అ ప్రసంగం ఇష్టం లేక శంకరం మాట మార్చడానికి ప్రయత్నం చేశాడు.
"ఈ రాత్రి పోలేరమ్మ తల్లికి వేట పోతూనేసి, బాణ సంచా , కోడి పందేలతో పెద్ద సంబరం చెయ్యదలుచు కున్నాం-- సంబరం చూడడానికి మీరు కూడా రావాలి . వాళ్ళ అందర్నీ తీసుకుని మిమ్మల్ని పిలవడానికే వచ్చాను అన్నాడు" మునసబు.
"ఇవాళ సంబరం ఏవిటి?" అన్నాడు శంకరం అర్ధం కాక.
"ఆ తల్లి పుణ్యమా అంటూ మనమీ కేసు నేగ్గాం కదా అండి....ఏదో అందుకని సంతోషంతో ....." అంటూ మాట కలిపాడు పంతులు.
"ఏదో కానిండి నేను రావడం ఎందుకు?....పైగా రాత్రి నేను పేషెంట్స్ ని చూడడానికి పొరుగూరు పోవద్దూ?" అన్నాడు శంకరం.
"ఆ వెళ్ళేటప్పుడే కాస్సేపు బండి ఆ గుడి దగ్గర ఆపుకుని చూసి మరీ వెళితే సరి.....ఏవైనా మీరు రావాలి " అన్నాడు మునసబు.
"అవును మీరు రావాలి" అన్నారు వచ్చిన జనం అంతా.
సరే ఇంక తప్పదను కుని 'అలాగే లెండి" అంటూ అయిష్టంగా ఒప్పుకుని వాళ్ళని పంపించేడు శంకరం.
ఆ రాత్రి ఒళ్ళు తెలియని ఆనందావేశాలతో సంబరం సాగించాడు మునసబు. ఆ పాలేళ్ళకి తగినంత కల్లు పోయించాడు. కారువా మేళం, కోయ డాన్సు , కోలాటం, కర్ర సాములూ, రెండెడ్ల బళ్ల మీద వేషాలూ, భజనలూ, డప్పులూ, బాణ సంచా వీటితో పెట్రో మాక్సు లైట్ల వెలుగులో పెళ్ళు మంటూ సాగింది సంబరం. సంబరం లో ఓ పక్కని మునసబు కావాలని పెట్టించాడు కోళ్ళ పందేలు. శంకరం వచ్చి అక్కడ నిలబడ్డ అరగంట లో కోడి పందెం మరీ ఉదృతంగా సాగింది. పౌరుశాలతో , కేకలతో, ఈలలతో అల్లకల్లోలం గా నడుస్తూన్న ఆ పందెంలో ఓ పుంజు కొంచెం జంకి పారిపోసాగింది. "పెద్దకాపు పుంజు ని డాక్టరు గారి పుంజు ఈడిచేసిందోయ్?' అని గట్టిగా ఎవరో గుంపు లోంచి అరిచాడు. మునసబు మీసాల వెనక నవ్వు తొంగి చూసింది.
పరిస్థితులు అలాంటి మలుపు తిరగడం చూసి సహించలేక బండి ఎక్కి శంకరం వెళ్ళిపోయాడు.
శంకరం దగ్గిర ఉండి ఆ కోళ్ళ పందేలు నడిపించాడనీ, ఓడిపోయినా పుంజు పేద కాపుదని అరిపించింది కూడా అతనే అయి ఉంటాడని లేకపోతె వెంటనే నోరు మూయించి ఉండేవాడనీ ఆ కారణంగా పెద్ద కాపు ని అవమానించే దృష్టి కాకపొతే , సంబరం తో ఏ సంబంధం లేని పెద్దకాపు మాట అక్కడ ఎత్తవలసిన అవసరం లేదనీ , అందులోనూ ఓడిపోయి పారిపోతూన్న పుంజు ని పెద్ద కాపు పుంజు అనడం అవహేళన చెయ్యడం కోసం తప్ప మరెందుకూ కాదనీ వీరాచారి చెప్పినప్పుడు శేషయ్య విని విననట్టు ఊరుకున్నాడు. కాని అదేమాట కరణం అన్నప్పుడు అప్పుడక్కడ ఉన్న నలుగురు రైతులూ అవునని సమర్ధించి నప్పుడూ శేషయ్య నమ్మకుండా ఉండలేక పోయాడు . హు....చివరికి శంకరం ఎంత నీచ స్థితికి దిగజారాడు " అనుకున్నాడు.
గుర్రపు బండిలో పోరుగూళ్ళ పేషెంట్స్ ని చూడడాని కని వెళ్లి పోయిన శంకరం ఆలోచనలో, సంబరమూ ఆ సంబరం లో పెద్ద కాపుని గేలి చేస్తూ అన్న మాటా జ్ఞాపకం రాసాగాయి. ఇదంతా చూస్తె ఊరు రెండు పార్టీలుగా విడిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ పల్లె వచ్చేటప్పటికీ ఎంతో సామరస్యంగా నూ, స్నేహం గానూ ఉండే మునసబూ, పెద్ద కాపూ ఇవాళ ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు నూరుతూ ఊరి ఐకమత్యాన్ని చీల్చేసి పార్టీలు సృష్టించి ఇలా వీరభద్రుడు పూనినట్లు వెర్రి ఎక్కి పోతున్నారేవిటి?....
వాళ్ళేదో అయితే అయ్యారు. తనేవిటి మధ్యన ?....తను కూడా మునసబు పార్టీలో చేరి ఈ పల్లెటూరి రాజకీయాల్లో పడిపోతున్నాడు ఏమిటి? ...వీటికి ఎంత దూరంగా వుండాలని ప్రయత్నం చేస్తున్నా వీలు లేకుండా పోతోంది. తనకి పెద్ద కాపు మీద కోపం ఉందంటే అది వేరే సంగతి. అందుకని ఈ పార్టీ కక్షలతో దిగుతానా నీచంగా ?......
ఎంత అణచుకొని సౌమ్యంగా ఉండాలని ప్రయత్నం చేస్తూన్నా తన వల్ల కాకపోతోంది గుండెల్లోంచి మంట. ఆలోచనల్లోంచి ఒక జ్వాల బయలుదేరి తనని కాల్చేస్తోంది. పెద్ద కాపు తనకి చేసిన అపకారానికి పగ తీర్చుకోవాలనీ, అతను మెత్తగా చేసిన అన్యాయానికి గట్టిగా సమాధానం చెప్పాలనీ ఏక తహతహ . తనని ఈ ఊళ్ళో కట్టేసి అక్కడ తమ్ముడు తన మాట వినకుండా కుల భ్రష్టుడు కావడానికి ఈ శేషయ్యే కారణం అనీ, తమ్ముడికీ, తనకీ కలతలు పెట్టడానికి సాయశక్తు లా ప్రయత్నించి చివరికి సాధించాడని , నీచంగా రెండు వేలు తినేసి ఏమి ఎరగనట్లు కూచున్నాడనీ, పదకాలన్నీ నెరవేరక ఈ పదేళ్ళ స్నేహాన్ని ఒక్క సెకను లో తెంపేసి నిర్వికారంగా వెళ్ళిపోయాడని శేషయ్య మీద తనకి మంట. ఇంతకింతా తీర్చుకోవాలని నాలికలు చాచే ప్రతీకార జ్వాల.
ఆ రాత్రి అంతా మనస్థిమితం లేక మందులు ఇవ్వడం లోనూ, పేషెంట్స్ ని చూడడం లోనూ ఎన్ని మాటులో తడబడ్డాడు. ఊపిరి తిత్తుల పరీక్ష చేయవలసిన వాళ్ళ కి టెంపరేచర్ చూసీ, టెంపరేచర్ చూడవలసిన వాళ్లకి గుండె కొట్టుకోవడం చూసి ఇలా ఎన్నో పొరపాట్లు చేయబోయి మళ్ళా అంతలోనే సర్దుకుంటూ వచ్చాడు. బండి మీద తిరిగి వచ్చేటప్పుడు తనలో తాను ఏదో అనుకోవలసింది పోయి, పైకి గొణుక్కున్నాడు శంకరం.
అది విని ముందు కూచుని గుర్రాన్ని తోలుతున్న సుబ్బడు ఏటి బాబుగారూ అంటున్నారు?" అని అడిగాడు ఒకటి రెండు సార్లు.
బండి ఊళ్లోకి వచ్చి శేషయ్య ఇంటి ముందు నుంచి వెళుతున్నప్పుడు అప్రయత్నంగా శంకరం కిటికీ లోంచి శేషయ్య ఇంట్లోకి చూశాడు. శేషయ్య ఇంకా పడుకున్నట్లు లేదు. హరికేన్ లైటు ఇంకా పెద్దగా వెలుగుతూనే వుంది. శేషయ్య కీ తనకీ మధ్య ఈ పదేళ్ళ నుండి ఉంటూ వచ్చిన స్నేహం తాలుకూ మధుర స్మృతులు జ్ఞాపకం వచ్చి గట్టిగా నిట్టూర్చాడు శంకరం.
మందుల పెట్టె హాస్పిటల్ లో పెట్టించి తన దగ్గర ఉన్న తాళం చెవితో కటకటాల తాళం తెరిచి, బండిలో ఉన్న తలగడా జంబుకానా వేయించి సుబ్బడి చేత అక్కడే పక్క వేయించుకుని వాడిని పంపేశాడు. దగ్గర్లో టేబిల్ మీద హరికేన్ లైటు తగ్గించి ఉంది. ప్రక్కనే కంచం మీద కంచం బోర్లించి వుంది. మంచినీళ్ళు కూడా మూత బెట్టిన మర చెంబు తో సిద్దంగా ఉన్నాయి. ఇవన్నీ ఇలా సిద్దం చేసి, జాగ్రత్తగా అమరుస్తూ క్రమం తప్పకుండా ఇన్నేళ్ళ నుంచీ సేవ చేస్తున్న సావిత్రి అంటే శంకరానికి ఒక్క క్షణం పట్టలేనంత ప్రేమ పుట్టుకొచ్చింది. లోపల ఉన్న పడక గదిలో కి తొంగి చూశాడు. పెద్ద పందిరి పట్టే మంచం మీద కూతురి మీద చెయ్యి వేసుకుని నిశ్చింతగా నిద్దరపోతోంది సావిత్రి. నిద్దట్లో సావిత్రి ముఖం ఎంత అమాయకంగా, అందంగా ఉంది. తనలో తాను ఒకసారి నవ్వుకున్నాడు. పరస్పర విరుద్దమైన ఆలోచనలు అధికం కావడంతో ఆకలి వెయ్యడం లేదు. అందువల్ల కంచాలు కదపకుండా వెళ్లి నేలమీద సుబ్బడు పరిచి వెళ్ళిన జంబుకానా మీద నడుం వాల్చాడు. తనకి జ్ఞానం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాడు . గట్టి నేల మీద కాని తనకి నిద్దర పట్టదు. "ఇన్ని పరుపులూ, మంచాలు ఉండగా నేల మీద పడుకుంటావు . ఏం అదృష్ట జాతకుడివిరా" అంటూ అమ్మ అప్పుడప్పుడు నిట్టుర్చేది. ఈ ఇల్లు కట్టించినప్పటి నుంచీ ఈ కటాకటాల్లో పడుకోవడం ఒకటి అలవాటయి పోయింది. పాపం ఏ అర్ధరాత్రి వేళో, సీరియస్ గా ఉన్న పేషెంట్స్ తాలుకూ మనిష్యులు వచ్చి కేకవేసినా , లోపల గదుల్లో పడుకుంటే వినిపించక పోవచ్చనీ, ఒకవేళ ఏ సావిత్రి కెనా వినిపించి లేచినా, నిద్దట్లో ఉన్న తనని లేపడం ఇష్టం లేక ఏదో సాకు చెప్పి పంపించేస్తే పాపం వాళ్ళు నిరాశగా వెళ్లి పోతారనీ, ఇన్ని అలోచించి ఈ కటకటాల వసారా కట్టించాడు తను. ఈ కటకటాలలో పడుకోడానికి కూడా అదే కారణం. ఇటు ఆప్యాయంగా చూసే భార్యా, అటు అవసరంగా ప్రార్ధించే పేషెంట్స్ . ఒక వేపు ఆదరణ మరో వేపు ఆవేదన. ఇటు సంసారం, అటు సమాజం -- ఓ వైపు స్వసుఖం మరో వైపు ప్రజాసేవ. మధ్యన తాను-- ఎంత విచిత్రంగా సాగుతోంది జీవితం?
ఇలా అలోచించి అలోచించి ఏ కోడి కూత వేళో నెమ్మదిగా నిద్ర పట్టించు కున్నాడు శంకరం. రాత్రి ఎంత సేపటికో కాని నిద్ర పట్టక పట్టిన శంకరానికి తెల్లరకుండా వంటింట్లో సావిత్రి చేస్తున్న చప్పుళ్ళ కి, అవతల గదిలోంచి పెద్ద గొంతుక పెట్టుకొని మణి చదువుతున్న చదువు కి మెళుకువ వచ్చేసింది.
అబ్బబ్బ !....ఆదమరచి ఒక్క అరగంట కూడా నిద్ర పోనియ్యరు. శనిలా దాపురించారు ఇద్దరి కిద్దరూ..." అని విసుక్కుని అటు తిరిగి పడుకుని మళ్ళీ నిద్దర కోసం ప్రయత్నం చేశాడు. ఉహు....... మణి చదువు, సావిత్రి గ్లాసుల చప్పుడూ చెవుల్లో రణగోణ ధ్వనిగా దూరి నిద్ర పట్టనియ్యడం లేదు.
దాంతో "ఏవిటా వెధవ గొడవ ! అంటూ గట్టిగా అరిచాడు.
శంకరం గొంతు విని హడలిపోయి చదవడం అపుచేసింది మణి , అంత గట్టిగా అరిచారేవిటి చెప్మా అని చేతులో ఉన్న పని వదిలేసి ఆ మట్టునే కటకటాల వసారా లోకి వచ్చేసింది సావిత్రి. వస్తూనే ఎర్రగా ఉన్న శంకరం కళ్ళు చూసి కంగారు పడి "ఏవిటండీ?....కళ్ళు మరీ అంత ఎర్రగా ఉన్నాయి. వేడి చేసిందేమో ! రాత్రి నిద్ర పట్టిందా ?..... మరి కొంచెం పెరుగు పోసుకో పోయారూ ?....అరె!....రాత్రి భోజనం చెయ్యలేదా ఏమిటి బోర్లించిన కంచం బోర్లించినట్లే ఉంది. అంది.
"భోజనం....నిద్రా! ...ఈ రెండూ సాగానిస్తారావిటి అసలు మీరీ కొంపలో ....తెల్లారకుండా ఏవిటి , అది అలా చించు కుంటోంది ?" అన్నాడు శంకరం కర్కశంగా.
"చించుకోవడం ఏవిటండీ ........ఏదో పాఠం కాబోలు కంఠస్తం చేస్తోంది."
"పాఠం?"
"ఊ....."
"పాఠం ఏమిటి?"
"ఏం లేదు లెండి "
"మాట తప్పిస్తావెం ?...చెప్పు...ఊ...నిన్నే ?....ఏవిటి అది చదువుతున్న పాఠం?"
"ఆహా....పాఠం అని . మరేం లేదు ....తోచక అనవసరం పుస్తకాలు ఏమీ చదవక ఏదో ముఖ్యమైన పుస్తకం చదువుతోంది ...అంతే"
"ఏవిటా నంగి నంగి గా చెప్పడం ....ఉండు, దాన్నే కేకేసి కనుక్కుంటాను అసలు సంగతేవిటో?"
"అది కాదండీ! ...జ్ఞానం వస్తూన్న పిల్ల -- మనమూ ఇంకా పెళ్లి చెయ్యలేదు. చుట్టూ పట్లా డానికి ఈడయిన అమ్మాయిలూ లేరు. కాలక్షేపానికి. మీరు హాస్పిటల్ కి వెళ్ళాక నేను వంటింట్లో పనులు చూసుకోవడానికి పోయాక ఒక్కదానికే దానికేం తోస్తుందండీ".......అందుకని ఏదో పొద్దుపోవడానికి ........"
