Previous Page Next Page 
మొగలి పొదలు పేజి 29


                                 14
    శ్రీనివాస్ కి,'    ప్రేమగా వ్రాసే ముకుందం నమస్కారాలు. నీ గురించి నాకు తెలియని కబురు అంటూ లేదు. నిన్ను చూస్తె నాకు బాధ , జాలి. నీకే భగవంతుడు యిన్ని కష్టాలెందుకు యిచ్చాడంటావు? చూడు శ్రీనివాస్ నేను చాడీల కోరుననీ , మరేదో మరేది అని , అంచనా వేయకు. నేను నీ శ్రేయోభిలాషిని. నాటకాల్లో నారదుడి పాత్ర వేసినంత మాత్రంలో కలహా ప్రియుడిని అనుకోకు. నా కర్తవ్యమ్ యిది అని గట్టి నమ్మకం కుదురుతే గాని నేను యే విషయాల్లోనూ జోక్యం చేసుకోను. మరో మాట. ముందు నన్ను అర్ధం  చేసుకో. నా మాటల్లో యదార్ధం గ్రహించు. అంతే కాని నన్ను తేలికగా జమ కట్టకు 'యేవిటి బోర్' అనుకోకు. అసలు విషయానికి వస్తున్నాను.
    చాలా రోజులకీ నీ కుటుంబానికి రామదాసు కుటుంబానికీ మధ్య కలహాలు రూపుమాపి పోయాయనే విషయం సంతోషంగానే అనిపించింది. రాజేశ్వరి గారు పుట్టింటికి రావడం నా భార్య చెప్పింది. అంతవరకూ మంచిదే. ఒక విషయం రాసిందుకు జంకు తున్నాను. అయినా తప్పదు. గతంలో మీ పిన్నిని దేవదాసు కొన్నాళ్ళు వుంచుకున్నాడు. నేను దేప్పుతున్నాననుకోకు. కూలిపోయే నీ సంసారం నిలబెట్టే బాధ్యత స్నేహితుడిగా తీసుకుంటున్నాను. యేమైనా అనుక్కో. వాడితో ఆ దౌర్భాగ్యుడితో సినిమాలకీ, షికార్ల కీ రాజేశ్వరీ గారు వెడుతున్నా రంటే వాడి సహ్రుదయాన్ని గానీ యీవిడ విశాల దృక్పధాన్ని గానీ నేను హర్షించను. దీంట్లో రామదాసు భార్య పాత్ర యెంతో వూళ్ళో అందరూ చెప్పుకుంటున్నారు. చేతులు కాలక ముందే జాగ్రత్త పడు. కళ్ళు తెరిచి వెంటనే బయలుదేరి వచ్చేయి.
                                                                                     నేను నీ వాడిని
                                                                                     --ముకుందం.
    శ్రీనివాస్ చేతిలో వుత్తరం చదివి రాజేశ్వరి తల వాల్చేసింది. ఒకటొకటిగా రాజమండ్రి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకూ విషయాలు రాజేశ్వరి కళ్ళల్లో కదిలాయి. నిజమే తను తిరిగిది దేవదాసు తో. రాజేశ్వరి కూర్చుండి పోయింది . స్తంభించి పోయినదానిలా. ఆ వుత్తరం ఆ గతం కళ్ళ ముందు కదిలి మాయం అయ్యాయి అప్పుడు శ్రీనివాస్ తనని యేవీ అనలేదు.
    శ్రీనివాస్ దృడ నిశ్చయానికి వచ్చేశాడు. అతని మాటకి తిరుగు లేదు. యింక రాజేశ్వరి కూడా విసిగిపోయింది. అవతల అయస్కాంత శక్తి కొన్ని వేల అశ్విక శక్తులతో పట్టుకుని లాగుతుంటే తన కళ్ళ ముందు మామూలు యిసుక రేణువు లా కనిపిస్తున్నాడు ఈ శ్రీనివాస్. యింక తెగతెంపులు చేసుకోవడమే మంచిది.
    'నారాయణ బాబు దగ్గరికి పద'
    మారు మాట్లాడకుండా శ్రీనివాస్ ని అనుసరించింది.
    శ్రీనివాస్ కళ్ళ నీళ్ళతో జరిగింది పూర్తిగా చెప్పాడు. నారాయణ బాబు వూరడింపు గా అన్నారు! పోనీ శ్రీనివాస్ స్త్రీ కే యిష్టం లేకపోతె సమాజం ఏం చేయగలదు.
    చంద్రమౌళి కూడా చెప్పాడు నీ స్థితి....శాయశక్తు లా ఆవిడను నీ వైపు తిప్పుకుందుకు ప్రయత్నం చేశావు, నేనూ అడుగుతాను. యేమంటుందో?'
    రాజేశ్వరి యెదురుగా వచ్చి కూర్చుంది. నారాయణబాబు నెమ్మదిగా అడిగారు! 'చూడు రాజేశ్వరి నా తల జీవిత అనుభవాలతో పండిపోయింది. మా సమాజం లో యింత వరకూ ఇలా జరగలేదు. యిద్దరికీ యిష్టం అయి చేసుకున్నారు. గృహాన్ని దేనికి చిద్రం చేసుకుంటారు?
    'పిల్లాడు మీ యిద్దరి మధ్యా పాడై పోతాడు. వాడి కోసం అయినా నువ్వు కాపురాన్ని చక్కబెట్టుకోవాలి. సమిధ లో దీపం లాంటి సంసారాన్ని రెండు చేతులూ అడ్డుగా పెట్టుకుని ఎప్పటి కప్పుడు యే గాలి వాటు తగలకుండా రక్షించుకుంటూ దీపాన్ని ఘనం యేక్కకుండా చూడాలి. యిలా గాలి వాటుకు వదిలేస్తే ఆరిపోయి, వొత్తి కోడిగట్టుకు పోయి ఆలంబన లేని తీగలా వడిలిపోతుంది. ఆలోచించు. తల్లిగా నీ బాధ్యత యెంతైనా వుంది పిల్లాడి విషయంలో. 'యింక నేనేవీ అలోచించలేను బాబుగారూ. గొర్రె తోక బెత్తెడు లాంటి అయన జీతంతో నేను సుఖపడలేను.'
    'డబ్బు రక్షిస్తుందా?' నారాయణ బాబుకే ఆశ్చర్యం వేసింది.
    'మీకు తెలీదు. నాకు కట్టుకుందుకు బట్టలు లేని సమయంలో దేవదాసు తెచ్చి యిచ్చిన బట్టలు చూసి అయన నన్ను అనరాని మాటలు అన్నారు.'
    నారాయణ బాబు గుబురు మీసాల చాటున వేదాంతి లా నవ్వారు. 'స్త్రీ సహన మూర్తీ, రాజేశ్వరీ. పురుషుడు యెన్ని తప్పులు చేసినా సమర్ధించుకు పోగలిగే ఔదార్యం ఆవిడకు పుట్టుకతో భగవంతుడు పెట్టాడు. కానీ పురుషుడు అలా కాదు. తనది అనుకొన్న వస్తువును తనే పూర్తిగా అనుభావించాలను కుంటాడు. ఆ వస్తువు మీద యీగను కూడా వాలనివ్వడు. నువ్వు చేసిన పని యేమంత సబబైనది కాదు.'
    'మీరూ పురుషులు. అందుకే వెనకేసుకుని వస్తున్నారు. నేను యింక అతనితో కాపురం చేయలేను. నాకు యిష్టం లేదు.'
    'నీ అభిప్రాయం ?' యెదురుగా అంత వరకూ తల దించుకుని కూర్చున్న శ్రీనివాస్ ని అడిగారు నారాయణ బాబు.
    'నేను యింక యీ సంసారం చేయలేను ఆవిడ యిష్ట ప్రకారం విడాకులకి   యేర్పాటు చేయిస్తాను. పిల్లడిని మాత్రం యివ్వను నేను.'
    'ఏవిటో పెద్ద వాళ్ళం , సమాజం నిర్వహించేవాళ్ళం అనీ, నాలుగు కాపురాలు నాలుగు కాలాల పాటు నిలపాలనే అనుకుంటూ వుంటాం. కానీ ఏం లాభం? మా ఆశయాలూ, మా ఆదర్శాలూ యిలా మట్టి కొట్టుకు పోతున్నాయి. మీరింత త్వరగా యిలా చీలి పోతారని.....' నారాయణ బాబు కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి. మునిగోటితో మీటి పుస్తకాన్ని అలాగే చేతిలో వుంచుకుని లోపలికి వెళ్ళిపోయారు. ఆయనకిక వాళ్ళతో సంబంధం అనవసరం అనిపించింది.
    రాజేశ్వరి పిల్లాడి విషయంలో తొట్రు పడలేదు. తన భవిష్యత్ బంగారు కలశం లా వుంటుంది. అందులో బాబు పాత్ర వుంటే ఆ కలశం లో వున్న అమృతం హాలాహలం కావచ్చును. తను స్వయంగా రామదాసు విషయం లో అనుభవించింది కూడా. యిక పైని జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకో కూడదు. బాబు తనకి పుట్టలేదనుకుంటుంది. కాకపోతే పురిట్లోనే సంధి కొట్టుకు పోయాడనుకొంటుంది. రాజేశ్వరి లో స్వార్ధం పరవళ్ళు త్రొక్కుతూ స్త్రీ లో లాలిత్యాన్ని, కరుణ నీ, కరిగించేసి కఠినశిలగా మార్చేసింది.

                     
    రెండు రోజులాగి రాజమండ్రి వెళ్ళిపోయింది బాబుని వదిలేసి. శ్రీనివాస్ స్టేషన్ వరకూ వెళ్లి రాజమండ్రి కి టిక్కెట్టు కొని యిచ్చి బాబుతో యింటి ముఖం పట్టాడు. దారిలో నారాయణబాబు యింటి ముందు ఆగాడు.
    అప్పటికి అయన గీతాపారాయణం చేస్తున్నారు. 'ఎవరూ శ్రీనివాసా' అన్నారు. లాంతరు వత్తి పెద్దది చేస్తూ.
    'అవును బాబుగారూ! శ్రీనివాస్ చేతుల్లో ముఖం దాచుకుని పసి పిల్లాడి లా భోరున యేడ్చాడు. బాబు వొడిలో నిశ్చింతగా నిద్రపోతున్నాడు.
    నారాయణబాబు అతని తల మీద చేయి వేసి మనం చేసుకొన్నదానికి ఎప్పుడో కాదు శ్రీనివాస్ యీ జన్మది యీ జన్మలో నే అనుభవించాలి. కలియుగం యింత దారుణంగా లేకపోతె పరమాత్ముడి కి ఏదో అవతారానికి అవకాశం వుండదు.' అన్నారు.
    'నేనేం చేశాను బాబుగారూ?'
    'నువ్వు యేవీ చేయలేదు ఆవిడ కళ్ళకి ఆశ పొరలు కమ్మేస్తే ఆ ధనాశ లో సర్వం మరచి పోయింది.
    'యింక నా దగ్గరకే రాదంటారా.'
    'యెంత పిచ్చి వాడివి. తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోయాక యింకా యెందుకు ప్రాకులాడుతావు. వకీలుతో సంప్రదించు. నేను యిటు వంటి వాటికి ప్రోత్సాహం యివ్వకూడదు , అయినా న్యాయ న్యాయాలు ఆలోచించాల్సిన బాధ్యత నామీద వుంది. పదిమంది ఆవిడ నిన్ను పెట్టిన అవస్థలు చెప్పగా విన్నాను. అందుకే చెబుతున్నాను'
    శ్రీనివాస్ పదిగంటలు దాటుతుంటే యింట్లో అడుగు పెట్టాడు.   రాజేశ్వరి తాలుకూ జ్ఞాపకాలు అతన్ని చిత్రవధ చేస్తున్నాయి. ఒకప్పుడు రాత్రి పది గంటలు కాగానే పళ్ళ రసం, పాలు వీటితో తనని అమర లోకాలని తీసుకు వెళ్లి అక్కడ స్వర్గ సౌఖ్యాలు చూపించింది. కానీ యిప్పుడు కొండ చివరి వరకూ తీసుకు పోయి యేమరు పాటున వున్నప్పుడు కందకాల్లోకి తోసేసింది. అతని అణువణువూ బాధగా గిలగిలా కొట్టుకుంటోంది. ఒకటికి రెండు సార్లు లేచినా బాబు ఏడవ లేదు. పైపెచ్చు బ్రతుకులో మాధుర్యాన్ని రుఛి చూసి యిప్పుడు కోల్పోయి యెక్కడా దాని తాలూకు స్మృతులైనా మిగలక పొతే శూన్యం లోకి చూస్తూ మునికాళ్ళ మీద చేతులు వుంచుకుని వీధి విరామం లేకుండా కన్నీరు కారుస్తూనే వున్నాడు శ్రీనివాస్. అసలు ప్రభాకరం వుంటే రాజేశ్వరి ఆటలు సాగేనా? శ్రీనివాస్ కే నవ్వు వచ్చింది. భవిష్యత్ యిలా వుండాలనే కాబోలు భగవంతుడు మాయం చేశాడు మర్మం లేని ప్రభాకరాన్ని. మంచం మీద పక్క చెల్లా చెదరై పోయి వుంది. బెడ్ రూమ్ లైట్ కాంతి యిప్పుడు మరీ చీకటి గా అనిపిస్తోంది. రోజూ యీవాల్టి కి అగరొత్తుల ఘుమఘుమ లతో యిల్లు ఘుప్పెత్తి పోయేది. యేవీ ఆ రోజులు? శ్రీనివాస్ చెంప మీద చేతులు పడ్డాయి. చిన్న చిన్న చేతుల్తో బాబు తండ్రి మొహం లోకి చూస్తున్నాడు.

                            *    *    *    *
    శ్రీనివాస్ కళ్ళ ముందు రాజమండ్రి రైలు యెక్కే ముందు రాజేశ్వరి కదిలింది. చెదిరిన వెంట్రుకలు, కొద్దిగా నీరసించిన మొహం బాబుని కన్నెత్తి కూడా చూడలేదు. చంద్రమౌళి వొకటి రెండుసార్లు అన్నాడు. 'ఎందుకైనా మంచిది శ్రీనివాస్ దీపం వుండగా యిల్లు చక్క బెట్టుకోవాలి. రేపు నీమీదే కేసు బనాయించగలదు. కోర్టులో నిన్ను దోషిగా నిలబెట్టే సాహసం నీ భార్యకి వుంది. యిలా అంటున్నానని మరో విధంగా అనుకోకు. నీకు మనస్పూర్తిగా రాజేశ్వరి ని వదిలేయలని వుందా.'
    శ్రీనివాస్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఆప్రయత్నంగా : 'నాకు అసలు ఆవుద్దేశ్యాం లేదు. మగవాడిని నన్ను రెచ్చగొడుతూ ఆ దేవదాస్ తో తిరుగుతుంటే భరించ లేకపోయాను. కానీ నేను రాజేశ్వరీ వోకళ్ళని వోకళ్ళం అర్ధం చేసుకున్నాకే పెళ్లి చేసుకున్నాం. యిలా జీవితం మధ్యలో అను ఆగిపోతుందనుకోలేదు. నాకు తనని వదిలి వుండగలిగే ధైర్యం, వోపికా రెండూ లేవు.'
    'తనే కాదని వెళ్ళిపోయాక నువ్వేం చేయగలవు?'
    'అప్రయత్నం కూడా చూశావు కద.'
    'ఒకటి కాదు రెండు మూడు సార్లు నేను తనని రప్పించాను. నారాయణబాబు ద్వారా తిరుమల గిరిలో వుండగా, మరోసారి రాజమండ్రి లో దేవదాసు తో తిరిగాక కూడా'
    'నేనో సంగతి చెబుతాను వింటావా.' చంద్రమౌళి అన్నాడు.
    'తప్పకుండా ఏవిటది చెప్పవోయ్' శ్రీనివాస్ అత్రంగానే అడిగాడు.
    'రాజేశ్వరి రెండు మూడు రోజుల్లో వెళ్ళిపోతుందని నారాయణబాబు అన్నారు. వెళ్లేముందు తనకి యిష్టం లేదనే విషయం కాగితం మీద వ్రాయించి వుంచుకో!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS