Previous Page Next Page 
లోకం పోకడ పేజి 28


                                    20    
    శారద ఇప్పుడు ఎక్కువగా వసుంధర ఇంటికి వస్తున్నది. ఉద్యోగ రీత్యా హైదరాబాదు వచ్చిన తరువాత ఆప్యాయంగా ఆమెతో స్నేహం చేసి పలకరించిన వారే లేరు. ఆమె మనస్సులోని అనంతమైన వ్యధలనూ, అనుభూతులనూ చెప్పేందుకు ఇప్పుడు వసుంధర లభించింది. మానవ మనస్తత్వాలు అనేక తీరులు. అందులో స్త్రీ హృదయం అగాధం. మనసిచ్చి మాట్లాడితే అమృత ఝురులు అందించ గలదు. లేకపోతె వాళ్ళ తీరు తెన్నులు అగాధం గానే ఉండి పోతాయి.
    ఇన్నాళ్ళ నుంచీ శారద తన మనస్సులో అనేక ఊహలను నింపుకున్నది. అనేక అనుభూతులను పెంపొందించు కున్నది. కాని ఆమె మనస్సు ను కనిపెట్ట గలిగిన వారు లేకపోయారు. కారణం ఆమె అనాకారి. ఎవ్వరూ కాంక్షించని నేరేడు పండు చాయ. ఎవ్వరూ చూడలేని స్పోటకం మచ్చలు. కాముకుల దృష్టి లో ఆమె చెడ తిరిగి అట్లా నాశనమై పోయింది. తోటి స్త్రీల దృష్టి లో ఆమె అంటరానిది. మాట్లాడినా తమ పరుపు ప్రతిష్టలు పోతాయను కుంటారు. చదువు లో అపర శారద. ఉద్యోగ విధులు నిర్వర్తించటంతో ఆమె పని మంతురాలు. దైవ దృష్టి లో ఆమె అనాఘ్రాత పుష్పం. తల్లి దృష్టి లో ఆమె పాపత్మురాలు. తీరని మనో వ్యధను తెచ్చి పెట్టింది. ఆ తల్లి మానసిక సంక్షోభ కరడు గట్టుకు పోయింది. వసుంధర దృష్టి లో స్నేహ పాత్రురాలు. శకుంతల దృష్టి లో బొగ్గుల్లో రామ చిలుక. కామాక్షి దృష్టి లో ఆత్మ స్వరూపిణి. అభిమానం  కల ఆడది. సుగుణాల రాశి. లోకం దృష్టి లో మగవాడు ఆశించని ఆడది. రమేష్ దృష్టి లో నివురు గప్పిన నిప్పు. సానపట్టని వజ్రం. శారద దృష్టి లో తానేవ్వరికి పనికి రానిది. ఎవ్వరినీ సంతోష పెట్టలేని నిరాశా జీవి.
    ఆరొజు వసుంధర పుట్టిన రోజు. డానికి తోడు ఆదివారం. శారద ను భోజనానికి పిలిచింది వసుంధర. అభిమానురాలైన శారద రానంది. కారణం ఆమెకు తెలుసు.
    "ఎందుకు రావు, శారదా? మా ఇంట్లో భోజనానికి అభ్యంతర మేమిటి?" అన్నది వసుంధర.
    శారద నవనాడులూ కుంచించుకు పోయినాయి. "నేనెక్కడికి వేడుకల కూ, వినోదాలకూ భోజనాలకూ పోను వసుంధరా. అక్కడ నలుగురి లోనూ నేనేమంత రాణించ గలను చెప్పు? వచ్చి మానసిక సంక్షోభం తెచ్చి పెట్టుకోవటమే అవుతుంది. ఇలాంటి స్నేహితురాలుందంటే నీకు మాత్రం చిన్నతనం కాదూ చెప్పు?' అన్నది శారద.
    "నీ మనస్సు నాకు తెలుసు శారదా. అసలు నేనెవ్వరి నీ పిలవలేదు. సినిమాల్లో పుట్టిన రోజుల వేడుకల మాదిరి పాతిక మందిని పిలిచి , ఆ పార్టీ సందడి లో నలుగురి చేతా నిన్ను వంచన చెయ్యదలుచు కోలేదు. అలాంటి వేడుక కాదు... నిన్నోక్కర్తి నే పిలుస్తున్నాను. అయినా నీకు తెలియని స్నేహితులు నాకు మాత్రం ఎవరున్నారు? తప్పక రావాలి. తెలిసిందా?" అని బలవంతం చేసింది. శారద సరేనన్నది.
    వసుంధర ఇంటికి వెళ్ళింది శారదను పిలిచి అప్పటి కప్పుడే శారద బజారు వెళ్లి నలభై రూపాయలు పెట్టి వసుంధర కు చక్కని సిల్కు చీరే, జాకెట్ గుడ్డ కొన్నది. ఆమె జీవితంలో వేడుకల కూ, భోజనాలకూ వెళ్ళటం ఇదే ప్రధమం.
    రమేష్ ఉద్యోగం చేసే కంపెనీ లో రామారావ నే అసిస్టెంటు మానేజరు ఉన్నాడు. అతన్ని కూడా భోజనానికి పిలిచాడు రమేష్. మాట తీసేయ్య లేక అయన కూడా భోజనానికి వచ్చాడు.
    పిండి వంటలతో సహా ఇద్దరికీ వడ్డించింది కామాక్షి. అప్పటికే శారద కూడా వచ్చింది. ఎవ్వరికీ కనుపించకుండా శారద , వసుంధర గదిలో కూర్చుంది. వసుంధర వంటింట్లో కి కామాక్షి కి సాయం చేస్తున్నది.
    భోజనాలయి నాయి. ఇద్దరూ చేతులు కడుక్కున్నారు. కిటికీ లో నుంచి శారద రామారావు కు కనిపించింది. ఒక్కసారి చూశాడు.
    ముందు గదిలో కుర్చీల్లో కూర్చుని తాంబూలం వేసుకుంటున్నారు.
    "మిస్టర్ రమేష్, ఆ అమ్మాయి ఎవరోయ్ ? మీ బంధువా? ఆ పరమాత్ముడు ఎంత నిర్దయుడో నా కిప్పుడు తెలుస్తున్నది. అనాకారి తానాన్నంతా ఒక మూసలో పోసి కరిగించి, ఆ అమ్మాయి ముఖాన కుమ్మరించినట్లున్నాడు. ఒక్కసారి ఆవిడని చూసేసరికి నాకు మతి పోయింది. ఏమిటో , ఆ పరమాత్ముడి జగన్నాటకాన్ని మనం అర్ధం చేసుకోలేం! ఆ అమ్మాయికి వివాహమయిందా?అయితే ఆ చేసుకున్న భర్త చాలా విశాల హృదయుడనే చెప్పాలి" అన్నాడు రామారావు.
    ఈ మాటలకు మనస్సు లో నొచ్చుకున్నాడు రమేష్, రామారావనే మాటలు శారద విని బాధతో కుమిలి పోతుందేమోనని . ":లేదండి వివాహం కాలేదు. అంత చొరవ చేసి ధైర్యంగా మనస్పూర్తిగా ఆ అమ్మాయిని చేసుకుంటానని ఎవ్వరూ అనలేదు. అది ఆ అమ్మాయి పురాకృత కర్మ. బి.ఎ. పాసయింది. సెక్రటేరియట్ లో యు.డి.క్లార్కు . చాలా తెలివి తేటలు కలది. ఎంతో బుద్ది మంతురాలు. అందం లో ఎంత తీసి పోయిందో, గుణ గుణాల్లో డానికి పది రెట్లు మంచిది. ఆ అమ్మాయి హృదయాన్ని అర్ధం చేసుకుని ఎవరయినా పెళ్లి చేసుకుంటా నంటే ఈ జన్మ లో ఆ అమ్మాయికి కావలసింది లేదు. ఆ భర్త ను వేనోళ్ళ కొనియాడి పూజిస్తుంది. పై మెరుగులు చూసి మోసపోయే మన మగజాతి అలాంటి సద్భుద్ది గల ఆడదాన్ని చేసుకోవటానికి ఇష్టపడరు. నెలకు నూట ఏభై పైగానే జీతం తెచ్చుకుంటుంది తల్లీ. ఆ అమ్మాయీ ఈ వీధిలోనే ఉంటున్నారు. మా వసుంధర స్నేహితురాలు" అన్నాడు రమేష్.
    రామారావు అంత అందమైన వాడు కాక పోయినా మరీ అనాకారి కాడు. ముప్పై అయిదేళ్ళు ఉంటాయి. భార్య పోయి సంవత్సరం దాటింది. పిల్లలు లేరు. రామారావు కు జీతం మూడు వందలు. చాలా మంచివాడు. సత్ర్పవర్తన కలవాడు. ఆతని మంచి చెడ్డలు రమేష్ కు తెలుసు. రెండో పెళ్లి వాడయినా పెద్ద వాడు కాదు గనక రామారావు శారద ను చేసుకుంటానంటే అంతకన్న సంతోషించ తగిన విషయం లేదనుకున్నాడు రమేష్. కాని రామారావు ఒప్పుకుంటాడా? అసలు శారద వివాహానికి మొగ్గు తుందా? ఉద్యోగం చేస్తూనే కాలం గడిపుతుందా? ఈ కొత్త ఆలోచనలు అలలు లాగ అతని మనస్సులో మెదిలినాయి.
    రామారావు ఏదో ఆలోచిస్తూ కూర్చుండి పోయాడు. అతని ఆలోచనలకూ అంతరాయం కలిగించటం ఇష్టం లేక రమేష్ కూడా మాట్లాడకుండా రామారావు వైపే చూస్తూ కూర్చున్నాడు. పది నిమిషాలు గడిచాక ఇంక వెళ్ళుతానని రామారావు వెళ్ళిపోయాడు.
    మగవాళ్ళ భోజనాలయాక శారద కూ, వసుంధర కూ , శకుంతల కూ వడ్డించింది కామాక్షి. తను తెచ్చిన చీర, జాకెట్ గుడ్డ వసుంధర కు బొట్టు బెట్టి ఇచ్చింది శారద. అంత ఖరీదు గల చీర ఎందుకు కొన్నావని వసుంధర శారద తో అన్నది కామాక్షి కూడా, "ఎందుకమ్మా, శారదా అంత ఖరీదు గల చీర? ఆ జాకెట్ గుడ్ల ఒక్కటే చాలదూ?" అన్నది.
    "నా వేడుక నాది. ఎవ్వరేమను కున్నా నేను చెప్పేది ఒక్కటే. నా జీవితంలో నేను ఏ నాటి కయినా నన్ను అర్ధం చేసుకుని ఆదరించగల స్నేహితురాల్ని సంపాదించు కోగలనా అని అలమటింఛి పోయాను. మా ఆఫీసులో చాలామంది లేడీ క్లార్కు లు ఉన్నారు. వాళ్ళ వికవిక లూ, పకపకలూ వాళ్ళ హాళ్ళూ పెళ్లూ చూస్తె నాకు మనస్సులో బాధగానే ఉంటుంది. సాటి అడదాన్ననే అభిమానం కూడా లేదు వాళ్లకి. నేను కనబడితే పక్కగా పమిట చెంగు నోటి కడ్డంగా పెట్టుకుని ఏకసిక్కలాడుకుంటూ చూడనట్లుగా నటించి పోతారు. ఈ తీరుగా అయిదు సంవత్సరాల నుంచీ బాధపడుతూనే ఉన్నా. మొదట్లో కర్నూలు లో ఉద్యోగం లో చేరాను. అక్కడా ఇంతే. ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఈ  హైదరాబాదు వస్తే ఇంత మహా పట్టణం లో ఒక్క స్నేహిరురాలు దొరకదా అనుకున్నా. కాని నా కోరిక ఫలించలేదు. నేటి కాలానికి వసుంధర నాకు అప్రురాలయింది. వసుంధర ద్వారా మీతో పరిచయ మయింది. ఇప్పుడు నేనూ ఒక మనిషి నేనని అనుకుంటున్నా" అంటూ కంట తడి పెట్టుకుంది శారద.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS