తల వంచుకుని "అలాగే " అన్నాడు వాసు నెమ్మదిగా.
ఆ సాయంత్రం ఇంత మొహం చేసుకుని బిక్కు బిక్కు మంటూ చేత్తో డబ్బు సంచీ పట్టుకుని మణి శేషయ్య ఇంటికి వచ్చింది. చిన్నబోయిన మణి ముఖాన్ని , చేతిలో ఉన్న సంచీ ని చూసి తెల్లబోయాడు శేషయ్య. నెమ్మదిగా దగ్గిరికి వచ్చి "మావయ్యా మరేమోనే ఈ సంచీ నీకు తిరిగి ఇచ్చెయ్య మన్నాడు నాన్న" అంది మణి.
"ఉహు ?......తీసుకొనేది లేదు. వెనక్కి పట్టుకు పో'" అన్నాడు శేషయ్య కంఠం లో కర్కశత్వన్నీ , దృడత్వాన్నీ సూచిస్తూ.
"ఇచ్చేయ్యక పోతే నాన్న తిడతాడు " మణికి ఏడుపు పర్యంతం వచ్చింది ఆ మాట అంటున్నప్పుడు.
ఇస్తే నే తిడతాను" అన్నాడు శేషయ్య కోపంగా.
మణి బావురుమంది.
శేషయ్య లో ఏమీ చలనం కలగలేదు.
కొంచెం సేపటికి సర్దుకొంది . కాని మధ్య మధ్య "ఎక్కు" వస్తోంది. బాధ ఇంకా తగ్గలేదు. ఉండుండి వస్తూన్న ఎక్కును అపుకుంటూనే అంది నాన్నకి ఇంతగా కోపం వస్తుందనే ఇలా కేకలేసెస్తాడనీ తెలియదు లేకపోతే పొద్దుట వాసు దగ్గర్నుంచీ ఈ సంచీ తీసుకోక పోయి ఉందును. ఇప్పుడు అమ్మనీ , నన్నూ తీసుకున్నామని తెగ కేకలేస్తున్నాడు. పుచ్చు కొన్నది నువ్వే కనక నవ్వే పట్టికెళ్ళి ఇచ్చేసి రా. మళ్ళీ వెనక్కి తెచ్చావో వీపు చీరేస్తాను , అంటున్నాడు నువ్వేమో తీసికొను వెనక్కి పట్టుకు పో అంటున్నావు -- ఇప్పుడెలాగ? నేనేం చెయ్యాలి?..... నాకు భయం వేస్తోంది ...పట్టుకెళితే నాన్న చంపేస్తాడు.....ఇప్పుడెలాగ ? ...ఎలాగ?....." భయంతో నూ బెంగతో నూ , విచార వదనం తోనూ నిలాబడి ఉన్న మణిని చూసేసరికి శేషయ్య గుండె కొద్దిగా కరిగింది.
"ఇలా చూడు మణీ ?.....ఇవాళ మాంచి కోపంలో ఉండి కేకలేస్తున్నాడు కాని రెండు రోజులు పోతే కోపం తగ్గి ఇంచక్కా తీసుకుంటాడు నాన్న. అందువల్ల నువ్వీ డబ్బు పట్టికెళ్ళి దాచి నాన్న కి కోపం తగ్గాక ఇయ్యి . ఏం ?' అన్నాడు బుజ్జగిస్తూ శేషయ్య.
"యెక్కడ దాచను ?.....నాకు భయం వేస్తోంది......"
"ఏం భయం లేడు అందాకా నీ పెట్టి అడుగునో పెట్టి వెళ్ళు. నే చెప్పినట్లు చెయ్యి . మంచి దానవు కదూ?.....మా మణి ఎంతో మంచిదట . చెప్పినట్లు వింటుందిట.....ఏం?...ఈ మిఠాయి పొట్లం తీసుకో !" అంటూ అంత క్రితమే సెట్టి కొట్లోంచి తెప్పించి వుంచిన మిఠాయి కొమ్ముల పొట్లాం ఆమె చేతిలో పెట్ట బోయాడు శేషయ్య.
మణి నవ్వి "భలేవాడివి మావయ్యా . నేనింకీ మిఠాయి పొట్లాలు తీసుకోవడం, తరచూ మీ ఇంటికి రావడం , ఇవేం చెయ్యకూడదుట!... నీకింకా తెలియదేవిటి నేను పెద్ద పిల్ల నవుతున్నాను , రేపటితో నాకు పదకొండు ఏళ్ళు వస్తాయి తెల్సా?.....నాన్న చెప్పాడు అందుకే నీ నాలుగైదు రోజుల నుంచీ రావడం లేదు మీ ఇంటికి ........ " అంది. శేషయ్య తెల్లబోయాడు.
'ఇవాళ తనకీ నాకూ మాట మాటా వచ్చిందని చంటి పిల్లను ఇక్కడికి రాకుండా కట్టడి చేస్తున్నాడా శంకరం ...." ఇలాంటివి పెద్దవాళ్ళూ పెద్దవాళ్ళూ చూసుకోవాలి కాన్ మద్యని పిల్లల్నేందుకు ఆంక్షలు పెట్ట్టడం ....ఎంత పని చేశాడు?.....ఇందుకా ఈ పసిది అయిదారు రోజుల నుంచీ రాలేదు -- ఇంకా ఏ రోజు కారోజే వస్తుందను కొని తాను రోజూ సెట్టి కొట్లోంచి మిఠాయి పొట్లాం ఒకటి తెప్పించి ఉంచుతున్నాడు. ఇంక ముందు మణి ని కూడా చూడకుండా చేస్తాడన్నమాట శంకరం . ఏం కక్ష సాధిస్తున్నాడు కర్కోటకుడు!"
శేషయ్య కళ్ళు ఆర్ద్రం అయాయి ఈ ఆలోచనతో -
అది చూసి మణి "ఏడుస్తున్నావా మావయ్యా!..ఇవాళ్టి కి తీసుకుంటానులే పోనీ" అంటూ మిథాయి పొట్లం ఓ చేత్తో అందుకుని రెండో చేత్తో డబ్బు సంచీ పట్టుకొని వెళ్ళిపోయింది.
ఆమె వెళ్ళిన దిక్కే కొంతసేపు చూసి "హమ్మయ్య . మాట నామీద లేకుండా డబ్బు శంకరానికి పంపేశాను -- తర్వాత అతని ఇష్టం " అంటూ ఏదో పెద్ద భారం తీరినట్లు శ్వాస వదిలాడు -- ఇలాగే అటు శంకరం కూడా అనుకుని తృప్తి పడుతున్నాడని మధ్యన ఆ సొమ్ము ఎవరికీ తెలియకుండా మణి పెట్టెలో మూలుగుతూ ఉండి పోయిందనీ పాపం అతనికేం తెలుసు.
"మొత్తానికి సొమ్ము తీసుకున్నాడు శంకరం . వట్టి డబ్బు మనిషి?' అని ఇక్కడ శేషయ్య అనుకుంటే , "తిప్పిస్తే తీసుకున్నాడు శేషయ్య -- అవును డబ్బు చేదా ఏవిటి ?" అనుకున్నాడు అక్కడ శంకరం.
రోజులు గడుస్తున్నాయి.
ఇన్నాళ్ళూ ప్రాణానికి ప్రాణంగా ఉంటూ వచ్చిన డాక్టరు కీ, పేద కాపుకీ చెడిందనీ, అందుకే పెద్ద కాపు శేషయ్య మీద కక్ష కట్టి, మునసబు తరపున తమ్ముడి చేత వకాల్తా నామా పడేయించి పకడ్బందీ గా శంకరం కేసు నడిపిస్తున్నాడనీ, అసలు ఆ విషయం తమ్ముడితో మాట్లాడడం కోసమే ఎప్పుడూ వెళ్ళని వాడు రాజమండ్రి వెళ్ళాడని ఊళ్ళో కొందరు అనుకుంటుంటే, ఇందులో డాక్టరు గారిది కాదుట మొదటి తప్పు , మాటా మాటా వచ్చి "నువ్వు తప్ప ఊరికి దిక్కు లేదు అనుకున్నావా ?....చూస్కో నా కొడుకు ని డాక్టర్ చదివించి నీకు పోటీ పెట్టిస్తాను " అని శేషయ్యే ముందు అన్నాడనీ, అందుకే కోపం వచ్చి డాక్టరు గారు రాజమండ్రి వెళ్లి తమ్ముడి ని ఎదర పార్టీ వకాల్తా నామా తీసుకొనేలా బలవంతంగా ఒప్పించారనీ, లేకపోతె తన ఉన్నత విద్యకీ, ఉజ్జ్వల భవిష్యత్తు కి అన్ని విధాల సహాయం చేసిన పెద్ద కాపుకీ వ్యతిరేకంగా కేసులో పని చెయ్యడానికి గోపాలం ఒప్పుకొని ఉండేవాడు కాదనీ మరికొందరు అనుకోసాగారు.
మొత్తం మీద వారం పది రోజులయేసరికి డాక్టర్ పెద్ద కాపూ మొహా మొహాలు చూసుకోవడం లేదనే వార్తా ఆ గ్రామం లోనే కాకుండా చుట్టూ పక్కల గ్రామాల్లో కూడా వ్యాపించింది, అందరూ దీన్ని గోరంతలు కొండంతలు చేసి విచిత్రంగా చెప్పుకోవడమే కాని, అసలీ వైరం ఎలా ప్రారంభం అయిందో ఎందుకు ప్రారంభం అయిందో ఒక్కళ్ళ కీ అంతు పట్టలేదు. ఎవరికి తోచిన ఊహాగానాలు వాళ్ళు చేస్తుంటే చిరాకేసి ఇరువైపులా అభిమానం ఉన్న కొందరు అసలు సంగతేమిటో తెలుసుకుందాం అని ప్రయత్నం చేశారు. కాని వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదు. ఏమంటే ఇటు డాక్టరు దగ్గరికి వెళితే గట్టిగా కసురుకుని "వెళ్లి ఆ శేషయ్య ని కనుక్కోండి" అన్నాడు. శేషయ్య దగ్గర కెళితే అతను చాలాసేపు మౌనంగా ఊరుకొని ఊరుకొని చివరికి నెమ్మదిగా "ఆయన్నే కనుక్కోక పోయారా?' అన్నాడు. ఆ విధంగా అసలు కారణం ఏదో గుప్తంగానే ఉండిపోయింది ! దాని వల్ల జనించిన కక్షలూ కార్పణ్యాలూ మాత్రం రోజురోజుకి పెరిగి పోతున్నాయి.
కొందరు అవకాశ వాదులు ఇదే అడననుకొని ఇటు శంకరానికి శేషయ్య మీద, అటు శేషయ్య కి శంకరం మీదా లేనిపోని కొండేలు చెబుతూ వాళ్ళ వాళ్లకి ఉన్న అవసరాలనీ లాభాల్నీ తేల్చుకోవాలని చూశారు. కాని అక్కడ శంకరం కాని ఇక్కడ శేషయ్య కాని పడనియ్యలేదు. గట్టిగా చివాట్లు పెట్టి శంకరం , చల్లగా కబుర్లు చెప్పి శేషయ్య వాళ్ళని సాగనంపె వారు.
అయితే ఆ చెప్పిన సంగతులు ఒకమాటు కాకపొతే ఒక మాటైనా మనస్సు మీద పనిచేసి, చూశావా నేను ఊరుకున్నా తను కక్ష సాధిస్తున్నాడన్న మాట! అనుకునేవారు ఇద్దరూ ఎవరి మట్టుకి వాళ్ళే!.......
వాసుకి మెడిసిన్ లో సీటు వచ్చి చేరాక శేషయ్య కళ్ళు తృప్తి తో కూడిన గర్వంతో మెరిశాయి. నాలుగేళ్ళు కళ్ళు మూసుకుంటే సరి తన వాళ్లకి కాని ఒకళ్ళ ప్రేక్ష్యం అక్కర్లేదు. అప్పుడీ శంకరం రంగు నీళ్ళ మీద ఎవళ్ళూ ఆధార పడనక్కర లేదు. వంద మందికి తన వాసే ఇస్తాడు శుభ్రమైన మందులు. అలా ఇచ్చే వాడెవడూ ఇప్పుడు లేడనే కదా ఈ శంకరం గర్వం ?....ఏం గర్వం?.......ఏం మిడిసి పాటు ? ఆశ్చర్యం వేస్తుంది ఆలోచిస్తే -- పదేళ్ళ క్రితం తాదూ బొంగరం ఏం లేకుండా వచ్చి తన పెంకుటి సావిట్లో ఆసుపత్రి ప్రారంభించి రెండునెలలు పూర్తిగా ఉప్పుతో తొమ్మిది తను పంపిస్తే కాని గడవని శంకరం, ఇవాళ చుట్టూ పక్కల ఊళ్ళల్లో బోలెడు పలుకుబడి, ఊళ్ళో ఓ స్థానం. పాతిక ముప్పై వేలు కిమ్మతు చేసే ఇల్లూ , మంచి హస్త వాసి గల డాక్టరు అనే పెద్ద పేరూ సంపాదించాడు! మంచిదే ! వెయ్యేళ్ళ కి బాగు పడవలసిందే!
కాని ఇదేవిటి?
ఇంత ఉపకారం చేసి, ఇన్నాళ్ళ నుంచీ సోదరుడిలా ఇంత ఇదిగా చూసిన తన మీద కక్ష కడతాడేవిటి?.....ముష్టి రెండు వేల రూపాయల కోసం తనని అనుమానిస్తాడా?....తెలివి తక్కువ మనిషి!.....
ఇలా ఓరోజున వసారాలో ఉయ్యాల బల్ల మీద ఆలోచించుకుంటూ కూచున్న శేషయ్య దగ్గరికి రంగయ్య రోప్పుకుంటూ వచ్చి ...."మన బట్లావు ఈనిందండీ." అంటూ సంతోషంతో చెప్పాడు.
"ఆహా! ...."ఏం దూడ?....అన్నాడు శేషయ్య ఉయ్యాల మీంచి లేస్తూ --'
"గిత్త దూడండి"
"ఏవిటి.....గిత్త దూడే !....నిజంగా?....హమ్మయ్యా-- ఎన్ని ఈతల తర్వాత గిత్త దూడని పెట్టింది ...దాన్ని మనం ఇంతక్రితం అనుకున్న ప్రకారం అచ్చోసి ఊరు ఉమ్మడి సొత్తుగా వదలాలి. ఈ రెండు మూడేళ్ళు ఎలా మేపుతావో --
"మన సోవన్న కి అప్పగిస్తే సరండి. ఓ పక్క పాలు ఒదిలేసి లేత గరికలు ఎసి మా వోటంగా మేపుతాడండి. అచ్చోసి వెంకన్న బాబు ఎసెస్తే రోజు తలకి అది సేతిలో సేయ్యేత్తు దూడ అవుద్దండీ గిత్త........."
"ఏమో-- సోవన్న కే అప్పకిస్తావో నువ్వే చూస్తావో ఏడాది తిరిగే సరికి నల్లని మూవురంతో మన వెంకన్న బాబు "ఖనీల్ " మంటే అరంకే విన్నవాళ్ళ గుండెలు మాత్రం దడాల్ మనాలి"
"సిత్తం "
"ఊ......ముర్రు పాలేవీ?....."
"ఎనకాల సోవన్న తెస్తన్నాడండి"
అడిగాడు కాని ఆవెంటనే శేషయ్య నవ్వుకున్నాడు. ఇప్పుడవి తెస్తే ఎవరు కాచేటట్టు ?....ఆ ముసలి మేనత్త ని ఇబ్బంది పెట్టాలి. పోనీ ఆవిడ ఎలాగో అలాగా కాచి జున్ను చేస్తుందయ్యా తినేవాళ్ళు ఏరి ?....ఆఖరికి కుర్ర నాగన్న వాసు కూడా లేడు. వెంటనే శేషయ్య కి శంకరం జ్ఞాపకం వచ్చాడు. బెల్లం పొడి మిరియప్పొడి కలిసి వండిన ఆవు జున్ను అంటే శంకరానికి మహా ఇష్టం. ఈ బట్లావు ఈనినప్పుడల్లా ముసలి అత్తని ఎలాగో అలాగ ఇబ్బంది పెట్టి తప్పేలాడుగ జున్ను అయితే వండించి పట్టి కెళ్ళేవాడు తను. చేతులో చేతులోంచే అందుకొని ఎంతో ఇష్టంగా తినేవాడు శంకరం.
ఇప్పుడూ అలా పంపిస్తే ? తింటాడెమో!...ఉహు!....తీసుకుంటాడా అసలు?....పౌరుషం ఎంత?....పోనీ రంగయ్య ద్వారా పంపిస్తే ? ...ఆ ....ఓ లాగ చెయ్యొచ్చు . తను పంపించినట్లు కాకుండా , రంగయ్య స్వంత అనే ఈనుతే రంగయ్యే వండించి పట్టి కెళ్ళినట్లు చెప్పిస్తే సరి?....
