సూర్యం శరీరం గగుర్పాటు చెందింది. ఏమిటీ సంబంధాలు? తనవేపు చూస్తె యింతమందికి యింత అభిమానా లెందుకు పుట్టుకోస్తున్నాయ్? తన ముఖంలో వుండే వెలుగా? తన కళ్ళల్లో తళుకా? ఇందరిని ఆకర్షించేది ఏమిటి? తనలో ప్రత్యేకత యేమిటి? బహుశః యెదుటి వాళ్ళని నొప్పించలేని తన మనస్తత్వమా?
తిరిగి వచ్చి పరుపు మీద పడినా ఏదో పెద్ద బరువు తన మీద పడినట్లయింది. తన దగ్గరే ఆసుపత్రి లో డబ్బు వుంచటం మంచిది కాదు. ఆ మరుసటి రోజునే తన యింటికి పంపించి జాగ్రత్తగా వుంచాలను కున్నాడు. శెట్టి గారి జీవితం లోని ఘట్టాలు ఆలోచిస్తూనే నిద్దర పోయాడు. ఉదయం లేచేసరికి సాధారణంగా దగ్గర వుండే శ్రీనివాస్ లేడు. అతను యింకా పరుపు మీదనే వున్నాడు. లేచి దగ్గరకు వెళ్లేసరికి శ్రీనివాస్ సిగరెట్ ముట్టించాడు. ముఖంలో నీరసం స్పుష్టంగా కనిపిస్తోంది. ఈ కొద్ది రోజులకే మనిషి బాగా నీరసించి పోయాడు.
'ఇదివరకు కంటే నొప్పి హెచ్చయింది.'
'ఇదివరకు నొప్పి వున్నట్లు చెప్పలేదే! ఎక్కడ?'
'ఎడమ వేపు గూడు లో -- ఆ లోపల ఏదో చీముతో నిండిన పుండు వున్నట్టు దిగ్గుట్లుపెట్తోంది. ఈ భాగం అంతా లాగుతోంది. రాత్రి తెలివోచ్చినప్పుడల్లా యమ బాధగా వుంది.'
'ఈ వేళ రిపోర్టు వస్తుందిగా. అదేంటో తెలుసుకుని ట్రీట్ మెంట్ చేస్తారు.'
'ఇంకా అనుమానాలు రావని చెప్పలేం. ఇంకో వారం రోజులు కూర్చో బెట్టి మరో పరీక్ష చేస్తారు.'
'కారణం లేకుండా చెయ్యరని పిస్తోంది. శెట్టి గారికి యిన్నాళ్ళు ఆపరేషను చెయ్యకుండా వుంచారంటే కారణం లేదంటారా?'
'కారణం వుంది లెండి. ఇంకో చావు యీ వార్డు లో తటస్థిస్తే అతను పిరికితోనే చచ్చిపోతాడు.'
'వైరాగ్యం వచ్చి అతని పిరికి పోకూడదా? అతనికి వున్న షుగర్ కంప్లయింట్ కంట్రోలు చేస్తున్నారు . అలానే మీ విషయంలో ఆలస్యానికి కారణం వుంటుంది.'
'వాళ్ళ పని లాభం లేదు లెండి. మనరాత. అందులో నారాత తోలి నుంచి బ్రహ్మండంగా వుంది.'
'ఇంత ధైర్యం చెప్పేవారు మీరే యిలా విసుక్కుంటే యెలా?'
'అబ్బబ్బే-- అధైర్య పడలేదు. ఆమధ్య డయాఫ్రం కాస్త పైకి పోయిందన్నారు. తరవాత యింకేదో అన్నారు. ఇప్పుడు రాత్రుళ్ళు జ్వరం రావటంతో యింకేదో అనుమాన పడ్తున్నారు. ఈవేళ యింకా జ్వరం వుంది. ఇంకేం అనుమాన పడ్తారో?'
శ్రీనివాస్ యింతకాలం యిక్కడ వుండటం వలన విసిగి వేసారి యిలా అంటున్నాడని సూర్యం అనుకున్నాడు. తనే అతని పరిస్థితిలో వుంటే తల దిమ్మెక్కి పోయేది. ఈసురోమని వుండేవాడు. కాలకృత్యాలు తీర్చుకుని వచ్చేసరికి శ్రీనివాస్ యింకా సిగరెట్ కాల్చుతున్నాడు.
'తెల్లారి లేచాక యిది యెన్నోది?'
"ఐదు'
సూర్యం దగ్గరగా స్టూలు మీద కూర్చొని అతని చేతిలో సిగరెట్ అందుకో బోతుంటే.
'ఈ కాల్చటం వల్ల వచ్చిన తృప్తి నైనా అనుభవించనివ్వండి.'
'ఆరోగ్యం నయం అయ్యాక రోజంతా కాల్చండి.
ఇప్పుడిలా గూడ్సు బండి పొగలా కాల్చనివ్వను.'
'ఆ పొగ వదిల్తే కదా శక్తి నిస్తుంది. ఇదిగోండి ఈ సిగరెట్ పూర్తయే లోగా యీ అలవాటు యెలా అబ్బిందో చెప్పేస్తాను.'
'సరే! చెప్పండి. ఐదవ ఫారం లో నుండగా యోగి పుంగవుని కలుసుకున్నారు.'
ఆ యోగి గురించి యెత్తగానే శ్రీనివాస్ ముఖంలో చిరునగవు వెలిగింది. పరుపు మీదే కూర్చో బోయాడు.
'వద్దు అలా పడుకునే చెప్పండి.'
శ్రీనివాస్ అలా పరుపు మీద నుండే తన గాధ మెల్లగా చెప్పసాగాడు.
'నేను యీ లోకంలో ఒంటరి వాడిని కాదన్న ధైర్యాన్ని ఆ సాధువు పరిచయం నాకిచ్చింది. చదువుతూ ట్యూషన్లు చెప్పసాగాను. కాలం గడచి పోయేది. స్కూలు ఫైనల్ పాసయ్యాక యిక పైకి పోయే స్థోమత లేదు. నాకు డాక్టరు కావాలని వుండేది. డాక్టరు అయ్యాక ఒక మురికి పేటలో రోగుల సేవ చెయ్యాలను కునేవాడ్ని. ఉద్యోగాన్వేషణకు బయలుదేరాను. ఏ ఆఫీసుకు వెళ్ళినా ఖాళీలు లేవనో, నీకు సరియైన క్వాలిఫికేషన్లు లేవనో, నీకు యిది రాదు అది రాదని యేవేవో సాకులు చెప్పి చివరకు నేను చేత కానివాడినా అన్న అనుమానాన్ని కూడా కలిగేటట్లు చేసారు. ఐనా ఆశను చంపలేదు. ఎక్కడో చదివినది యెప్పుడూ గుర్తుకు వస్తుండేది. 'మనిషికి ఆత్మ వుంది-- ఓర్పు, త్యాగం, జాలీ చూపించగల శక్తి వున్నది.' నేనూ ఒర్చాలి, త్యాగి నవ్వాలి, నాపై కాకుండా యెదుటి వాళ్ళ పై జాలి చూపించాలి. అప్పుడే మనిషి నౌతానని నా నాటకంలో పాత్రను నేను నటించసాగాను. ఒకనాడు తలవని తలంపు గా పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంటులో ఖాళీలు వున్నాయ్ అంటే వెళ్లాను. అప్పటికే అక్కడ యేభై మంది చేరి వున్నారు. హెడ్ గుమస్తా ఒక జూనియర్ యింజనీరు మనుషుల ముఖా లోకసారి చూసి కొన్ని పేర్లు చదివి మిగతా వాళ్లు వెళ్ళవచ్చన్నారు. నాకు ఒళ్లు మండింది. ఎగ్జిక్యూటివ్ యింజనీరు తలుపు తట్టి లోనికి వెళ్లాను. అతను మర్యాదగా "ఏం కావాలన్నాడు?'
'మా ముఖాలు చూసినంత మాత్రాన మా తెలివి తేటలు తెలిసి పోతాయా సార్? ఇది ఒకరి జీవనానికి సంబంధించింది. మా తెలివి తేటలు పరీక్షించి చెత్త కాగితాల బుట్టలో వేస్తె బాగుండేది.'
'మీకేం పరీక్ష చేయలేదా?'
'లేదు.'
'అయితే -- కూర్చోండి' అంటూ బెల్ వాయించాడు. జూనియర్ యింజనీర్ ని పిలిచి 'యిప్పుడు వచ్చిన వారందరినీ పిలవండి.' అన్నాడు. వెళ్ళిపోతున్న వాళ్ళందరూ వచ్చారు. అతనే స్వయంగా పరీక్ష చేసి వారంరోజుల్లో యెవరైతే సెలక్టు అవుతారో వాళ్లకు వర్తమానం వస్తుంది. మీ అడ్రసులు యీ పేపర్ల లో మరచి పోకుండా రాసారు కదూ?'
ఆ వారం లోనే నాకు వుద్యోగం లో చేరమని వచ్చింది. ఇదివరకు ముఖాలు చూసి సెలక్టు అయిన వారిలో ఒకడు తప్పించి యింకేవడూ కనపడలేదు. న్యాయానికి కాలం లేదనుకున్న యీ రోజుల్లో అక్కడక్కడా యిలా న్యాయం వుండటం వలన అన్యాయం న్యాయాన్ని పూర్తిగా కబళించలేక పోతోంది. మా ఐదుగురిని మేస్త్రీ లన్నారు. కానీ ఆఫీసులోనే పని చేయించే వారు. నా పనికి మెచ్చుకుని ఎగ్జిక్యూటివ్ యింజనీరు నాకు బిల్లులు ప్యాసు చేసే సీటు యిచ్చాడు. అప్పటికి నేను కాజువల్ మేస్త్రీ గానే వున్నాను. ఉద్యోగం దినదిన గండం గానే వుండేది. ఈ ఆఫీసరు బదిలీ కానీ వీడి పని పట్టిస్తానన్నట్లుగా హెడ్ గుమాస్తా బోనులో పులిలా కాసుకూర్చున్నాడు. లంచాలు పుచ్చుకుని ఆ సీటులో యిదివర కెందరో బాగుపడ్డారు. నేను పుచ్చుకోకుండా వేగంగా బిల్లులు ప్యాస్ చేస్తుంటే అందరికీ ఆశ్చర్యంగా వుంది. ఎందరో కాంట్రాక్టర్లు , కంపెనీ యాజమాన్లు వస్తూ చివరకు ఒక సిగరెట్ నైనా కాల్చకపోతే ఒప్పుకునే వారు కాదు. ఈ సిగరెట్ రానురాను కొనవలసిన పరిస్థితి వచ్చింది. ఈ సిగరెట్ల కే యింత అయిపోతుంది మానేద్దామని వభీష్మించుకున్నాను. ఒక కంపెనీ యజమాని 'సిగరెట్ పెట్టి' అందివ్వ బోయాడు.
'వద్దు.'
'ఏం? మానేసారా?'
'హా, ఈ జీతంతో భరించలేను.'
'జీతం హెచ్చు అయితే భరించగలరా?'
అతని వుద్దేశమేమిటని సంశాయంగా చూసాను. 'చెప్పండి. ఇలాంటి అమూల్యమైన వస్తువుతో సంపర్కం వదల గలరా?'
'విధి లేదు.'
'ఇక్కడ మీరు లేకపోతె మాకు కష్టంగానే వుంటుంది. మీలాంటి నమ్మకస్తుడు మాకు దొరకటం కష్టం. ఐనా మీ భవిష్యత్తు కూడా చూడాలా? ఎన్నాళ్ళు చేసినా యీ కొలువు యింతే అంచేత మీకు అభ్యంతరం లేకపోతె మా కంపెనీ లో చేరండి. నెలకు రెండు వందలిస్తాం.'
నేనాతని మాటలు వెంటనే నమ్మలేక పోయాను. డెబ్బయి రూపాయల నించి ఒక్కసారి రెండు వందలే! మాట ప్రకారం అతను ఆర్డరు పంపాడు. నా ఉద్యోగమే నా ఆస్థి. ఆ ఆస్థికి యిప్పుడు విలువ రాగానే పెళ్లి బజారులో నా విలువ పెరిగింది. ఇన్నాళ్ళూ ముఖం చూపించని దూరపు బంధువులంతా పెళ్లి కూతుర్లను తోడ్కుని వచ్చి మరీ నన్ను బాధ పెట్టసాగారు. ఈ చెరువు యిప్పుడు నిండగానే కప్పలు చేరాయి. ఆ కప్పలను తప్పించు కోడానికి నా తల ప్రాణం తోకకి వచ్చింది. ఒంటి ప్రాణం. అంత డబ్బెం చేసుకుంటాను? కూడబెట్టాలన్న తలపే రాలేదు. నేనో చెయిన్ స్మోకర్ ని అయిపోయాను. సిగరెట్ల కే సగం జీతం అయిపోతుందా అన్న భయం అప్పుడప్పుడూ కలగసాగింది. రెండు సంవత్సరాల్లో నాకు మరో యేభై రూపాయలు జీతం పెరిగింది. ఇక పెళ్లి చేసుకోవాలన్న కోర్కె కలిగింది. నేను పి.డబ్ల్యూడి. లో పనిచేస్తున్నప్పుడు నా స్నేహితునితో ఒకసారి వాళ్ళ పల్లెటూరు వెళ్లాను. అక్కడ లంగా జాకెట్టు తో వాళ్ళ యింటి పొరుగునే అమ్మాయిని చూసాను. ఎప్పుడైనా యీ అమ్మాయి నాదైతే యెంత అదృష్ట వంతుడ్ని అనుకున్నాను. ఆ పిల్లకు గొప్ప సిగ్గు. మాట్లాడుదామని ప్రయత్నించాను గాని లాభం లేక పోయింది. ఆ పిల్ల తండ్రి పిచ్చివాడై పోయాడట. తల్లి లేదట. మామ్మ వుంది గానీ-- యిలాంటి కబుర్లు విన్నాక తప్పక యీమె కోసమే నేను అగానని నిశ్చయించు కున్నాను. మా మిత్రునికి వాళ్ళకీ ఏదో దగ్గర సంబంధమే వుందట. నేను తిరిగి వచ్చే ముందు మా మిత్రుని చెల్లెలను చూపించారు, నాకు మా వాడి పై కోపం వచ్చింది. దీని కోసమని చెప్తే రాకపోయే వాడ్ని. పోనీ యీ నెపాన ఒక కోరిక కలిగింది. ఇప్పుడు మళ్లీ ఆ కోరిక చివురించగానే మళ్లీ ఆవూరు వెళ్లాను. ఆ యెదిగిన పిల్లను చూడగానే నా శరీరమంతా పులకరించింది. ఇన్నాళ్ళూ మేఘ సందేశాలు పంపగా దివి నించి భువికి దిగిన గాంధర్వ కన్యలా వుంది. ఒకే జాతి -- నా అంతస్తు పెరిగింది. ఆమెను పొంద గలిగే అన్ని హంగులు తనకు వున్నాయ్. అప్పటికి ఆమెకు అందం తప్పించి యింకేమీ లేదు. ఆ ముసలమ్మ మంచం పట్టింది. ఆ పిల్లకు ఒక మేనమామ వున్నాడు. వాడు పేచీ కోరు. ఉన్న కొద్ది భూమి అమ్మి ఆ పిల్లకు పెళ్లి చేసి చచ్చిపోదామని ముసలమ్మ ఆశకు గాయం తగిలింది. నివ్వు పట్నం లో వుండగా యీ భూమి మీద తీసి యెంత డబ్బు పంపించాను. ఇంకేం మిగిలింది అన్నాడు. డబ్బు లేదు , పిల్ల పెళ్లెలా చేస్తావని మామ్మ మంచం పట్టిన స్థితిలో నేను వెళ్లాను. మామ్మగారిని కలుసుకుని నా నిశ్చయాన్ని చెప్పాను. 'మీరో చిల్లి గవ్వ ఖర్చు పెట్టకండి. అన్నీ నేనే చూసుకుంటాను. ఆమె వూర్లో పదుగురి పెద్దలను పిలిపించింది. నా మాట మొదట యెవరూ నమ్మలేదు. నా వుద్యోగం వగైరా అన్ని విషయాలను నిరూపించే ఆధారాలను వెంటనే తీసుక వెళ్లాను కాబట్టి! సరిపోయింది.
'అయితే మీ పెద్దలు రానీయండి.'
'నాకు నేనే పెద్దననీ' నా చరిత్ర చెప్పాను.
'వేలుంటే గానీ ఆడపిల్ల చెల్లని రోజుల్లో రెండు ప్రక్కల ఖర్చులు పెట్టుకుని మరీ పెళ్లి చేసుకుంటామని ముందు కొచ్చాడు. అదృష్ట మంటే అలాగుండాలి.' నా ఎదర గానే విశాలాక్షి అదృష్టం గురించి ఎందరెందరో పొగుడు తున్నారు.
మామ్మ సంతోషంతో తబ్బిబ్బయి పోయింది.
'పిల్ల నచ్చింది కదా నయానా!'
'నచ్చకపోతే యింతదూరం ఎందు కోస్తాను.'
'దాని తల్లి దీవన -- ఈ కష్తాల్లోనూ వెలుగు అగపడింది. దానికి అక్షింతాలు వేసి నేనూ హాయిగా కళ్ళు మూస్తాను.'
మామ్మ అలా అంటూ యింట్లో నికి వెళ్ళింది. ఏదో గొడవగా ఉందని వూహించాను. మామ్మ కోపంగా ఏదో అంటోందని యిద్దరికీ యేవో వాదోపవాదా లవుతున్నాయని అనుకుని తిరిగి వచ్చేముందు.
'అమ్మాయికి యిష్టం లేదా ?' అన్నాను.
'దాని యిష్టా యిష్టాలేవరిక్కావాలీ . రత్నం లాంటి మొగుడు దొరికితే అప్పుడే నాపెళ్ళికి తొందరేం అంటుంది. తొందర కాదూ?'
'అంతేనా?'
'ఈరోజు పిల్లలు నాయనా -- ఏదో చదివించాను కదా? ఏమంటే ఉద్యోగం చేసి నన్ను పోషిస్తాదట-- సరే నివ్వేళ్ళు. ముహూర్తం అదీ నిశ్చయించి నీకు రాస్తాను. పెళ్లి యిక్కడే చేస్తాను.'
'పట్నం లో ఏర్పాటు చేస్తాను.'
'నేను మరెక్కడికి కదల్లెను బాబూ!'
'సరే' అని వచ్చేసాను. పెళ్ళయి పోయింది. కధ కంచికి మనం యింటికి' అన్నాడు శ్రీనివాస్.
మౌనంగా కూర్చున్న సూర్యం తో,
'ఎలా వుంది కధ?'
'బావుంది.'
'అర్ధాంగి రాకతో కావ్యం లో వర్ణించినట్లు-- మోదుగులు పూసాయి. అశోకాలు పుష్పించాయి. సంపెంగ లు వికసించాయి. పూల కోసం మూగుతున్న తుమ్మెద నై పోయాను!' సరా. 'మీకు బెరియమ్ మీల్ టెస్టు కు వెళ్ళటానికి టైమైంది కదూ?'
'అవును' అంటూ లేచి సూర్యం తన పరుపు దగ్గరకు వచ్చేసాడు. కాస్సేపయ్యాక బయలుదేరాడు.
