Next Page 
లోకం పోకడ పేజి 1

       
                               లోకం పోకడ
                                                     'హరి కిషన్'
                                      బోడపాటి దమయంతి

                             


    కౌసల్యా సుప్రజారామ
    పూర్వ సంధ్యా ప్రవర్తతే,
    ఉత్తిష్ఠ నరశార్దూల
    కర్తవ్యం దైవ మాహ్నికమ్!

    తెల్లావారు ఝామున లేచి రామయ్య గారు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చదువుతున్నారు. అప్పటికి నాలుగున్నర యింది. ఆయనకు ప్రతి రోజూ అదే వేళకు లేచి సుప్రభాతం చదవటం అలవాటు. ఆ వేళకు అయన తప్ప ఇంట్లో ఎవ్వరూ నిద్ర లెవరు. కాని ఆరోజున కొడుకు సురేంద్ర కూడా నిద్రలేచాడు. ప్రతి రోజూ ఆ వేళకు గాడ నిద్రలో ఉండే ఏకైక పుత్రుడు సురేంద్ర తనతో బాటు నిద్రలేచేసరికి ఆయనకు ఆశ్చర్యం కలిగింది. సురేంద్ర మెల్లిగా తండ్రి దగ్గరికి వచ్చాడు.
    "ఏం బాబూ! నువ్వూ నిద్రలేచావ్" అన్నాడు ఆప్యాయంగా.
    "ఇవ్వాళ స్కూలు ఫైనలు పరీక్షలు తెలుస్తయిగా? పేపరు చూట్టానికి స్టేషను కు వెళ్ళాలి. మెయిలోచ్చే వేళయింది" అన్నాడు సురేంద్ర.
    రామయ్య గారికి అమితానందం కలిగింది. సరే వెళ్ళ మన్నారు. కాని 'చీకట్లో ఆవేళప్పుడు వెళ్ళకపొతే తెల్లవారితే పేపరు రాదా?' అందామను కున్నాడు. కాని ఆయనకూ ఆదుర్దాగానే ఉంది. పరీక్షా ఫలితాలు తెలుసుకోవటానికి . అందుచేత ఏమీ అనలేక పోయాడు. సరేనన్నట్లుగా తల ఊపాడు. సురేంద్ర కదల్లేదు.
    "చీకట్లో పోలేను. పాలేర్ను తీసుకు వెళతా."
    "అదా నీ భయం! సరే."
    పాలేరు వెంకయ్య ను లేపి వాడితో పంపాడు సురేంద్ర ను. పాలేరు కళ్ళు నులుముకుంటూ లాంతరు తీసుకుని బయల్దేరాడు. వెనకాల పుట్టెడు ఆదుర్దాతో నడవ సాగాడు సురేంద్ర.
    ఈ ప్రపంచం లో రకరకాల పెక్కు తరహాల వ్యక్తులున్నారు. కొందరు డబ్బు పుష్కలంగా ఉన్నా స్వతహాగా అలోచించి ఏ పనీ చెయ్యలేరు. వారి జీవితాల్లో జ్యోతిని వెలిగించటానికి మరొకరు  కావాలి. కొంతమంది డబ్బు లేకపోయినా అంతా తమతోనే ఉందనుకొని పాకులాడుతారు. కొంత మంది డబ్బున్నా, తమకు తోచకపోయినా ఎవరయినా చెప్పినప్పటికీ అర్ధం చేసుకోలేరు. ఈ రకమైన తరహ కు చెందినవారే ఈ తండ్రి కొడుకులు.
    మెయిలు అయిదున్నర కు ఆ ఊరు స్టేషను కు వచ్చింది. అప్పటికే చాలా మంది విద్యార్ధులు వచ్చారు. సురేంద్ర ను ఎవ్వరూ పలకరించ లేదు. సురేంద్ర కూడా ఎవర్నీ పలకరించలేదు. పాలేరు దీపం తగ్గించి ఒక పక్కన కూర్చున్నాడు. చుట్ట కాలుస్తూ. మెయిలు రాగానే  పేపర్ల కట్టలు స్టేషను లో దిగినవి. ఎవరి ఆదుర్దా వాళ్ళది. విద్యార్ధులంతా పేపర్ల చుట్టూ మూగారు. అంతా తలో పేపరూ కొన్నారు. పాసయిన వాళ్ళూ సంతోషంతో గంతులు వేశారు. తప్పిన వాళ్ళు దిగులు పడ్డారు. అన్ని భావాలూ, అన్ని అనుభూతులూ, అన్ని ఆలోచనలూ అప్పుడే. విద్యార్ధుల మనస్తత్వాలు తారాజువ్వల్లాంటివి . రివ్వున పైకి పోతాయి. సురేంద్ర ఆ గుంపులో పేపరు కొనలేక పోయాడు. కాని ఎవ్వరినీ తన నంబరు సంగతి అడగలేదు. అంతా సద్దు మణిగిన తరవాత తనూ వెళ్లి ఓ పేపరు కొన్నాడు. ఆదుర్దాగా చూశాడు. తన నెంబరు పడింది. పాసయి నాడు. సురేంద్ర ఆనందంతో గంతులు వెయ్యలేదు. ముభావకంగానే ఉన్నాడు. ఇది చూచి పాలేరు ---------
    "అబ్బాయి గోరూ , ఏందీ కత?' అన్నాడు.
    "ప్యాసయినానురా" అన్నాడు సురేంద్ర.
    "వెర్రి గుడ్. ఏది ఓ అణా పారెయ్, పుగాక్కాడ కొనుక్కుంటా " అన్నాడు సురేంద్ర వాడికి అణా యిచ్చి యింటికి బయల్దేరాడు.
    ఇంటికి రాగానే తండ్రి ఆదుర్దాగా అడిగాడు -- "పాసయావురా?" అని. తల్లి వరలక్ష్మీ కూడా గొడ్ల సావిట్లో నుంచి పాల చెంబు తో వస్తూ, "పాసయినవురా బాబూ?" అన్నది ఎంతో ఆదుర్దాగా.
    "పసయినాను" అన్నాడు సురేంద్ర.ముభావంగానే. పేపరు తండ్రి కిచ్చాడు. ఆయనా నంబరు చూసి ఎంతో సంతోషించాడు. తల్లి ఎంతో ఆనంద పడ్డది. సురేంద్ర మాత్రం అదో మాదిరి గానే ఉన్నాడు.
    "పాసయినావన్న సంతోషమైనా కనబడదేం రా నీలో?........" అన్నాడు తండ్రి.
    "పొరుగూరు పోయి కాలేజీ లో చదవాలి గా నాన్నా?' అన్నాడు సురేంద్ర.
    "అదా నీ దిగులు!" అన్నది తల్లి నవ్వుతూ.
    పాసయిన స్నేహితులంతా వచ్చి సురేంద్ర ను ఏం చేస్తావనీ, ఎక్కడ చదువుతావనీ, ఏ గ్రూపు తీసుకుంటా వనీ అడగసాగారు. సురేంద్ర ఏమీ చెప్పలేదు. "మా నాన్న ఇష్టం" అన్నాడు. కుర్రాళ్ళంతా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. అంతా వెళ్ళాక సురేంద్ర మెల్లిగా తండ్రి దగ్గరికి వచ్చాడు.
    "కాలేజీ లో చదవ మన్నావా నాన్నా?"
    "ఏం? ఇంతటి తోనే మానేద్దా మనుకున్నావా?"
    "అది కాదు. గుంటూరు పోవాలిగా?"
    "పొదువు గాని. ఈ ఊర్నుంచి నలుగురయిదుగురు వెళతారుగా? వాళ్ళతో బాటుగా నువ్వూ గుంటూరు పోయి చదువుకో."
    "వాళ్ళెవ్వరూ నాతొ కలవరు. వాళ్ళంతా చదువుల కన్నా ఆటల్లోన్నే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అయిత బి.ఏ వరకూ చదువుకోవాలిగా?"
    "ఏం చదవవా? చెప్పించే వాణ్ణి నే ఉండగా చదువుకోటానికి భయపడతావెం?"
    "భయమెం లేదు. చదువుకుంటాను. గుంటూరులో కాలేజీ లోనే చేర్తాను."
    తండ్రి సంతోషించాడు. కాని సురేంద్ర మనస్సులోని దిగులు వదల్లేదు.
    సురేంద్ర కు ఈ కాలపు కుర్రవాళ్ళ మాదిరి తెలివి తేటలు లేవు. అతనికి స్నేహితులనే వాళ్ళు ఎవరూ లేరు. ఎవ్వరితో నూ ఆప్యాయంగా మనసిచ్చి మాట్లాడడు. అతని ప్రకృతే వేరు. ఎప్పుడూ ఒక్కడే కూర్చుని ఏదో ఆలోచిస్తాడు. లేకపోతె ఒకటే చదువు. స్కూలు ఫైనలు వరకూ చదివినా అతని పదహారేళ్ళ జీవితం లోనూ స్నేహితులని చెప్పుకోదగిన వాళ్ళెవరూ లేరు. అందరితోనూ మాట్లాడుతాడు. కాని మాట్లాడినా అ మాటల్లో ఆప్యాయత గానీ, స్నేహసౌశీల్యం గాని, కుర్ర తనపు చిలిపితనం గాని, చదువుకునే కుర్రాళ్ళ గడసరి తనం గాని ఉండవు. అతనికి ఎవరూ స్నేహితులూ లేరు. విరోధులు లేరు.
    ఇలాంటి సురేంద్ర ను గుంటూరు లో రామయ్య గారు కాలేజీ లో చేర్చాడు. హాస్టల్లో సీటు దొరకలేదు . హోటల్లో చేరాడు. గది అద్దె పదిహేను రూపాయలు. వాళ్ళ ఊళ్ళో తనతో బాటు చదువుకున్న విద్యార్ధులు ఇద్దరు ముగ్గురు గుంటూరు లోనే కాలేజీ లో చేరినా ఎవ్వరూ అతన్ని తమతో బాటు గదిలో ఉంచటానికి అంగీకరించలేదు. సురేంద్ర పద్దతి ఎవ్వరికీ నచ్చలేదు.  రామయ్య గారే ఎట్లాగో వాకబు చేసి ప్రసాద పురం వస్తావ్యుడూ , ఇంటరు రెండో సంవత్సరం చదువుతున్న వాడూ ఆయిన రమేష్ ను మంచి చేసుకుని సురేంద్ర కు జత చేసి ఇద్దరినీ సురేంద్ర గదిలో ఉంచాడు. ఇద్దరూ ఒకే హోటలు.
    సురేంద్ర కు కావలసిన సదుపాయాలన్నీ చేసి తండ్రి వెళ్ళిపోయాడు. తండ్రి వెళ్లి పోతుంటే సురేంద్ర కు కళ్ళలో నీళ్ళు తిరిగినవి.
    ఇట్లాంటి మనస్తత్వం గల సురేంద్ర ఒక్క సారిగా గుంటూరు పట్టణ వాతావరణా నికి అలవాటు పడవలసి వచ్చింది. ఆడది తిరిగి చెడ్డది, మగవాడు తిరక్క చెడ్డాడు అన్న సామెత గా అయింది సురేంద్ర పని. అతను పుట్టి బుద్దేరిగిన తరవాత హోటల్లో ఎక్కువగా ఎప్పుడూ భోజనం చెయ్యలేదు. ఆ కూరలూ, పచ్చళ్ళూ , సాంబారూ అతనికేం నచ్చలేదు. ఇంటి దగ్గర యితే కావలసినవి చేయించుకుని తినచ్చు. కాని హోటళ్ళ లో వాళ్ళు పెట్టిన తిండి తినవలసిందే. ఈ హోటలు తిండి తోనే అతని మనస్సులో ఆందోళన ప్రారంభమయింది.
    కాలేజీ లో చేరి పదిహేను రోజులైనా ఒక్క రమేష్ తో మినహా ఎవ్వరితో నూ మాట్లాడటం లేదు. విద్యార్ధుల్లో అనేక రకాల  మనస్తత్వాలు కలవాళ్ళు ఉంటారు.  కొంతమంది ఉన్నదాంట్లో నే, తల్లి తండ్రులు పంపే డబ్బుతోనే అన్ని వసతులూ ఏర్పరచు కుంటారు. లేమిని బయటికి పోక్కనివ్వరు. కొంతమంది కి ఎంత డబ్బు ఉన్నా రాణింపుకు రాదు. వాళ్ళ సిగరెట్ల కూ, సినిమాలకూ, కాఫీ హోటళ్ళ కూ, వినోదాల కూ ఎంత డబ్బూ చాలదు. డాబూ, దర్పం ఎక్కువ.
    రమేష్ ఇట్లాంటి రెండో తరహ కు చెందిన వాడు. రమేష్ తండ్రి కొద్ది పాటి స్థితి మంతుడు. అన్ని విషయాలూ తెలిసినవాడు. కొడుకు ఏం యిబ్బంది పడతాడో, నలుగురి లోనూ ఏం నొచ్చు కుంటాడో నని అయన రమేష్ అడిగినంత డబ్బూ ఇచ్చేవాడు. కాని ఎక్కడి డబ్బూ రమేష్ కు 'ప'కార త్రయానికే చాలేది కాదు.
    'స'కార త్రయమంటే తెలుసుకోవాలి. స్నేహితులు, సినిమాలు, సిగరెట్లు -- ఈ మూడు 'స' కార త్రయంగా చలామణి అవుతున్నాయి.
    అలాంటి మనస్తత్వం కల సురేంద్ర, ఇలాంటి మనస్తత్వం గల రమేష్ ను అడిగాడు ----ఎలాంటి బట్టలు కుట్టించు కుంటే బాగుటుందని.
    పలకరించటం తరువాయి రమేష్ తన ఉపన్యాసం మొదలు పెట్టాడు.
    "బ్రదర్ , అసలీ మానవజాతికి ఒక రకమైన శాపం ఉంది. తృప్తి అనేదే ఏ కోశానా ఉండకూడదు. అదే అన్నింటికీ మించిన పెద్ద శాపం. అసంతృప్తి అనే ఉంపుడు కత్తే ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది."
    సురేంద్ర కు ఈ మాటలెం అర్ధం కాలేదు.
    "నువ్వన్నది నాకేం తెలీటం లేదు. రమేష్, నాక్కావలసింది ప్యాంట్లు, కుట్టించుకొవటం ఆ విషయం చెప్పు. బజారు పోదామా?" అన్నాడు.
    "ఏమాత్రం డబ్బుంది?"
    "ఏభై రూపాయలు న్నాయి . నాలుగు ప్యాంట్లు రావూ?"
    "భేషుగ్గా వస్తయ్యి, పద."
    ఇద్దరూ బట్టల కొట్టుకు వెళ్ళారు. సురేంద్ర నచ్చిన పాంటు గుడ్డలు కొని టేయిలరు కు ఇచ్చారు. నాలుగో రోజుకల్లా కుట్టిన పాంట్లు వచ్చినవి. సురేంద్ర సంతోషానికి మేరలేదు. అతని పరిస్థితి కి నవ్వు వచ్చింది రమేష్ కు.
    "హోటలు భోజనం బావుండటం లేదు. మనం చెప్పింది చెయ్యరా?' అన్నాడు సురేంద్ర.
    "కాఫీ హోటలు కు, భోజన హోటలు కు ఒక్కటే తేడా. ముందు డబ్బిచ్చి టిక్కెట్టు  కొనుక్కుని పెట్టింది తిని రావాలి. భోజనం విషయంలో.   మన యిష్టం ఎంచుకొని ఫలహారం చేసి వచ్చేటప్పుడు డబ్బిచ్చి రావాలి కాఫీ హోటల్లో" అన్నాడు రమేష్.
    సురేంద్ర మరి మాట్లాడలేదు.


Next Page 

WRITERS
PUBLICATIONS