Previous Page Next Page 
అర్పణ పేజి 29


                               23
    అప్పుడే చదివిన అధ్యాయాన్ని తిరిగి చదవ నారమించినట్లున్న మానసికానుభవమే! అనుభవం లేని రచయిత, చెప్పిన సంగతే తిరిగి తిరిగి చెబుతుంటే కలిగే విసుగే! ఎంతటి మమతాబద్దుడైన మనిషి మార్పు కోరతాడు. అంతర్యపు విధి. నీరవంగా, నిస్తబ్దంగా పోతున్న రోజులతో పార్వతి బొత్తిగా విసిగిపోయింది. విసిగి ఏమీ చెయ్యలేదు.    
    వాన ఒక్క జల్లే కురిసింది ఆరోజు. కొత్తగా ఒక్క పువ్వే విరిసింది రోజా. ఆ జల్లుకే దాని రేకు పెదవులు చంచలించాయి. అప్పుడే కన్ను విచ్చిన పువ్వు తన జీవితమంతా వానే కాబోలు ననుకుంది. పువ్వు గనక దానికి ఒక్క రోజో, ఒక్క గంటో , ఒక్క క్షణమో లోక సంబంధం. మనిషి కలా కాదు. ఒక క్షణం జీవించినా అతన్ని అన్ని బంధనాలూ చుట్టినట్లే లెక్క.
    సరస్వతి కి ఉత్తరం వ్రాద్దామని పూనుకుందే కానీ, ఎలా ప్రారంభించాలో తెలియటం లేదు పార్వతికి. అది నుంచి అదే సమస్యగా , కలం కదలకుండా నిలబడింది. కిటికీ లో నుంచి బల్ల దగ్గరకు ఆకాశం చక్కగా కనిపిస్తున్నది. పంచ రంగుల ఏరు ప్రవహిస్తున్నట్లు రమణిస్తున్న పశ్చిమాకాశం.
    చేతిలోని కలం వదిలి ఆటే చూస్తూ కూర్చున్నది. నోట తిరగని ఏవో బరువైన భావాలు. కళ్ళు మూసుకుంటే రాధాకృష్ణ , మరొకసారి సరస్వతి కనిపిస్తున్నారు.
    కొన్నాళ్ళ కిందట ఒక రోజున రాదా కృష్ణ , పార్వతి దీర్ఘంగా సంభాషణ లోకి దిగిపోయారు.
    సుభద్ర గారితో కొంత సత్కాలక్షేపం జరిగిపోయాక రాధాకృష్ణ దగ్గరికి వెళ్ళింది పార్వతి.
    ఆమె లోపలికి అడుగు పెట్టగానే ఏదో వ్రాస్తున్న రాధ కృష్ణ-- "కవిత రచన చదివారా పార్వతీ? మార్చి సంచిక ఇచ్చెను-- అందులో " అన్నాడు కూర్చోమంటూ.
    నవ్వి, "కవిత, కవిత అని పట్టించారేమిటిటండోయ్? ప్రేమిస్తున్నారేమిటి?" అన్నది పార్వతి, నోరు జారి. తర్వాత అంతలా ఎందుకన్నానా తను-- అని విమర్శించు కుంది.
    అతనికి కోపం వచ్చిందేమో నని చూసింది.
    తలయెత్త కుండా వ్రాస్తూనే అన్నాడు : "నా జీవితానికి, ప్రేమకూ మధ్య ఆధారంగా ఉన్న సూత్రం ఎన్నాళ్ళ కిందటో తెగిపోకుండా ఉంటె --ఈ 'కవిత' మగవాడైనా, ఆడదైనా తప్పక ప్రేమించి ఉందును."
    "కవిత అడపెరులా ఉంది కదండీ?' పార్వతి వింతగా చూసింది.
    "మా రచయితలు సరదా కి మార్చుకుంటారన్న సంగతి మీకు తెలియదా?"
    "ఓహో! అదా!"
    కొంతసేపు మౌనం తర్వాత --"మీ మీద నాకు కోపం వస్తోంది" అన్నది పార్వతి.
    "ఎందుకు, పార్వతీ?" అన్నాడు రాధాకృష్ణ ఆశ్చర్యంగా.
    "మీరిలా జీవితాన్నంతా పాడు చేసుకోవడం నాకు నచ్చలేదు."
    "మీకు తెలియదు, పార్వతి! ఇప్పటికీ నాకు ణా ఏకాంత జీవితంలో ఏ లోటూ తెలియడం లేదు. నిశ్చింతగా ఉంది."
    "అనుకోని కష్టాలు వస్తే ఏం చేస్తారు?"
    "నేను దైవాన్ని నమ్ముతాను. అతను నిర్ణయించిన దాన్ని అనుభవించదానికి సిద్దంగా ఉన్నాను."
    "పరిపూర్ణత లేని జీవితం అయిపోదా మీది?"
    "ఏది పరిపూర్ణత, పార్వతి గారూ? అమలినమూ, పరిశుద్దమూ ఐన భావమేదైనా హృదయం తో నిండి ఉన్నంత వరకూ అది పరిపూర్ణతే. అందరికీ సముచితమైన దాని కన్నా తనకు ఉన్నతంగా తోచిన దాన్ని త్రికరణ శుద్దిగా నమ్మి, అన్య ప్రాబల్యానికి లొంగి పోకుండా చివరి వరకూ నిలవ గలిగితే ఆత్మకు పరిపూర్ణత  కలుగుతుంది."
    "ఇహానికి చెందినా వాటి నన్నింటి నీ అనుభవిస్తే కాని మానవుడి జీవితానికి పరిపూర్ణత కలగ దంటారు. అదేమిటో నా కర్ధం కాలేదు.  చెప్పండి."
    "మిమ్మల్ని మీరు విశ్వసించలేనంత వరకు అల్లాటి వన్నీ నమ్ముతుంటారు. కానీ ఇవాళ ఇటువంటి ప్రసంగం ప్రారంభించారేమిటి?"
    "మీరు పెళ్లి చేసుకోండి, కృష్ణ గారూ!"
    రాధాకృష్ణ తలెత్తి, కొద్దిగా నవ్వాడు. అంతలో అతని ముఖం మారింది.
    "ఇంతవరకు ఇక్కడి వాళ్ళెవరితోనూ జరిగిన ణా జీవిత విశేషాలేవీ సరిగ్గా చెప్పలేదు . మాది బ్రాహ్మణ కుటుంబం, పార్వతీ! తల్లి లేకపోవడం వల్ల పినతండ్రి ఇంట్లో పెరిగాను. మావాళ్ళు సంకుచిత స్వభావం కలవాళ్ళు. నాకు వాళ్లతో సరిపోక వాళ్ళ ఉద్దేశాలతో ఏకీభవించ లేకపోయే వాణ్ణి ఎప్పుడూ కూడా. ఆఖరికి మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకోమన్నప్పుడు కూడా అంగీకరించలేకపోయాను."
    పార్వతి చటుక్కున అందుకుంది.
    "మేనమామ కూతురంటే చులకన కదా, మరి?"
    అప్పుడు గుర్తు వచ్చింది రాధ కృష్ణకు-- రాజు పార్వతి ఒకరి కోక రేమౌతారో . నవ్వుతూ "పెళ్ళైన తర్వాత మేనమామ కొడుకూ చులకనై పోతాడు లెండి!" అన్నాడు.
    వ్రాసిన కాగితాల వైపే చూస్తూ తాపీగా ప్రారంభించాడు రాధాకృష్ణ. "నేను కోరికోరి లలితను పెళ్లి చేసుకున్నాను. అప్పటి నుంచి మరి కాస్త ఎడం అయ్యాను మా వాళ్ళ దృష్టి లో. తర్వాత ఏడాది కే చనిపోయిన ఆమెను గురించి ఎవరైనా విచారించారో లేదో గాని నా విషయంలో మాత్రం చాలా సానుభూతి చూపించి వేర్రేట్టించారు. అప్పటి కింకా మామయ్య కూతురు నళిని కాలేజీ లో చదువు కుంటోంది. ఆమెని నాకిచ్చి చేస్తానన్నారు. అవసరం లేదన్నాను. మొదట కాదని తర్వాత నా అవసరానికి ఆ అమ్మాయిని చేసుకుని అవమానించే బుద్ది హీనుణ్ణి కానన్నాను. ఆ మాట నేనన్న మీదట -- నళిని కూడా ఒప్పుకుంటున్న దన్నారు పట్టుపట్టి మావాళ్ళు. ఆ బాధ పడలేక వినకుండా వచ్చేశాను. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇంకా ఒకటి రెండు కధలు ఎక్కువ వ్రాయగలుగుతున్నాను.
    "వరసకి మా అక్కగారు ఒకావిడ ఉంది. ఆమె విశాల దృక్పధం కల మనిషి. ఉత్తరాల్లో నా యోగ క్షేమాలు విచారిస్తూ పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించ మంటుంది. నళిని కూడా ఉత్తరాలు వ్రాసి వ్రాసి కోపం వచ్చి మానేసింది. ఆ పిల్లకి పెళ్ళయిందట. ఇదీ నా కధ. ఇంతకీ ఈ ప్రసక్తి ఎందుకు తెచ్చారు, పార్వతీ , మీరు?"
    సున్నితంగా నిస్శ్వసించింది పార్వతి. "ఈ మధ్య పెళ్ళిళ్ళు చేసే బరువు నెత్తిన వేసుకుంటున్నా లెండి!" నవ్వింది.
    "ఎవరికైనా పెళ్లి చేశారా-- మాటలేనా?"
    "ఇంకా ఎక్కడ, రచయిత గారూ! ఒక అమ్మాయికి పెళ్లి చెయ్యాలి. ఇంకా వరుడేక్కడ దొరుకుతాడో కూడా ఊహ కందడం లేదు."
    "సరే! మీ ప్రణాళిక ప్రారంభానికి దొరికిన రెండో వ్యక్తిని నేనని తెలుస్తూనే ఉంది. సులువు కోసం ఒక్క ముహూర్తానికే ఇద్దరి పెళ్ళీ చేసేయ్యరు కదా?' ఛలోక్తి విసిరాడు రాధాకృష్ణ.
    అర్ధమయ్యాక- "అబ్బే! అదెలా ఔతుందండీ! కుల భేదాలు ఉన్నాయి. లేకపోతె అలానే చేద్దును." అంది తెప్పరిల్లి.
    "ఎవరా అమ్మాయి?" అన్నాడు రాధాకృష్ణ తెల్ల కాగితం మీద కలాన్ని అనుస్తూ.
    "ముందు మీ సంగతి చెప్పండి? మీకు మరి పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదా?-- మగవారై ఉండి ఇల్లాటి పట్టు పట్టడం లో అర్ధమేమిటో తెలియడం లేదు."
    "మగవాడైనా , ఆడదైనా అంతరంగాల ఆవేదన ఒక్కటే. దుఃఖ సంఘటనలు ఎదురైనప్పుడు రెండు మనసులూ ఒక్క విధంగా బాధపడతాయి. మగవాడు మనః స్థైర్యం కలవాడు కనక తాత్కాలికంగా బయట పడడు."
    "మీరు చెప్పెదెందుకో.... " పార్వతి నసిగింది.
    "నేను మగవాణ్ణి ని మీరు ప్రత్యేకించి అంటుంటే నాకీ ఊహ కలిగింది. భర్తను కోల్పోయిన స్త్రీ విపరీతంగా దుఃఖ పడుతుంది. భార్యను పోగొట్టుకున్న భర్త కూడా అంతగానూ బాధపడతాడు. అల్లాంటప్పుడు స్త్రీ జీవితంత మూ అనుభవించే దుఖమూ, శిక్షా పురుషుడు మాత్రం ఎందుకు అనుభవించకూడదు? ఆ నియమాలు ఎందుకు విధించలేదని అంటాను. అతను కష్టాలు విస్మరించే ప్రయత్నాలు ఎందుకు చేయాలి?" అన్నాడు రాధాకృష్ణ. ఎంత పైకి కనిపించనీయ కుండా ఉన్నా కళ్ళతోనే అతని ఉద్రిక్తత వ్యక్తమౌతున్నది.
    పార్వతి గడ్డం కింద చెయ్యి పెట్టుకుంది. "మీవంటి వారిని పువ్వులతో పూజించినా వింత లేదు. కానీ నాకు చాలా కష్టంగా ఉంది. మీరు జీవితమంతా ఇలాగే ఉండిపోతారా. నన్యసించినట్లు?"
    "కాదు, పార్వతి! ఎక్కడైనా నాలాటి అభాగ్యురాలే తటస్థ పడితే పెళ్లి చేసుకుంటాను."
    "అంటే?' పార్వతి కళ్ళు విప్పారి అతన్ని చూశాయి.
    "నేను భార్యావియోగాన్ని అనుభవిస్తున్న ట్లే  భర్త వియోగానికి పరితపిస్తున్న స్త్రీని పెళ్లి చేసుకుంటాను-- ఆమె అంగీకరించి నట్లయితే . అప్పుడామే బాధను నేను, నా బాధను ఆమె తెలుసుకొని, ఒకరి కొకరం, తోడు నీడగా అపోహలు , అరమరికలు లేకుండా కలిసి జీవిస్తాము."
    "ఇవన్నీ కలలేమో అనిపిస్తోంది నాకు. అపోహాలు, ఎత్తి పొడుపులు లేని సంసారం ఉంటుందా ఎక్కడైనా -- ఎంత ఆదర్శదాంపత్య మైతే మటుకు?"
    "అలా చెప్పలేమండీ! భార్య భర్తల్లో ఒక వ్యక్తీ అజ్ఞానంతో నో, మరెందుచేతనో అనుకూలం కాకపొతే మరొక వ్యక్తీ తనకు తెలిసినంత ల అనుకూల పరిణామాన్నే వాంచించి కృషి చేస్తే చాలు. ఇక ఇద్దరూ మూర్ఖులైతే వేరే నరక దర్శనం అనవసరం."
    పార్వతి ఎవరో కొట్టినట్లు చూసింది. బాధ అనిపించింది. కానీ రాధ కృష్ణ తో వాదించగల ధైర్యం లేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS