Previous Page Next Page 
నాలుగు మంచాలు పేజి 29


                                  13
    సూర్యం టెస్ట్ కు వెళ్లి తిరిగి వచ్చేసరికి శ్రీనివాస్ బెడ్ మీద లేడు శెట్టి గారి వలన తనను యింకో సర్జను దగ్గరకు పంపించినట్లు తెలిసింది. అనుకోకుండా సూర్యం తనను చూస్తున్న డాక్టరు యీ నిర్ణయానికి రావటానికి కారణం ఎక్స్ రే లో ఏదో లోపం కనపడి వుంటుంది.
    సూర్యం యింకా విశాల పెళ్లి ఘట్టాలను చిలవల వలపల చేసి మనసులో అల్లుకున్తున్నాడు. ఆమె మామ్మ బలవంతం వలన యీ పెళ్ళికి తల ఒగ్గవలసి వచ్చిందని నిర్ధారించుకున్నాడు. జీవితం అంటా యెంటో అల్లకల్లోల మైనట్లు అనిపించింది. బయటకు రాలేని చిక్కుల్లో చిక్కుకున్నట్లు మనసు బాధపడ్తోంది. ఏం చదివినా ఏం చేసినా అతని ఆలోచనలలో చేసిన చేష్టలలో విశాల పరోక్షంగా పాల్గొంటోంది. చేసిన నిర్ణయాన్ని పాటించే వెన్నె ముకలేని మనిషి నయ్యానని విసుగు జెందెవాడు.
    శ్రీనివాస్ వచ్చేసరికి భయంకరంగా కనిపించాడు. అతని జుత్తు చెదరి వుంది. కళ్ళు లోతుకు పోయి వున్నాయ్. అంతగా వాగే మనిషి మౌనంగా వున్నాడు. ముఖంలో విషాద చాయలు అల్లుకోసాగినాయ్. మనిషి బాగా దిగజారి పోయాడు. అతనిని చూస్తుంటే గోవిందరావు చివరి రోజు జ్ఞప్తికి వచ్చింది. కాళ్ళు చప్పున చల్లబడినట్లయింది. ఐనా తమాయించుకుని దగ్గర కూర్చున్నాడు. వాళ్ళ మౌనాన్ని భంగ పరచింది నర్సు. "కొద్దిగా పోడుం యిస్తారా?' అని దగ్గరకు వచ్చింది.
    "అలవాటై పోగలదండి' అన్నాడు సూర్యం. శ్రీనివాస్ పొడుం డబ్బీ మౌనంగా అందించాడు.
    'ఏం అలా వున్నారు?'
    శ్రీనివాస్ చిన్న నవ్వుతో 'ఏం? యెలా వుంటేనేం? నేనేం పెళ్లి కొడుకునా?'
    'మీవేపు చూస్తె అలానే కనిపిస్తున్నారు!'
    శ్రీనివాస్ లో కాస్త ఉత్సాహం అగుపడింది.
    'నన్నెవరు కట్టుకుంటారండీ?'
    'మీతో పరిచయమైన యే ఆడదైనా కట్టుకుంటుంది.'
    'నిజంగా -- అయితే మిమ్మల్నే అడిగేగలను జాగ్రత్త,'
    'నాకేం అభ్యంతరం లేదు' అంటూ పెళ్లి కూతురు సిగ్గు పడినట్లు అక్కడి నుండి వెళ్ళిపోయింది.
    'ఏమండీ సూర్యం గారూ మాంచి చలాకీ పిల్ల కదూ! మొదట ఆ చలాకీ తనాన్ని గర్వంగా పొరపాటు పడ్డాను. ఇలాంటి వాళ్ళను చూస్తె ఆశ కలుగుతుంది. ఆవేశం వస్తుంది...కానీ...యిద్దరికీ రాసి వుండాలా?'
    'రాత యందు మీకూ  నమ్మకం ఉందా?"
    'నిరాశ నమ్మాకాల మీద మోజు పుట్టిస్తుంది. ఏటిలో కొట్టుకొని పోతున్నప్పుడు ఒడ్డున వున్న చెట్టు వ్రేళ్ళు అందినట్లు యీ నమ్మకాలు మనలను రక్షిస్తాయ్. ఈమెనే నేను కావాలని కోరుకుంటే దొరుకుతుందా?'
    'ఎందుకు దోరకదు?-- అవతలి వాళ్లు యిష్టపడి నప్పుడు.'

                          
    'మీరింకా పై పై మెరుగులే చూడ్డానికి అలవాటు పడిపోయినట్లున్నారు. మీరు లోపలికి కూడా చూడటం అలవాటు చేసుకోండి. అవిడ్నే అడగండి -- ఏం చెప్తుందో?'
    అంతకంటే హెచ్చు శ్రీనివాస్ మాట్లాడ లేకపోయాడు. అలా నిస్త్రాణగా కొంతసేపటికి నిద్దర పోయాడు. సూర్యం తన పరుపు మీద పడి పుస్తకం పట్టుకున్నాడే గాని ధ్యానం పుస్తకం మీద లేదు. ఎంతసేపైనా ఒక్క పేజీయే విప్పి వుంది. నాలుగు పంక్తులు చదివి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు.
    "ఏం చదువుతున్నారని?' నర్సు ముఖంలో ముఖం పెట్టింది.
    'పుస్తకం.'
    'ఏం పుస్తకం?'
    'చూడండి.' అని అట్ట చూపించాడు.
    'మీకు ప్రేమ కధలు యిష్టమే.'
    'అది లేకుండా' యే కధా లేదు.
    'ఎందుకూ లేవూ? కష్టాలతో కధలు లేవూ?'
    'ప్రేమనించే  కష్టాలు కూడా వస్తాయ్. దాని నుంచే అవి తొలగి పోతాయ్. ఎదో అనుభూతి లేకపోతె కధే లేదు. ఏ అనుభూతి కైనా ప్రేమ కావాలి.'
    'మీరు గట్టివారే!"
    "ఇందులో మెత్తని వాళ్ళెవరు? మీరా?'
    "అలా అని అన్నానా? మెత్తగా వుంటే ఈ వుద్యోగం చెయ్యలేను. ఇలా నటించలెం?'
    "మీరు నటిస్తున్నారా? ప్రేమను కూడా!'
    'హ, మాకో ధ్యేయం వుంది. అదే యెదుటి వాళ్ళ దగ్గర నించి యేమీ కాంక్షించకుండా సేవ చేయటం. ఆ సేవను అపార్ధం చేసుకునే వాళ్ళు కూడా వుంటారు. ఆ సేవ మనస్పూర్తిగా చేసినా యెదుటి వాళ్ల మనసును రంజింప చెయ్యటానికి నటిస్తాం.'
    'మీ ప్రేమ అంతా నటనేనా?'
    'అవును. మేం నటించి పలికిన ప్రేమ పలుకుల వలన మీరు సంతోషించి మీ రోగం నయం కావటానికి దోహదమైతే మాకు అంతకంటే యింకేం కావాలి? ఇక అసలు ప్రేమ అంటారా? అది జీవితంలో యెన్నో సార్లు రాదు-- ఒక్కసారే వస్తుంది.'
    ఆమె ఆ మాటలని, దరహాసంతో తిరిగి వెళ్ళిపోయింది. సూర్యం అలా నివ్వెరపోయి ఆమె వేపు చూసాడు.  ఇదేంటో ఈ గది మహత్యం లా వుంది. ఈ నాల్గు మంచాలు నాల్గు వేదాల్లా వుండి యిందులో అడుగు పెట్టిన ప్రతివాళ్ళ చేత వేదాంతాన్ని పలికిస్తోంది. బయటకు అంత కర్కోటకునిలా కనిపిస్తున్న శెట్టి గారూ మరపురాని సన్నివేశాలను వేదాంత పరంగా చెప్పారు. శ్రీనివా'స్ సంగతి సరే! అతని చదువు, సంస్కారాలు ఒక యోగి పుంగవుని కొద్ది క్షణాల సహవాసం లో శాశ్వతంగా మెరుగులు దిద్దుకున్నాయ్. గోవిందరావు ప్రవాహానికి ఎదురీదిన ధైర్య శాలి చివరకు దానిలోనే కొట్టుకు పోయాడు. ఇక తను ఈ ముగ్గురి జీవితాలను తెలుసుకుని సమన్వయపరచి తన వ్యక్తిత్వానికి యెలాంటి వెలుగులను ప్రసాదించుకుంటాడో? ఈ నాల్గు మంచాల చరిత్ర తన మనసులో యెలా లభించబడుతుందో? ఆ వ్రాసినది చదివి తను శాశ్వతమైన అనుభూతినేదైనా సృష్టించుకుంటాడో లేదో చూడాలి.
    ఆవేళ సాయంత్రం విశాల వచ్చింది . శ్రీనివాస్ కూడా అట్టే మాట్లాడలేదు. అతను దొరసిక్ సర్జన్ దగ్గరకు పంపగానే నిస్పృహను చెందినట్లుంది. అతనిని ధైర్య పరచాలని సూర్యం అనుకున్నా ఆ వూసే యెత్తలేదు. ధైర్య మైన వాళ్ళను ధైర్య మైన మాటలు పిరికిని తెస్తాయ్. ధైర్యమైన మాటలు పిరికి వాళ్ళ కోసం సృష్టించబడ్డాయ్. ఒకోసారి ధైర్యం చెప్తుంటే ఏదో బ్రహ్మాండం ముంచుకుని రాబట్టి వీళ్లు ఈ మాటలు చెప్తున్నారని తట్టి ఒకరికి మరింత పిరికి రావచ్చు. అంచేత అతను మౌనం తోనే వున్నాడు. విశాల మూగ పిల్లలా వుంది.  ఆమె కళ్ళ వేపు ఇంకా అలా చూడ బుద్ది వేసినా సూర్యం అక్కడ నించి వెళ్ళిపోయాడు.
    ఆ రాత్రి మరి కాస్త బరువుగా, సరియైన నిద్దర లేకుండా పోయింది. రెండు మూడు సార్లు బాధతో శ్రీనివాస్ సతమత మైపోయాడు. 'ఇక్కడ కోసేయండి' అని యేడ్చాడు. తెల్లవారే సరికి మామ్మూలు కోలాహలం. వార్డు బోయ్ ల మీద తోటీల మీద నర్సుల అలజడి. వాళ్ళ వెటకారం కబుర్లు, విసుగులు -- డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్లు గుంపుల కదలిక, పెద్ద డాక్టరు వెంట శిష్యులు నడకలు-- వచ్చే క్రొత్త రోగులు, పోయే పాత రోగులు-- అంతా గజిబిజిగా వుంది.
    పది గంటల కల్లా శ్రీనివాస్ కాస్త కూర్చున్నాడు. దగ్గర వున్న సూర్యంతో 'రాత్రి మీకు చాలా గాబరా పెట్టేశాను కదూ?'
    'లేదు.'
    'మీ అంత మొగమాటస్తూడ్నీ యెక్కడా చూడలేదు.'
    సూర్యం జవాబు చెప్పక అలా భయంకరంగా వున్న అతని ముఖం వేపు చూస్తున్నాడు. ఇంత వేగిరం అతని ముఖం లోనించి కళ మాయమై పోవటం అతనికి ఆందోళన గానే వుంది.
    శ్రీనివాస్ సిగరెట్ వెలిగించాడు.
    'డాక్టరు వద్దన్నాడుగా!'
    'ఒకరు వద్దన్నా మనకు నచ్చిన పనులు కొన్ని చేస్తాం. నాకు నచ్చిన వాటిలో సిగరెట్ ఒకటి. నచ్చిన మనుషుల్లో మీరొకరు.'
    'మీకు నచ్చని వంటూ యేమైనా ఉన్నాయా?'
    'ఉన్నాయ్'
    'ఒకటైనా వినవచ్చా!'
    'రోగంతో నున్న శరీరం!'
    "మీరే అలా అంటే యెలా? రోగాలు వస్తాయ్ పోతాయ్.'
    అతనోకసారి తనవేపు చూసి
    'నా రోగం పోతుందంటారా?'
    'పోకుండా వుండి పోతుందా?'
    'ఈ రోగం పోయినా పోకపోయినా మీ సహాయం అవుసరం వుంది.'
    'పోతుందనుకుని చెప్పండి.'
    'మీ ఆఫీసరున్నాడే -- పెద్దవాడు -- వాడికీ మా కంపెనీ పెద్దకు చాలా స్నేహం. కొన్నాళ్ళ పాటు ఆఫీసులోనే వుంచేటట్టు చెయ్యండి-- పనిలో చేరితే గాని చాలా యిబ్బంది పడవలసి వస్తుంది.'
    'ఇందులో యేముంది? తప్పక చేయిద్దాం.'
    ఇంకా నా మాటలు నోటనే వున్నాయ్ శ్రీనివాస్ ను చూస్తున్న పెద్ద డాక్టరు వచ్చాడు. అతను యిదివరలా పరీక్ష చెయ్యకుండా ఒకసారి అతని ఎదరగా నిల్చొని చూసాడు. కాస్సేపు నిల్చున్నాక
    "మీ దగ్గర వాళ్ళెవరూ లేరా?'
    'అదిగో -- అతనే' అని శ్రీనివాస్ సూర్యం ని చూపించాడు.
    'మీరొకసారి రండి' అంటూ అతను సూర్యం ను నర్సులు వున్న గదిలో నికి తీసుక వెళ్ళాడు, వార్డు కు ఆ గదికి మధ్య నున్న స్ర్పింగ్ తలుపులు మూయబడ్డాయ్. సూర్యం కాళ్ళు అప్పుడే వణుకుతున్నాయ్. ఒక మూలకు సూర్యానికి తీసుక వెళ్లి ఆ కిటికీ దగ్గర నిల్చొని
    'సారీ! ఆతని జబ్బు నయం కాదు.'
    'ఎక్కడా కాదా?'
    'ఊపిరి తిత్తులలో కేన్సర్-- ఆపరేషను చేసే పరిస్థితి దాటిపోయింది. అయన ఆఖరి రోజులు యింట్లో వాళ్ళ ఆత్మీయుల మధ్య గడప నివ్వండి. డిశ్చార్జి కి రాసే సాను-- వస్తాను' అంటూ ఆ పెద్ద డాక్టరు కదలిపోయాడు.
    సూర్యం అలా అక్కడనే కాళ్ళు చల్లబడి కిటికీ మీద కూర్చుండబడి పోయాడు. కిటికీ గుండా శూన్యం లోకి చూస్తూ కన్నీరు కళ్ళల్లో నింపు కున్నాడు. ఇందుకేనా మళ్లీ తను యీ వూరు వచ్చినది? గౌరికి ఇలాంటి వార్తే చెప్పలేని వాడు విశాలకు యెలా చెప్పగలడు? చావు వాకిట్లో కాసుకుని కూర్చుందని శ్రీనివాస్ తో యెలా చెప్పడం? తనకు విధి యిలాంటి పనులు అప్పచేప్పినందుకు దూషించాడు. అక్కడ నించి కదలే ధైర్యం లేక కూర్చుంటే నర్సు దగ్గరాగా వచ్చి    'విన్నారా? నిన్ననే నేను యీ వార్త ఈ రోజు వస్తుందని అనుమానించాను.'
    సూర్యం కన్నీరుతో నిండిన కళ్ళను రెండు చేతులతో కప్పుకుంటూ 'యెలా చెప్పను?'
    'మీరిక్కడే వుండండి. నేను సావకాశంగా చెప్తాను!'
    'వద్దు-- మీరు చెప్పకండి. చెప్పే ధైర్యాన్ని నాకే యివ్వండి.'
    ఆమె సూర్యం చెయ్యి పట్టుకుని లేపి "మీరు మరి కొన్నాళ్ళు ఆసుపత్రి లో వుంటే వైరాగ్యం వచ్చేస్తుంది. ఎన్నో చావులు చూస్తుంటారు కాబట్టి పట్టపగలు శ్మశానం లో తిరుగుతున్నట్లు వుంటుంది. చావుకు భయపడరు.'
    కొద్ది చిన్న గొంతుకతో "మీరు వార్డు లోనికి అడుగు పెట్టగానే 'ఎన్నాళ్ళకో యెదురు చూస్తున్న ముహూర్తం వచ్చినట్లు అనిపించింది. మీ కన్నీరు చూసి యెన్నడూ లేనిది నా కళ్ళల్లో నీరు నిండుకుంటూన్నాయ్.'
    సూర్యం ఆమె వేపు ఒకసారి చూసాడు. ఆమె చూపులు నిలబెట్టి ధైర్యాన్ని ప్రసాదించింది. ముసలి వానికి చేతి కర్రలా , వంగిన తివ్వకు పందేరలా ఆమె ఆదుకుంది. వార్డులో కాలు పెట్టాడు. శ్రీనివాస్ అప్పటికే ముఖం త్రిప్పి కిటికీ గుండా రోడ్డు వేపు చూస్తున్నాడు. కాస్సేపు సూర్యం తన పరుపు దగ్గరే నిల్చొని రెండు మూడు సార్లు చూసాడు. చివరకు శ్రీనివాస్ తన వేపు చూసి రమ్మన్నట్లు సైగ చేసాడు.
    సూర్యం కాళ్ళీడ్చు కుంటూ వెళ్ళాడు.' శ్రీనివాస్ శూన్య దృష్టులను చూడలేక మనిషి మూగవాడై దగ్గర నిల్చున్నాడు. శ్రీనివాస్ కొద్ది క్షణాల మౌనాన్ని భంగ పరిచాడు!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS