Previous Page Next Page 
మల్లెలు ఎర్రగులాబీలు పేజి 27


    'బావగారూ! మన చేతిలో ఏముంది? మనం అనుకున్నట్లు ఎందుకు జరుగుతుంది? అంతా దైవఘటన!' అన్నారు సుందరరామయ్యగారు.
    'అన్నయ్యా! మీకీ అవస్తలన్నీ ఎందుకు? అందరం కలిసి ఉందామంటే వినకపోతిరి. ఇప్పుడు చూడు అమ్మాయి ఎంత యిబ్బంది పడవలసి వచ్చిందో?' విచారపడుతూ అన్నారు అన్నపూర్ణమ్మగారు.
    అంతలో అక్కడికి సుందరం వచ్చాడు. నీరజ సుందరాన్ని శ్రీపతిగారికి పరిచయం చేసింది. పరస్పరం నమస్కారాలు చేసు కున్నారు. ఒక గంట ఉండి శ్రీపతిగారు, అన్నపూర్ణమ్మగారు వెళ్ళిపోయారు.
    'నీరజా....!  ఎలాగూ ఈరోజు ఆదివారం. రేపటి నుండి సక్రమంగా కాలేజీకి వెడుతూ ఉండు. పరీక్షలు దగ్గరపడ్డాయి. నాన్నగారి విషయం నే చూసుకుంటాను.'
    'మీకు లేనిపోని శ్రమ కలుగు...' మాట పూర్తి చేయలేక పోయింది నీరజ.
    'ఫర్వాలేదు. నీ చదువుకు భంగం కలిగితే సంవత్సరమంతా పడిన శ్రమ వృధా అవుతుంది.' అని ఎవరో పిలుస్తూ ఉండగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సుందరం.
    సుందరరామయ్యగారికి ఆస్తమా పూర్తిగా తగ్గేందుకు ఆపరేషను చేయవలసి వచ్చింది. శ్రీపతి గారు అన్నపూర్ణమ్మ గారు ప్రతిరోజూ వచ్చి చూసి వెడుతున్నారు. నీరజ ప్రతిరోజూరెండుసార్లు వచ్చి వెడుతూ ఉంది. మధ్యలో ఏదైనా అవసరముంటే సుందరం కనుక్కుంటూ ఉన్నాడు.
    క్రమంగా కోలుకుంటున్నారు సుందర రామయ్యగారు. పరీక్షలు మరీ దగ్గర పడడంతో నీరజ అటు శ్రద్ధగా చదువుతూ యిటు తండ్రికి కావలసిన ఉపచారాలు చేస్తూ ఉంది.

                             *    *    *

    నీరజ పరీక్షలు పూర్తయ్యాయి. సుందరరామయ్యగారు పూర్తిగా కోలుకున్నారు. ఆపరేషను జరిగినతర్వాత ఆయాసం చాలా వరకు తగ్గిపోయింది. ఆస్పత్రిలో షుమారుగా యిరవైరోజులు ఉన్నారు. ఆ యిరవై రోజులూ సుందరం ఎంతో శ్రద్ధ తీసుకొని సుందరరామయ్యగారికి చక్కని ట్రీటు మెంటు జరిపించాడు. సుందరాన్ని తమ కుటుంబ వ్యక్తిగా, ఎంతో ఆప్యాయంగా చూడసాగారు వారు.
    సుందరం హౌస్ సర్జన్ షిప్ పూర్తి చేశాడు. అతనికి క్రితంరోజు రామం దగ్గర నుండి వెంటనే రావలసిందని ఉత్తరంకూడా వచ్చింది. రూము ఖాళీచేసి వెళ్ళిపోవాలి.
    ఆనందభవన్ లో టిఫిను చేసివచ్చిన సుందరం ఆలోచనలో పడ్డాడు. 'నీరజ నన్ను ప్రేమిస్తూ ఉంది. కాని మనస్సూ ర్తిగా నేను ఆమెను ప్రేమించలేక పోతున్నాను. అందుకు కారణం? శాంత నా హృదయంలో తిష్టవేసుకొని కూర్చోవడం. అది సాధ్యపడే విషయమేనా? ఎలా సాధ్య పడుతుంది? రామమే తన కాబోయే అల్లుడని లక్ష్మయ్యగారు అందరితోనూ చెప్పడం నాకుతెలుసు. అయినా ఆమెపై ఆశను వదులుకోలేక పోతున్నాను. రామం... వాడు నా చిన్ననాటి స్నేహితుడు. మరి .... నేను శాంతపై ఆశలు పెంచుకొని వాడికి ద్రోహం చేసిన వాన్నవుతానేమో? శాంత నన్ను వివాహమాడడానికి యిష్టపడితే నేనెవ్వరినీ లెక్కచేయను. ఆమె యిష్టపడితే ఎన్ని యిబ్బందులనైనా ఎదుర్కొని ఆమెను వివాహ మాడతాను. రామం ఎంత ప్రాణ స్నేహితుడైనా అతనికోసం నా సుఖాన్ని త్యాగం చేయలేను. అసలు శాంత ఎలా యిష్టపడుతుంది? చిన్నప్పుడే ఈ విషయం ఒకసారి రుజువైందికూడా! శాంతను గురించి ఆలోచించడంలో అర్ధంలేదని లోగా జరిగిన ఒక సంఘటన రుజువు చేస్తుంది.
    'అప్పుడు ముగ్గురమూ ఎంతో స్నేహంగా ఉండి ఒక్కదగ్గరే ఆడుకుంటూ ఉండే వాళ్ళం. ఒకరోజు నేను ఒంటరిగా లక్ష్మయ్య గారి మామిడితోటలో శాంత అందంగురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. అంతలో శాంత బావా బావా, అంటూ రామాన్ని వెదుకుతూ వచ్చింది అక్కడికి.
    'శాంతా! రామం యిక్కడ లేడ'ని చెప్పాను. అప్పుడే వికసించబోతున్న గులాబీ మొగ్గలా ఉంది ఆమె. ఆ రోజు తలంటు పోసుకుందేమో? జుట్టు ఆరడానికి ఒదులుగా జడవేసుకుంది. ఆరిన ఆ జుట్టు పిల్లగాలికి రేగి నుదురు పై నాట్యం చేస్తూ ఉంది. ఆమె జడలో మల్లెలు తమ వాసనలు నలు ప్రక్కలా విరజిమ్ముతున్నాయి. ఎర్రని సిల్కు జాకెటు, లేత నీలంరంగు పరికిణా, వోణీలో ఆమె వనదేవతలా మెరిసిపోతూ ఉండడం నాకు పిచ్చెక్కిచ్చింది. రామం లేడని నేను చెప్పిన తర్వాత వెనుదిరిగి వెళ్ళిపోబోతున్న ఆమెను వెనుకకు పిలిచాను. హంసలా వయ్యారంగా నడిచిపోతున్న ఆమె ఆగి వెను తిరిగి ప్రశ్నార్ధకంగా నావైపు చూసింది. రమ్మని మళ్ళీ పిలిచాను. దగ్గరకు వచ్చింది. ఆమె కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ శాంతా బావలేడని అలా వెళ్ళిపోతున్నావేం? నాతో మాట్లాడ కూడదా?' అని ప్రశ్నించాను. నా చూపులకు ఆమె తడబడుతూ, కాలి బొటన వ్రేలితో నేలపై గీతలు గీస్తూ తల ఒంచుకోని నిలబడింది. 'శాంతా....శాంతా...' అని మత్తుగా పిలుస్తూ ఆశతో శాంత కళ్ళల్లోకి చూస్తూ ఆమెచేతిని పట్టుకున్నాను. ఆమె 'సుందరం ఏమిటిది?' అని నిలువెల్లా వణికిపోయింది కోపంతో. నిన్ను 'నా ప్రాణసమంగా ప్రేమిస్తున్నాను' అని ఎంతో ఆప్యాయతతో ఆమె కళ్ళల్లోకి చూస్తూ దగ్గరకు తీసుకొనే ప్రయత్నం చేస్తూ అన్నాను. కొలిమిమీద పెట్టి తీసిన యినుపముక్కలా ఎర్రబడిన ముఖంతో ముక్కుపుటా లదురుతూ ఉండగా, కోపంతో కంపించిపోతూ  తన బలంకొద్దీ నా చెంప మీద చాచి ఒక్క దెబ్బవేసింది. ఆ దెబ్బ లోని చురకుతనానికీ నా కళ్ళల్లో నీరు తిరిగింది. అంతే కాకుండా ఈ విషయం రామంతో చెబుతానని బెదిరిస్తూ అక్కడి నుండి వెళ్ళడానికి వెనుతిరిగింది. నాకు ముచ్చెమటలు పోశాయి. ఆలోచించే వ్యవధిలేదు. ఈ విషయం రామానికి తెలుస్తే  ఇంకేమైనా ఉందా? డొక్క చీరేస్తాడు. భయంతో శాంతను బ్రతిమిలాడి, భంగపడి ఈ విషయం రామంతో చెప్పవద్దని ఒప్పించుకున్నాను.
    'ఆ తర్వాత శాంతను కన్నెత్తి చూడడానికే నేను భయపడేవాణ్ణి. ఇక్కడకు వచ్చిన ఐదారు సంవత్సరాలకు శారదతో సుల్తాన్ బజార్ వద్ద కనుపించింది. ప్లాజా టాకీసు వద్ద జరిగిన సంఘటన, ఆమె వైఖరి నాపట్ల సుముఖంగా ఉన్నట్లే తోచింది. ఆమె మనసు తెలుసుకోవడానికే ఆమెను అలా యిరకాటంలో పెట్టాను. ఆమెకు నాపై సద్భావమున్నట్లు అప్పటి ప్రవర్తనవల్ల నాకు తోచింది. అయినా 'స్త్రీ బుద్ధి? ప్రళయాంతక?' అని త్వరపడి రెండవసారి భంగపడకూడదు. అప్పుడు నేను సామాన్యున్ని. మరి యిప్పుడో డాక్టరును. అధునాతన నాగరికతను జీర్ణించు కున్న వాణ్ణి.
    'శాంత సుముఖంగా ఉన్నా, లక్ష్మయ్య గారు ససేమిరా ఒప్పుకోరు. శాంత పట్టు పట్టి మారాం చేసి ఎంతో ప్రయత్నంమీద తన తండ్రిని ఒప్పించవచ్చు, కాని రామం యిది సాగనిస్తాడా? ఊరు ఊరంతా అతని మాటను జవదాటరు. వేదవాక్కుగా శిరసావహిస్తారు. అటువంటి స్థానబలమున్న అతనిని నేను ఎదిరించగలనా? అందుకు వేరే మార్గమేదైనా ఉందా? ఒక్కటే మార్గం! శాంత నాతో లేచిరావడం! అది సంభవమేనా? ఇన్ని అసాధ్యాలతో నిండిన ఈకార్యభారాన్ని వహించడం అవివేక మౌతుందేమో? హుఁ...ఆ విధాలా పిరికిగుండెతో ఆలోచిస్తే యిక పని అయినట్లే! ధైర్యం చేస్తాను. ఊరివారంతా ఒక్కటైనా సరే! లక్ష్మయ్యగారు, రామం ఎంతగా తమ పట్టుదలపై నిల్చున్నాసరే! నా కార్యాన్ని నెరవేర్చుకుంటాను. నాకు కావలసిందల్లా శాంత. ఆమెలేని నా జీవితం అసంపూర్ణంగా ఉంటుంది. ఏదైనా పథకం ఆలోచిస్తాను. రామం పేరు చెబితేనే శాంత మండిపడేట్లు చేస్తాను.
    'మరి! నీరజో? పాపం గ్రుడ్డిగా నన్ను ప్రేమిస్తూ ఉంది. ఆమెనుండి తప్పుకు తిరగాలని ఎంతో ఆలోచిస్తూ కూడా తప్పుకు తిరగలేక పోతున్నాను. నీరజ కళ్ళల్లో అటువంటి అయస్కాంతశక్తి ఉంది. మరి.... అటువంటప్పుడు దగ్గరకు రావాలని విశ్వప్రయత్నం చేస్తున్న నీరజను దూరం చేసుకొని శాంతను పొందే ప్రయత్నం చేయడం అందని మ్రానిపండ్లకు ఆశించి నట్లౌతుందేమో? అయినా ఫర్వాలేదు. ప్రయత్నిస్తాను. అంతవరకూ నీరజకు ఏ సమాధానమూ తేల్చి చెప్పను. ఇష్టం లేకున్నా మా ఊరు వెళ్ళడానికి ఒప్పుకున్నది రామం మాట తీసివేయలేక కాదు. శాంతను నాదాన్నిగా చేసుకోవాలనే కోరికతో అంగీకరించాను.'
    తనలో రేగిన ఆలోచనా తరంగాలనుండి తేరుకొని ఒక నిర్ణయానికి వచ్చాడు సుందరం. శాంతను తనదాన్నిగా చేసుకోవాలనే కాంక్ష అతని వివేకాన్ని, ఆలోచనా శక్తిని వెనుకకు నెట్టింది. అది అక్రమ మనే ఊహ అతని మనసుకు తట్టనేలేదు. 'బహుశా శాంత, శారద లిద్దరూ ఈ పాటికి యింటికి వెళ్ళిపోయే ఉండి ఉంటారు. సుందరరామయ్యగారికి, నీరజకు చెప్పి ఈరోజే యింటికి వెళ్ళిపోతాను' అని అనుకుంటూ లేచి డ్రెస్ చేసుకోసాగాడు సుందరం.
    
                              *    *    *

    'హల్లో! డాక్టరుగారా? రండి' తను కూర్చున్నచోటునుండి లేచి ముందుకు నడిచి వెళ్ళి ఎదురుగా వస్తున్న సుందరాన్ని లోపలికి ఆహ్వానించింది నీరజ.
    'నీరజా! పరీక్షలు బాగా వ్రాశావా?' కుర్చీలో కూర్చొని అడిగాడు సుందరం.
    'బాగానే వ్రాశాను. మీరు వస్తారని వారం రోజులనుండి ప్రతిరోజు ఎదురు చూస్తున్నాను. ఇవ్వాళ్ళ వచ్చారు.' ఆమె కంఠంలో బాధ ధ్వనించింది.
    'వీలు పడలేదు .... వద్దామనుకొనే సరికి ఎవరో ఒకస్నేహితుడు రావడం నా టైము వేస్టు చేస్తూ ఉండడం జరుగుతూ ఉంది. ఈరోజు మా ఊరికి వెడుతున్నాను. చెప్పి వెడదామని వచ్చాను.'
    నీరజ ముఖంలో రంగులు మారాయి. వంచిన తల ఎత్తలేకపోయింది. ఆమె బాధను గుర్తించాడు సుందరం. మెల్లిగా తన చేతితో ఆమె ముఖాన్ని పైకెత్తాడు. కన్నీటితో నిండిన ఆకళ్ళు, జాలిగొలిపే చూపులు సుందరం హృదయాన్ని కలచి వేశాయి.
    'ఏమిటది? ఈవిధంగా నా కోసం బాధ పడుతూన్న ఈమెను వదిలి ఎండమావుల కోసం పరుగెడుతున్నావా? అలా ఎందుకనుకోవాలి? శాంత పొందశక్యం కాని అంత ఉన్నతస్థానంలో ఉందా? నన్ను, రామాన్ని పోల్చిచూస్తే ట్యూబులైటు ముందర జీరో బల్బులా వెలవెలపోతాడు రామం. ఆమెను పొందే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తాను. జయాపజయాలు దైవాధీనాలు.
    'ఏమిటండీ ఆలోచిస్తున్నారు?' నీరజ మాటలకు ఈ లోకంలోపడిన సుందరం 'ఏమీలేదు. నాన్నగారికెలా ఉంది? కులాసా గానే తిరుగుతున్నారా?'
    'మీ దయవల్ల కులాసాగానే ఉంది. పడుకొని నిద్రపోతున్నారు. లేపమన్నారా?' 'నిద్రపోతున్న వారిని లేపడమెందుకులే నీరజా?'
    'మళ్ళీ ఎప్పుడొస్తారు?'
    'నీవు కోరనప్పుడు. నేను వ్రాసిచ్చిన మందులు జాగ్రత్తగా వాడుతూండమని నాన్నగారితో చెప్పు. బహుశా యికముందు మీ నాన్నగారు జబ్బుతో ఎక్కువగా బాధ పడరు. ఆపరేషను చేయడం వల్ల ఆస్తమా అంత ఉధృతంగా రాదు. దగ్గు కూడా యిప్పుడు వాడుతున్న మందులవల్ల చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకా కొంత కాలం ఆ మందులే వాడితే పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది.'
    'మీరు వెళ్ళుతున్నారు. నాకెలాగా ఉంది. మీతో పరిచయం కలిగినప్పటినుండీ నాన్న గారి అనారోగ్య విషయం నన్ను బాధించ డంలేదు. నా పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుందేమో?'
    'బాధపడకు. మా ఊరు యిక్కడికి దగ్గరే!ఒకకార్డుముక్క వ్రాస్తే చాలు, వెంటనే వచ్చేస్తాను. అయినా చెప్పానుగా మీ నాన్నగారు కోలుకుంటున్నారు. ఇక ఫర్వాలేదు.'
    'పోనీ నాన్నగారిని లేపుతాను. ఐదు నిముషాలు వారితో మాట్లాడి ధైర్యం చెప్పి వెళ్ళండి. 'నన్నెందుకు లేపలేదని' కోప్పడతారు కూడాను.' దిగులుతో అంది నీరజ. సుందరం వెళ్ళిపోవడం ఆమెకు ఏ మాత్రం యిష్టంలేదు. వెళ్ళవద్దని చెప్పేంతటి చనువు యింకా వారిద్దరి మధ్య ఏర్పడలేదు. అయినా ధైర్యం చేసి అడిగింది.
    'పోనీ మీరిక్కడే ఉద్యోగ ప్రయత్నం ఎందుకు చేయకూడదు?'
    'అక్కడికి వెళ్ళాలని నాకు కూడా ఉత్సాహంగా లేదు. కాని నా బాల్య మిత్రుని మాటలు తీసివేయలేక వెడుతున్నాను. అక్కడ నేను ఎంతకాలం పనిచేయగలనో నాకే తెలియడం లేదు.'
    అప్పుడే మెలుకువ వచ్చిన సుందర రామయ్యగారికి హాలులో సుందరం మాటలు వినిపించాయి. లోపలికి వెళ్ళి ముఖం కడుక్కొని వారున్న చోటికి వచ్చారు.
    'బాబూ! ఈ మధ్య కనుపించడం లేదేమిటి?'
    'వారి స్నేహితులమధ్య మనను మర్చిపోయారు నాన్నారూ!'    
    'అబ్బే! అదేమీ లేదండీ!'
    'వారు ఊరికి వెళ్ళిపోతున్నారు. ఆ విషయం చెప్పడానికే వచ్చారు.'
    'అవునండీ!' అని విషయమంతా క్లుప్తంగా చెప్పాడు సుందరం.
    'వెళ్ళక తప్పదా బాబూ! నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను.'
    ఆయనగారు చెప్పబోయే ముఖ్య విషయమేమిటో ఊహించుకున్న సుందరం 'నేను ఉద్యోగం చేయబోతున్న ఊరు యిక్కడికి దగ్గరే! ఇక్కడికి వచ్చినప్పుడల్లా కలుస్తుంటాను. ఆహారం విషయంలో, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. నేను అడ్రసు యిచ్చి వెడతాను. అవసరమనుకున్నప్పుడు వ్రాస్తే వెంటనే వస్తాను.'
    సుందరరామయ్యగారు యిక ఆ విషయంలో వత్తిడి చేయలేక పోయారు. ఐదునిముషాలు కబుర్లు చెప్పి తమ వెళ్ళబోయే బస్సుకు టైము అవుతుందని వారికి చెబుతూ వెళ్ళిపోయాడు సుందరం.
    ఆప్తమిత్రుడొకడు దూరమౌతున్నాడని బాధపడ్డారు సుందరరామయ్యగారు. నీరజ స్థితి యిక చెప్పనక్కరలేదు.

                              *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS