Previous Page Next Page 
ధర్మ చక్రం పేజి 28


    "అది సహజమే, ధర్మరావ్! ఎందుకంటె నువ్వు అంతకు సంవత్సరం ముందే డేరాడూన్ పంపి వేయబడ్డావు కదా? ఇంటినీ, ఇంటి వద్ద వారినీ మరింపింప జేయడానికి శతవిధాల శ్రమ పడుతుంటారు , అటువంటి విద్యాలయాలలో."
    "అవును.' తల పంకించాడు ధర్మారావు.    
    "సరే, అసలు విషయం త్వరగా చెబుతాను. విను. అట్టే వ్యవధి లేదు. నేను తొందరగా వెళ్ళాలి. చాలా పనులున్నాయి."
    "ఏమిటి? చెప్పండి."
    "ఆ కేసులో దోషి సుయోధన్. మనదేశానికి సంబంధించిన కాగితాలేవో శత్రువులకు అందించు తున్నాడు. ఆ విషయాన్ని నేనూ, గౌతమ్ పసికట్టి ఆటంక పరిచాము. కాని, ఏం చేస్తాము? దైవమె ప్రతికూలించాడు. తన నేరాన్ని సుయోధన్ మా మీద నెట్టి తను తప్పు కొన్నాడు. అందరూ అదే నమ్మారు. నేను పారిపో గలిగాను, కానీ, గౌతమ్ ధైర్యంగా నిలబడ్డాడు -- అధర్మంగా ప్రవర్తించ లేదని, నమ్మేదెవరు? ఖైదీ అయ్యాడు. అధికారులు నా ఇల్లూ, గౌతమ్ ఇల్లూ కూడా శోధించారు. నేనూ దూరం అలోచించి, మీ అమ్మను, ఒక సురక్షిత ప్రదేశం లో దాచి, నిన్ను అ స్కూలు నుంచి ఒక అర్ధరాత్రి వేళ ఎత్తుకు వచ్చాను. దేశద్రోహి కుటుంబానికి ఎక్కడా అన్న వస్త్రాలు కాని, విలువ నీడ కాని ఉండవు మరి!"
    "ఆ తర్వాత?"
    "ఆ తర్వాత ఏముంది? ఏమి చేయాలో దిక్కు తోచలేదు. నిన్నెలా పెంచాలో అర్ధం కాలేదు. గౌతమ్ ది కొంచెం తొందర స్వభావం. తలుచు కొన్నప్పుడు ఎంత పనైనా చేసేస్తాడు. ఏమీ అడ్డు రావు అతడికి. తాను చేస్తున్నది సరయిన దైతే , పరిణామాలు ఆలోచించడు. ఈ ఉగ్ర స్వభావం , తొందర స్వభావమే అతడి అభివృద్ధి కి ఆటంకాలై పోయాయి. జైలు నుండి రెండు సార్లు పారిపోవడం వల్ల అతడి శిక్ష ఎక్కువయింది. అందువల్ల నేను బాగా అలోచించి, అతడికి మన జాడ తెలియనీయకుండా మిమ్మల్ని తీసుకుని ఎవరూ తెలియని ప్రదేశానికి పోయి, కొన్నాళ్ళుండి పేరు మార్చుకుని, ఆశ్రమం స్థాపించి, అజ్ఞాత వాసం ప్రారంభించాను . ఇక ఈ మధ్య కాలంలో గౌతమ్ కు మన విషయాలే తెలియవు. చనిపోయానని అనుకోని ఉండవచ్చు. అందుకే జైలు లో బుద్దిగా ఉన్నాడు. నేను జాగ్రత్తగా అలోచించి, ఒక ప్రయోజనాన్ని సాధించడానికే నిన్నిక్కడ ఉద్యోగి గా చేశాను."
    "ఏమిటది?' అడిగాడు ధర్మారావు.
    "ఏముంది? తలుచుకొంటే అధికారుల వల్ల కాని పనులుండవు. నువ్వే సూపరింటెండెంట్ వు గనుక, నీ తండ్రి తన నిర్ధిషిత్వాన్ని నిర్పూపించుకో గల అవకాశం కల్పించు. జరిగిన విషయాన్ని కాస్త చూచీ చూడనట్టు వదిలేయి. ఈ గడువులో అతడు ఆనాడు సుయోధన్ చే అణిచి పెట్టబడిన ఆధారాలను వెలికి తీసి తనను తాను రక్షించు కోవడమే కాక, దేశాన్ని కూడా రక్షించు తాడు.
    'ఆనాడు సుయోధన్ వల్లనే దేశం రక్షించ బడిందని నమ్మిన ప్రభుత్వం అతడిని గౌరవించింది. అందుకే ప్రభుత్వం వారు ఇప్పుడు, ఈ అత్యవసర పరిస్థితిలో దేశ రక్షణ దళం లో, పని చేయమని సుయోధన్ ను పిలిచారట. సైనికొద్యోగిగా 'త్వరలో నే పోబోతున్నాడు. ఆ విషయం పత్రిక లో చదివిన గౌతమ్ 'ఇప్పుడు దేశానికి, అనర్ధం తెచ్చి పెడతాడో ఈ సుయోధన్' అని భయపడి తెగించాడ'ట!"
    ఆలోచిస్తున్నాడు ధర్మారావు. "పత్రికలలో ఒక వార్త చదివి, అయన చాలా ఖంగారు పడిపోయారు. అది యుద్ధం వార్తా అని మాత్రం  చెప్పగలను.' అని ఒక ఖైదీ అన్నాడు, గౌతమ్ పారిపోయిన నాడు.
    "నువ్వు కూడా ఈ ప్రయత్నం లో సహకరించాలి , ధర్మరావ్!' అన్నాడు నారాయణ స్వామి.
    "అసంభవం!' ఉగ్రుడై పోయాడు ధర్మారావు. "మీరు చెప్పింది విని, సాధారణ మానవుడుగా నేను సానుభూతి చూపగలను. కాని ప్రభుత్యోద్యోగిగా నా ధర్మం వేరే ఉంది."
    "ఏమిటది?' నివ్వెర పోయిన నారాయణ స్వామి నీరస స్వరంతో ప్రశ్నించాడు.
    "ఏనాటి నుండో అరెస్టు వారంటు ఉన్న మిమ్మల్ని ముందు అరెస్ట్ చేయించడం నా విధి."ఆ పైన గౌతమ్ కోసం వెదకడం నా ధర్మం."
    అటువంటి సమాధానాన్ని ఏమాత్రమూ ఆశించని నారాయణ స్వామి, దయామయి -- ఇద్దరి వదనాలూ కళా, రక్త విహీనమై పాలిపోయాయి.
    అది చూచిన ధర్మారావు గుండె తరుక్కు పోయింది. "ధర్మ నిర్వహణ కత్తి మీద సాము వంటిది, బాబుగారూ. పెంచి పెద్ద చేసిన మీతో, ఇలా మాట్లాడ వలసి వచ్చింది. నిర్భాగ్యుణ్ణి. ఇటువంటి ఉద్యోగం లో ఉండి మీకెలా సాయం చేయగలుగుతాను? నన్నితువంటి ఉద్యోగం లో అసలెందుకు చేర్పించారు?" అంటూ నారాయణ స్వామి పాదాలపై వాలి కన్నీరు కురిపించాడు.
    ఆ దయానీయవస్థ నుండి ఇంకా తెరుకోనక మునుపే టెలిఫోన్ మోగడం తో ధర్మారావు లేచి అందుకున్నాడు, తప్పనిసరిగా.
    "అవును, ధర్మారావు నే. సత్యాదేవి గారా? ఏమిటి? నాన్నగారు వచ్చారా? రానీయండి. భయం దేనికి? ఏమిటంత ఖంగారు పడిపోతున్నారు?"
    "అదుగో , ఆ సుయోధన్ కూతురే. ఈసత్య. దీనితో స్నేహం ఏమి ముప్పు తెస్తుందో తెలియదు." విసుగుదల గా అంటున్న దయామయి మాటలను వినిపించుకోలేదు నారాయణ స్వామి. శ్రద్దగా ధర్మారావు మాటలనే వినసాగాడు.
    "ఏమిటీ? పారిపోమ్మంటారా? అరెస్టు చేస్తారా, నన్ను? ఎందుకు? నేనేం చేశాను? ఫర్వాలేదు. చేయనివ్వండి. నాకేం భయం లేదు. నేనేమీ తప్పు చేయలేదు. ఎవరినీ మోసం చేయలేదు. అసలు నాకేమీ తెలియదు."
    ఫోన్ పెట్టేసి వస్తున్న అతడు నారాయణ స్వామి ఖంగారు చూచి విస్తుపోయాడు.
    నారాయణ స్వామి షాక్ తిన్నట్లు కుర్చీ నుండి లేచాడు. "ఏమిటీ? నిన్ను అరెస్టా? సుయోధన్ వచ్చేశాడా? అయితే రహస్యం తెలిసిపోయింది కాబోలు!" అన్నాడు భయ క్రోదాలతో కళ్ళు పెద్దవి చేస్తూ.
    ధర్మారావు మౌనంగా, గంబీరంగా నిలబడ్డాడు.
    "బాబూ! అలా నిల్చున్నా వేమిటి? భయోత్సాతం తో అరిచింది దయామయి.
    "ఇక అంతకంటే మార్గ మేముంది? ఇక పరిస్తితు లేలా నిలబెడితే అలా నిలబడవలసిన వాడినే." చలన రహితంగా నే జవాబిచ్చాడు.
    "కాదు. నడవండి. పారిపోవాలి." ఆవేశంగా అంది దయామయి.
    "ఈ ధర్మారావు అటువంటి పనులు చేయడు." కరుకుగా అన్నాడు ధర్మారావు.
    'అవును" స్థిరంగా అన్నాడు నారాయణ స్వామి . "ధర్మారావు ఇక్కడే ఉండాలి. అతడు లేకపోతె వారి అనుమానాలు మరింత దృడపడతాయి. జాగ్రత్త! సమయానుకూలంగా వర్తించు, ధర్మరావ్. నేనిక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు" అంటూనే కిటికీ తెరిచి బయటికి దుమికి పారిపోయాడు.
    ఇదంతా ఏమిటో ,అసలు కలో నిజమో అర్ధం కాలేదు ధర్మారావు కు. విస్మయావస్థ నుండి తేరుకొని, "బాబుగారూ! ఏమిటది?' అని ఆలోచనా రహితంగా అతడు వెళ్ళిన దిక్కే చూస్తూ నిలబడిన అతడిని అన్ని వైపులా నుండి వచ్చి పోలీసులు చుట్టూ ముట్టారు . ఏమాత్రం చలనం లేకుండా మ్రాన్పడి నిలబడి పోయాడు ధర్మారావు. మరుక్షణం లోనే అరెస్టు వారంటు చూపుతూ ఇద్దరు సి.ఐ.డి లు అరెస్ట్ చేశారు.
    నారాయణ స్వామి వెంట పరుగెత్తిన పోలీసులు అతడు దొరకక ముఖాలు తేల వేసుకొని వచ్చారు.
    "పారిపోయాడా? వెళ్ళండి. పరుగెత్తండి అన్ని వైపులకూ." రోషంతో ఆజ్ఞలు జారీ చేస్తూ ఐ.జీ పక్కన నిల్చున్న ఆ గంబీరాకృతి ని సుయోధన్ గా గుర్తించ గలిగాడు ధర్మారావు.
    "వెళ్ళండి. ఆ రాజ్యలక్ష్మీ ని కూడా అరెస్ట్ చేయండి. ఆమె అసలే ఆరితేరిన వ్యక్తీ!"
    చలించి పోయాడు ధర్మారావు. "అమ్మను కూడా అరెస్టా?" అప్రయత్నం గానే అతడి నోటి నుండి దీన వచనాలు వెలువడ్డాయి. "ఏమిటిదంతా? నాకేమీ అర్ధం కావడం లేదు. కారణం చెప్పండి.' అని అడిగాడు అరెస్టు చేస్తున్న వ్యక్తులను.
    "ఎందుకా? ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నందుకు. తండ్రీ, కొడుకూ ఏకమై దేశానికి ద్రోహం చేస్తున్నందుకు."
    "భగవాన్!"
    "రాజ్యలక్ష్మీ దొరకలేదు. పారిపోయింది సార్!" తిరిగి వ్యక్తులు విన్నవించుకున్నారు.
    "వాట్?" సుయోధన్ గర్జించాడు. "ఇందరు ఉండగా ఒక ఆడది పారిపోయిందనడానికి సిగ్గు లేదూ? ఛీ! బ్రూట్స్ . ఇడియట్స్. అన్ ఫిట్."
    "పరిసరాలన్నీ వెతికాము సార్. ఎక్కడా లేదు మరి!' తలలు వాల్చి మనవి చేసుకున్నారు పోలీసులు.
    "అవును. దొరకదు. నేను చెబుతూనే ఉన్నాను, అది ఆరితేరిన చతురురాలని. చెట్లు, గుట్టలు కొండలు తొందలాగా ఎక్కి వేయగలదు. నదులు, నదులు అవలీలగా ఈది దాటి వేయగలదు!"
    పోలీసులందరూ సరేసరి, ధర్మారావు కూడా అమితాశ్చర్యానికి లోనయ్యాడు, కొత్తగా వింటున్న ఆ విశేషాలను గురించి.
    "ఇతడిని రిమాండ్ లో ఉంచండి. వెళ్ళండి. పారిపోయిన వారి కోసం గట్టి ప్రయత్నాలు చేయండి.' ఇన్స్ పెక్టర్ జనరల్ పోలీసులకు ఆజ్ఞలు జారీ చేశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS