Previous Page Next Page 
శాంతినికేతన్ పేజి 28


    "అలాగే."
    "సరే. తర్వాత కలుసుకుందాం." గోవిందరావు వెళ్ళిపోయాడు స్నేహితులతో.
    హాస్టల్ కు వచ్చి మధ్యాహ్న ఫలహారానంతరం తీరికగా పడుకొని పుస్తకం తెరిచింది శాంతి. ఆశ్చర్యం! నీలి కవరొకటి జారి పడింది. భయోద్వేగాలతో విప్పి చూచింది. గులాబిరంగు కాగితంపై పట్టి పట్టి వ్రాసిన వ్రాత! అక్కడికీ వంకర టింకరగానే ఉన్నాయి అక్షరాలు.
    "నా శాంతీ,
    ఎంత ప్రయత్నించినా మన సమాగమం కుదరటం లేదు. ఆ రోజున నిజానికి నాకేపనీ లేదు. నీకోసమే కలకత్తా వచ్చాను. కాని రాహువులా ఆ రాజా అడ్డుపడ్డాడు. నువ్వూ నాలాగే తపించిపోతున్నట్లు నాకు తెలుసు. రేపు రాత్రి రిహార్సలైపోయిన తర్వాత పదకొండు గంటలకు కళాభవనం వెనుక నీకోసం వేచి ఉంటాను. చాలా మాట్లాడాలి.
                                                                                                రావ్."
    ఆనందంలో తేలిపోయింది శాంతి. 'మనోరమ ఉంటే ఎంత బాగుండును!' అనుకొంది. కాని వెంటనే ఆమె వల్లించే పాఠాలు జ్ఞప్తికి వచ్చి లేకపోవడమే మంచిదనిపించింది. మనోరమ వెళ్ళిపోయిన దగ్గరినుంచి శాంతి ఒంటరిదై పోయింది. చనువూ, స్నేహభావమూ ఎరుగని ఆమె హృదయానికి ఆమె హృదయానికి ఎవరైనా దగ్గరగా రావడమనేది సాధారణ విషయం కాదు. ఆమెకు ఎవరూ చెప్పుకోదగిన స్నేహితులు లేరు. ఎవరితో నైనా మాట్లాడినా అది ముక్తసరిగా అవసరార్ధం, నాలుగు మాటలు. అంతే.
    'రేపు కలుసుకుంటే ఏం జరుగుతుందీ? ఏం మాట్లాడుతాడూ?' అని ఆలోచించు కొంటూండగానే ఏదో తెలియరాని జంకూ, ఉద్వేగం ఆవరించేశాయి. 'కోరిన అవకాశం వస్తూంటే యింత అందోళన దేనికీ?' అని తనను తానే ప్రశ్నించుకుని నవ్వుకుంది. అంతలోనే ఒక అమ్మాయి వచ్చి ఒక కవరు యిచ్చి వెళ్ళింది. మనోరమ వ్రాసింది. మనోరమ లేదని విచారిస్తూన్న సమయానికే ఆమె ఉత్తరం వచ్చిందే! ఘటనాఘటనల ప్రాబల్యానికి నవ్వు కుంటూ ఉత్తరం తెరిచింది.
    క్షేమ సమాచారానంతరం బావకూ, తనకూ మాఘమాసంలో వివాహమనీ, వివాహానంతరం కాశ్మీర్ వెళ్ళుతామనీ వ్రాసింది మనోరమ. తానూ, శేఖర్, ఉభయుల స్నేహితులైన మరికొందరూ ఆ మధ్య ఢిల్లీ, ఆగ్రా అన్నీ తిరిగి చూచామంటూ ఆ విశేషాలు వ్రాసింది.
    "నువ్వు ఏ నిర్ణయాని కొచ్చావు, శాంతీ? రాజాను నువ్వు తృణీకరించినందుకు బావకూడా బాధపడ్డారు. ఆయనకు చూచీ చూడగానే మీ యిద్దరికీ తగిన జోడు అనిపించిందట. గోవిందరావు విషయంలో నేను మనసారా అంగీకరించలేకుండా ఉన్నాను, శాంతీ. కాని, తొందరపడకు. అతడైనా మంచివాడేనేమో? అతడిని గురించి అన్నీ తెలుసుకొని మరీ ఒక నిర్ణయానికి రా. వట్టి వెర్రి వ్యామోహంలో పడిపోవద్దు - అని నా కోరిక. అటువంటి వివాహాలూ లేకపోలేదు. శాంతినికేతనంలో చదివిన నా స్నేహితులే యిద్దరు అలా తఃమకు నచ్చిన వారిని వివాహం చేసుకొని హాయిగా ఉన్నారు. గురుదేవుడు ఈ విశ్వభారతిని విశ్వజనీనమైన దిగా, సర్వమానవ సౌభ్రాత్రతకు నిలయంగా చేయాలని తాపత్రయపడ్డారట. ఆయన కుటుంబమంతా యిటువంటి విషయాలలో ముందడుగు వేసినవారేనట. కుమారుడైన రతీంద్రునికి రవీంద్రులు ఒక బాల వితంతువును వివాహం చేశారట.
    సంకుచిత కృత్రిమ అవధులతో ఆయన పోరాడారట. వర్ణ మత జాతి ప్రాంత దేశాదిభిన్నత్వాల కతీతమైన శాంతి ప్రేమ సంపూర్ణతలనే ఏకత్వాన్ని కనుగొని లోకానికి చూపిన మహనీయుడు. వివిధ సంస్కృతుల నిలయమూ, కుల మతాతీతమైన అసమాన విద్యా పీఠమూ అయిన ఈ విశ్వభారతికి జనకుడైన ఆ మహామహుడు దేశౌన్నత్య కారణభూతమయ్యే యిటువంటి వివాహాలకు పరమానందంతో పైనుండి పూలవాన కురిపిస్తాడు. ఎటొచ్చీ ఆ చేసేపని సంస్కరణపూరితమైనదనే భ్రమతో గాక, గ్రుడ్డినమ్మకంతోనూ వెర్రి వ్యామోహం తోనూ గాక, నిజమైన ఆత్మ సంస్కారంతో, తర్కవివేకంతో చేస్తే తర్వాత విచారించకనక్క ర్లేదు. అది ఇతరులకు ఆదర్శప్రాయము, అనుసరణీయముకూడా కాగలదు. అనగా, నీలాగే గోవిందరావుకూడా నిర్మల ప్రేమ హృదయుడైతే తప్ప నీతో వివాహయోగ్యత ఉండదని నా భావం. చూడు, శాంతీ, జ్యోతి కాంతికి భ్రమసి పట్టుకోబోతే కాలి మచ్చపడుతుంది. నిర్మలమైన నీటి అడుగునకూడా సుడిగుండాలు ఉంటాయి. మొగలికి సువాసన ఉన్నా ఆప్యాయంగా ఆఘ్రాణించ వలనుపడదు. అది ముళ్ళ పువ్వు. అర్ధం చేసుకోగలవు కదూ?
                                                                                             నీ మనోరమ."
    నిర్లక్ష్యంగా నవ్వుకొంది శాంతి. 'ముసలమ్మ కబుర్లు' అని తలపోసింది హేళనగా. 'తానుమాత్రం పెళ్ళి కాకముందే బావతో స్వేచ్చగా దేశం తిరుగుతూందట. నాకుమాత్రం ధర్మపనాలు బోధిస్తూంది. సిగ్గు లేకపోతే సరి' అని ఈసడించింది.
    మర్నాడు రాత్రి నిర్ణీతసమయానికి వృక్షపునీడలో ఎదురుచూడసాగింది శాంతి. ఆకాశ మధ్యంలో పున్నమచంద్రుడు, హృదయసరసిలో బంగరు ఆశా పద్మం, నేత్రాలలో విచిత్ర కాంతి లాస్యం చేస్తున్నాయి. అనిర్వచనీయా నందోద్వేగాలలో నిమిషమొక యుగంగా గడుపుతున్న శాంతి ఆరాట హృదయం కడకు గోవిందరావు రావడంతో ఊరట చెంది క్రొత్తరకంగా స్పందించసాగింది.
    "శాంతీ, ఎదురుచూస్తూన్న శుభసమయం వచ్చింది. ఈ తరుణంకోసం ఎంతగా నిరీక్షిస్తున్నానో, తెలుసా?"
    ఎంత ప్రయత్నించినా శాంతి కంఠస్వరం పైకి రాలేదు. మనోరమ చెప్పినట్లుగా అతడితో ఎన్నో మాట్లాడుకొందామని క్రిందటి రోజునుండీ మనస్సులో పదే పదే మననం చేసుకొన్న విషయాలన్నీ మచ్చుకైనా గుర్తులేకుండా పోయాయి. స్వప్నానిష్ఠలాగా అతడి సమక్షంలో సర్వం మరిచిపోయింది. అతడూ, తనూ తప్ప మిగతా ప్రపంచం ధ్యాసే లేకపోయింది.
    "నిన్ను ఎప్పటికీ వదులుకోలేను, శాంతీ!" అన్నాడు గోవిందరావు ఆమెను సమీపిస్తూ "నువ్వు శాంతినికేతన్ లో ప్రవేశించినవాడే నీ సౌందర్యానికి కట్టుబడిపోయాను. నీ ఆరాధకుడి వైపోయాను."
    "మీ మురళీగానమే నన్ను మీ దరికి జేర్చింది" అంది శాంతి, అరమోడ్పు కన్నులతో.
    "శాంతీ!" ఏమో మాట్లాడబోతున్న గోవిందరావు ఠక్కున మాటలు ఆపేశాడు. రిహార్సల్స్ పూర్తి చేసుకుని వెళ్ళుతూన్న నలుగురైదుగురు విద్యార్ధులు అటుగా వచ్చి అక్కడే కొద్ది దూరంలో నిలబడి మాట్లాడుకోసాగారు.
    అనురాగ పరిష్వంగంలో ఉన్న శాంతీ గోవిందు లిరువురూ ఉలిక్కిపడ్డారు. నెమ్మది నెమ్మదిగా ఎవరిదారిన వారు చీలిపోయారు.
    "ఏమిటీ దైవం, ఎప్పటికప్పుడే మా సమావేశాన్నిలా ఆటంకపరుస్తున్నాడు?' అని లోలోపల కుమిలిపోయింది శాంతి, ఆ రాత్రంతా.
    'ఛ! ఇక యిలాగ కాదు, అన్నయ్యకు వ్రాసి అతడిచేతే అడిగిస్తాను. వచ్చి మాట్లాడుతాడు. గోవిందరావు కెలాగూ ఇష్టమేకదా? అయినా ఇక భయం దేనికి? తర్వాత ఎలాగూ అందరికీ తెలిసేదే. ఎప్పుడో వీలు చూచుకొని అడిగేస్తాను. ఎవరు చూచినా చూడనీ.'
    ఒక స్థిర నిశ్చయానికి వచ్చాక తృప్తిగా నిద్రపోయింది.
    
                                                          31

    ఆనాడు నిద్ర లేస్తూనే శాంతి మనస్సు చాలా ఉల్లాసంగా ఉంది. గోవిందరావు మురళీగానం ఆరోజు ఎప్పటికంటే ఆనందమయంగా వినూత్న పోకడలతో వీనులవిందు చేసింది. అసలే సుందరంగా కన్పించే విశ్వభారతి మరింత సుందరమయంగా కన్పించింది. వేకువ ప్రార్ధనా గీతాలలో ఏదో 'అసాధారణ నూతన భక్తి భావం గోచరించింది. ఆనందంగా ఉత్సాహంగా సమలన్నీ తెముల్చుకుంది. 'ఇవ్వాళే గోవిందరావుతో మాట్లాడేస్తాను. ఇంటికి వ్రాసేస్తాను' అని పొంగులు వారుతున్న హృదయంలో సంభాషించుకొంటున్న ఆమెకు చల్లని వార్త అందింది, తనను చూడటానికి ఎవరో బంధువులు వచ్చారని, ఆశ్చర్యపోయింది. 'ఎవరా?' అనుకుంటూ త్వరత్వరగా వెళ్ళింది. 'గెస్ట్ హౌస్' వరండాపై నిల్చుని ఉన్నాడు, నారాయణరావు!
    "చిన్నన్నయ్యా!" ఆశ్చర్యంగా అంది శాంతి. "ఇలా వ్రాయకుండా వచ్చావేమిటి?" విస్మయంలో దగ్గరికి వెళ్ళి ప్రశ్నించింది.
    "ఆకస్మికంగా బయల్దేరాన్లే." ఇద్దరూ వెళ్ళి కూర్చున్నారు.
    "అయితే ఏమిటీ అరణ్యవాసాని కర్ధం?" సూటిగా అడిగాడు నారాయణ.
    "అరణ్యమా?" విస్తుపోయింది శాంతి.
    "మరి ఏమనమంటావ్? పెళ్ళి వద్దన్నావట? ఏం చేద్దామని?"
    "పోనిద్దూ." విసుక్కొంది శాంతి. "వస్తూనే అదే సంగతి మాట్లాడకపోతే కాస్త నీవిషయ మేమైనా చెప్పరాదూ?"
    "నా విషయం చెప్పేందు కేముంది? పంజాబ్ కు బదిలీ అయింది నాకు. నీకు వ్రాశాను కధ? సరే ఇప్పుడు విశేషమేమంటే నా పెళ్ళి కుదిరిందట. ప్రస్తుతం పెళ్ళికొడుకు నవ్వటానికి వెళ్ళుతున్నాను. నిన్నూ లాక్కుపోదామని వచ్చాను. లేకుంటే మళ్ళీ యింతదూర మెవరొస్తారు, నిన్ను తీసుకెళ్ళటానికి?"
    పకపకా నవ్వసాగింది శాంతి.
    "ఏమే? ఎందుకా నవ్వు?"
    "ఏముంది?" మళ్ళీ నవ్వింది. "నా పెళ్ళి కుదిరిందట - అని నువ్వు చంటి పాపాయిలా చెప్పుతూంటే నవ్వొస్తోంది. నీ పెళ్ళి కుదరడంలో నీ ప్రమేయమేమీ లేదా, అన్నయ్యా?"
    "నాన్సెన్స్. ఏవో సినీమాలూ, పుస్తకాలలో మాటలు వల్లించి అలా ఉండాలంటే కుదరదే, శాంతీ. నా ఉద్దేశ్యం ప్రకారం మన మనస్సు బొత్తిగా ఏమీ తెలియని పసి బిడ్డవంటిది. కంటికి నదురుగా కన్పించినవన్నీ కావాలంటుంది. కన్ను చెదురుతుంది. కాని వివేకం మేల్కొలుపుతుంది. మేల్కొలుపకపోతే పతనమే."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS