తన ముసలి మేనత్త లేబలేకపోతే , తనే లేచి కొబ్బరాకులు మంట బెట్టి, జున్ను వండి, ఎలా చెప్పాలో ఏవిటో అంతా పాఠం చెప్పి రంగయ్య ద్వారా శంకరానికి ఎంతో ఆప్యాయతతో జున్ను పంపించాడు శేషయ్య. రంగయ్య తిరిగి వచ్చేదాకా భోజనం కూడా చెయ్యకుండా కూచుని , రంగయ్య వచ్చాక ఆత్రంగా అడిగాడు "ఏం?..డాక్టరు గారు తిన్నారా? ఎవన్నారు ?..." అని.
"తప్పేలా కేసి పరద్దేనంగా కాసేపు చూసి, ఏటా మీ పెద్ద కాపు గోరు పంపేవారు. ఆనవాయితీ పోకుండా యీఏడు నువ్వు తెచ్చేవు ఏటో నాకా తినాలనే సరదాయే పోయింది . సరే -- అక్కడ పెట్టి ఎల్లు -" అన్నారండీ అయిష్టంగా 'అన్నాడు రంగయ్య.
అది విని శేషయ్య గట్టిగా నిట్టూర్చాడు.
పనిగట్టుకుని శేషయ్య పొలానికి వెళ్ళినా వెళ్ళకపోయినా, దగ్గరుండి అన్నీ రంగయ్యే చూసుకు పోతున్నాడు. దమ్ములు, ఊడ్పులు, చెత్త కోతలు, నీరు పెట్టడం, కోతలు, బల్ల కొట్టు అన్నీ రంగయ్యే చేయించాడు . శేషయ్య కేం శ్రమ కలిగించకుండా , శేషయ్య కూడా పొలం పనులు అంతగా పట్టించుకోడం లేదు. వెళితే ఆ కేసు నిమిత్తం రాజమండ్రి కి వెళ్లి రావడం, లేకపోతె ఇంట్లో కూచోవడం, ఏ వీరాచారో కరణ మో వస్తే కాస్సేపు పిచ్చాపాటి చెబుతుంటే వింటూ కూర్చోవడం . లేదా ఎప్పుడైనా వాళ్ళ నాన్నకి తెలియకుండా రహస్యంగా కనక మణి వస్తే కబుర్లు చెబుతూ కాలక్షేపం చెయ్యడం -- ఇలా గడుపుతున్నాడు రోజులు.
ఓరోజున తలంటి ఒడులుగా వేసుకున్న జడలో రెండే రెండు గులాబీ పువ్వులు తురుముకొని, కాటికా, బొట్టూ పెట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకొని సంక్రాంతి లక్ష్మీలా వచ్చింది మణి, మామూలుగా పరికిణీ జాకేట్టూ మాత్రమె వేసుకోలేదు. పైన కండువా కూడా వేసుకొంది. పది పదిహేను రోజులయి చూశాడేమో ఈ పక్షం దినములలోనూ పిల్ల బాగాఎదిగినట్లు కనిపించింది శేషయ్య కి. డానికి తోడు పైట కండువా ఒకటి కొత్తగా వేసుకుంది. మణిలో వచ్చిన మార్పు చూసి శేషయ్య నవ్వుకున్నాడు.
వస్తూనే "ఓహో!....ఇదా నువ్వీ మధ్య మా ఇంటికి రాజపోవడానికి కారణం ?...." అంది మణి.
"ఏది?" అన్నాడు శేషయ్య కంగారుగా.
"నాకంతా తెలిసింది లే -- అమ్మ చెప్పింది."
"అమ్మా?"
"అవును అమ్మకి కూడా ఈ మధ్యనే తెలిసిందిట ....అవును గాని మావయ్యా, నువ్వూ నాన్న ఎందుకు కొట్టుకున్నారు."
శేషయ్య నీరసంగా నవ్వి "చ...ఛ...కొట్టుకోవడం ఏవిటి? అంతా వట్టిది ....' అన్నాడు.
"మరయితే నువ్వు మా యింటికి ఎందుకు రావడం లేదు , నేనూ వాసూ ఎన్ని మాట్లు దెబ్బలాడు కోలేదు ! మరి నేను మీ యింటికి రావడం మానేశానా?"
"మీరు దేవుళమ్మా-- మీ అంత పవిత్ర హృదయాలు మాకు ఎలా వుంటాయి ?"
"అన్నట్టు ఈ మధ్య మా ఇంట్లో రోజూ దేబ్బలాట్లే అనుకో!..."
"ఏం?...."
"ఏమో....మా నాన్నకి కోపమూ, చిరాకూ ఎక్కువై పోతోంది. అమ్మ కనిపిస్తే కేక లేస్తున్నాడు. నేను కనిపిస్తే అసహ్యించు కుంటున్నాడు-- ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా ఇంకా యింట్లో ఎవర్నీ బతకనియ్యడం లేదు. మొన్నటికి మొన్న తెల్లారుతూనే నన్ను పట్టుకొని గుండెల మీద కుంపటి లా నువ్వోకత్తేవి నా ప్రాణానికి-- ఎదిగి కూచున్నావు , ఏ అయ్య చేతిలోనో పెట్టి అవతలకి సాగనంపుదాం అంటే ఈ శారదా బిల్లు ఒకటి తగలడింది. మా తాతతండ్రుల ఉత్తర లోకాలన్నీ పోగొట్టడానికి దాపురించావు నువ్వు. నిన్ను చూస్తుంటే నాకు వళ్ళు రవరవ లాడిపోతోంది . నాకు కనిపించకుండా ఫో....అన్నాడు."
"అదేవిటి .....మతి గాని పోయిందా?"
"అమ్మ అడ్డం పడి అదేవిటండీ! ...ఎలాగేనా మీకు రోజు రోజుకీ చిరాకు ఎక్కువై పోతోంది. శేషయ్య అన్నగారితో స్నేహంగా ఉన్నప్పుడే నయం - ఆయనతో విరోధం వచ్చిందనే మీ మనస్సులో బాధ అంతా. అయినా దేవుడు లాంటి శేషయ్య అన్నతో విరోధం ఏమిటి మీకు?.... శుభ్రంగా వెళ్లి ఆయనతో మాట్లాడండి అంది-- ఇంక చూసుకో -- దాంతో నాన్న అంత ఎత్తున లేచి అమ్మని నానా చివాట్లూ పెట్టి ఆ శేషయ్య తో విరోధం వచ్చిందని నేనేం ఇప్పుడు క్రుంగి పోవడం లేదు. ఎలాగయితే ఏం చెప్పావు బోడి సలహా ఒకటి -- నేను వెళ్లి మాట్లాడాలిట. వెళ్ళు వెళ్ళు -- వంటింట్లో కి వెళ్లి నీ పని చూసుకో-- మొగాళ్ళ గొడవల్లోకి రాకు....అంటూ కసురుకున్నాడు.
"అయ్యో! నాకోసం ఆ మహా సాధ్వి ఎన్ని చివాట్లు తింది" అంటూ నొచ్చుకున్నాడు శేషయ్య.
కాసేపు కూర్చుని వాసు దగ్గర్నుంచి ఉత్తరాలు వస్తున్నాయా. ఎప్పుడొస్తాడు. బాగా చదువు తున్నాడా ఈ వివరాలన్నీ శేషయ్య ని అడిగి తెలుసుకుని, "నేను కూడా చదువు కుంటే బాగుండును. నేనెంత బతిమాలినా అమ్మ ఎంత నచ్చ చెప్పినా , నాన్న వినకుండా ఉన్నాడు. ఆడదానికి చదువేమిటి ?...నోర్ముయ్ అంటున్నాడు. చదువూ కాలక్షేపం ఏం లేక మతి పోతోంది." అని మనస్సులో అనుకుంటూ " మరి ఇక వస్తాను" అంటూ లేచింది మణి.
గడప దాటి బయట అడుగు పెట్టబోతున్న మణిని "నీ జడలోని రెండు గులాబీ పువ్వులలోనూ ఒక పువ్వు ఇక్కడ పడిపోయింది మణి తీసికెళ్ళు' అంటూ వెనక్కి పిలిచాడు శేషయ్య.
మణి వెనక్కి వచ్చి గులాబీ పువ్వు తీసి జడలో పెట్టుకుంటూ "అబ్బా! ...ఈ గంట లోనూ ఇది ఎన్ని మాట్లు పడిపోయిందో లెక్కలేదు . అక్కడికీ దీన్ని రెండో పువ్వుతో దారం వేసి గట్టిగా కట్టాను కూడా అయినా విడిపోతోంది " అంది విసుగ్గా .......
'అవునమ్మా-- చెట్టున పూసినప్పుడే కలిసి పూస్తే అతుక్కుని ఉంటాయి కాని, తర్వాత ఎంత ప్రయత్నం చేసి కలిసి ఉంచాలన్న సాధ్యం కాదు. అతుక్కోకుండా విడిపోతాయి పువ్వు లేమిటి, మనస్సు లేవిటి" అనుకున్నాడు బాధగా శేషయ్య తనలో తను. శంకరానికి జన్మతః సోదరుడై పుట్టిన గోపాలానికి తనకీ, ఉన్న అంతరాల్ని జ్ఞప్తి చేసుకుంటూ --
12
గోపాలం ఆ వరసని తను ఎంత కోపంగా బెదిరిస్తూ ఉత్తరం రాసినా లెక్క చెయ్యకుండా తల చెడిన దాన్ని చేసుకోడాని కని నిర్ణయించుకుని, తనకి దూరం అయ్యాడు. మనసు కలిసి ఏకగర్భ అనితుడు గా ఉంటూ వచ్చిన శేషయ్య ఈ వరసని ఉన్న మాటంటే ఉలుకు తెచ్చుకొని ఎంతో ఇదిగా పెంచుకొన్న అపెక్షల్ని తెంపేసుకుని ఎడం అయిపోయాడు. ఇంట్లో చూద్దాం అంటే ఇటు మణి కాని, అటు సావిత్రి కాని తనతో ఏమాత్రమూ సహకరించక మరీ చికాకు కలిగిస్తున్నారు. ఆడదానివి నీకెందుకే చదువు ? ఇంటా వంటా లేంది? అంటూ ఎంత కసురుతున్నా ఆ కుర్ర కుంక అర్ధం చేసుకోలేక పోవడమే కాకుండా పైగా రోజూ ఏడుపూ పేచీ చదువు కుంటానని?....ఇంక భార్య చూడ వస్తే అస్తమానూ తనని దోషిని చూసినట్లు నిశితంగా చూడటమూ అవకాశం దొరకడం తడవు గోపాలం ప్రసక్తే శేషయ్య ప్రసక్తీ ఎత్తి, వాళ్ళ దూరం కావడానికి తనే కారణం అన్నట్లు, ఉండుండి మాటలు ఈటెలు లా వదులుతూ ఉండడమూను--
చెప్పొద్దూ?....ఉండగా ఉండగా తనకి అందరి మీదా కోపమూ అసహ్యమూ ఎక్కువవుతోంది ఏవిటి? ఒక్కళ్ళూ తనని అర్ధం చేసుకో రేవిటి?....తమ్ముడంటే తనకి ఎంత ప్రేమ?....ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడే ?....అటువంటి వాడు తన మాటంటే గడ్డి పరక కంటే తేలికగా తీసిపారేసి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తాడూ ? అన్న గారూ, గౌరవం ఉండక్కర్లే? ఎందుకు చెప్పానో అర్ధం చేసుకోకుండా ఆ తల చెడిన దాన్ని చేసుకుని కులభ్రష్టుడు కావడానికి సిద్దం అవుతాడా?......ఛీ.....ఇంతదాకా వచ్చాక వాడు తమ్ముడేవిటి , తను అన్న ఏమిటి ?..........
తమ్ముడు దూరం అయినందుకే తను బాధపడుతుంటే ఈ శేషయ్య తెలివి తక్కువ ఉక్రోషం ఒకటి .....అవును అతను తన నిజాయితీ ని శంకించి నప్పుడు ఒళ్ళు మండి తనూ అతని నిజాయితీ గురించి నిలేశాడు. అవును మరి.?....మాట వస్తే మాట వస్తుంది. అడిగాను గదా అని పౌరుష పడితే ఎం ,లాభం? అయినా ఇన్నాళ్ళ మైత్రి ని ఇట్టే కాలదన్నిపోయిన ఆ మనిషి కోసం తాను ప్రాకులాడడం ఏమిటి?.........పొతే పోయాడు పోనీ !......ఎవళ్ళు ఎలా పోయినా తనేం బాధపడడు . పోయేవాళ్ళు పోతారు ఉండేవాళ్ళు ఉంటారు -- ఎల్లకాలం వాళ్ళ కోసం తను బాద పడడమే నేవిటి ?....తమ్ముడేవిటి తక్కిన వాళ్ళేమిటి అర్ధం చేసుకొని చెప్పినట్లు విని జాగ్రత్తగా ఉంటారా ఉంటారు. లేదా పోతారు.......ఆ?.........అంతే!
ఇలా ఒకరోజున శంకరం గతాన్ని నెమరేసుకుంటూ వర్తమానాన్ని సమీక్షించుకుని భవిష్యత్ కర్తవ్యాన్ని నిర్ణయించు కుంటూ , పేషెంట్స్ నీ కంపౌండరు నీ అందరినీ పంపెశాక హాస్పిటల్ లో ఒక్కడూ కూర్చుని ఉండగా బిలబిల మని పాతిక ముప్పై మందిని వెంట బెట్టుకు మునసబూ, బడి పంతులూ అక్కడికి వచ్చారు.
వస్తూనే "డాక్టర్ గారూ! ...రెండు శుభవార్తలు ' అంటూ అరిచాడు పంతులు.
"గోపాలం గారి ధర్మమా అని మన కేసు నెగ్గింది " అన్నాడు ఆనందాన్ని పత్తాలేకుండా మునసబు.
'అంతే కాదండోయ్ ! ఈ కేసులో గోపాలం గారు చూపించిన వాదనా నైపుణ్యా ని చూసి మెచ్చుకుని గవర్నమెంటు ఆయన్ని గవర్నమెంటు ప్లీడరు గా నియామకం చేసింది" అన్నాడు పంతులు.
"నిజంగా?' అన్నాడు అవధులు నిండిన ఆనందంతో శంకరం.
"నిజం అండి?....నిన్న జడ్జీ మన పక్షంగా జడ్జిమెంటు ఇచ్చేశాక మేం అంతా సంతోషంగా ఇవతలికి వచ్చి గోపాలం గారితో కలిసి అయన గుర్రపు సార్టు ఎక్కి .........."
"ఏవిటి ?....తమ్ముడు గుర్రపు సార్టు కొన్నాడా?"
"మీకు తెలియదేవిటి ?....అప్పుడే రెండేళ్ళయింది . ఆ ...గుర్రపు సార్టు ఎక్కుతుండగా పోస్ట్ మాన్ పట్టుకు వచ్చి ఆ ఆర్డరు ఇచ్చాడు -- ఇది వస్తుందని బార్ లో ఉన్న వకీళ్ళందరికీ వారం పదిరోజుల క్రితమే తెలుసుట!

"నాకెంతో సంతోషంగా ఉంది. మా అమ్మ వాడిని కలెక్టరు గా చూడాలను కుంది. కలెక్టరు గా కాకపొతే మానె అధమం ఏ గవర్నమెంటు ఆఫీసరు గానైనా వాడిని చూడాలని నేను ఆశించాను. మొత్తం మీద నా ఆశ ఫలించింది --"
"అయితే ఇది మన మునసబు గారి విజయమే కాకుండా మీ విజయం కూడా నన్నమాట?....ఏమంటే రాజమండ్రి రాజమండ్రి అంతా ఈ కేసు కారణం గానే గోపాలం గారికీ ఉద్యోగం వచ్చిందని అంటోంది." అన్నాడు పంతులు.
"ఇలా ఇది మన ఇద్దరి విజయం అని తెలిస్తే పెద్దకాపు మరి ఏడ్చు కుంటాడు. ఈ దెబ్బతో కుదేలు అయిపోడూ?" అన్నాడు మునసబు.
