16
చచ్చిపోయిన నా మనస్సుకు నూతనోత్తేజం కలిగింది. అనుభవాలు దూరమైతే కోరికలు తలెత్తవు. దగ్గరైనా అనుభవం కొత్త కోరికల్ని సంతరించు కుంటుంది.
రోజూ ఉదయం తొమ్మిది గంటల కల్లా భోజనం చేసి టాయిలెట్ అయి డ్రస్ చేసుకుని ఆఫీసుకు వెళ్ళేవారు. రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చేవారు. ప్రతి రోజూ పిల్లలకు బిస్కెట్లు, నాకు రకరకాల పూలు . వారితో పిల్లలతో రెండు సినిమాలకూ వెళ్ళాను. మాకు తెల్సిన వాళ్ళు కొంతమంది కనిపించారు. అందరి తోనూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. కొత్తగా ఉద్యోగం దొరికిందని చెప్పారు. జీవితంలో, జీవిత గమనం లో అనుభవాల్లో మార్పు వచ్చినందుకు సంతోషించాను.
ఒకరోజున అడిగాను.
"ఇదంతా కలా నిజమా, మమ్మల్ని మురిపిస్తున్నారా , లేక చెడ్డ నక్షత్రం మాసిపోయిందా."
"అన్ని అడ్డంకు లూ తొలగిపోయాయి సుభా, అందని ఆనందాల్ని కూడా అందుకుని అనుభవించుదాం . కొత్త జీవితానికి ఇది నాంది" అన్నారు.
మరొక వారం గడిచింది. ఉదయం నిద్రలేచేసరికి వారు లేరు. నా మెళ్ళో గొలుసు లేదు. చేతుల కున్న బంగారు గాజులు లేవు. కళ్ళు నులుముకుని ఒక్క అంగలో మంచం దిగాను.
"అమ్మా, నా మెళ్ళో చంద్రహారం . పుస్తెల తాడూ, చేతి గాజులూ లేవే" అని అక్కయ్య పెద్దగా ఏడుస్తూ అన్నది. అందరం ఒకచోట చేరాం. అక్కయ్య మెళ్ళో పది చంద్రహారం , చేతులకు నాలుగు నవర్సులు గాజులు లేవు. మూడు నవర్సులు కాసుల కొబ్బరి తాడు లేదు. నా మెళ్ళో బంగారు గొలుసూ, చేతుల గాజులూ లేవు. వారి పనేనని ఊహించాము. అయితే మాకు తెలీకుండా ఎట్లా ఇవన్నీ తీశారు? అక్కయ్య గోడు గోడున ఏడ్చింది.
"సుభా, అసలే నాది చచ్చీచావని జీవితంగా ఉన్నది. మంచి రోజులు వచ్చి ఆ మెట్రిక్ పాసయితే నేనే ధైర్యం చేసి వారి వద్దకు వెళదాం మనుకున్నాను. నా మెళ్ళో ఉన్న చంద్రహారము , కొబ్బరి తాడూ. చేతుల గాజులూ అన్నీ వారు పెళ్ళిలో చేయించి ఇచ్చినవే. ఇన్నాళ్ళు వాటిని కాపాడుకుని ఈ ఆఖరు రోజుల్లో ఈ నగల్ని పోగొట్టుకున్నాను. వారు నన్ను స్వీకరించటానికి ఒప్పుకున్నా వంటి మీద చిన్నం బంగారం లేకుండా వెళితే వారే మనుకుంటారో ఆలోచించు. ఇన్నాళ్ళూ నీకు తిండి పెట్టినందుకు ఈ నగలన్నీ మీ చెల్లెలికి. మరిదికే యిచ్చి వచ్చావా. అని నానా మాటలూ అంటారు. అన్నింటి కన్నా విపరీతం! ఆశుభంగా నా మెడ తయారయింది. నామెళ్లో మంగళ సూత్రాలూ కూడా లేవు. నా భర్త నన్ను వదిలి పెట్టారు గాని మరణించలేదు" అని వెక్కి వెక్కి ఏడువ సాగింది అక్కయ్య. అమ్మా, అక్కయ్యా నెత్తీ నోరు బాదుకుని ఏడువసాగారు.
దుఃఖమయ జీవితానికి స్వస్తి చెప్పినట్లుగా నటించి నన్నెంతో మురిపించి అరి చేతి లో వైకుంఠం చూపి. అందలం ఎక్కించి ఒక్కసారి సముద్రం లో విసిరి వేసినట్లయింది. వారి మీద ఎంతో అసహ్యం కలిగింది. జీవితం లో చరమాంకం ఆఖరు కావచ్చింది. ఆరిపోయే లైటు ప్రకాశ వంతంగా వెలిగినట్లుగా నా భర్త నన్ను ఆదరణగానే చూస్తున్నారని ఎంతో మురిసి పోయాను. కాని ఎంతో చక్కగా నటించారు. అందరి కళ్ళల్లో కారం కొట్టారు.
"అక్కయ్యా, మెళ్ళో వీ, చేతులవీ తీస్తుంటే నీకు మెలుకువ రాలేదా?"
"లేదు నాకు బాగా నిద్రపట్టింది."
"నాకేదో అనుమానం కలిగింది. "రోజూ కన్న బాగా నిద్ర పట్టిందా. రోజూ మాదిరి ఒకరాత్రి పెరట్లో కి వెళ్ళటానికి లేవలేదూ?"
"లేదు. వళ్లు తెలియకుండా నిద్ర పట్టింది. మరి నీకు నిద్రపట్టిందా?"
"ఆ. నాకూ మొద్దు నిద్రా పట్టింది. నా అనుమానం నిజమే కావచ్చు. మనిద్దరి ముక్కు దగ్గరా ఏదో కాస్త మత్తుమందు వాసన చూపించి ఉంటారు. అంచేతనే మనకు ఎన్నడూ లేనంతగా నిద్రపట్టింది."
"నిజమే కావచ్చు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి?' కళ్ళు తుడ్చుకుని అడిగింది అక్కయ్య.
"పోలీసు రిపోర్టు ఇస్తే"
"పిచ్చిదానా, మన గొయ్యి మనమే తవ్వుకున్నట్లు ఉంటుంది. బైటపడి ప్రయోజనం లేదు. వారే మనకు చక్కగా వ్యతిరేకంగా చెప్పి చక్కగా మనల్ని ఇరికిస్తారు. మా వదినే గార్ని భర్త వదిలి పెట్టారు. ఇన్ని సంవత్సరాల నుంచీ నా అధీనం లోనే ఉన్నది. ఆవిడే నన్ను అమ్ముకు రమ్మని ఇచ్చింది. మళ్ళీ మనసు మార్చుకుని నా మీద అభాండం వేసిందంటారు. వస్తువులు పోవడమే కాకుండా మనం అల్లరి పడతాం" అన్నాను.
అక్కయ్య సందిగ్ధావస్థలో పడ్డది. "నేను చెప్తున్నాను. వారు ఈనగల కోసమే ఈ ఎత్తు ఎత్తటానికి ఇట్లా నటించారు. వారి అభిలాష సిద్దించింది. ఇంక వారు మన ఇంట్లో ఎత్తుకు పోయేది. ఏమీ లేదు. సర్వం వారు చేజిక్కించుకున్నారు. ఇంక వారు ఇక్కడికి రారు. వారితో ఆఖరి అనుభవమూ ఆఖరి కోరికా అన్నీ తీరాయి. ఇక సొమ్ము రాదు-- వారు రారు."
నా నిర్ణయాన్ని ఉద్దేశ్యాన్ని చెప్పేశాను. ఇంక వారు ఈ ఇంటి గుమ్మం తొక్కుతారనే నమ్మకమూ లేదు.
"అన్నయ్యతో చెబితే" అన్నాను.
"నిజమే. అసలు వాడి ఆచూకే మనకు తెలియదు కదా" అన్నది అక్కయ్య.
రామారావు గారింటికి వెళ్లి చెప్పాను. వారి విషయం లో అయన విసుగెత్తే ఉన్నారు.
"ఆఖరు అస్త్రం ప్రయోగించాడు. ఇక వాడు రాడు. పోనివ్వండి. మీ జీవితానికి శని వదిలి పోయినట్లే. పోతూ పోతూ ఇంకా కసితీరా అవమాన పరిచి వెళ్ళాడు. పీడ వదిలి పోయింది" అన్నారు.
అయన కూడా పోలీసు రిపోర్టు ఇవ్వవద్దనే చెప్పారు. ఇంటికి వచ్చేశాను. ఆ రోజు సాయంత్రం అత్తయ్య వెలికి ఉన్న అరకాసు ఉంగరం అమ్మి అక్కయ్య కు రెండు మంగళ సూత్రాలు కొనితెచ్చాను. తాడు పేనుకుని ఎంతో బాధపడుతూ కన్నీటితో ఆ సూత్రాలను మెళ్ళో కట్టుకున్నది అక్కయ్య.
జీవితంలో అన్ని విధాలా ఓడిపోయిన నేను అక్కయ్య విషయం లో అంతకన్నా ఏం చెయ్యాలో తోచలేదు. నా కళ్ళల్లో నీళ్ళు ఎప్పుడో ఇంకి పోయాయి. ఇంక ఈ కళ్ళల్లో నీళ్ళు రావు.
రెండు రోజులు గడిచాక సాయంత్రం పూట ఆఫీసు నుంచి వస్తున్నాను. బ్రాకెట్ కంపెనీలతో వున్న సంబంధం రెండు బడ్డీ కొట్లు కనిపించాయి. ఆ కొట్ల ముందు పలక మీద ఆరోజు ఓపెనింగ్, క్లోజింగ్ అంకెలు వేసి వుంటయ్యి. ఒక కొట్టు ముందు ఎవ్వరూ లేరు . కొట్లో ఒక నడి వయస్కుడు కూర్చుని ఉన్నాడు. అతన్ని అడిగాను.
"మీకు వాణీనాధం కాని, శ్రావణ కుమార్ గాని తెలుసా" అతనేం కూస్తాడో నని గుండెలు దడదడ లాడినయ్యి అతనూ నావైపు ఎగాదిగా చూసి.
"తెలుసమ్మగారూ వాళ్ళ తో మీకేం పని."
"కాస్త మాట్లాడాలి."
"వాళ్లతోనా , వాళ్ళు అన్నింటికీ తెగించిన వాళ్ళమ్మా. మీరక్కడికి వెళ్ళకూడదు. వెళ్ళారో మళ్ళీ మనిషిలా రారు" నవ్వుతూ చూశాడు.
"తెలుసు. కాని వాళ్లతో మాట్లాడాలి. నేను మాత్రం అలాంటి దాన్ని కాను."
"సరేనమ్మా మీ ఇష్టం. వాళ్ళు బహుశా ఇప్పుడు కల్యాణి లాడ్జింగు లో ఉంటారు."
"ఎక్కడది."
"గుర్తు చెప్పాడు. ఎందుకో మొండి ధైర్యం కలిగింది. రిక్షా ఎక్కి కల్యాణి లాడ్జింగు కు తీసుకు వెళ్ళమన్నాను. పది నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాను. రిక్షా లో కూర్చునే రిక్షా అతన్ని వెళ్ళి వాణీ నాధాన్ని, కాని, శ్రావణ కుమార్ ని కాని ఉంటె పిల్చుకు రమ్మన్నాను. వాడు మేడ మీదికి వెళ్ళాడు. అన్నయ్య మేడ దిగి వచ్చాడు. రిక్షాలో కూర్చున్న నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. బ్రతుకు జీవుడా అనుకున్నాను.
"సుభా. నువ్వా. ఇక్కడి కొచ్చావెందుకూ. డబ్బు కావాలా" అన్నాడు. వాడూ కంగారు పడిపోతున్నాడు.
"ఒక్కసారి ఇప్పుడే ఇంటికి రావాలి" అన్నాను.
"పద. ఓ గంటలో వస్తాను" అని వెంటనే వెళ్ళిపోయాడు. నేనూ రిక్షా లో ఇంటికి చేరాను.
రాత్రి పదింటికి అన్నయ్య వచ్చాడు జరిగిందంతా చెప్పాను.
"అట్లాగా. బావ మా కూటమి లో లేడు. నాకిదంతా తెలీదు. అయినా కనుక్కుని పట్టేస్తాను. ఎక్కడెక్కడ వెతకాలో నాకు తెలుసు. సరే వెళతాను. ఏం చెప్పకుండా అన్నయ్య వెళ్ళిపోయాడు. ఇంట్లో నగలు పోయినట్లు ఇంటి వారికీ వారి ద్వారా చుట్టూ పక్కల వాళ్ళకీ అందరికీ తెల్సింది. ఆ మర్నాడు ఉదయమే ఇంతాయనా. ఇంటావిడా వచ్చి "మా ఇంట్లో ఇటువంటి దొంగతనాలు జరిగినయ్యంటే మాకెంతో చిన్నతనంగా ఉంది. మీరు వారం రోజుల్లో ఇల్లు కాళీ చేసి వెళ్ళండి. మా ఇంట్లో ఉంటానికి వీల్లేదు." అని నిష్కర్షగా చెప్పేశారు.
ఆ పరిస్థితిలో ఏడవాలో, నవ్వాలో కూడా తెలీక నవ్వేశాను.
"అట్లాగేనండీ ఇల్లు కుదరం గానే వెళ్ళిపోతాను." అని చెప్పాను.
మరో రెండు రోజులు గడిచాయి. రాత్రి పన్నెండు దాటింది. తలుపు చప్పుడైంది. అన్నయ్య వచ్చాడేమోనని తలుపు తీశాను.
వారొచ్చారు. ఒక్క ఊపులో ఇంట్లో కొచ్చి తలుపు గడియ పెట్టి నా నోరు మూశారు. "ఎవరే" అంటూ అమ్మ, అత్తయ్య వచ్చారు. బొడ్లో నుంచి కత్తి తీసి చూపించి అందర్నీ నోరు మూసుకో మన్నారు. అందరికీ చెమటలు పట్టినయ్యి. గుడ్ల ప్పగించి కొయ్యబారి పోయారు. మెల్లిగా అన్నారు.
"సుభా. లాభంలేదు. పోలీసులు తరుముకొస్తున్నారు. పారిపోవాలి. ఈ రక్తపు గుడ్డలు ఇక్కడ విడిచేసి మంచి బట్టలు కట్టుకుని పారిపోతాను. నా బట్టల పెట్టె పట్రా " అన్నారు.
బట్టల పెట్టె తెచ్చాను. రక్తం చిమ్మిన ఆ గుడ్డలు విడిచేశారు. తుండు గుడ్డతో వళ్ళంతా తుడ్చు కున్నారు. ఆ రక్తపు గుడ్డలూ, కత్తీ కింద పడేశారు. ఇస్త్రీ గుడ్డలు వేసుకున్నారు.
"ఎవర్ని చంపారు" అన్నాను. నన్ను దగ్గరకు పిల్చి వాళ్ళు ముగ్గురూ వినకుండా చెవిలో రహస్యంగా చెప్పారు.
"మీ అన్నయ్య తో పేచీ వచ్చింది. పొడి చేశాను? లాడ్జి లో చచ్చిపడి ఉన్నాడు." దిమ్మర పోయాను. నేనేం మాట్లాడలేదు. మనస్సు ఖాళీ అయింది. కింద పడేసిన కత్తి మీద నా దృష్టి పడింది వారు వెళ్ళి పోవటానికి లేచారు. వార్ని వెనక్కు తిరగనిచ్చి క్షణం లో కత్తి తీసుకున్నాను. కుడి చేతితో ఆ కత్తిని గట్టిగా పుచ్చుకున్నాను.
వెనక్కు తిరిగి నిల్చున్న వారి చెయ్యి ఎడమ చేత్తో పుచ్చుకున్నాను. వారు ముందుకు తిరిగారు. శక్తి నంతా కూడ గట్టుకుని ఆ కత్తితో గట్టిగా వారి గుండెల్లో పోదిచాను. ఆ కత్తి పిడి వరకూ వారి గుండెల్లో దిగిపోయింది.
"సుభా అంటూ గావుకేక పెట్టి పడిపోయారు. అయిదు నిమిషాల్లో వారి ప్రాణం పోయింది. నా చీరే మీద రక్తం పడింది. కుడి చేతి నిండా రక్తం చిమ్మింది. వారి గావు కేకకు అందరూ వచ్చారు. కొయ్యబారి పోయి చూస్తూ కూర్చున్నాను.
నా కళ్ళలో నీళ్లు రాలేదు. నావి నీళ్లు రాని కళ్ళు
"ఆ విధంగా వారిని నేనే చంపేశాను" అని తన కధ ముగించింది సుభాషిణి.
