Previous Page Next Page 
ధర్మ చక్రం పేజి 29


                                                                   33
    గట్టి బందోబస్తు తో సెంట్రల్ జెయిల్ లో ఉంచబడిన ధర్మారావు ను చూచి ఖైదీలలో అధిక భాగం విచారించారు అంతర్యం లోనూ, బహురంగం గానూ కూడా. మరికొందరు కరుకు హృదయులు మాత్రం రకరకాలుగా వ్యాఖ్యానించారు.
    "మాకోసం ఎన్నో ప్రయత్నాలు చేసినమీరే కడకు మాలో చేరిపోయారు బాబూ! విధి వైపరీత్యం " అన్నాడొక ముదుసలి.
    "ధర్మానికి ఇది లోకం కాదు బాబూ. లేకుంటే మీకు ఈ శిక్షా?' అని కంట తడి పెట్టాడొక ఆర్ద్ర హృదయుడు.
    "ఆనాడు శ్రీరామ చంద్రుడికే వనవాసం తప్పింది కాదు. హరిశ్చంద్రుడే కష్టా అనుభవించాడు" అన్నాడొక ఆధ్యాత్మిక వాది.
    "మంచి రోజులు రాకపోవు. పైన ఆ భగవంతుడు లేడా?" అన్నాడు ఒక ఆశావాది.
    "పెద్ద పెద్దోల్ల అసలు రంగు లిలాగే ఉన్నట్టుండి బయట పడతాయి." అన్నాడు లోకమంతా నేరస్తులే ఉంటారను కొనే మొరటు మనిషి ఒకడు.
    ధర్మారావు దేనికీ, ఎవరికీ సమాధాన మివ్వలేదు. నిర్లిప్తంగా నిలిచిపోయాడు. కాని లోలోన అతడు మహా ఆశ్చర్యం చెందాడు, బలరాం ఏమీ మాట్లాడక పోవటం చూసి.
    సరదాగా నవ్విస్తూ, కవ్విస్తూ చలాకీగా మాట్లాడుతుండే బలరాం ఎందు వల్లనో చాలా ముభావంగా ఉండి పోయాడు. అసలు ధర్మారావు వైపు చూడనే లేదు. గౌతమ్ పరారై నప్పుడు కూడా అతడి లాగే నిర్లిప్తంగా ఉండి పోవడం గుర్తు వచ్చిన ధర్మారావు, బలరాం అసలు తత్వ మేమిటో తెలియక తికమక పడ్డాడు.
    ధర్మారావును మరీ ప్రమాదకరమైన వ్యక్తీ గా పరిగణించి, అతడిని ఇతర ఖైదీలందరి నుండి విడిగా ప్రత్యేకమైన గదిలో ఉంచారు. కాలకృత్యాలకు, భోజనానికి-- ఎందుకైనా సరే అతడిని ఒక్కడినే ప్రత్యేకంగా తీసుకు వెళ్ళుతున్నారు. ఇతర ఖైదీ లెవరూ అతడితో గాని, అతడు వారితో గాని మాట్లాడ కుండా తగు కట్టుదిట్టం చేశారు.
    తన గతిని తలుచుకొన్న కొద్దీ తనకే విస్మయమూ , జాలీ కలిగాయి ధర్మారావు కు. నీతి, న్యాయ ధర్మాలు భగవంతునికి అపర స్వరూపమే అంటారు. మరి ఈ ధర్మ పధం ఇంత కంటకావృతమై పొయిందేమిటి?

                                   34
    "అయ్యో, అయ్యో! ఇంకా నయం. ఇంతటి తోనే వదిలిపోయింది వాడి స్నేహం. నేనంటూనే ఉన్నాను-- వాడో ముదనష్టపు వాడై ఉంటాడని!"
    సుమిత్రాదేవి  వెలి బుచ్చుతున్న ఆ అమూల్యాభి ప్రాయాలను వింటున్న శ్రోతలు ముగ్గురి లో సుయోధన్ మాత్రమే ఆ అభిప్రాయాలతో మనస్పూర్తిగా ఏకీభవిస్తూ , మధ్య మధ్య అంతకంటే గొప్ప అభిప్రాయాలను వెల్లడిస్తున్నాడు. న్యాయమిత్ర తటస్థంగా అప్పుడప్పుడు ఊ కొడుతున్నాడు. మూడవ శ్రోత సత్యాదేవి మాత్రం తల వాల్చి కూర్చుని, తనకు పూర్తిగా అనవసరమన్నట్టు నిర్లిప్తంగా ఉండి పోయింది.
    "ఏమమ్మా, మాట్లాడవు? ఇంకా నీకు వాడంటే అభిమానమేనా?" సుమిత్ర ప్రశ్నకు తలెత్తి చూచి తిరిగి వాల్చేసుకుంది సత్య. సుమిత్ర మరేమీ అనలేక తనలో తాను మూతి మూడు వంకరలు తిప్పుకుని ఊరుకుంది.
    "అయితే ఏం చేస్తారట , ఆ అబ్బాయిని?' కుతూహలంగా ప్రశ్నించింది సుమిత్ర.
    "బెయిలు కూడా ఇవ్వరు" అన్నాడు సుయోధన్ ఉత్సాహంగా." మంచి కట్టడి లో ఉంచే విచారణ అంతా పూర్తీ చేస్తారు."
    "పాపం!" ఎంతైనా సుమిత్రది స్త్రీ హృదయం!
    వికటంగా నవ్వాడు సుయోధన్! "హెచ్చు తగ్గులోస్తే ఉరిశిక్షే పడేది" అన్నాడు మిత్రా. ఇనుమడించిన సంతోషంతో "ఎక్కడున్నా వాడి బాబు కూడా దెబ్బతో ఊడి పడవలసిందే." అన్నాడు సుయోధన్.
    అదిరి పడింది సుమిత్ర. ఆమె స్త్రీ హృదయం తల్లడిల్లి పోయింది. "ఏమిటి, మరీ అంత దారుణం? చిన్నతనం. పాపం, ఏదో తెలిసీ తెలియక చేశాడు. కనికరించి ఏదో చిన్న శిక్ష తో భయం చెబుదురూ."
    సత్య తన చెవులను తానె నమ్మలేక పోయింది , ;పిన్ని ఇంత మంచిగా ఎప్పుడు మారిపోయిందా ?" అని.
    సుమిత్ర ఇంకా అంటూనే ఉంది. "ఎంత దారుణం! ఎంత దారుణం! చక్కగా, వినయంగా మాట్లాడు తుండేవాడు కుర్రాడు! ఏదో చిన్న తప్పు చేసినంత మాత్రాన ఉరి శిక్షే?"
    "ఊ. కట్టి పెట్టు." విసుక్కున్నాడు న్యాయ మిత్రా. "అయినా నీలాటి ఆడదానితో ఈ విషయాలు మాట్లాడట మేమిటి? పోయి నీ పని చూచుకో."
    అక్కడి నుంచి తప్పనిసరిగా నిష్క్రమించింది సుమిత్ర. "ఎవడో ఒకడు. ఎంతైనా మానవుడు కదా? జాలి ఉండక్కర్లే? ఉరి శిక్ష , వేసేయడం? నేను భరించలేను. నేను వినలేను" అని గొణుక్కుంది.
    "మాట్లాడవేం , సత్యా? ఉండి, ఉండి ఇటువంటి అర్ధంతరపు పనులే చేస్తారు, మీ బాబాయి" అని సత్యను కవ్వించ బోయింది పోతూ పోతూ.
    ఆమెకు ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా, ఆవేశం కలిగినా అవధులు ఉండవు.
    'ఛ ఆ దౌర్భాగ్యుడి మీద నీ కంత అభిమానమేమిటి?" మరదలి పై విసుక్కున్నాడు సుయోధన్.
    సత్య హృదయ గత స్థితి వర్ణనా తీతం. సప్త సముద్రాలూ ఒక్క ఉరవడి ని మీదకు దుముకుతున్నట్లు, పండ్రెండుగురు మార్తాండులు ఒక్కసారే ఉదయించి మాడ్చి వేస్తున్నట్టు గిలగిల లాదిపోయిందామె. తన మనో గతాభిప్రాయాలు , దుఃఖా వేశామూ ఇతరుల ముందు వెల్లడి కాగలవనే భయంతో త్వరత్వరగా తన గదిలోకి నడిచింది.
    సుయోధన్ ఎవరినీ గమనించ గల స్థితి లో లేడు నిజానికి. తానూ, తమ్ముడూ ఏకాంతంగా మిగలగానే , హద్దులు దాటిన ఆనందంలో లేచి తమ్మునికి దగ్గరగా వెళ్ళాడు.
    "మిత్రా! మంచి నిర్ణయం! ఆ దేశ ద్రోహికి మరణ శిక్ష కూడా చాలదు. కాని అంతకంటే పెద్ద శిక్ష లేదు!"
    మిత్రా ఒక్కసారి తలెత్తి చూచి, మౌనంగా ఉండిపోయాడు.
    "అసలు నేను చెబుదామనే అనుకొంటున్నాను. వాడికి ఉరి శిక్ష వేయమని."
    అప్పటికీ మిత్రా మాట్లాడలేదు.
    "కొడుకు కు ఉరి శిక్ష పడడంతో తండ్రి ఎక్కడ దాక్కున్నా బయటకు వచ్చి మనకు లొంగి పోతాడు." తన సంతోషంతో సుయోధన్ ఇంకా భవిష్యత్తు పై వ్యాఖ్యానిస్తూనే ఉన్నాడు.
    చిన్నపిల్లల ధోరణి వంటి ఆ తరహ చికాకనిపించిన న్యాయమిత్ర హటాత్తుగా కూర్చున్న చోటి నుండి లేస్తూ అన్నాడు: "నిజంగా దేశ ద్రోహే అయితే అంతే శాస్తి కాని, అటువంటి వాడు కాదని నాకు బాగా తెలుసు."
    ఆ కఠినత్వం చూచిన సుయోధన్ ముఖంలో హాసం మాయమయింది.
    "అయితే ధర్మారావు, గౌతమ్ ..." అర్దోక్తి లో ఆపేశాడు.
    "ఏదో ఒకటి కానియ్యి. కాని, ఇప్పుడు తర్కించ వద్దు, అన్నయ్యా" అంటూనే అక్కడి నుంచి పోబోయాడు. అతడి వదనం లోని విజయ గర్వపు చిరునగవు సుయోధన్ గమనించలేదు.
    "మిత్రా!' అన్నాడు తట్టుకోలేని ఆశ్చర్యంతో.
    "అవునన్నయ్యా.' మేడ మెట్లు దిగిపోతున్న మిత్రా అక్కడే ఆగాడు కాని, వెనకకు తిరగకుండానే సమాధానం చెప్పాడు. "నేను ఎప్పుడూ న్యాయానికి మిత్రుడి నే. ఏది ధర్మమో, ఏది న్యాయమో అది చేస్తాను. నా వృత్తి విషయం లో ఎవరి సలహాలు, చర్చలూ అనవసరం. ఈ సంగతి నీకూ తెలుసు."
    ఆ ఆకస్మిక అఘాతం నుండి సుయోధన్ తెరుకోనక మునుపే మిత్రా కదిలి కనుమరుగయ్యాడు.
    కాని, అన్నదమ్ము లిద్దరికీ ఒకరి స్వభావం ఒకరికి బాగా తెలుసు గనక, ఎవరూ ఆ విషయం గురించి ఇక ఏమీ అనుకోలేదు.
    సత్య ధర్మారావు గురించిన చింతలో లోకమే మరిచిపోయింది. అతడి తో గడిపిన అనేక సమయాలూ, జరిపిన చర్చలూ, చేసిన ప్రయత్నాలూ పదేపదే గుర్తు రాగా మనస్సు కదిలి పోయి, నేత్రాల నుండి అవిరళ భాష్పధారలు వర్షించ సాగాయి. అతడి లో ప్రాణిగ్రహణం చేయవలసిన తాను అతడికి విరోధి గా మారిపోవాలి! అతడి కంఠన్ని పూల మాలతో అలంకరించ వలసిన తానె ఉరితాడు బిగించడానికి నాంది పలకాలి' 'భగవాన్! ఎందు కింత క్రూరంగా ఆడుకుంటున్నావు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS