"ఏమిటది?"
"చీఫ్ మినిష్టర్ కి మనం ఇలా ప్రధానమంత్రి తరపున వచ్చిన విషయం తెలిసింది"
"తెలిస్తే తెలియనీయ్ ప్రహ్లాద్ - ప్రాబ్లెమ్ ఏముంది?"
"ఆయన కోపంగా ఉన్నారట. వెంటనే ప్రధానమంత్రితో మాట్లాడి మనల్నిఎందుకు పంపించారో తెలుసుకోవాలనుకుంటున్నారట" అన్నాడు.
"అందుకేగదా! ప్రధానమంత్రి విదేశీ పర్యటనలో ఉన్న సమయం చూసుకుని మనమీ పని చేశాం. ఆయన తిరిగి ఇండియావచ్చే వరకూ ఈ విషయం చర్చించటానికి కుదరదు"
"కానీ ముఖ్యమంత్రి మలేషియాలో ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రిని కాంటాక్టు చేయటానికి ప్రయత్నిస్తున్నారట- ఏ క్షణంలోనైనా అది సాధ్యం కావచ్చు."
నూతన్ కి ఆ వార్త చికాకు కలిగించింది.
"ఎవరు చెప్పారీ విషయం?"
నూతన్ కొద్దిసేపు ఆలోచనలో పడిపోయాడు.
"మయూరీ! మనకేదయినా ఆల్టర్ నేటివ్ ప్లాన్ వుందా?"
"ఉంది"
"ఏమిటది?"
"ఆరింటికి ఒక బస్ వుంది. అందులో బయలుదేరితే నగరందాటి బాంబేరూట్లో కెళ్ళవచ్చు"
"గుడ్! ఆ బస్ కి మనజర్నీ కుదురుతుందేమో చూడండి"
"కానీ ముగ్గురం అదే బస్ లో వెళ్ళటం క్షేమంకాదేమో"
"ఔను! ముగ్గురూ మూడుడైరెక్షన్స్ లో విడిపోవటం బెటర్"
"నన్నడిగితే బస్ కూడా రిస్కే! ట్రైన్ లో వెళితే బెటర్! అంత మందిలో మనల్ని ట్రేస్ చేయటం కష్టమవుతుంది అన్నాడు ప్రహ్లాద్.
"ఆరింటికి ఏమేం ట్రైన్స్ ఉన్నాయ్"
"మద్రాస్ ఎక్స్ ప్రెస్ ఒకటుంది. అందులో విజయవాడ వరకూ వెళితే అక్కడనుంచీ తలోదారీ అవచ్చు"
"అవును! ఎనీవే - అలాంటి అవసరం రాకూడదని కోరుకుందాం" నవ్వుతూ అన్నాడు నూతన్.
ఫోన్ మ్రోగింది. మయూరి అందుకుంది.
"మయూరీ హియర్"
"నేను సి.బి.ఐ సూపర్నెంట్ రంజన్ ని మాట్లాడుతున్నాను. ఒక సారి కృష్ణ కాంత్ గారితో మాట్లాడాలి"
"ఏ విషయం?"
"అది ఆయనతోనే మాట్లాడతాను! చాలా అర్జంట్"
"వెయిటే మినిట్ ప్లీజ్" అయినా మౌత్ పీస్ మూసేసి నూతన్ తో ఆ విషయం చెప్పిందామె.
నూతన్ గాభరాపడ్డాడు.
"ఐతే మనగురించి పూర్తి డిటెయిల్స్ తెలుసుకోవటానికి వస్తున్నట్లున్నాడు. బహుశా ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో మాట్లాడాడేమో!" అన్నాడు.
ప్రహ్లాద్ ముఖంలో కూడా భయం కనిపించింది. కానీ మయూరి మాత్రం ఎలాంటి భయంలేకుండా చిరునవ్వు నవ్వింది.
"వస్తే రానీండి! మనం చెప్పే వర్షన్ కాదనటానికి ఎవడికీ దమ్ములుండవ్. ప్రధానమంత్రికూడా ఖచ్చితంగా మనం తను పంపినమనుషులు కాదు అనిచెప్పలేరు గదా! నిజానికి ఆయన పంపించదలచుకున్న అబ్జరర్స్ రేపో మాపో ఇక్కడికి చేరుకోవాల్సి వుంది. వాళ్ళు ఒకరోజు ముందే వచ్చారని అనుకోవటానికి చాన్స్ వుంది"
నూతన్ కి ఆమె వాదననచ్చింది.
దానికన్నా ఆమె ధైర్యం! ఇంత ప్రెజర్ లోనూ ఆమె ఎంత కూల్ గా వుందోచూస్తూంటే నమ్మశక్యంకావటంలేదు.
ఆమె అతి భయంకరమయిన క్రిమినల్ అయినా అయ్యుండాలి- లేదా అతి అమాయకురాలయినా అయ్యుండాలి.
తమాషా ఏమిటంటే ఈమె ఈ రెండూ కాదు.
జస్ట్! ఒక ఇంటెలిజెంట్ గాళ్! అంతే!
ప్లెయిన్ దుస్తులలో వున్న సి.బి.ఐ అధికారిలోపలకొచ్చాడు.
నూతన్ కి సెల్యూట్ కొట్టాడు.
కలవరపాటుని పైకి కనిపించనీయకుండా నూతన్ అతనివేపు చిరాకుగా చూశాడు.
"త్వరగా చెప్పండి ఐయామ్ వెరీ బిజీ! ప్రధానమంత్రి నుంచి ఏమైనా మెసేజ్ తెచ్చారా?"
"లేద్సార్! మీ వివరాలు కావాల్సి వచ్చింది! దానికోసమని!"
"నా వివరాలు కావాలంటే ఢిల్లీ పార్టీ ఆఫీస్ నడిగి తెలుసుకోండి! నన్నెందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? అయామ్ బిజీ నౌ"
"కనీసం మీ వివరాలు ధృవపరిచేలెటరేదయినా చూపించినాచాలు"
"దిసీజ్ వెరీ బాడ్ మిస్టర్! మీ బాస్ ఎవరు?"
"మిస్టర్ దుగ్గాల్ సార్!"
"ప్రస్తుతం ఆయన టూర్ లో వున్నారు సార్! బెంగుళూర్ నుంచి నాతో మాట్లాడారిందాక"
"ఆల్ రైట్! మయూరీ! మన లెటర్ హెడ్ మీద మనవివరాలు రాసివ్వు"
మయూరి లెటర్ హెడ్ మీద రాసిచ్చింది.
"థాంక్యూ సర్! సారీ ఫర్ ది ఇన్ కన్ వీనియన్స్"
"ఇంకోసారి డిస్టర్బ్ చేయకండి. ఐ డోంట్ లైకిట్"
అతను సెల్యూట్ కొట్టి వెళ్ళిపోయాడు. నూతన్ రిలాక్సయ్యాడు.
"ప్రస్తుతానికి గండం గడిచినట్లే" అన్నాడు.
సెక్యూరిటీ గార్డు లోపలికొచ్చాడు.
"సార్! మోహన్ రెడ్డి గారొచ్చారు."
"ఆల్ రైట్ రమ్మను"
మోహన్ రెడ్డితోపాటు మరో ముగ్గురు లీడర్లు లోపలికొచ్చారు. వారి వెనుక ఒకతను రెండు సూట్ కేసులు పట్టుకొచ్చాడు. వాటిని గదిలో ఓ పక్కన ఉంచి అతను వెళ్ళిపోయాడు.
అందరూ కూర్చున్నారు.
"విత్ గ్రేట్ డిఫికల్టీ....రెండు కోట్లు పోగుజేయగలిగాం సార్! ఇంకో కోటిరూపాయలు ఎల్లుండి కల్లా ఢిల్లీ పంపిస్తాం!"
"ఓకే! ప్రధాన మంత్రిగారికీ విషయం చెప్తాం..."
"ఈ డబ్బుకి మీ రశీదు ఇస్తే......" నసిగాడతను సంశయంగా.
"ఓ! దేరీజ్ నో ప్రాబ్లెమ్! మయూరీ రెండు కోట్లకు రసీదు మన లెటర్ హెడ్ మీద రాసివ్వు. కానీ ఈ రసీదు చాలా రహస్యంగా ఉంచాలి మిస్టర్ మోహన్ రెడ్డి! దీనివల్ల తర్వాత ఎలాంటి కాంప్లికేషన్సూ రాకుండా చూసుకోండి. ఇంకో విషయం ఏమిటంటే ముఖ్యమంత్రిగా మీ పేరు ఎనౌన్స్ చేసిన వెంటనే నేను స్వయంగా వచ్చి ఈ రసీదు వాపస్ తీసుకుంటాను"
"తప్పకుండా!"
మయూరి రాసిచ్చిన రసీదు ఓసారి చూసి సంతకం చేశాడు నూతన్. మోహన్ రెడ్డి ఆ రసీదు ఓసారి చూసి, మళ్ళీ కవర్లో వుంచి జేబులో పెట్టుకొన్నాడు.
మరి రెండు నిముషాలు మాట్లాడాక అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే ప్రహ్లాద్ హడావిడిగా గదిలో కొచ్చాడు. అతనిమొఖంలో ఆందోళన.
"నూతన్ మనం ట్రబుల్లో పడ్డాం!"
నూతన్ గుండె ఝల్లుమంది.
"ఏం జరిగింది?"
