
ఆ భావన రాగానే నవ్వు వచ్చింది పార్వతికి. రాజు ఎంత గంబీరంగా ఇతర మక్కర్లేనట్లు ఉంటున్నాడో లోలోపల అతనికి అంత కసి, కోపం ఉన్నాయి-- అనుకుంది మనసులో. తను అతన్ని హింసిస్తూన్నదా? అతడు తనను ఏడిపించలే? లొంగి బతకలేదు తను-- ఎక్కడైనా సరే, ఎవరి దగ్గరైనా సరే. తను కొంత తప్పు చేసి ఉండచ్చు. అతనంత కంటే క్రూరంగా ప్రవర్తించాడు. తర్వాత తను కాస్త తక్కువై, ఒక రకపు విలువ దొరుకుతుందేమోనని ఆశిస్తే అది కూడా భంగ మైంది. ఎందుకని తను ఒదిగి పోవాలి? అంత కొరవలసిందేమీ లేదు అతనిలో.
రాజు వచ్చిన నాటికి పార్వతి ఇంట్లో కనిపించలేదు.
"ఏది?' అన్నాడు గోడను అడుగుతున్నట్లు.
ఎవరు? అని జానకమ్మ తిరిగి ప్రశ్నించలేదు. "వాళ్ళ ఊరికి వెళ్ళింది మొన్న పద్దెనిమిదో తారీఖున " అని అతడు ప్రశ్నించిన గోడ తనే అనుకోని సమాధానం చెప్పింది. "నువ్వూ వెళ్ళకూడదటరా? సరస్వతి కి కాస్త సరదాగా కాలక్షేపమౌతుంది పాపం!"
"వద్దమ్మా! అన్నట్లు సరస్వతి ఉత్తరాలు వ్రాస్తోందా?"
"ఆ ఏదో వ్రాస్తుంటుంది గానీ-- నేనైనా ఒక మాటు వెళ్లి రావాలి. నిక్షేపం లాంటి పిల్ల జన్మ అలా అయింది. ముసలి బ్రహ్మ కి మతి చేడిందేమో -- అందరి బతుకులూ వల్ల కాటి కీడుస్తున్నాడు!"
ఫక్కున నవ్వాడు రాజు. అతనలా నవ్వటం చూసి చాలా రోజులైందేమో ----జానకమ్మ కు తన ఇంట్లో కోటి వరహాలు రాలినట్లనిపించింది. అసలే అందంగా నవ్వుతాడు. రాజు ఇంత మొనగాడు గాకపోయి వుంటే దిష్టి తీసి పారేసేదే!
హటాత్తుగా అన్నది జానకమ్మ: "రాజూ! పార్వతి కొంచెం మారినట్లు నాకగుపించిందిరా!"
"ఏడవనీ ! మారిందని దాన్నవడలుకుంటా డిప్పుడు?" చటుక్కున అనేసి నాలుక కరుచుకున్నాడు.
"అది కాదమ్మా....." నసిగాడు.
"నిజమే. నేనెన్ని పాపాలు చేశానో! కష్టపడి పెంచానే కానీ మీ సంతోషాన్ని చూస్తూ సుఖించ లేకపోతున్నాను. పాడు జన్మ!" పైట చెంగుతో కళ్ళు వత్తుకుని అంది జానకమ్మ.
తనకు తెలిసేలా తల్లి ఎప్పుడూ కన్నీళ్ళు పెట్టుకోలేదేమో ఇలా-- 'ఈ అమాయకురాలిని కష్టపెడుతున్నాను.' అనుకున్నాడు రాజు. తల్లి ఆనందం చూడడం కోసమన్నా పార్వతికి దాసానుదాసుడై పోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ, అవిడ్నీ చూసేటప్పటికి ఈ సహనం నిలవదే? నిగ్రహం పటాపంచలై పోక తప్పదు. "నిర్లక్ష్యమైన నవ్వు, ఆ మొహంలోని మిడిసి పాటు దాని కెందుకో? సందర్భం , అవకాశం రావాలీ గానీ , ఆ చెంపల మీద శక్తి కొద్ది కొట్టి తన పాదాల మీద పడేటట్లు చెయ్యాలని కోరిక.
'మరి అమ్మను ఆనంద పెట్టడ మెలా? అసంభవమే తన ఊహలో. కాకపోతే -- ప్చ్!'
ఆ మాటా ఈ మాటా చెప్పి, ఆవిడ దుఃఖం బాగా చల్లారాక, "అమ్మా! కాశీ వెళ్దామా?' అన్నాడు రాజు.
"ఎందుకూ, గంగలో పడి చావడానికా?" అన్నది జానకమ్మ.
"నువ్వే చూడాలన్నావుగా ఒకసారి?"
"అవును. అలా మేం పోతేనైనా దిక్కెవ్వరూ లేక తిన్నగా బతుకుతారు."
ఇక లాభం లేదనుకున్నాడు రాజు. ఆవిడ పెట్టిందేదో తిని అవతలకు నడిచాడు బరువుగా.
సావిట్లో రామనాధం గారు అతన్ని నిలేశారు.
"ఏమోయ్! ఆ బడిలో ఉద్యోగం మాని-- ఈ ఊళ్ళో నే ఏదైనా వ్యాపారం పెట్టకూడదు?"
"ణా కిష్టం లేదు, నాన్నా!" అనేశాడు సవినయంగా. "అందులోకి దిగితే అనేక కష్ట నష్టాలు' అనబోయాడు గాని గొంతు రాక మెల్లగా తప్పుకున్నాడు అక్కడి నుంచి.
రామంధం గారు ఆలోచించారు కొంతసేపు. కొడుకు ఆర్జించి ఆస్తిలో కలుపుతున్నదెం లేదు. ప్రతి నేలా ఉత్తరాలు వ్రాసి దర్జాగా డబ్బు తీసుకుంటున్నాడు. 'కలిసి మెలిసి ఇక్కడుండకుండా ప్రత్యేకంగా ఉందట మేమిటి, అనవసరంగా?" అనిపించిందాయనకు.
* * * *
పార్వతి వాడిన మొగ్గలా కూర్చుంది. అలా ఉంటె సరస్వతి చూసి ఊరుకోలేదని తెలుసు.
సరస్వతి రానే వచ్చింది. "అదేమే, అలా ఉన్నావు?" అన్నది అతి దగ్గరగా వెళ్లి.
"ఎల్లుండి వెళ్లి పోవాలిగా, నిన్నోదిలి?" దిగులుగా నవ్వింది పార్వతి.
"పాడు ఉద్యోగం మానేయ్య కూడదు?" అంది సరస్వతి విసుక్కొని.
చేత్తో పార్వతి జడలు సర్దింది. "పోనీ రెండు నెలలు వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోతే వాళ్ళే డిస్మిస్ చేస్తారు."
పార్వతి అక్క భుజం మీద తల అన్చుకుంది. "సస్పెండ్ చేస్తేనేం మరీ బాగుంతుందే అక్కా!" అంది.
కుడిచేతి మీద పడిన నీటి బొట్టు కు ఉలికిపడి ఆత్రంగా పార్వతి ని చూసి మరింత దగ్గరకు చేర్చుకుంది ఆ అమ్మాయిని సరస్వతి.
"ఏమిటే , పారూ, ఇదంతా?"
"ఏం లేదు."
పార్వతి ముఖం మామూలుగానే ఉంది. సరస్వతి తనను లాలన చెసినప్పుడంతా పార్వతి కి పాప గుర్తుకు వస్తున్నది.
"ఏమైనా సరే -- నేను బతికి వుండగా నీకు పెళ్లి చేసేస్తాను ." కొంతసేపటికి పార్వతి అన్నది.
"ఎదిసినట్టే ఉంది. ఇప్పుడు నాకు పెళ్ళేమిటి?" అంది సరస్వతి మొహం చిట్లించి.
"ఏం? నీకేన్నేళ్ళెం మహా! ఇరవై ఆరు వెళ్లి ఇరవయ్యేడేనా?"
"అయితే?"
"అంతే! నీకు పెళ్లి చేసేస్తాను. అదే ముఖ్యం నాకు."
పార్వతి ఇదివరక కేన్నోసార్లు ఇవే మాటను సారస్వతి దగ్గర అన్నది. కొన్ని సంగతులు ప్రత్యేకంగా మాట్లాడాలని ఉంది ఆ పిల్లకు. ఎదురుగా అడిగితే చిన్న పిల్ల ప్రశ్నల కింద తీసి పారేస్తుందేమో అన్న సందిగ్ధమూ ఉంది.
సరస్వతి ఆలోచిస్తూ కూర్చుంది.
"కులం చూడను, మతం చూడను: ఆస్తి చూడను. ఉద్యోగం చూస్తె చూస్తాను. గుణం చూస్తాను. అందం చూడమంటావా?"
ఫక్కున నవ్వు వచ్చింది సరస్వతికి. ఆ ప్రశ్నలు విని. "ఏమిటే , పిచ్చి మొద్దూ?" అంది నవ్వుతూ ఎర్రబడి.
"నిన్ను చూస్తె పెళ్లి చెయ్యాలని పిస్తుంది!"
"ఎందుకూ ? కొందరు పెళ్లి చేసుకుని సంసారాలు చేస్తున్న వాళ్ళ కంటే నేను సుఖంగా ఉన్నాను. అన్నట్లు, రాజు ఇప్పుడు ఎలా ఉంటున్నాడు, పారూ!"
"ఆ సంగతి అడక్కు, అందుకే నీ కాబోయే వరుడికి గుణం చూస్తా నన్నాను."
"రాజు గుణాని కేం?"
"బంగారం లాంటిది కదూ?"
సరస్వతి తల వంచుకుంది. "నువ్వన్న మాటకి చెబుతున్నాను. నేను పెళ్లి చేసుకుంటే నాన్న నెవరు చూస్తారే? అసలు నాన్నగారి ఆరోగ్యం బాగుండటం లేదు. మొన్న మొన్న జ్వరం వచ్చి నాలుగు రోజులు విడవక పొతే వల్లభ చౌదరి గారొచ్చి మీ ఊరు వెళ్ళమన్నారు. అక్కడి గాలి చల్లగా ఉండి ఆరోగ్య వంతమైనదన్నారు."
"అది నిజమే ---చల్లగా ఉండటం, ఆరోగ్య వంతమా అనేదే సందేహం . సరే-----"
"నాన్నగారి తత్వం నీకు తెలుసుగా ! ఎన్ని కష్టాలొచ్చినా ఆఖరికి శరీర కష్టం వచ్చినా ఈ ఊరు వదలనంటారు. అదే చౌదరి గారితో అన్నారు కూడాను. ఇల్లాటి అమాయకపు మనిషిని ఒంటరిగా వదిలి ఎక్కడి కైనా వెళ్ళిపోవడమే? నా వల్ల కాదు" చీర అంచుతో కళ్ళ కొసలు తుడుచు కుంది సరస్వతి.
"నువ్వలా బాధపడకూడదు . నేను నీకోసం ప్రయత్నించేది సహృదయుడ్నే గానీ, రాక్షసుణ్ణి కాదు కదా? పైగా వింతంతు వివాహం చేసుకోవడానికి ఒప్పుకునే వ్యక్తీ ఎల్లాటి ఉన్నత హృదయం వివేచన కలిగి ఉంటాడో ఊహించుకో. అతను నిన్ను బాగా అర్ధం చేసుకుని ఇక్కడే నీతో కలిసి జీవించడానికి ఒప్పుకునేటట్టు చేస్తాను ముప్పాతిక వంతు. ఒకవేళ అతడంగీకరించ కాపోతే...."
"ఊ......అదే కావాలి, ముఖ్యంగా." చెప్పు."
"నేనే నాన్న దగ్గర ఇక్కడ ఉండిపోతాను."
"బాగానే ఉంది. మరి రాజేక్కడి కి పోతాడు? అతడి కిలాటి స్థలాలు నచ్చవేమో?"
"అతని సంగతెందుకు? విడాకులిచ్చి, వచ్చేస్తాను. నాకిక్కడ ఏంతో హాయిగా ఉంటోందక్కా!"
సరస్వతి తెల్లబోయింది. "ఇది మరి బాగుంది ; నాకు పెళ్లి చేసి నువ్వు విడాకులిచ్చుకోవడ మేమిటి? ఇన్ని నీతులూ చెప్పి ఇదా? ఇంతకీ రాజేమన్నా అన్నాడా?"
"ఎవరు చెప్పే నీతులు వాళ్ళ సొంతానికి వర్తించవు లేవే!"
"అలా అయితే నాకు పెళ్ళీ వద్దూ పాడూ వద్దు."
"ఆహా! ఎలా చేసుకోవో చూస్తాగా!"
పార్వతి మొటమోటా, విసవిసా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది.
ఒక చిన్న గది నరసింహ మూర్తి గారి గది. అక్కడున్న వస్తువుల్లో నిశ్శబ్దం కూడా ఒకటి.
అయన చుట్ట కాలుస్తూ మంచం మీద చేరగిలి ఉన్నాడు. పార్వతి వెళ్లి తండ్రి పలకరిస్తున్నా నిశ్శబ్దంగా కూర్చున్నది.
కొద్ది సేపుండి , "నాన్నా! నాన్నా!" అంది, అప్పుడే మేలుకున్నట్టు.
నరసింహ మూర్తి గారికి ముక్కునా, గొంతునా పొగ కమ్మి ఉక్కిరిబిక్కిరయింది కూతురి పలవరానికి.
"అదేమిటే?' అన్నాడాయన.
"అది కాదు, నాన్నా!"
"ఏది కాదు?" నవ్వి అన్నాడు. నీరసానికి కళ్ళలో నీళ్ళు చిమ్మాయి.
బలహీనంగా ఉన్న తండ్రి దేహం వైపు ప్రేమగా చూచి, "అది కాదు,నాన్నా! అక్కయ్య కీ........" అంది.
"అక్కయ్య కేమయిందమ్మా?" అయన కళ్ళల్లో మళ్ళీ కంగారు ద్యోతకమైంది. లేచి కూర్చున్నాడొక్కసారిగా.
"అబ్బే. ఏం లేదు నాన్నా. నువ్వలాగే కూర్చో. మరీ......అక్కయ్య కీ పెళ్లి చెయ్యవా, నాన్నా?"
నరసింహమూర్తి గారు సున్నితంగా, నవ్వడం, వెనక్కు జరగడం జరిగాయి.
"చేద్డెంలే , అమ్మా!" అన్నాడు.
"ఎప్పుడు నాన్నా?" మళ్ళీ అది ముసలిదయిపోతుందేమో!" పార్వతి గారంగానే అంది.
"తగిన వాణ్ణి ముందు చూడాలి కదమ్మా?"
"నాన్నా. ఒక్కమాట! దానికి మొగుణ్ణి నన్ను చూడమంటావా?"
అయన తేలిగ్గా నవ్వి, "తప్పకుండా చూడు!" అన్నాడు. అప్పుడా నవ్వులో అయన మనసు తేలలేదు.
తలుపు పక్కన నిలబడి వింటున్న సరస్వతి నవ్వుకుంది పార్వతి కొంటె తనానికి. తండ్రికి తను పునర్వివాహం చేసుకోవటం ఇష్టం లేదేమో నన్న అనుమానం సరస్వతి మనసులో మొదటి నుంచి ఏర్పడింది ఎందుకో.
