Previous Page
నీళ్ళు రాని కళ్ళు పేజి 30


                                        17


    కేసు వాయిదా పడింది.
    ఆరోజున సుభాషిణి తో మాట్లాడి వెళ్ళిన వాణీనాధం నేరుగా తన లాడ్జింగు కు వెళ్ళాడు. శ్రావణ కుమార్ ఎక్కడున్నాడని అనుచరులను అడిగాడు. ఫలాని లాడ్జింగ్ లో ఉన్నాడనీ, కాకినాడ నుంచి రామకుమారిని తీసుకు వచ్చాడనీ చెప్పారు. రామకుమారి ఎవరో వాణినధానికి బాగా తెల్సు. అందరి కన్నా సామర్ధ్యంతో పది రూపాయలు ఎక్కువ రాబట్టుకోగల దిట్ట.
    వాణీనాధానికి ఈ లాడ్జింగ్ లూ, అందులోని వ్యక్తులూ తెల్సు కనుక వెంటనే అక్కడికి వెళ్ళి వాకబు చేశాడు. రామకుమారితో ఫలాని గదిలో ఉన్నాడని చెప్పారు.
    గది తలుపు తట్టాడు. రెండు నిమిషాలు గడిచాక తలుపు తీశాడు శ్రావణ కుమార్. లోపలికి వెళ్ళి గడియ పెట్టాడు వాణీనాధం. ఆ ఇద్దరూ తాగిన నిషాలో ఉన్నారు. వంటి మీద బట్టలేని రామకుమారి దుప్పటి ముసుగు పెట్టింది. వాణీనాధం కుర్చీలో కూర్చుని సిగరెట్ వెలిగించాడు. ఇట్లా రావడంతో శ్రావణ కుమార్ కి వళ్ళు మండి పోయింది.
    "సభ్యత తెలుసుకోకుండా వచ్చావ్" ఉడికిపోతూ అన్నాడు శ్రావణ కుమార్.
    "లాడ్జింగ్ సభ్యతలు నాకన్న నీకెక్కువ తెలీవు. సరే కాని, నీ దగ్గర చంద్రహారం పుస్తెల తాడు, గొలుసు, గాజులు ఉండాలి. వాటిని ఎక్కడ దాచావ్."
    "నాకు తెలీదు. అసలవి ఎవరి నగలో నాకేం తెల్సు. నీకు తెలుసా బ్రదర్ ఇన్ లా" కైపు లో అన్నాడు శ్రావణ కుమార్.
    "ఓహో ఎవరి నగలో కూడా తెలీదెం. మత్తు మందు వాసన చూపించి నీ భార్య మెళ్ళో కాజేసిన నగలు, మా అక్కయ్య మెళ్ళో కాజేసిన నగలు, ఏం ఇప్పటికయినా తెల్సిందా." కుర్చీలోంచి లేచి అన్నాడు వాణీనాధం.'    
    "అట్లాగా. వాళ్లవా తెచ్చాను. నీకేం వాళ్ళు నా భార్య, వదినే. ఆ నగల మీద నాకు బోలెడంత హక్కుంది. నీ కెందుకూ. గెటవుట్," తూలుతూ అన్నాడు శ్రావణ కుమార్.
    వాణీనాధం మాట్లాడకుండా వెళ్ళి రామకుమారి కప్పుకున్న దుప్పటి లాగేశాడు. అమ్మాయి మెళ్ళో గోలుసుంది. చేతులకు గాజులున్నాయి. రామకుమారి వణికిపోతూ చీరే కట్టుకుంది.
    "ఏయ్, ఆ నగల్ని ఇచ్చేయ్." గద్దించాడు . వాణీ నాధం సంగతి రామకుమారి కి తెల్సు. అయినా మొరాయించింది.
    "ఇవ్వవూ" ఇవ్వనని తలూపింది.
    "నేనే తీసుకుంటాను" ఒక్క నిమిషం లో మెళ్ళో గొలుసు, చేతుల కున్న గాజులూ తీసుకున్నాడు.
    "ఏయ్ ఎవడ్రా నువ్వు ఆడదాని మెళ్ళో సొమ్ములు కాచేస్తావ్. బుద్ది లేదూ" అని వాణీనాధం రెక్క పుచ్చుకున్నాడు శ్రావణ కుమార్. అతను విదిలించుకుని "ఇవాళకి ఇవి దక్కాయి. రేపు మర్యాదగా చంద్రహారం , పుస్తెల తాడు పట్రా" అని ఆ నగల్ని తీసుకుని వెళ్లి పోయాడు వాణీ నాధం.
    "రాస్కెల్ , వీడి అంతు చూస్తాను" అని పళ్ళు కొరికాడు శ్రావణ కుమార్.
    రెండు రోజులు గడిచాయి. రాత్రి పదకొండు దాటింది. లాడ్జి లో ఒక గదిలో లెక్కలు రాస్తున్నాడు వాణీ నాధం. ఒరవాకిలిగా వేసి ఉన్న తలుపు నెట్టి లోపలికి వెళ్ళి గడియ పెట్టాడు శ్రావణ కుమార్.
    "అ నగలు ఇస్తావా లేదా " అన్నాడు.
    "ఏ నగలు." లెక్క పుస్తకం మూసేసి లేచి నిల్చున్నాడు వాణీ నాధం."
    "ఏ నగలో నీకు తెలియదూ?"
    "ఇద్దరికీ తెల్సు. కాని బావా నువ్వు చేసింది చాలా తెలివి తక్కువ పని. ఆఖరికి నీకు దొరికింది నీ భార్య మెళ్ళో నగలా, నీ వదినే గారి మెళ్ళో నగలూనా? వాళ్ళు గోడు గోడున ఏడుస్తున్నారు బావా, వాళ్ళ నగలు వాళ్ళకి ఇచ్చేయ్. బావా, నా మాట విని' ప్రాధేయ పడుతూ అడిగాడు వాణీ నాధం.
    "బావ . ఈ వ్యవహారాల్లో బంధుత్వాలకు తావు లేదు. మర్యాదగా ఇచ్చేయ్" జేబులోంచి కత్తీ తీశాడు శ్రావణ కుమార్.
    "ఆ నగలు ఇస్తావా లేదా" కత్తి గట్టిగా పట్టుకున్నాడు శ్రావణ కుమార్.
    "ఇవ్వను. మర్యాదగా ఆ నగలూ ఇచ్చేస్తే, వాటిని తీసుకు వెళ్ళి సుభాషిణి కి సునంద కూ ఇస్తాను. వాళ్ళెంతో సంతోషిస్తారు. నువ్వే పుస్తెల తాడూ, చంద్రహారం తెచ్చివ్వు బావా. ఇవి చేతులు కావు. కాళ్ళు పట్టుకుని బ్రతిమాలు తున్నాను" అని శ్రావణ కుమార్ కాళ్ళు పట్టుకున్నాడు వాణీ నాధం. అతన్ని అట్లాగే వెల్లకిలా పడేసి బలంగా రెండు చోట్ల గుండెల్లో పొడిచాడు శ్రావణ కుమార్.
    లాడ్జి లో ఈ గది మేడ మీద మెట్ల పక్కన ఉన్నది. ఆ కత్తి జేబులో ఉంచుకుని గబగబా మెట్లు దిగి వడివడిగా నడుస్తూ ఇంటికి చేరాడు శ్రావణ కుమార్. అతనికి ఏం తోచలేదు. ఆ రక్తపు గుడ్డలు కత్తీ ఇంట్లో ఉంచేసి మంచి బట్టలు వేసుకుని ఎక్కడికో పారిపోవాలని శ్రావణ కుమార్ ఉద్దేశ్యం.
    కాని హంతకుడైన తన భర్తను ఆ కత్తితోనే పొడిచి చంపి తను హంతకురాలుగా నిల్చిపోయింది సుభాషిణి.
    ఆ రాత్రే సుభాషిణి తన భర్తను  కత్తితో పొడిచి చంపిందని చుట్టుపక్కల వాళ్ళందరకూ తెల్సి పోయింది. శ్రావణ కుమార్ ని అరెస్టు చెయ్యటానికి వచ్చిన పోలీసులు అతని శవాన్ని చూసి ఆ పరిస్థితిలో ఉన్న సుభాషిణి ని అరెస్టు చేశారు.
    తెల్లవారే సరికి ఈ వార్త ఊరంతా తెల్సిపోయింది. అందరూ విభ్రాంతి తో శవాన్ని చూశారు.
    "ఎంత దుర్మార్గుడైనా కత్తితో భర్తను పొడిచి చంపిందా-- ఆ ఇల్లాలు" అని ఎంతో ఆశ్చర్యపోయారు. సుభాషిణి సంగతి తెల్సిన వారంతా. తెలియని వాళ్ళు మరోలా అనుకున్నారు. ఆసమయంలో ఎవరి భావాలు వాళ్ళవి. ఎవరి విమర్శలు వాళ్ళవి.
    ఆ దృశ్యం చూడలేక సుభాషిణి తల్లి , శ్రావణ కుమార్ పినతల్లీ పడిపోయారు. ఆ చుట్టూ పక్కల వాళ్ళంతా విభ్రాంతి తో చూసి గుండె పగిలి కొందరు ఏడ్చారు. రాధ వచ్చింది. రాధ తల్లి పిల్లలూ వచ్చారు. రామారావు భార్యా వచ్చారు. ఆ వార్తా తెలిసిన ఆఫీసు వాళ్ళంతా ఆ అర్ధరాత్రే వచ్చారు. అందరి గుండెలూ ఆందోళన తో కొట్టుకో సాగాయి. సునంద ఏడుస్తూ ఇద్దరి పిల్లల్నీ వళ్ళో పెట్టుకుని కూర్చున్నది. పిల్లలిద్దరూ ఆ దృశ్యాన్ని చూసి భయపడి ఏడుస్తూ కళ్ళు మూసుకుని పడున్నారు.
    ఒక సబిన్ స్పెక్టర్, నలుగురు కానిస్టేబుల్స్ వచ్చారు.
    సుభాషిణి స్తబ్దురాలై గుండె రాయి కాగా భర్త గుండెల్లో దిగబడి వున్న ఆ కత్తి వైపు చూస్తూ నిల్చున్నది. ఆ కళ్ళల్లో నీళ్ళు లేవు. కన్నీరు ఎప్పుడో ఎండి పోయింది. అవి నీళ్ళు రాని కళ్ళు.
    సబీన్ స్పెక్టరు పోలీసు స్టేషన్ కు నడవమన్నాడు. సుభాషిణి శ్రావణ కుమార్ శవం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేసి నమస్కరించింది. సునంద తో అన్నది.
    "నీ కాపురం బాగుపడుతుంది అక్కయ్యా. ఈ ఇద్దరు పిల్లలూ మా పిల్లలు. కాని ఇక నుంచీ వాళ్ళను పెంచవలసినది మీ భార్య భర్తలు."
    అని పోలీసుల మధ్య నిల్చుని వీధిలోకి నడిచి పోలీసు వేన్ లో ఎక్కి కూర్చున్నది.
    రాధ కాకినాడ వెళ్ళి ఈ సంగతి అంతా చెప్పి ఆనందరావు ను తీసుకు వచ్చింది.

                                                      *    *    *    *
    రెండు రోజులు కోర్టు లో తన కధను చెప్పింది సుభాషిణి అన్ని జతల కళ్ళూ చమర్చాయి.
    మూడవ వాయిదా రోజున కూడా కోర్టు హల్లో అందరూ చేరారు.
    బోనులో నిల్చున్న సుభాషిణి మళ్ళీ చెప్పసాగింది.
    "సుభాషిణిగా, ముద్దాయిగా నేను చెప్పిన యదార్ధ విషయాలన్నీ విన్నారు. నేను దోషిననీ, హంతకురాలిననీ నేనే వప్పుకున్నాను. నాకు శిక్ష విధించమని సవినయంగా ప్రార్ధిస్తున్నాను. నా కేసులో తీర్పు యివ్వటం కూడా న్యాయ మూర్తికి తేలిక. కాని అది ప్రధానం కాదు.
    "ఈ సంఘంలో నాలాంటి హంతకులు లేకపోలేదు. ఉన్నారు. కాని వారంతా పురుషులు. ఈ పవిత్ర భారతదేశంలో హైందవ కుటుంబంలో వంశ మర్యాదలు గల గౌరవ కుటుంబంలో పుట్టి, ఇల్లాలుగా కాపురం చేసి, ఇద్దరు బిడ్డల తల్లినై ఉండి పెళ్ళాడిన భర్తను దారుణంగా హత్య చేశానంటే అందుకు బాధ్యులెవరు? నా బోటి ఇల్లాండ్ర జీవితం ఎంత దుర్బరంగా  ఉన్నదో ఆలోచించండి. ఈదుర్బర పరిస్థితి నుంచి ఎంతో మంది స్త్రీలు బైట పడలేక సతమతమై తమ ప్రాణాల్ని తీసుకుంటూన్నారే కాని ఈ నగ్న సత్యాన్ని వేలెత్తి చూపరేం? అందుకు కారణం ఈ మగవారి మనస్తత్వం.
    "నాకు శిక్ష పడుతుందని నేను విచారించటం లేదు . నా పరిస్థితి అర్ధం చేసుకున్న ఈ కోర్టు హాల్లోని జనమంతా తమ సంసార జీవితాల్లో నా భర్తలా ప్రవర్తించకుండా తమ కాపురాల్ని తీర్చు దిద్దుకుంటే నా జీవితాన్ని సవ్యంగా అర్ధం చేసుకుని ఈ హంతకురాలి మీద మీరు జాలి కనబర్చినట్లే నా ఆత్మ శాంతికి కావలసింది నాలాంటి అభాగినులు ఈ సంఘం లో క్రమీపీ తగ్గిపోవటమే. అందుకు తగిన వాతావరణం ఆ భర్తలు కలిగించాలి.
    "అదే ఈ జీవితంలో ఈ ఆఖరు క్షణం లో నాకు కలిగే ఆత్మ శాంతి" అన్నది ముద్దాయి సుభాషిణి.
    అందరితో పాటు న్యాయమూర్తి కూడా కళ్ళు తుడుచుకున్నాడు.
    తీర్పుని మర్నాటి కి వాయిదా వేశాడు న్యాయమూర్తి.

                                  (సమాప్తం)


 Previous Page

WRITERS
PUBLICATIONS