"నాకేమీ అర్ధం కాలేదు. నేనేదో అడిగితే నువ్వేమేమో చెప్పుకొచ్చావు."
"అర్దమవ్వడాని కేముంది? ఏదో కాస్త అందంగా, చలాకీగా వున్న పిల్లను చూచి పెళ్ళి చేసుకోవాకనుకుంటాననుకో. ఆపిల్ల గుణగణాలు, కుటుంబ చరిత్రలూ ఎటువంటివో ఎలా తెలుస్తుంది? మోసపోనూ?"
నివ్వెరపోయింది శాంతి. "వ్యక్తి ప్రధానం కాని మిగత కుటుంబమెందుకు మనకు?"
"అదే చాలా పొరపాటు. కాలమూ, చదువులూ, నాగరికతలూ వ్యక్తిలో చిన్న చిన్న మార్పులనైతే తేగలవుకాని నైతిక విలువలు, దయా క్షమాగుణాలు వంశామగతంగా సంక్రమిస్తాయి. రక్తమాంశాలలో జీర్ణించుకుపోయి వుండే ఆ గుణాలే వ్యక్తిత్వానికి ప్రధానం. జీవితాన్నీ, జీవిత భాగస్వామినీ సుఖమాయం చేసినా, దుఃఖించేయగలిగినా అవే."
శాంతి దృష్టి ఎక్కడో నిగిడ్చి ఆలోచనా పూర్వకంగా, "అంగీకరించలేను" అంటూ తల అడ్డంగా త్రిప్పింది.
నవ్వాడు నారాయాణ. "మహామహా వాళ్ళే అంగీకరించారు. నువ్వెంత? కాకపోతే ఒక వయస్సులో అలాగే అన్పిస్తుంది, మరి! తర్వాత తర్వాత నువ్వే తెలుసుకుంటావు. నేనవన్నీ ఆలోచించక పోలేదు. ఏ కారణంవల్లనైనా మన హృదయానికి దగ్గరగా వచ్చిన వ్యక్తిని, ఎన్ని లోపాలున్నా సరే చేపట్టగల సంస్కారముంటే చాలు. కాని ఎవరినో ఉద్దరిద్ధామనీ, కేవలం సంస్కరణ అనే పేరుకోసం కానీ, పెద్దలు నిర్ణయించినదాన్ని చేసుకోవడం నాగరికత కాదనే భ్రమతోగానీ క్రొత్తదారులు త్రొక్కబోవడం అనర్ధాలు చేజేతులా కొని తెచ్చుకోవడమే అవుతుంది. నాకలాటి ఉద్దేశ్యాల్యూ లేవు; నాకెవరూ దగ్గరగా రానూ లేదు. అసలు ఈ యితరుల్ని ఉద్ధరించడం అనే బురఖా వదిలేసి, ఎవర్నివారు ఉద్ధరించుకుని ఊరుకుంటే దేశంలో సగం అనర్ధాలు సమసిపోతాయి. అందుకే నేను బాధ్యత వంతనూ నాన్నగారికే, అన్నయ్యకే వదిలేశాను."
"అయితే ఆవిడెలాగున్నా నీకేం అభ్యంతరం లేదన్నమాట!"
"ఆహఁ! బొత్తిగా అటువంటిది కాదులే. నాకు చదువూ, అందం రెండూ కావాలని చెప్పాను. సరే, ఆ మిగిలినవి పెద్దలు ఎలాగా చూచుకుంటారు. ఫోటో పంపారు, నచ్చింది. ఇదుగో చూడు." పాకెట్ దైరీలోంచి తీసి ఇచ్చాడు.
పరీక్షగా, కుతూహలంగా చూచింది శాంతి.
బాడ్ మింటన్ బాట్ తో సైడ్ పోజ్ లో హుందాగా నిల్చుంది. రెండు జడలు, నాజూకు అలంకరణ - చాల షోగ్గా ఉంది. "అందంగానే ఉంది" అంది చిరునవ్వుతో శాంతి.
"ఆఁ. అదీ. అదే కావాలి! ఆ తర్వాత అనురాగం మనం సృష్టించుకోవచ్చులే. అనేక సమస్యలు నెత్తిన వేసుకొనేకంటే ఒక్క సమస్యనే తెలివిగా తేల్చుకోవడం మంచిది."
"పోనిద్దూ. మన ఉద్దేశ్యాలు సమానాంతర రేఖలవంటివి" అంటూ ఆ సంబాషణపట్ల అయిష్టం వెలిబుచ్సింది శాంతి.
"మరి, నువ్వు త్వరగా తెములు. ఇప్పుడే వెళ్ళిపోదాం. నేను ప్రొఫెసర్ తో మాట్లాడతాను."
శాంతి గుండెలలో రాయి పడింది. "ఇప్పుడే వెళ్ళిపోవాలా?"
"ఏం, ఏమిటి విశేషం?"
"విశేషం లేదనుకో. కాని మాఘమాసంలో కదా? ఇంకా సుమారుగా మూడు వారాలుంచి వ్యవధి."
"ఇప్పట్నుంచీ ఎందుకంటావా? మళ్ళీ వినను తీసుకువెళ్ళడానికి ఎవరొస్తారు?" కఠిణంగా అడిగాడు.
"......."
"ఒక్కత్తెవే రాగలవా? రాగలిగినా అలా వీలుపడదు. అది మంచిపని కాదు. ప్రయాణానికి సిద్ధంగా ఉండు. నాన్నగారుకూడ అలాగే వ్రాశారు ఉత్తరంలో. లేకపోతే తిన్నగా రాజమండ్రీ దేవీపట్టణం పోదును. ఇక్కడికి రావడమెందుకు?"
ఇక మాట్లాడలేకపోయింది శాంతి. 'కాని ఏమిటీ విధి వైపరీత్యం? గోవిందరావుతో దగ్గరకావడానికి ఒక్కో అవకాశం వచ్చినట్టే రావడం, అది మళ్ళీ గగనకుసుమంలా ఊరిస్తూ దూరం దూరంగానే ఉండిపోవడం. అతడితో మాట్లాడి అప్పుడు యింటిదగ్గర ఆ విషయం చెప్పడం సమంజసం. తన కవసరం లేకపోయినా ఎవరూ, ఏమిటీ? అని నాన్నగారు ప్రశ్నించక మానరు. అందుకైనా అతడిని గురించి తెలుసుకోవాలి. ఏది దారి?'
భోజనశాలలోకి వెళ్ళి పరిచయమున్న ఒక మనిషి చేత శ్రీనికేతనంలోని రాధూకు కబురంపింది. శాంతి వార్త వినగానే పాఠశాలలో ఉన్న రాధూ తరగతిలోనుంచి ఎగిరివచ్చాడు.
"ఒక చిన్నపని చేసిపెట్టాలి, రాధూ. ఈ చీటీ గోవిందరావుగారికిచ్చి రావాలి."
"ఓ!" వాడు మేఘాలపై ఎగురుతూ వెళ్ళిపోయాడు.
చీటీ పంపి రాధూ రాకకే ఎదురుచూస్తూ కూర్చుంది శాంతి.
పది నిమిషాలకు తిరిగివచ్చిన రాధూ చెప్పాడు: "ఆయన 'ఉత్తరాయణ్' ను అలంకరింపజేస్తున్నారు. రావడానిక్ తీరిక లేదట."
"చీటీ యిచ్చావా?" అడిగింది శాంతి.
"ఇచ్చాను. ఆవిడ అన్నయ్య వస్తే నేనెందుకు? వెళ్తే వెళ్ళమన్నారు."
"సరేలే. నువ్వు వెళ్ళు" అని పంపేసింది రాధూను. 'నన్ను ప్రేమించినవానికి నా అన్నలతో పరిచయం చేసుకోవలసిన అవసరం లేదా? అదేం మాట?' అని ఆలోచించింది.
'వెళ్ళిపోతున్నానని కోపం కాబోలు! చిత్రాం గద నాటకంలో వేషం వెయ్యనని నిరాశ. ఏం చెయ్యను, మరి? నాకుమాత్రం యిష్టమా, వెళ్ళిపోవడం? వెళ్ళాక ఉత్తరం వ్రాస్తాను' అని సరిపెట్టుకుంది.
'ఇదీ ఒకందుకు మంచిదే. చిన్నన్నయ్య దసలే కొంచెం దురుసు స్వభావం. ఇందులో ఇతడి ప్రమేయం ఉండకూడదు. పెద్ధన్నయ్యా, నాన్నగారే నా ముద్దు చెల్లించగలరు' అని సంతృప్తిపడింది.
