"శ్యామా!"
"ఏం బావా!"
"ఏం లేదు, శ్యామా! ఏం లేదు."
విప్పారిన ఆమె సౌందర్యాన్ని, ఏదో తీరని అకాంక్ష తో చురుగ్గా చూసే ఆమె నేత్ర ద్వయాన్ని చూస్తున్నాడు సురేంద్ర. క్షణం లో అతని కళ్ళు చేమ్మగిలినాయి. పాంగారిన మనస్సుతో, నిండారిన హృదయంతో , మనసారా ఆమెతో ఎన్నో విషయాలు మాట్లాడాలను కున్నాడు. కాని సంతోషాతిశయం లో మాట్లాడ లేకపోయాడు.
"మాట్లాడవేం బావా?"
"శ్యామా! మా ఊరి హైస్కూల్లో చదువుకునే రోజుల్లో నాకు లోక జ్ఞానం శూన్యం . ప్రతి విషయమూ నాకు కొత్తగానే ఉండేది. ఇక్కడ కాలేజీ లో చేరిన కొంతకాలం వరకూ అదే స్థితిలోనే ఉన్నాను. లోక జ్ఞానం లేని నాకు వ్యక్తుల మనస్తత్వాలూ, మంచి చెడ్డలు అంతగా తెలిసేవి కావు. నువ్వు పొట్టిగా, లావుగా, ఉన్నావనే విషయమే నా బుర్రలో ఇమిడి పోయింది గాని నీ హృదయం నాకు తెలీలేదు. నా హృదయమే నాకు అర్ధం కాని వయస్సు లో, నీ మనస్సు నా కెట్లా తెలుస్తుంది చెప్పు? ఫలితం, నా నుంచి మన కుటుంబాలు రెండూ దూరమై పోయినాయి. ఇప్పుడు మన పెద్దలు రాజకీయపు రంగు వేసుకున్నారు" అన్నాడు సురేంద్ర.
"పోనీ లే బావా. జరిగిందేదో జరిగిపోయింది. మేనమామ కూతురునైనా నీకు నేను బావుండ నప్పుడు పదిసార్లు అనుకోవట మెందుకు బావా? మేనరికమనే మిష తో ఇష్టం లేని నీకు పెళ్లి చేస్తే జీవితాంతం నువ్వు బాధపడే కన్న, నన్ను చేసుకోకుండా ఉండటమే మంచిది. చక్కని డాన్ని, చదువు కున్న దాన్ని, నువ్వు చేసుకుంటా నంటే ఎవరు కాదంటారు బావా?' అన్నది శ్యామ సుందరి.
తుపాకి గుండు గుండెల్లో నుంచి దూసుకు పోయి నట్లనిపించింది సురేంద్ర కు. శ్యామసుందరి తనను ఎత్తి పొడుపు మాటలతో ఎందుకు బాధ పెడుతున్నదో అతనికి అర్ధం కాలేదు. ఇరువురి హృదయాలూ అర్ధం కానన్నాళ్ళూ అట్లా గడిచిపోయింది. హృదయౌన్నత్యాన్ని అర్ధం చేసుకుని మనస్సు లో వీడి పోనీ మమతల ను మనస్పూర్తి గా చెప్పు కుందామనుకుంటే , అసలు మనస్సే లేకుండా మాట్లాడుతున్నదనుకున్నాడు సురేంద్ర.
తను అన్న మాటలకు సురేంద్ర ఏం సమాధానం చెపుతాడో నని ఆదుర్దాగా అతని వైపు చూసింది శ్యామ సుందరి. ఇంత కాలానికి గాను బావతో మనస్పూర్తిగా మాట్లాడటానికి అవకాశం చిక్కింది గదా అనే ఆనందాతిశయం లో, ఏం మాట్లాడాలో తోచక ఈ మాటలు అన్నది శ్యామ సుందరి. అర్ధం కాని సురేంద్ర హృదయాన్ని అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించా ననుకున్నది. కాని ఎంతవరకూ కృత క్రుత్యురాల నవుతానా అన్న సంశయం శ్యామసుందరి మనస్సు లో నుంచి తొలగి పోలేదు.
"నిన్ను ఏమనుకోవాలో అర్ధం కావటం లేదు శ్యామా. నిన్ను ముద్దుగా శ్యామా అనే పిలుస్తాను. మరీ చిన్న తనంలో చూసిన అప్పటి పరిస్థితుల్లో నీ బాహ్య సౌందర్యానికే ప్రాధాన్యం ఇచ్చాను గాని, నీ మనస్సు ను తెలుసుకోవటానికి ప్రయత్నించాలనే కోరిక నాకు అప్పట్లో లేకపోయింది. అప్పటితో పోలిస్తే , నీ లావులో నుంచి నాలుగు తీసేసి, పొడుగుని మూడు పెట్టి హెచ్చ వేశారా అనిపిస్తున్నది. ఇప్పుడు నువ్వు అందమైన చక్కని ఆడపిల్లవు. నీలో నాకు ఏ లోటూ కనిపించటం లేదు" అన్నాడు.
ఆనందాతిశయం తో ఆమె శరీరం మొగ్గలు తొడిగింది. హృదయం లో బావ ప్రేమను రంగరించు కుంది. మనస్సంతా బావ రూపం తోనే నిండిపోయింది.
"నీకు మనస్పూర్తిగా నచ్చానా బావా? ఇప్పుడు బాగున్నానంటావా?"
"నచ్చటమే కాదు శ్యామా. ప్రేమిస్తున్నాను. కాని ఒక్కటే విచారం. చేతులు కాలిన తరువాత ఆకులూ పట్టుకుని లాభం లేదన్నట్లుగా మన మనస్సులు వికసించి, ఒకరి నోకరం అర్ధం చేసుకున్న తరుణం లో , పెద్ద వాళ్ళకు మనస్పర్ధలు ఏర్పడి, మన మమతలకు అడ్డు గోడలు కట్టారు. పార్టీ తత్వాల్లో మునిగి తెలేవారికి మనబోటి వాళ్ళ లేత హృదయాలు అర్ధం కావు." మనస్సులో ఎంతో బాధపడుతూ అన్నాడు సురేంద్ర.
అప్పటికే పార్కు లో చాలామంది జనం షికారు వచ్చారు. అంతా వింతగా తమ వైపే చూడటం ఇద్దరికీ బాధ కలిగింది. పార్కు లో నుంచి లేచి వచ్చి వేశారు.
"సినిమాకు వెళదామా, శ్యామా?"
"నీ ఇష్టం బావా . పోదామా?"
"మరి నువ్వు హాస్టల్లో ఉంటున్నావు గా? మీ వార్డెను కేక లేయ్యదూ?"
"ఆమెను నేను వేడుకుని సమాధానం చెప్పుకుంటాను."
"జీవితం లో ఇదొక మహత్తరమైన సన్నివేశం శ్యామా. కాదు. మధురాతి మధురమైన పర్వదినంగా భావిస్తున్నాను."
ఇద్దరూ సినిమాకు వెళ్ళారు. సురేంద్ర బావ పక్కన కూర్చుని సినిమా చూస్తుంటే శ్యామసుందరి మనస్సు లో ఆనందంతో అనేక ఆలోచనలూ, భావాలూ నృత్యం చేసినాయి.
ఎక్కడో పోగొట్టుకున్న ఆప్యాయమైన వస్తువును తిరిగి పొందగలిగినట్లు గా భావించాడు సురేంద్ర. అనురాగ రంజితమైన ఆ లేత హృదయాల్లో ప్రేమ వాహిని తొణికిసలాడింది. ఇద్దరి హృదయాల్లో ఎప్పుడో ఇంకిపోయిన అనురాగ భరితమైన అమృత ఝురులు పొంగారి, అంచులు తాకినాయి. ఉత్సాహం కట్టలు తెంచు కుని ప్రవహించింది.
సినిమా వదిలారు. ఇద్దరూ హల్లో నుంచి వచ్చేశారు.
"నిన్ను హాస్టలు వద్ద దిగవిడిచి వెళ్ళనా, శ్యామా?"
"అక్కర్లేదు బావా. హాస్టలు చుట్టూ పక్కల ఎవరయినా మనం కలిసి రావటం చూస్తె మర్నాడు అందరి నోళ్ళ లోనూ పడతాను. నేనొక్కదాన్నే రిక్షా లో వెళతాను. చూడు, బావా , వచ్చే ఆదివారం సాయత్రం నాలుగింటికి నువ్వున్న చోటికి వస్తాను. కులాసాగా కబుర్లు చెప్పుకుందాం."
"నీకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటాను. నాలుగింటి కల్లా రావాలి."
"అట్లాగే. అయితే నీ గది ఎక్కడ?"
"అడ్రసు చెప్పాడు సురేంద్ర. మనస్సులు కలిసినా, శరీరాలు దూరమై , వెనక్కు తిరిగి చూసుకుంటూనే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు.
అనుకున్నట్లుగానే ఆదివారం సాయంత్రం నాలుగు గంటల కల్లా సురేంద్ర గదికి వెళ్ళింది శ్యామసుందరి. గదిలో అడుగు పెడుతూనే . "నేను వస్తానా రానా అని ఆలోచిస్తూ కూర్చున్నావా, బావా?" అన్నది. గోడకు అనుకుని చాప మీద కూర్చున్నది శ్యామ సుందరి. తనూ ఒక పక్కన కూర్చున్నాడు సురేంద్ర. ఆ స్థితిలో అట్లా కూర్చున్న శ్యామసుందరి ని చూసేసరికి వసుంధర గుర్తుకు వచ్చింది సురేంద్ర కు. తనలో తను నవ్వుకున్నాడు.
"ఎందుకు బావా, నవ్వుతావ్? ఈ ఆడపిల్ల సిగ్గయినా లేకుండా తెగించి ఇట్లా వచ్చి కూర్చుందేమా అనేనా?"
"కాదు శ్యామా. నా మంచి చెడ్డలు కోరే వాళ్ళల్లో నా స్నేహితుడు రమేష్ అని ఒకరున్నాడు. అతనూ నేనూ ఒక సంవత్సరం ఈ గదిలోనే ఉన్నాం. అతను వెళ్ళిపోయాడు. మా ఇద్దరి మనస్సులూ ఒక్కటే. కొన్ని చిత్రమైన పరిస్థితుల్లో చక్కని వాతావరణాన్ని కల్పించుకుని వాడి చాకచక్యం వల్ల , వసుంధర అనే అమ్మాయిని ప్రేమించి, ప్రేమింప జేసుకుని పెళ్లి చేసుకున్నాడు. వసుంధర కూడా ఇక్కడికి వచ్చేది. ఇట్లాగే ఈ చాప మీద గోడ కానుకుని కూర్చునేది. నేటి కాలానికి నువ్వుఅట్లాగే కూర్చుంటే వసుంధర గుర్తు వచ్చింది. అందుకు నాలో నేను నవ్వుకున్నాను." అన్నాడు నవ్వుతూ సురేంద్ర.
"అయితే నేను కూడా వసుంధర మాదిరే ఈ గదిలో కూర్చుంటున్నానన్నమాట. పోనీలే బావా అచ్చి వచ్చిన గది. అనావాయితీ తప్పకుండా ఉండటం మరీ మంచిదేగా" అన్నది శ్యామ సుందరి.
"వాళ్ళు కాబట్టి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మన సంగతి ......" అన్నాడు సురేంద్ర.
ఈ మాటకు శ్యామ సుందరి మనస్సు లో బాధపడింది. తను ఎంత కల్పించుకుని, మనసిచ్చి మాట్లాడినా, సురేంద్ర ఇట్లా అంటీ ముట్టనట్లుగా మాట్లాడుతాడేమా అనుకుంది శ్యామసుందరి.
"బావా?"
"ఏం శ్యామా?"
"నేనంటే నీకు ఇష్టం లేదు కదూ?"
"అని నేనన్నానా?"
"మనస్పూర్తిగా నేనడిగేడానికి సమాధానం చెప్తావా బావా?"
"తప్పక."
"మా ఊళ్ళో ఉన్నప్పుడు అనుక్షణం నిన్నే తలుచుకుని మా బావ ఇట్లా ఉంటాడు, అట్లా ఉంటాడు అని మనస్సులో నీ రూపు రేఖల్నీ ఊహించు కుంటూ ఎంతో ఆనంద పడేదాన్ని. ఎప్పటికి నిన్ను చూస్తానా అని తపించే డాన్ని. కాని నువ్వు నన్ను తలుచుకొనే లేదు కదూ బావా?"
"నీకెట్లా తెలుసు తలుచు కోలేదని?"
"నాలిక కోరుక్కోలేదు ఎప్పుడూ!"
ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ నవ్వులో ఎన్నో సంవత్సరాల ప్రేమానుబంధం కట్లు తెంచుకుని ముందుకు దూకినట్ల యింది.
"తలుచుకునే వాడినే. కాని ఇప్పుడున్నంత ఇష్టం అప్పుడు లేదు. అప్పటి సురేంద్ర వేరు. ఇప్పటి సురేంద్ర వేరు. అప్పటి శ్యామసుందరి దిబ్బిన కుక్క. ఇప్పటి శ్యామ సుందరి నా ఆరాధ్య దేవత, అందాల రాణి."
"ఇప్పుడు కాని నేనంటే ఇష్టం కలగలేదన్న మాట?"
"ఇన్ని అనుమానాలేందుకు శ్యామా? నిన్ను పెళ్లి చేసుకోవాలను కుంటున్నాను. చాలా. నన్ను పరీక్షించడం అయిందా, శ్యామా? మన జీవితాలు పిచ్చి కుదిరితే కాని పెళ్లి కుదరదు, పెళ్లి కుదిరితే కాని పిచ్చి కుదరదన్నట్లుగా ఉన్నయ్యి. మనం ఒకరి నోకరం అర్ధం చేసుకుని ఆత్మార్పణ చేసుకున్న తరుణం లో పెద్ద వాళ్ళ మధ్య మనస్పర్ధలు వేళ్ళు పాతుకు పొయినయ్యి. పార్టీ తత్వమనే విత్తనం పడకుండా ఉన్నంత వరకే రాజకీయవేత్తలు ఒకరి నొకరు పరామర్శించుకుంటారు. పార్టీ తత్త్వం మొలకేత్తిందో భార్య భర్తలు, తండ్రి కొడుకుల్లోనే ఎన్నో కలతలు వస్తయ్యి." అన్నాడు సురేంద్ర నిరాశగా.
"నిజమే, బావా. ఈ పరిస్థితుల్లో వాళ్ళు మనల్ని అర్ధం చేసుకోలేరు. అధికార పక్షం తో అంతర్యాలు, అంతస్తులు కూడా మరిచిపోయి వ్యవహరిస్తారు. పొట్టేళ్ల మధ్య మేక పిల్లల్లా మనం నలిగి పోవలసిందే."
"శ్యామా , మావయ్య ఈ విషయం ఆలోచించటం లేదా? నిన్ను మరెవరి కయినా ఇచ్చి చెయ్యాలను కుంటున్నాడా?"
"లేదు బావా, లేదు. నన్ను చదువులో ప్రవేశ పెట్టాక అయన పెళ్లి విషయమే ఎత్తటం లేదు. వాళ్ళ పార్టీ రాజకీయాలకు మనం బాలి కావలసిందేనా బావా?> ఇంక మన జీవితాలు నశించి పోవలసిందేనా?"
శ్యామసుందరి కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. రెండు కన్నీటి బొట్లు చాప మీద పడ్డాయి. సురేంద్ర అంతా అర్ధం చేసుకున్నాడు. శ్యామసుందరి ని పొదివి పట్టుకుని, తన గుండెల కడుముకుని, ఒళ్లోకి తీసుకున్నాడు, ఆమె కళ్ళు తుడుస్తూ.
"శ్యామా! ఛా, ఊరుకో. ఎందుకా కన్నీళ్లు? పెద్ద వాళ్ళు మూర్ఖపు పట్టుదలతో మనకు పెళ్ళిళ్ళు చెయ్యరే అనుకో. మనం కూడా ఆత్మ విశ్వశాన్ని పోగొట్టుకుని జీవితాలు నాశనం చేసుకుంటావా చెప్పు? దైవ సాక్షి గా నిన్ను పెళ్లి చేసుకుంటాను. నామాట నమ్ము శ్యామా!" అంటూ మరింత గట్టిగా దగ్గరకు తీసుకుని ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. సంతోషాతిశయంతో మనస్సూ, హృదయమూ పరవళ్ళు తొక్కుతుంటే అతని కౌగిలి లో కరిగిపోయింది శ్యామ సుందరి.
"నువ్వింత ధైర్యంగా మాట్లాదతావని అనుకోలేదు బావా. నిన్ను మనః పూర్తిగా అర్ధం చేసుకున్నాను. నాకింకా ఏ దిగులూ, విచారమూ లేదు" అన్నది శ్యామసుందరి, అతని కళ్ళల్లోకి చూస్తూ ఇద్దరి కనుపాప లలోనూ ఒకరిప్రతిబింబాలు మరొకరు చూసుకుని తృప్తిగా నవ్వుకున్నారు. రాగరంజితమైన అపరంజి బొమ్మలా అతని ఒళ్లో ఒదిగి కూర్చుంది శ్యామసుందరి. లేత గులాబి లాంటి ఆమె చెక్కిళ్ళూ , ప్రేమ పూరితమైన ఆమె సోగ కన్నులూ చూస్తూ పదేపదే ఆమె ఎర్రటి పెదవులను ముద్దు పెట్టుకున్నాడు సురేంద్ర.
ఆ మధురాను భూతుల్ని అనుభవిస్తూ ఎంతో సేపు అట్లాగే కూర్చుండి పోయారు.
సాయంత్రం ఆరు దాటింది. చీకటి పడింది.
"బావా?"
"ఏం శ్యామా?"
"నువ్వు మా సురేంద్ర బావవేనా?"
"ఏం అట్లా అంటున్నావ్ శ్యామా?"
"ఏం చెప్పాలో నాకు తెలీటం లేదు. ఈ రోజు నా జీవితంలో మరువలేని రోజు. నేను బావకు దూరమయ్యానని ఎంతో బాధపడ్డాను. నన్ను నేను నిందించు కున్నాను. ఇప్పుడను కుంటున్నాను-- మా బావ కు నేను ఎప్పుడూ దూరం కాలేదని, ఇంక ఎప్పుడూ దూరం కాననీ."
"నేను మాత్రం అట్లా అనుకోవటం లేదంటావా? ఈ రోజుకి నేనూ ఒక మానవుడినయాను. నాకూ మంచి చెడ్డలూ, ప్రేమా హృదయమూ, అనుభూతులూ అనురాగమూ అన్నీ తెలుసు. అన్నీ తెలుసుకుని అర్ధం చేసుకున్నాను. ఈ అందాల బాల , ఈ సురేంద్ర బావను ఎప్పుడూ పెన వేసుకునే ఉండాలి" అంటూ ఆమె కళ్ళల్లో కి తృప్తి గా చూసి ఆమె చెక్కిళ్ళ ను ముద్దులతో ముంచెత్తాడు.
వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళింది శ్యామసుందరి. వాళ్ళ జీవితాల్లో నవవసంతాలు వెల్లి విరిసినాయి.
