, లావణ్య ముచ్చటగా ముస్తాబైదిగారు. అంటే వాళ్ళు స్నానం వగైరా ముగించుకున్నారన్నమాట- ఎక్కడ? ఏమో- అడిగే ధైర్యం లేదు- ఐనా డాక్టర్లకు తెలియని మనుస్యులా? ఎవరో అన్నీ అమర్చివుంటారు.
"డాక్టర్ గారూ- మీ మేలును మరచిపోలేము' మా కృతజ్ఞతను ఏ విధంగా చూపాలో అర్ధం కావటంలేదు .......సామానేదీ..."
ఎన్ని సంవత్సరాలకో ఆనాడు తండ్రి కూతుళ్ళు ఒకరి నొకరు చూచుకుంటున్నారు, మంజు హృదయంలోని అల్లకల్లోలం వర్ణింప తరంకాదు. అతిప్రయత్నంతో అంది "సాయంత్రం టాక్సీ వస్తుంది. వెళ్ళిపోవాలి, ఈ మాత్రం దానికి అంత సామానెందుకు నాన్నా."
"అప్పుడే వెళ్తారా?"
"ఔనండీ- నాకు చాల పనులున్నాయి. మధ్యలో ఐదురోజులున్నాయి. అమెరికా వెళ్తున్నాను మీ ఆహ్వానాన్ని తిరస్కరించలేక వచ్చాము" మంజు పిల్లలతో పరాయి ఇంట్లో కూచున్నట్లు ముందు గదిలోనే కూచుంది. "అమ్మ ఏదీ?" అంది లోపలికి చూస్తూ-
"పూజ చేసుకుంటోంది."
అంతలోకే ఆవిడ వచ్చింది, ఆమె హృదయంలో ప్రేమ పెల్లుబికింది. పిల్లల్ని దగ్గరకు తీసుకోవాలని, ఏమేమో కోరికలు.... కాని... భయం. అనుమానం- ఆమెను ముందుకు సాగనివ్వలేదు.
"బాగున్నారా మంజూ-" కుమార్ నుంచుని నమస్కారం చేశాడు.
"కూర్చోండి బాబూ- అంతా కులాసాయే కదూ!"
తల్లి కూతుళ్ళు కాసేపు మాట్లాడుకున్నారు, ఆమె టిఫిన్ అమర్చటానికి లోపలి కెళ్ళింది, ఎప్పుడూ లేంది కప్పుల, సాసర్ల గలగల శబ్దం విని మంజు తనలో తాను నవ్వుకుంది. పుట్టి పెరిగిన ఇల్లయినా ఈ రోజు తను పరాయిదానిగా వచ్చింది. కుమార్ కు ఏ విధమైన అవమానం కలక్కూడదని భగవంతుని మ్రొక్కుకుంటోంది.
