రాత్రి ఎనిమిది గంటలకు రామారావు గారు వచ్చారు. జరిగిన విషయాలు చెప్పి ఎక్కడన్నా మూడొందల రూపాయలు అప్పుగా ఇప్పిస్తే నెలకు పాతిక చొప్పున తీరుస్తానని చెప్పాను. లేకపోతె సంసారం గడిచే అవకాశం లేదు. ఆయనా ఎంతో బాధపడి ఎట్లాగయినా వారిని వదిలించుకోమనే సలహా చెప్పారు. "కాని ఇంటికి వచ్చే భర్తను విరోధిగా భావించి ఎట్లా వెళ్ళమనాలి? కోపంలో ఇంటికి రావద్దని గట్టిగా చెప్పినా ఇంట్లోకి వస్తుంటే ఎట్లా వెళ్ళగొట్టాలి ? ఈ రోజుల్లో ముష్టి వాణ్ణి కూడా రోడ్డు మీదికి నెట్టే వేసి తలుపు వేసుకోలేమే? మాటలకు పశుబలం అక్కర్లేదు. చేతితో పనిలేదు. పరిస్థితిని బట్టి ఎన్నో అంటాం. కటువుగా మాట్లాడుతాం. కాని మెడ పట్టి బైటికి గెంటి వెయ్యగలమా? అందులోనూ భర్త మీద చెయ్యి చేసుకుని గెంటి వేస్తె , వారిలో కరుడు గట్టిన ఇన్ని సంవత్సరాల దుర్మార్గమూ మరుగున పడిపోయి నా మనస్తత్వం బయటపడి అందరి దృష్టి లో అనేక రకాలుగా ఆలోచించటానికి ఎంతయినా అవకాశం కలుగుతుంది. సంపాదన లేని భర్తను ఈసడించి వెళ్ళ గొట్టి నేనెవరితోనో కులుకుతున్నాననే నిర్ణయానికి వస్తారు. అందరి దృష్టి లో నేను కులటగా, జారిణిగా మారిపోతాను. సంఘం లో నాకు గౌరవం ఉండదు. భర్తను వెళ్ళగొట్టిన, వన్నెలాడి అంటారు. నాలో వన్నె చిన్నెలు లేకపోయిగా అందరి మనస్సులో నేను పరమ వ్యభిచారిణిగా నిల్చిపోతాను.
"సంఘం నన్నట్లా అర్ధం చేసుకుంటుం'దని చెప్పాను. నా అభిప్రాయాలు ఆ భార్యాభర్తలకు నచ్చాయి. ఎంతో అలోచించి రామారావు అన్నారు. "నువ్వన్నది నిజమే సుభాషిణి, వాణ్ణి మార్చినా, చంపినా ఆ పని భగవంతుడే చెయ్యాలి గాని మనవల్ల కాదు. సరే ఆ మూడు వందల రూపాయలూ వడ్డీ లేకుండా నేనే అప్పుగా ఇస్తాను. నెలకు పాతిక చొప్పున ఒక సంవత్సరం లో తీర్చేయ్యి. నీ పరిస్థితీ నిజాయితీ నాకు తెలుసు కనుకనే ఈ కష్టదశలో ఈ సహాయం చేస్తున్నాను. రేపు ఉదయం ఎనిమిది గంటల తరవాత నేనే బ్యాంకు నుంచి మీ ఇంటికి వచ్చి డబ్బిస్తాను. ఆ నికృష్టుడు ఉంటె తలావాచేట్లు చివాట్లు వేస్తాను." అన్నారు.
కృతజ్ఞత చెప్పి నేనూ రాధా వచ్చేశాం.
ఆ మర్నాడు తొమ్మిది గంటలకు రామారావు గారు వచ్చారు. వారూ ఇంట్లోనే ఉన్నారు. "ఏరోయ్ కుమార్. కులాసా . మళ్ళా ఏదో ఘనకార్యం చేశావుట. నీకు మతి లేదురా. నువ్వు బాగుపడవు సరే ఆ ఇల్లాలిని కూడా నానా అవస్థలు పెడతా వెండుకురా. సర్వ భ్రష్తుడి వవటం కాక భార్య జీతం కూడా కైంకర్యం చెయ్యటం ప్రారంభించావన్న మాట. సిగ్గు లేదురా. ఆ ఇల్లాలు కాబట్టి నువ్వు చేసే ఘాతుక కృత్యాల నన్నింటినీ ఇన్నేళ్ళ నుంచీ సహిస్తున్నది. ఇంకొక అడదయితే చెప్పుతో దేహశుద్ది చేసేది. అమ్మాయి జీతం కూడా నువ్వు తినేస్తే ఇంక సంసారం ఎట్లా గడుస్తుందిరా కుమార్" అన్నారు. జేబులో నుంచి డబ్బు తీసి మూడు వందలూ నా చేతికిచ్చారు.
"నెలకు పాతిక చొప్ప్పున తీర్చే పద్దతి మీద అప్పుగా మూడు వందలూ ఇచ్చాను. నువ్వు ఎట్లాగూ బాగుపడవు. అమ్మాయి మనస్సు ఉసురు పెట్టకు" అన్నారు రామారావు గారు.

"వారు మా ఇద్దరి వైపూ నిశితంగా చూశారు. ఒక విషపు నవ్వు నవ్వి!
"పాపం! సుభాషిణి అంటే ఎంత అపేక్ష. ఆ ఇల్లాలి యందు ఎంత సానుభూతి. మూడు వందలు వడ్డీ లేకుండా నెలకు పాతిక చూప్పున తీర్చే పద్దతి మీద అప్పుగా ఇచ్చావెం. అందుకేనే కామాలు రాత్రి తొమ్మిది దాటాక మీ ఇంటి నుంచి వచ్చింది. మీ సంబంధం ఈ రోజున తెల్సింది. అప్పు కాదు. ప్రియురాలికి సహాయం -- అంతేకదూ" అన్నారు.
"రాస్కెల్ ఏం కూశావురా" అని మితిమీరిన కోపంలో వారి దవడలు వాయగోట్టారు. నాకు స్పృహ తప్పింది . పడిపోయాను.
అమ్మా, అత్తయ్యా ముఖాన నీళ్లు చల్లారు. పది నిమిషాలకు స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి చూశాను. వారు లేరు. అప్పుడే వెళ్ళిపోయారు. రామారావు గారు చాలా బాధపడ్డ్డారు.
"వాడు మనిషి కాదమ్మా. పశువు రాక్షసుడు . ఇటువంటి కిరాతకుణ్ణి ఎక్కడా చూళ్ళేదు." అన్నారు.
కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు. వారం రోజుల వరకూ వారు రాలేదు. రాలేదని మేమూ అనుకోలేదు. పాడయిన వస్తువు బాగు చేయించు కోవచ్చు. అనారోగ్యంగా ఉంటె వైద్యం చేయించు కోవచ్చు. వినే వారికి హితబోధ చేయవచ్చు కాని కుళ్ళి పోయిన పండు తినే తీరుగా పక్వానికి రాదు. ఉంచిన కొద్దీ ఇంకా కుళ్ళి పోతుంది. వాసన, పురుగులు . వారి జీవితం మనస్తత్వం కుళ్ళిపోయిన పండు లాంటిది.
పిల్లలిద్దరూ దడుసుకున్నారు. నేను పుట్టి బుద్దేరిగిన తరువాత స్పృహ తప్పి పడిపోవటం ఇదీ మొదలు.
"అమ్మా , నాన్న పిచ్చి. నువ్వు మంచి. నాన్నకి జిలాయి లు. నాన్నకి అన్నం పెట్టొద్దు. బూచోడి కి పట్టించు." అన్నాడు చిన్నవాడు.
"అమ్మా మా బళ్ళోబ్బాయి నాన్న ఇట్లా చెయ్యడే. అయన దొంగ కాదు. ఉద్యోగం చేస్తాడు. అబ్బాయిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటాడు. నాన్న నన్నెప్పుడూ ముద్దు పెట్టుకోడు. దొంగలు పిల్లల్ని ముద్దు పెట్టుకోరా అమ్మా" అన్నాడు పెద్దవాడు.
నా కడుపు తరుక్కు పోయింది. బాధ పడినా చేసేదేముంది?
పది రోజులు గడిచాక వారొచ్చారు. కొత్త ప్యాంటు, షర్టు , కొత్త బూట్లు ఎంతో దర్జాగా, ఠీవిగా ఉన్నారు. పిల్లలకు బిస్కెట్లూ, చాక్ లేట్లూ తెచ్చారు. రెండు బుట్టల నిండా రకరకాల పళ్ళూ, పూలూ తెచ్చారు. నాకు సిల్కు చీరే, సిల్కు జాకెట్ పీస్ తెచ్చారు. మంచి ట్రిమ్ గా ఉన్నారు.
ఆశ్చర్య పోయాం. రెండో వాణ్ణి ఎత్తుకుని నవ్వుతూ కబుర్లు చెప్పారు. పెద్ద వాడికి చక్కటి స్కూల్ బాగ్ తెచ్చారు. నవ్వుతూ అందర్నీ పలకరించారు. పాత శ్రావణ కుమార్ కాదు. కొత్త మనిషి కొత్త భావాలు.
"ఏమిటండీ ఇందంతా? వీటికి డబ్బెక్కడిది . ఇంతగా మారిపోయారు. ఏమిటి విశేషం."
భయపడుతూనే అడిగాను.
"సుభా. జరిగిందంతా ఒక పీడకల. ఒక పెద్ద కార్ల కంపెనీ లో ఉద్యోగం దొరికింది. రెండు వందల యాభై జీతం. క్యాంపు లుంటాయి. రెండు మసాల జీతం అడ్వాన్సు గా ఇచ్చారు. జరిగిందంతా మర్చిపో. అంతా ఒక పీడకల." అన్నారు.
వారు ఎంతకయినా సమర్ధులు. నేను నమ్మలేదు. మళ్ళీ ఏదో కొత్త ఎత్తు వేసేందుకు ఈ పన్నాగం అనుకున్నాను.
"నన్ను నమ్మలేదు కదూ."
"ఇన్ని నెలలు ఏడిపించిన వారు. ఒక్క పది రోజుల్లో మారిపోతారని ఎట్లా నమ్మమంటారు."
"నిజమే సుభా. నీ పరిస్థితుల్లో నేను ఉన్నా అంతే. కాని ఇది యదార్ధం. మన జీవితంలో చెడు రోజులు తొలగి పొయ్యాయి. కోరికలు కొత్త శక్తులతో విరబూస్తయ్యి. బంగారు కలలు కంటాము. పాత భావాలూ, ఉద్దేశ్యాలు ఏమీ లేవు. నా బుద్దికి గ్రహణం పట్టింది. ఇప్పుడు గ్రహణం విడిచింది. కొత్త భావాలతో, కొత్త కోరికలతో నూతన దంపతుల్లా ఏకం కావాలి." అని కొంటెగా నా వైపు చూశారు.
వారు కోరినట్లుగా ఆ సిల్కు చీరే కట్టుకున్నాను. ఇన్ని పూలూ తల్లో తురుముకున్నా. పిల్లలు అమితానందంతో చాక్ లేట్లూ, బిస్కెట్లూ తిన్నారు.
ఆ రాత్రి మొదటి రాత్రి లా గడిపాము.
