Previous Page Next Page 
డెత్ ఛాంబర్ పేజి 29


    "హోటల్ చుట్టూ పోలీసులు మఫ్టీలో నిలబడి వున్నారు."
    నూతన్ పరుగుతో వెళ్ళి కిటికీలో నుంచేచూశాడు. హోటల్ కెదురుగ్గా వున్న రోడ్ కి ఆవల వేపున వరుసగా నిలబడి వున్నారు. వాళ్ళు సివిల్ డ్రస్ లో వున్న పోలీసులని తెలిసి పోతూనే వుంది.
    "అంటే మన గురించి తెలిసిపోయి వుంటుందంటారా?"
    "అనే అనిపిస్తోంది."
    నూతన్ కి చెమటలుపట్టేసినయ్.
    మయూరి తన బాగ్ లోంచి వైర్ లెస్ సెట్ తీసుకొచ్చింది.
    "దీని సంగతి మర్చిపోయినట్లున్నారు" అంది నవ్వుతూ.
    నూతన్ ఆతృతగా అది అందుకుని చెవిదగ్గర పెట్టుకుని ఆన్ చేశాడు. వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ మాటలు వినిపించినయ్.
    "ఇన్ స్పెక్టర్ విక్రమ్! ఇనస్పెక్టర్ విక్రమ్!!"
    "ఇప్పుడే మోహన్ రెడ్డి డబ్బు రెండుసూట్ కేసుల్లో అందజేశారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారా అని ఎదురుచూస్తున్నాం!"
    "వాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోడానికి ఏ మాత్రం చాన్స్ యివ్వకండి! కావాలంటే టాస్క్ ఫోర్స్ ని కూడా పంపిస్తాం."
    "అవసరం లేదు. హోటల్ చుట్టూ జవాన్లున్నారు! హోటల్ మేనేజ్ మెంట్ కి కూడా చెప్పాం. వాళ్ళు రూమ్ ఖాళీ చేసినప్పుడు వెంటనే అక్కడే కూర్చున్న మన ఇనస్పెక్టర్ కి చెప్పాలని - ఓవర్-"
    నూతన్ గుండెవేగంగా కొట్టుకోసాగింది.
    "మన ప్లాన్ దెబ్బతింది" వివర్ణమయిన మొఖంతో అన్నాడు.
    "అవును!" ఒప్పుకున్నాడు ప్రహ్లాద్.
    "ఇప్పుడేమిటి చేయటం?"
    "ఒకసారి ఈ హోటల్ ప్రొప్రయిటర్ సామిరెడ్డితో మాట్లాడితే కరెక్ట్ ఇన్ ఫర్మేషన్ తెలుస్తుందేమో!"
    "ఊహు! అందువల్ల ప్రయోజనం ఏమీ ఉండదు."
    "ఈ లెక్కన మనం తప్పించుకోవటం కష్టమయ్యేట్లుంది" అన్నాడు ప్రహ్లాద్.
    మయూరి నవ్వింది "మనం తప్పించుకోవటం కష్టం కాదుగానీ ఈ డబ్బుబయటకు రావటం కష్టం" అందామె.
    ఇద్దరూ ఆశ్చర్యంగా ఆమె వేపు చూశారు.
    "మనం మాత్రం ఎలా తప్పించుకుంటాం?"
    "ఏదోక ఉపాయం ఆలోచించవచ్చు. ముందు మనం మానసికంగా డబ్బుని ఇక్కడే వదలి వెళ్ళిపోడానికి నిర్ణయించుకుంటే-"
    కొద్దిసేపు ఎవరూ ఏమీ మాట్లాడలేదు.
    "ఛ! ఇంత కష్టపడి ఇలా అయిపోయిందేమిటి?" నిరాశగా అన్నాడు నూతన్.
    "మనం రిస్క్ తీసుకుని డబ్బుతో పారిపోడానికి ప్రయత్నిస్తే?" అసహనంగా అన్నాడు ప్రహ్లాద్.
    "నో! మనం ఇంతకాలం ఇంత ఖర్చుపెట్టి ప్లాన్లు వేసింది జైలుకి వెళ్ళడానికి కాదు" కఠినంగా అన్నాడు నూతన్.
    "మనం క్షేమంగా వుంటే ఇంకోసారి ఇంకోప్లాన్ వేసి డబ్బు సంపాదించవచ్చు! కనుక ఎలాగోలా పోలీసుల చేతిలో పడకుండా తప్పించుకోవటంముఖ్యం" అంది మయూరి.
    ప్రహ్లాద్ అసహనంగా పచార్లు చేశాడు కాసేపు.
    నూతన్ అతనిభుజం తట్టాడు ఆప్యాయంగా.
    "మయూరి చెప్పింది కరెక్ట్ ప్రహ్లాద్! నువ్వే మనం కలుసుకున్న మొదటిరోజున అన్నావ్ గుర్తుందా.....? ఇంతవరకూ బాంబేలో ఎన్నో కిరాతకాలు చేసి పోలీసులతో చాలా బాధలుపడ్డానని. అలాంటిజీవితం అక్కర్లేదనేనా దగ్గర కొచ్చావ్! పోలీసులకు దొరకని పద్దతిలో మర్డర్లూ, మానభంగాలూ లేకుండా, క్లాస్ గా డబ్బు సంపాదించే స్కీమ్ లయితే రడీ అన్నావ్- అవునా?"
    ప్రహ్లాద్ ఆవేశం తగ్గిపోయింది.
    "అవును! చేతిదాకా వచ్చిన ఇంతడబ్బు చేయి జారిపోతోందనేబాధతో అలా అన్నానుగానీ - నిజంగానే ఇంక రోడ్ లెవల్ క్రైమ్ లు చేయదల్చుకోలేదు. బాంబే గాంగ్ వార్స్, స్మగ్లింగ్ వార్స్ తో విసిగి పోయాను. లక్షలు ఒక్క రోజులో సంపాదించటం - ఒక్కరోజులో అదంతా పోలీసులు దోచుకోవటం ఎవరో ముక్కూమొఖం తెలీనివాడిని మర్డర్ చేసి లక్షలు సంపాదించటం- ఆ కేస్ నుంచి తప్పించుకోడానికి అదంతా పోలీసులకు తినిపించటం చ! పెద్ద నరకం! మెంటల్ పీస్ ఉండదు."
    "కరెక్ట్! నా దగ్గర స్కీమ్స్ కేమీ తక్కువ లేవు. ఒకటి రెండు ఫెలయిలయితే అవుతాయ్! అంత మాత్రాన నిరాశపడకూడదు. మనకి ముఖ్యం ఏమిటంటే ఏ పరిస్థితిలోనూ పోలీసుల చేతుల్లో పడకపోవటం! ఇంకోసారి తప్పకుండా సక్సెస్ సాధించితీరతాం."
    "అయితే ఇప్పుడిక్కడి నుంచి తప్పించుకు బయట పడటం ఎలా?"
    "ముందు మనం పోలీసులను మన కదలికలగురించి మిస్ గైడ్ చేయాలి. వాళ్ళను ఇంకోవేపు చూసేలా చేసి అప్పుడు మనం బయటపడాలి" మయూరి అంది.
    నూతన్ కి ఆశ్చర్యంగా వుంటుంది మయూరి అయిడియాలు చూస్తూంటే! ఆడపిల్లల్లో ఇంత ఫాస్ట్ గా ఇంత తెలివిగా ఆలోచించే వాళ్ళు తన కింతవరకూ ఎక్కడా తారసపడలేదు.
    "యూ ఆర్ కరెక్ట్!"
    చకచక ఆలోచించాడతను. ముందు ముగ్గురూ ఇక్కడినుంచి బయటపడాలి. పోలీసులను డైవర్ట్ చేయటం ఎలా?
    రూమ్ బయట కాపలా వున్న సెక్యూరిటీగార్డ్స్ ని మభ్యపెట్టటం ఎలా?
    "ప్రహ్లాద్! ప్రస్తుతం నీవొక్కడిగా ఎలాంటి అనుమానం కలుగకుండా బయటకు వెళ్ళడానికి ఆస్కారం వుంది."
    "అవును! నన్నెవరూఫాలో అవరు- సూట్ కేస్ లు నా చేతిలో లేనంతకాలం! ఒకవేళ ఫాలో అయినా వాళ్ళనెలా వదిలించుకోవాలో నాకు తెలుసు. ఇంతకుముందు చాలాసార్లు తప్పించుకున్నానలా!"
    "అయితే ఆ సూట్ కేస్ తెరచి రెండు మూడు నోట్లకట్టలు జేబులోపెట్టుకుని వెళ్ళిపో"
    ప్రహ్లాద్ సూట్ కేస్ తెరిచాడు. అన్నీ వందనోట్లకట్టలే!
    "ఇడియట్స్! అయిదువందల కట్టలిస్తే బావుండేది!" కోపంగా గొణుక్కుని నాలుగుకట్టలు తీసి రెండుజేబుల్లో చెరోరెండు పెట్టుకున్నాడు. జేబులు ఎత్తుగా కనిపించడంతో అతనికేం చేయాలో అర్ధంకాలేదు.
    "వదిలెయ్ ప్రహ్లాద్! ఇది మనం సంపాదించుకునే సమయం కాదు. జస్ట్ ఇంకో స్కీమ్ వరకూ పబ్బంగడపడానికే! జేబులలా ఎత్తుగా ఉంటే వాళ్ళకు అనుమానం కలుగుతుంది"
    ప్రహ్లాద్ రెండుకట్టలు తీసి సూట్ కేస్ లో పడేశాడు మళ్ళీ.
    "మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకోవటం?"
    "రోజూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ చూస్తూండు. మెసేజ్ కనబడుతుంది."
    "సరే"
    నూతన్ దగ్గరకొచ్చి కరచాలనం చేశాడతను.
    "ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా కలుసుకోవాలి మనం! చెప్పానుకదా! మర్డర్స్ తో డబ్బు సంపాదించుకునే పద్దతులు మానేశాను. చేతులు బురద అంటకుండా త్వరగా లైఫ్ అంతా సరిపోయేంత డబ్బు సంపాదించాలి! అందుకు మీరు తప్ప నాకింకోసోర్స్ కనిపించటం లేదు-"
    "ష్యూర్!"
    అతను మయూరి చేతిని అందుకుని ముద్దు పెట్టుకున్నాడు.
    "నేను రేప్ లు మానేశాక నువ్ కనిపించావ్ గనుక బ్రతికిపోయావ్. లేకపోతే ఇంత అందంగా ఉన్నందుకు నాలో మృగాన్ని చూసి ఉండేదానివి"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS