12
పెళ్ళి చూపులకోసం ముస్తాబైన అమ్మాయి ముఖంలా కళ కళ లాడుతోంది లక్ష్మయ్యగారి తోట. పెళ్ళికి తరలి పోతున్న వరుని ముఖంలోని ఠీవితో పోటీ పడుతూంది ఆ తోటలో నూతనంగా నిర్మించబడిన ఆస్పత్రి భవనం. ఆ సందడి, ఆ హడావుడి, తిరణాల సమయంలో కలిగే అలజడిని గుర్తుకు తెస్తూ ఉంది.
పిల్లలు, వృద్ధులు, యువకులు, యువతులు, వీరంతా ఎంతో ఉత్సాహంగా కళ కళ లాడుతూన్న ముఖాలతో ఆ ఆస్పత్రి భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
ప్రారంభోత్సవం ముగిసినతర్వాత ముఖ్య అతిధులకు, ఆస్పత్రి భవనంలో మిగతా వారందరికీ తోటలో భోజనాలు ఏర్పాటు చేశారు. తాయారు ఎక్కడ చూసినా తనే కనపడుతూ రామానికి కుడిభుజంలా పని చేస్తూ ఉంది. శాంత, శారదలుకూడా శక్తి వంచన లేకుండా వారికి తగిన పనులు చేస్తూనే ఉన్నారు.
తాయారు సుందరం చెల్లెలు. తండ్రిని ఒప్పించి అనుకున్న దానికన్న రెండువేలు ఎక్కువ కట్నం ఖర్చుతో బస్తీ యువకుణ్ణి పెళ్ళాడింది. ఆరుమాసాలు బస్తీలో భర్తతో కాపురం చేసింది. ఆమె నుదుట బ్రహ్మ వ్రాసిన వక్రరేఖలు ఆమె సౌభాగ్యాన్ని ఏడవమాసంలో తుడిచిపెట్టాయి. భర్త మరణానంతరం అత్తమామలతో పేచీపడి శాశ్వతంగా ఉండి పోయేందుకు తల్లిగారింటికి వచ్చింది. మానసికంగా ఆమెకు సుందరం పోలికలే వచ్చాయి. బస్తీ యింటికి కోడలిగా వెళ్ళి వచ్చిన ఆమె విధిలేక ఆమె మళ్ళీ పల్లెకే రావలసి వచ్చింది.
తాయారు శాంతతోపాటు హైస్కూలు చదువు పూర్తి చేసింది. ఇద్దరికీ స్నేహం కూడా ఎక్కువే! భర్త చనిపోయినా వేష ధారణలో ఆమె పిసరంత మార్పు కూడా తీసుకురాలేదు. సుమంగళిగా ముస్తాబవుతూ ఆమె వచ్చిన ఆ కొద్దిరోజులలోనే ఆ పల్లె లోని యువకులను నిద్రకు దూరంచేస్తూ ఉంది తాయారు.
తాయారు అక్కడికి వచ్చినప్పటినుండి రామంతో చనువుగా తిరగడానికి ప్రయత్నిస్తూ ఉంది. రామం మాత్రం తనకేమీ పట్టనట్లుగా తప్పుకు తిరుగుతున్నాడు.
ఆస్పత్రి భవన ప్రారంభోత్సవ ఉత్సవాలు ఆమెకు చక్కని అవకాశాన్ని కలిగించాయి. రామానికి సన్నిహితురాలని నలుగురూ ఊహించేవిధంగా అతనితో అసందర్భంగా మాట్లాడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంది. అమెను మందలించడానికది తగిన సమయం కాదని, సహనంతో ముఖాన చిరునవ్వు తెచ్చిపెట్టుకొని నివురుగప్పిన నిప్పులా, గుంభనంగా ఆమెతో మాట్లాడుతున్నాడు రామం.
యుక్తవయస్కులు, అవివాహితులైన ఆగ్రామంలోని యువతులందరికీ రామం తనవాడౌతే ధన్యులమౌతామనే ఊహ మొదటినుండీ ఉంటూ వచ్చింది. కాని అతని స్వభావాన్ని పూర్తిగా అర్ధంచేసుకున్న ఏ యువతీ అతనిని పొందే ప్రయత్నం చేయలేదు. అతనిని గురించి తలపోస్తూ తీయని కలలు కంటున్నారేకాని కనీసం తమ అభిప్రాయాన్ని అతనితో చెప్పడానికి కూడా ఎవరూ సాహసించడంలేదు. రామం శాంతకు కాబోయే భర్త కాబట్టి అతనిని గురించి ఆలోచించడం నిష్ప్రయోజనమని తెలిసిగూడా ఆ ఆలోచనలనుండి విరమించుకోలేక పోతున్నారు.
ఒక్క తాయారుతప్ప మిగతావారంతా రామానికి భయపడతారు.
తాయారు నిర్భయత, నిస్సంకోచత్వం, తెగింపు మొదలైన గుణాలుగల యువతి. రామం శాంతలు కాబోయే భార్యా భర్తలని తెలిసి నప్పటికీ విద్యార్ధి దశలోనే రామంవద్ద ఒకసారి అతి చనువు ప్రదర్శించబోయి భంగపడింది. అప్పటినుండి రామం అంటే ఎక్కడో ఆమె హృదయంలో మారుమూల కొద్దిభయం ఏర్పడింది.
ఇప్పటి ఆమె పరిస్థితి వేరుగా ఉంది. పూర్తిగా స్వంతత్రురాలు. అప్పుడే రెక్కలు వచ్చిన పక్షిలా ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంది. తీరని కోరికలు ఆమె హృదయాన్ని గగ్గోలు పరుస్తూ వుక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
శాంత తాయారును తన బావను గురించి ఎన్నో పిచ్చిపిచ్చి ఊహలకు తన మనసులో పెంచుకుంటూ ఉంది. శాంత అనుమానాలను శారద ఎంతో నేర్పుతో తుడిచేసింది. కాని ఉదయం నుండీ తాయారు ప్రవర్తనను చూస్తూన్న శాంత హృదయంలో పల్లేరు కాయలు కదిలాయి. తనవాడనుకున్న బావ తనకు దూరమైపోతున్నట్లు భావించసాగింది. శారదకూడా ఈ విషయమే ఆలోచిస్తూ ఉన్నట్లు ఊహించిన శాంతఆమె ముఖంలోని భావయుక్తంగా చూసింది. ఆమె చూపుల నర్దం చేసుకున్న శారద 'కొద్దిగా వోపిక' పట్టమనే అర్ధం వచ్చేట్లు సంజ్ఞ చేసింది.
ఆస్పత్రి భవన ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ముఖ్య అతిధులంతా రామాన్ని, అతని కృషిని, ఎంతో మెచ్చుకున్నారు. ఆ తర్వాత ఊరి ప్రముఖులవద్ధ శలవు తీసుకొని వెళ్ళిపోయారు. కార్యక్రమాలన్నీ ముగిసి యితర గ్రామాల నుండి వచ్చిన అతిధులు వెళ్ళిపోయేసరికి రాత్రి ఎనిమిది దాటింది. ప్ర్రారంభోత్సవం రోజు రోగులకు చికిత్స ప్రారంభించాలి కాబట్టి అంతకుముందే రామం చేసిన ఏర్పాటు ప్రకారం నలుగురు రోగులు ఇన్ పేషెంట్లుగా, పదిమంది రోగులు అవుట్ పేషెంట్లుగా వచ్చి కార్యక్రమం ముగిసేంత వరకు ఎదురుచూస్తూ కూర్చున్నారు.
సుందరం ఆ పేషెంట్లను పరీక్ష చేస్తూ తనపనిలో లీనమయ్యాడు. శాంత, శారదలిద్దరూ ఆస్పత్రి భవనానికి కొద్ది దూరంలో ఒక మామిడి చెట్టుక్రింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. రామం రంగయ్య తాత కుటుంబానికి ఆరోజు తమ యింట్లో విందు ఏర్పాటు చేయడానికి లక్ష్మయ్యగారితో యింటికి వెళ్ళాడు.
లక్ష్మయ్యగారు శాంత, రామం ల వివాహ ప్రసక్తిని తీసుకు వచ్చినప్పుడు శాంత ముభావంగా ఊరుకుంది. రామం మాత్రం 'వచ్చే వేసవిలో ఆలోచిద్దాం! అప్పుడే తొంద
రేముంది? మొన్నటిదాకా ఆస్పత్రి గొడవతోనే సరిపోయింది' అని అన్నాడు.
శాంత ముభావంగా ఊరుకోవడం, రామం తమ వివాహాన్ని వచ్చే సంవత్సరానికి వాయిదా వేయమని కోరడంతో లక్ష్మయ్యగారి ముఖంలో శ్రావణ మేఘాలు కదిలి మాయమయ్యాయి.'ఒరేయ్ రామం! ఇంతకాలం నీ యిష్టప్రకారమే జరుగుతూ వచ్చింది. వచ్చే సంవత్సరంవరకు వివాహాన్ని ఎందుకు ఆపాలో నా కర్ధం కావడంలేదు' వారిద్దరినీ నిశితంగా చూస్తూ అన్నారు లక్ష్మయ్య గారు.
శాంత వంచిన తల ఎత్తలేదు-
'వ్యవసాయపు పనులు మొదలుపెట్టాం. అదీకాక పెళ్ళికిముందు కొంత వ్యవధి ఉంటే బాగుంటుందని నా ఉద్దేశ్యం. నిన్న నీవు పురోహితుణ్ణి అడిగి తెలుసుకున్నావట గదా! వారం లోపుగా ఉన్న ఒక్క ముహూర్తం తప్ప ఈ సంవత్సరంలో మా పేరు బలాలతో ఇక వేరే ముహూర్తాలు లేవని చెప్పి నట్లు తెలిసింది. ఇంత కొద్ది వ్యవధిలో వివాహ మంటే మాటలా? అయినా అంత త్వరపడవలసిన అవసరమేముంది? మనదసలే పల్లెటూరు. ప్రతి చిన్న అవసరానికీ పట్నం పరుగెత్తాలి. అటువంటప్పుడు ఈ కొద్ది వ్యవధిలో లగ్ననిర్ణయం చేసుకొని బాధపడడమెందుకు?' నచ్చచెపుతున్నట్లుగా అన్నాడు రామం.

'ముందొచ్చిన చెవులకన్న వెనుక వచ్చిన కొమ్ములువాడి. అలా ఉంది నీ వ్యవహారం. ఒక పెళ్ళి జరిపించడానికి వారం రోజుల వ్యవధి కావాలట్రా? తలచుకున్న మూడవ వాటికల్లా ఎన్నో పెళ్ళిళ్ళు నా చేతుల మీదుగా జరిగిపోయాయి. పిల్లొచ్చి గ్రుడ్డును వెక్కిరించినట్లు లేనిపోని కబుర్లన్నీ చెబుతావేంరా?' తన హయాంలో జరిపించిన ఎన్నో పెళ్ళిళ్ళను గుర్తుకు తెచ్చుకుంటూ అన్నారు లక్ష్మయ్యగారు.
'ఇంత స్వల్ప వ్యవధిలో ముహూర్తం నిర్ణయించడం నాకు మాత్రం యిష్టం లేదు' అని అక్కడినుండి వెళ్ళిపోయాడు.
'నాన్నా.....బావ ఎప్పుడూ అనాలోచితంగా మాట్లాడడు. ఇంత త్వరలో ముహూర్తం కుదిరించుకొని తొక్కిసలాడడం ఏం సబబుగా ఉంటుంది?'
'సరే! మీ రిద్దరూ ఏకమైన తర్వాత నేనేం చేయగలను? ఎలా జరగవలనుంటే అలా జరుగుతుంది.' ఆయన ముఖంలో విషాదం తొణికిసలాడింది.
'ఎందుకు నాన్నా అంత బాధపడతావ్? అసలు నీ భయమేమిటో నా కర్ధం కావడం లేదు. బావను నేను వివాహమాడడానికి నిరాకరిస్తానని అనుమానమా? బావ నన్ను నిరాకరిస్తాడన్న సందేహమా?' తండ్రి ముఖంలోకి ప్రశ్నార్ధకంగా చూస్తూ అడిగింది.
'ఏదైనా జరగవచ్చు! ఏ నిముషంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు?' కంఠస్వరంలో కాఠిన్యాన్ని నింపుకుంటూ శాంత కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నారు లక్ష్మయ్య గారు.
'నిశ్చింతగా ఉండు నాన్నా! ఎటువంటి అశుభమూ జరగదు. నీవు బాధపడుతూ ఉంటే నేను చూడలేను' చిరునవ్వు చిందిస్తూ తండ్రిని సంతోషపరచాలని ప్రయత్నించింది శాంత.
లక్ష్మయ్యగారి ముఖ కవళికలలో ఎటువంటి మార్పూ రాలేదు. వారి ముఖంలో కనుపిస్తూన్న గాంభీర్యాన్ని చూసి వారి వద్దకు వెళ్ళడానికే భయపడింది శాంత.
ఈ సంభాషణలు మొదటినుండీ చివరి దాకా నిన్నది శారద. వివాహ ప్రసక్తి రావడంతో ఆమె ఆలోచనలు ఎవరిమీదకో మళ్ళాయి.
* * *
రామం తను కట్టించిన ఆస్పత్రికి తన తల్లిగారి పేరు పెట్టాడు. 'శ్రీ లక్ష్మీ వైద్యనిలయం' ఆస్పత్రిలో రోగుల సంఖ్య క్రమంగా అభివృద్దిచెంద నారంభించింది. రామం తన తీరిక సమయాలను ఆస్పత్రి భవనంలోనే గడుపుతున్నాడు. నిరుపేదలైన రోగులకు ఆహార సదుపాయాలనుకూడా ఏర్పాటు చేస్తున్నాడు. అనతి కాలంలోనే ఆ ఆస్పత్రి పేరు ప్రతిష్టలు ఆ చుట్టుపట్ల గల గ్రామాలన్నింటికీ వ్యాపించాయి. ఎవరి నోట విన్నా రామం పొగడ్తలే! 'పుణ్యాత్ముడు' 'ధర్మదాత' 'దొడ్డ గుబం గల దొర' 'వెయ్యేళ్ళు చల్లగా వర్దిల్లాలి' ఇటువంటి వ్యాఖ్యానాలు రోజు రోజుకూ ఎక్కువవుతున్నాయి.
రామాన్ని గురించిన పొగడ్తలు వింటున్నప్పుడల్లా లక్ష్మయ్యగారు సంతోషంతో గర్వపడుతూండేవారు. 'రామం దొరగారి మామగారు' అని నలుగురూ అతని వెనుక అనుకుంటూ ఉంటే వారిముఖంలో దర్పం తొణికిసలాడుతూ ఉండేది.
రోజులు ఎటువంటి మార్పులు లేకుండా క్రమంగా గడిచిపోతున్నాయి. రెండురోజుల్లో బి.ఎ. రిజల్స్టు వస్తాయని పత్రికలో ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటన చూసిన శాంత, శారదల ఆతృత కొండ వీటి చేంతాడులా పెరిగిపోయింది. పరీక్షలు జరిగిన తర్వాత గడిచిన రెండు మాసాలలో ఆదుర్దాపడని ఆ యిద్దరు ఈ రెండురోజులు తమ ఆత్రుతను అణుచుకోలేకపోవడం రామానికి ఎంతో విస్మయాన్ని కలిగించింది. తను హెచ్. ఎన్. సి. పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూసిన రోజులు గుర్తుకు వచ్చాయి. 'అవును ఆదుర్దాపడడం సహజమే!' అనుకున్నాడు రామం.
వారు నిరీక్షిస్తున్న ఆ రోజు రాళవచ్చింది. శాంతను, శారదను తోటకు వెళ్ళేమని తను పంచాయితీ ఆఫీసునుండి పత్రిక తీసుకు వస్తానని చెప్పి వెళ్ళాడు రామం. శాంత, శారదలిద్దరూ తోటవైపు నడిచారు.
'రిజల్స్టు వస్తున్నాయని తెలిసినప్పటి నుండీ నా హృదయం ఆతృతతో గాభరా పడుతూ ఉంది.' అంది శారద.
'అదేమిటే! నీవే యిలా బాధపడితే మరి నా విషయం!'
