Previous Page Next Page 
మొగలి పొదలు పేజి 28


    'ప్రభావతీ,' చంద్రమౌళి పిలిచాడు.
    'యేవిటీ?' అంటూ వచ్చి శ్రీనివాస్ ని చూసి పలకరింపు గా నవ్వింది.
    'రాజేశ్వరి గారికి వొంట్లో బాగుండడం లేదుట. నువ్వు ఒక్కసారి వెళ్లి చూసి వస్తావా?' అతని అంతరార్ధం గ్రహించింది ప్రభావతి.
    'అలాగే, స్టౌ మీద పప్పు వుడుకుతోంది. అన్నం డైనింగ్ టేబిల్ మీదే వుంది : మీరు వడ్డించేసుకుని సామాను అక్కడే పెట్టేసి వెళ్ళిపొండి. డూప్లికేటు 'క్రీ' వుంది నా దగ్గర. నేను రాజేశ్వరి ని హాస్పిటల్ లో చూపించి వచ్చి భోజనం చేస్తాను.'
    'మీకు శ్రమ యిస్తున్నట్లున్నాను.' శ్రీనివాస్ నొచ్చుకున్నాడు.
    'శ్రమేం వుంది యిందులో. దగ్గర్లో వున్నాం కనుక ఆదుకో గలం. లేకపోతె యెవరి పాట్లు వారికి తప్పవు.' చంద్రమౌళి కూడా అన్నాడు.
    'నీకు యెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో.'
    'నీ గొంతు నాటక సమాజానికి అంకితం చేసి......' చంద్రమౌళి హాస్యం చేశాడు. శ్రీనివాస్ అక్కడ జరిగింది తు.ఛ. తప్పకుండా భార్యకు చెప్పాడు కూడా ప్రభావతి ఎదుటే. శ్రీనివాస్ ని పంపేసి రాజేశ్వరి పక్కనే కూర్చుంది ప్రభావతి.
    'నువ్వు మనసులో ఏదో వుంచుకుని యిలా బెంగ పడిపోతుంటే వచ్చిన రోగం తిరుగు ముఖం పట్టమంటే యెలా పడుతుంది?' ప్రభావతి చనువుగా అంది.
    'లేదక్కా. నాకు బెంగేవీ లేదు.'
    'వుందో లేదో నీ మొహం చూస్తేనే తెలుస్తోంది. శ్రీనివాస్ యేమైనా అన్నాడా? మీ యిద్దరూ బాగానే వుంటున్నారు కద'
    'అయన యేవీ అనలేదు.'
    'మరి?'
    రాజేశ్వరి మౌనంగా వుండిపోయింది.
    ప్రభావతి నవ్వుడూ అంది: 'మీరు ప్రేమించి చేసుకున్నారు. మీకు మధ్య పోట్లాటలు యేవిటి నా మొహం నేనేదో అన్నాను గానీ... చూడు రాజేశ్వరీ ప్రపంచంలో మనుషుల సంగతి నాకు అంతగా తెలీదు గానీ మీ బావగారు అంటుంటారు శ్రీనివాస్ వంటి బుద్ది మంతులు వుండరని' రాజేశ్వరి మనసులో నిప్పులు చేరుగుతున్నాయి . 'ఈనాడు శ్రీనివాస్ అందరి కళ్ళకి మంచి వారులాగే కనిపిస్తారు: కాదు మరీ అందరి దగ్గరా తన కష్టాలనీ ఏకరవు పెట్టేసుకుని తను వారాలు చేసుకుని చదువు కున్నానని ప్రకటిస్తే అందరికీ పుట్టుకు వస్తాయి యెక్కడ లేని అభిమానాలూ-- ప్రభావతి వెంటనే అంది: 'అయినా మనకెందుకు మగవాళ్ళ విషయం.' రాజేశ్వరి ముఖంలో భావాలు చదివేయగల్గెశక్తి లేకపోతె ఎం.ఎ సైకాలజీ పాసయ్యేది కాదు ప్రభావతి. అడపా దడపా ప్రభావతి వస్తూనే వుంది.
    రెండు వారాలు గడిచిపోయాయి. పిల్లడు పాల కోసం ఏడుస్తూంటే రాజేశ్వరి కి శ్రీనివాస్ మీద కోపం కట్టలు తెంచుకుంది; 'యీ యింట కాలు మోపింది మొదలు యేనాడూ సుఖ పడలేదు . పుట్టిన పిల్లాడైనా సుఖంగా బ్రతకడం లేదు. ఈ కరువులో వాడిని కూడా పోగొట్టు కుంటానెమో.'  రాజేశ్వరి గుండెల మీద చేతులుంచుకుంది భయంగా.
    రెండోసారి పెద్ద సైజు వుత్తరం వచ్చింది. ఆరోజు సాయంత్రం శ్రీనివాస్ రాగానే 'నేను రాజమండ్రి వెడతాను. మా అమ్మ వుత్తరం రాసింది' అంది.
    'ఎమనేమిటి?'
    'ప్రతి తల్లీ కూతురికి ఏం రాస్తుందో అదే.'
    'అంటే'
    'నన్ను రమ్మని రాసింది.'
    'అయితే వెడతావా?'
    'అవును అమ్మ దగ్గర వుంటే కొంచెం మనశ్శాంతి వుంటుందేమో అని.'
    'యిక్కడ నీకు అంత మనశ్శాంతి లేకుండా వుందా రాజేశ్వరి.'
    'అది మీకు తెలియాలి.'
    'నిన్ను నేను పన్నెత్తి వొక్కమాట అనడం లేదు.'
    'వేరే అనాలా.'
    'అయితే ఏం చేస్తున్నానంటావు?'
    'కూటికి గతి లేని యింట్లో నేను వుండలేను. యింకా యెన్నిసార్లు అనిపిస్తారు నా చేత.'
    'రాజేశ్వరీ' శ్రీనివాస్ తెల్లబోయాడు. నిన్ను అంత మాడుస్తున్నానా?'
    'నేను పచ్చి బాలింత రాలీని, నాకు మేజర్ ఆపరేషన్ కూడా అయింది. కుట్లు నొప్పి పుడుతుంటే వొక్క మందు సీసాకి నోచుకోలేదు......అందరి చేతా , ముఖ్యంగా ప్రభావతి కూడా నన్ను యెన్ని మాటలు అంది.'
    శ్రీనివాస్ తల దించు కున్నాడు అపరాధి లా 'ఆవిడే మంది మధ్య' అతను అనుకున్నాడు మనసులోనే.
    'అందుకే అంటున్నాను నేను మా యింటికి వెడతాను.'
    'మళ్ళీ యెప్పుడు వస్తావు?'
    'అక్కడ విసుగు పుట్టినప్పుడు' రాజేశ్వరి అహంకారం బయటికి వస్తోంది. బాబుని అందించి కాళ్ళు యిడ్చు కుంటూ బయటికి వచ్చాడు శ్రీనివాస్.
    
                              *    *    *    *
    పుట్టి పెరిగిన వూరు. అడ్డుగా వున్న రామదాసు కాలగర్భం లో కలిసి పోయాడు. రాజేశ్వరి అంటే పద్మావతి కి పంచ ప్రాణాలు. రోజుకో రకంగా పిండి వంటలు చేస్తూ వండివారుస్తూ వుంటే రెండు వారాలకే పచ్చగా దబ్బ పండు చ్చాయ లో మంచి ఆరోగ్యం తో మిసమిస లాడి పోతుంది రాజేశ్వరి. హైదరాబాదు లో శ్రీనివాస్ యిల్లూ ఆ గది గోడలూ కళ్ళ ముందు కదులుతుంటే చిరాకు పడేది.
    ఆరోజు రాజేశ్వరి వచ్చిందని తెలిసి దేవదాసు పరుగున వచ్చాడు.
    'బాగున్నావా,' రాజేశ్వరి సోఫాలో కూర్చుని అతన్నీ కూర్చోమనీ మాటల్లో దిగింది.
    దేవదాసూ, రాజేశ్వరీ ఒకే బళ్ళో చదువుకుని, వోకేసారి మెట్రిక్ పరీక్ష పాసయ్యారు. అతన్ని మొదట్లో రాజేశ్వరి కి యిచ్చి చేయాలని రామదాసు కి పట్టుదల గా వుండేది. అనేక తిరుగుళ్ళు తిరిగిన స్థిరం లేని మనిషని అప్పట్లో ఆ ప్రయత్నాన్ని విరమించింది పద్మావతి.
    'అత్తా నీ కూతురు దట్టంగా బలిసింది.' దేవదాసు అంటుంటే పద్మావతి ముసిముసిగా నవ్వింది. దేవదాసు వెళ్ళిపోగానే అంది పద్మావతి. 'నువ్వు మొదటి నుంచీ కష్టాల్లోనే పెరిగావు. నీకు ఆ దరిద్రపు బాధ దేనికి. హాయిగా యీ పదెకరాలు నీకూ విజయ కి రాసిస్తాను. అతన్ని వదిలి వచ్చేయి.'
    'అమ్మా,' రాజేశ్వరి వులిక్కి పడింది. శ్రీనివాస్ జాలిగా ఆవిడ కళ్ళ ముందు కదులుతుంటే భయపడి పోయింది. అతన్ని తను వదులుకోలేదు. తను లేకపోతె శ్రీనివాస్ పిచ్చివాడై పోతాడు. అయినా తను ఒక పిల్లాడికి తల్లి కూడా.
    'నేనేం తప్పుగా అన్నాను? కన్న తల్లిని కనుక కష్టాల్లో వుంటే చూడలేక నాకు తోచింది చెప్పాను. నీకు యింత కష్టంగా వుంటుందనుకోలేదు. అయినా వాడిని ఏం చూసి చేసుకున్నావు?'
    'నీకు పుణ్యం వుంటుందమ్మా, ఆయన్ని యేవీ అనకు. తను నాకు ఆ రోజు నిలుచుందుకి నీడ చూపించక పొతే నా బ్రతుకు యిప్పుడు యెలా అయిపోయేదో....'
    'ఏం అంత బాగుందనుకుంటున్నావా నీ బ్రతుకు యిప్పుడు. వాడు నీకేదో మాయమాటలు చెప్పి నిన్ను యిక్కడికి పంపాడు. మీ బాబాయి వున్నప్పుడు లేని ధైర్యం యిప్పుడు యెలా వచ్చింది?'
    'ఛ! అనవసరంగా అనకమ్మా. ఆయనకి అసలు ఏ విషయాలూ తెలియవు.' 'పోవే, రెండు రోజులుండి వెళ్ళే దానివి. నీతో యేవిటి వితండ వాదం,' పద్మావతి మరి మాట్లాడలేదు.
    దేవదాసు రోజూ సాయంత్రం వచ్చి నాలుగైదు గంటలు మాట్లాడి వెడుతుంటే రాజేశ్వరి మనసు కళ్ళెం నుంచి తప్పుకునేది. కార్లో దిగి ఠీవి గా అడుగులో అడుగు వేసే దేవదాసును తను యెందుకు వదులుకుంది అనుకునేది లీలగా. పద్మావతి పదేపదే దేవదాసు ని పొగుడుతుంటే ఆ అభిప్రాయం నీరు పోసి పెంచినట్లు యింతింతై వటు వంతై లోకి దిగింది. దేవదాసు వచ్చి అన్నాడు. 'శ్యామలా టాకీసు లో మంచి పిక్చరుంది. వెడదాం వస్తాయా అత్తా.' తనకన్నా ముందుగా కూతుర్ని వొత్తిడి చేసి లేవదీసింది పద్మావతి. ఏదో విధంగా తన కూతురు ఐశ్వర్యంలో తులతూగే దేవదాసు యింట స్థిరంగా వుండాలి. దేవదాసు ప్రతిఫలం ముట్ట జేపుతున్నప్పుడు పద్మావతి విశ్వాసం చూపిస్తోంది అతనికి. కొంతలో కొంత ఈ సంగతి రాజేశ్వరి గ్రహించింది కూడా.
    రెండు మూడు సార్లు వరుసగా పిల్లడిని యింట్లో వదిలి సినిమా లకీ, గోదావరి వొడ్డు కీ వెళ్ళడం రాజేశ్వరి కి తప్పుగా తోచలేదు. సమయం దొరికినప్పుడు కొంచెం దగ్గరగా మెసులుతూ, పరధ్యానంగా చేతిలో చేయి వేస్తూ వుషారుగా కబుర్లు చెప్పేస్తూ తన సంగీత పాండిత్యానికి అందరూ యెలా అభినందిస్తున్నారో వెల్లడి చేస్తుంటే రాజేశ్వరి కి వింటున్నంత సేపూ మతి పోయేది.ఆ ఆకాశ సౌధాలని అందుకోవాలని మనసు తహతాహ లాడెది. రాజమండ్రి ని కలలో కూడా వదులు కోవాలని పించేది కాదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS