Previous Page Next Page 
ధర్మ చక్రం పేజి 27


                                   32
    ఆలోచనలకూ అడనమైన ఆలోచనలు తోడూ కాగా, హృదయ భారం అధికం కాసాగింది ధర్మారావు కు. ఈ సమస్యల అల్లిక అతడిని తామర తంపర లాగా బంధించి వేసింది. ఖైదీలలో గౌతమ్ ప్రధమ వీక్షణం లోనే తన మనస్సులో గౌరవ స్థానాన్ని పొందాడు. విదేశీయుల తో కలిసి స్వదేశం పై కుట్ర పన్నాడనే అభియోగం తో కారాగార వాసం అనుభవిస్తున్న అతడి పై తనకు అభిమానం ఎందుకో తనకే తెలియదు! ఎంత నూతను లైనా కొందరు వ్యక్తులను చూడగానే అనిర్వచనీయమైన ఆత్మీయత పెనవేసుకుంటుంది. అందుకే ఈ బాధ! ఇక దయామయి విస్మరించ రానిది, విడదీయ లేనిది! అయితే, ఈ దయామయి కీ, ఆ గౌతమ్ కూ ఏదో తనకు తెలియని రహస్య సంబంధం!
    చూస్తుండగానే ఏర్పడిపోయిన ఈ సమస్యా త్రిభుజం లో ఇరుక్కుపోయిన తన గతి ఏమి కానున్నదో?
    అట్లా ఆలోచనలు సాగుతుండగానే . ప్రాగ్దిలలో అరుణోదయం కావడం, ఆదిత్యుడు మెల్లమెల్లగా అధిక తాపవంతుడు కావడం జరిగిపోయాయి. హటాత్తుగా ఆ విషయం గుర్తించిన ధర్మారావు చకితుడై లేచాడు.
    తనకోసం ఆ సమయానికే కాఫీ, ఉపాహారాలను సిద్దం చేసే అమ్మ పూజా మందిరం ముందు, విగ్రహాల దెస వెర్రిగా చూస్తూ ఒక విగ్రహమై పోయినట్టు కనిపించింది. కొంత తడవు నిశ్చేష్టుడై నిలిచినా అతడు మెల్లగా చెంత చేరి కన్నీటి సెలయేళ్ళు ఎండిపోయిన జాడలను స్పష్టంగా చూపుతున్న ఆమె చెక్కిళ్ళ ను రుమాలుతో ఒత్తుతూ అన్నాడు: "అమ్మా ఏమిటి నీ బాధ? చెప్పవా?"
    అప్పటికి ప్రతిమ లో చైతన్యం వచ్చి పరిసరాలను గుర్తించింది. "ఏమి లేదు బాబూ, బాధలకే పుట్టిన ' మానవులం నిర్భాగ్యులం ." ఉస్సురంటూ లేచింది. "అయ్యో, నీకు ఆలస్యమై పోతుంది కాబోలు! ఉండు, త్వరగా కాఫీ పెట్టి ఇస్తాను."
    'ప్రతి మనిషికీ ఎన్నో మూగ బాధలు!' అనుకోని బాధపడ్డాడు ధర్మారావు. "తొందర లేదులే, అమ్మా. కాస్సేపలా బయట తిరిగి వస్తాను. సావకాశంగా చెయ్యి."
    రెండడుగులు వేసి మళ్ళీ వెనక్కు వచ్చాడు. "అమ్మా! చూడు నాతొ చెప్పడానికి ఏమిటి అభ్యంతరం? నీ బాధ ఏమిటో నాకు చెప్పటానికి కాస్త ప్రయత్నించు ."        
    స్టౌవెలిగిస్తున్న దయామయి తలెత్తింది. "చూడు, బాబూ! నారాయణ స్వామి గారిని రమ్మని టెలిగ్రామ్ ఇవ్వగలవా?"
    ఆమె మానసిక స్థితిని గ్రహించిన ధర్మరావు ఎదురు ప్రశ్న వేయలేదు. "అలాగే నమ్మా" అంటూ వెళ్ళిపోయాడు.
    కర్తవ్య మూడుడై విశాలమైన జైలు ఆవరణ లో పచారు చేయసాగాడు ధర్మరావు. ఇంకా ఎక్కడా సందడి లేదు. అటు వచ్చిన సెంట్రీతో అన్యమనస్కం గానే  రెండు మాటలు మాట్లాడాడు.    ఎక్కడా మనసు నిలవక, ఏమీ తోచక తిరిగి ఇంటికే వచ్చాడు.
    "టెలిగ్రామ్ ఇచ్చావా?" అని అడిగింది. దయామయి కాఫీ ఇస్తూ. "లేదు ఇప్పుడిస్తాను." అన్నాడు.
    పెద్ద సంభాషణ ఏమీ జరగలేదు. ఎవరి ఆలోచనలలో వారున్నారు.
    ఎనిమిది గంటలకు అతడు ఆఫీసు దుస్తులు వేసుకుని తయారవుతుండగా , మెల్లగా సమీపించింది దయామయి.
    "ఏమిటి' అన్నట్లు చూచాడు ధర్మారావు.
    "ఆ ఖైదీ విషయం ఏం నిర్ణయించావు?'
    లోలోన చెలరేగుతున్న బావ పరంపరను అణుచుకుంటూ చెప్పాడు ; ఆలోచించడానికి నేనెవరి నమ్మా? నేరస్తుడు పారిపోయాడు. చట్టం వెంటాడుతుంది. నేను నిమిత్త మాత్రుడినే , ఇందులో."
    "అలా కాదు," స్థిరంగా అన్నది దయామయి.
    "మరేమిటమ్మా?' ఆశ్చర్యం ప్రకటించాయి ధర్మారావు ముఖ కవళికలు. "అయినా ఆ సంగతులేవో నేను చూచు కుంటానులే. నువ్వు అనవసరంగా ఈ విషయం గురించి ఆలోచించకు. నీ మనస్సు అసలే బాగున్నట్టు లేదు."
    "అనవసరం కాదు. నాకు చాలా అవసరమైన విషయం ఇది. నీవు సాధ్యమైనంత వరకూ అతడికి మేలే చేయడానికి ప్రయత్నించు. విషయాన్ని రూపు మాపేయి."
    "అమ్మా!" భూమ్యాకాశాలు గిరగిరా తిరిగి పోయాయి. "ఏమిటిది? ఏం మాట్లాడుతున్నావు?' నన్ను ధర్మదూరుడు కమ్మంటావా?"
    వింటూనే ఆవేశావతి అయిపొయింది దయామయి. "కాదు ధర్మాన్ని రక్షించ మంతున్నాను. నోరులేక మారుమూల మగ్గిపోతున్న ధర్మ మూర్తిని రక్షించి, ధర్మదేవత ను ఉద్దరించ మంటున్నాను. బాబూ, ఉద్దరించ మంటున్నాను." బలవంతంగా దుఃఖాన్ని దిగమింగ జోచ్చింది.
    దయామయి ని నిశితంగా చూచాడు ధర్మారావు . దయామయి ఆవేశం ప్రదర్శించి నప్పుడల్లా కనులలో మెదిలే ఆ సంఘటన నేడు మళ్ళీ గుర్తుకు వచ్చింది. ఒకనాడు కను చీకటి వేళ ఆమె ఒక వ్యక్తీ తో మాట్లాడుతుండడం , ఆ వ్యక్తీ గౌతమ్ అని తనకు అనుమానం కలగడం, దయామయిని ప్రశ్నిస్తే తేలికగా నవ్వేసి విషయాన్ని మాపు చేయడం -- అన్నీ లీలగా గుర్తు వచ్చాయి అతడికి.
    "ఒకవేళ గౌతమ్ పారిపోవడం లో దయామయి సహాయం, ప్రేరాపణ కూడా ఉన్నాయేమో?' తన ఆలోచన తననే తుళ్ళి పడేటట్లు చేసినా, ఆ అనుమానం బలంగా మనస్సులో తిష్ట వేసుకు కూర్చుంది.
    "అమ్మా, ఏడవకు." దగ్గరగా వెళ్లి ఆమె కన్నీటి ని తుడిచాడు. "అసలు సంగతేమిటో నాకు వివరంగా చెప్పు. అతడి నెందుకు కాపాడాలి ? అతడికీ, నీకూ ఏమిటి సంబంధం?"
    ఒక్కసారిగా దయామయి దుఃఖ సాగరం కట్టలు తెంచుకు ప్రవహించింది. "ఎమౌతాడు? ఏం సంబంధమని చెప్పను? ఏం చెప్పను, నేను?" మతి భ్రమణం కలిగిన దానిలా అరుస్తూ స్పృహ తప్పి పడిపోయింది.
    ఏమి చేయడానికీ తోచక స్తంబీభూతుడై నిలిచిన ధర్మారావు కు అదే సమయం లో వచ్చిన నారాయణస్వామి ని చూడగానే కొండంత బలం, ధైర్యం కలిగాయి.
    దయామయి కి స్పృహ వచ్చే వరకూ ధర్మారావు , నారాయణ స్వామి మాట్లాడుకోలేదు. స్పృహ వచ్చిన పిమ్మట కుమిలి కుమిలి దుఃఖించుతున్న దయామయి ని మూడుడు లా తిలకించడం కన్నా ఏమీ చేయలేక పోయాడు ధర్మారావు.

 

                           
    "బాబుగారూ, ఇక దాపరికం వద్దు. నేనీ రంపపు కోత భరించలేను. చెప్పండి. అంతా చెప్పండి." అని ఇంకా అధికంగా దుఃఖిస్తున్న దయామయి ని ఓదార్చి ప్రయత్నించాడు నారాయణ స్వామి. "ఇక ఎవరమూ దాచలేము. చెప్పవలసిన సమయం రానే వచ్చింది. కాస్త సమాధాన పడి ఊరడిల్లు, దయామయి."
    ఆ సన్నివేశాన్ని అయోమయంగా తికలించ సాగాడు ధర్మారావు. "నాకేమిటో మతి పోతున్నది ఏమిటి, బాబుగారూ , ఇదంతా?" తల రెండు చేతులతో నూ పట్టుకుని ప్రశ్నించాడు.
    నారాయణ స్వామి ధర్మారావు కు దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. "ధర్మారావ్, నేను కొన్ని ముఖ్య విషయాలు-- ఇంతకాలం అతి కష్టం మీద గోప్యంగా ఉంచినవి -- ఇప్పుడు నీకు చెబుతున్నాను. నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి. గుండె గట్టి చేసుకో."
    'సిద్దంగానే ఉన్నాను. చెప్పండి. నా చుట్టూ ఏదో రహస్యపు వల ఉన్నదని ఏనాడో గ్రహించాను . కాని, ఎన్నిసార్ల డిగినా అమ్మ చెప్పలేదు.
    నారాయణ స్వామి కూర్చున్న చోటి నుండి లేచి, ఒక్కసారి బయటికి పోయి పరిసరాలన్నీ పరిశీలించాడు  . ఎవరూ ఆ చుట్టూ పక్కల లేరని నిర్ధారించు కున్న తర్వాత తలుపులన్నీ మూసి వచ్చి తగ్గు స్వరంతో చెప్పనారంభించాడు.
    "జైలు నుంచి పారిపోయాక, గౌతమ్ వచ్చి నన్ను కలిశాడు!"
    "ఆ!" ఉలిక్కి పడ్డారు లోపల ఇరువురు కూడా.
    'అవును, ధర్మారావ్! గౌతమ్, నేను సహోద్యోగులం, ఒకప్పుడు. ప్రాణ స్నేహితులం."
    అయోమయంగా చూడసాగాడు ధర్మారావు.
    నారాయణస్వామి మంద్ర గంబీర స్వరం చెప్పుకొంటూ సాగిపోయింది. "కాలం వక్రించింది . ఇద్దరం విడిపోయి, నేను అజ్ఞాతంగా, అతడు ఖైదీ గా బతక వలసి వచ్చింది. అమాయకులైన అతడి భార్యా, కుమారుడూ చెట్టూ, పుట్టా పట్టి పోవలసి వచ్చింది. దైవం ఏమాత్రమో దయ తలచి నందువల్ల , అతడి కుమారుడు ఇప్పుడు ప్రయోజకుడై తండ్రిని ఉద్దరించే అర్హత కలిగి ఉన్నాడు."
    "ఎవరతడు?' కుతూహలంగా కూర్చున్న చోటి నుంచి లేచాడు ధర్మారావు , ఆత్రం పట్టజాలక.
    "చెబుతున్నాను." ఆగిపోయి, దయామయి నీ, ధర్మారావు నూ పరిశీలనగా చూచాడు నారాయణ స్వామి.
    "చెప్పండి, బాబుగారూ, ఇదంతా ఏమిటో ఇంకా సంశయం లో ఉండలేను."
    "నువ్వే, ధర్మరావ్! ఈ దయామయే నీ తల్లి రాజ్యలక్ష్మీ."
    మ్రాన్పడి పోయిన ధర్మారావు మాటలుడిగి చేష్టలు దక్కి, చూపులు నిలిపి వేశాడు.
    "బాబూ!' వెర్రి ఆవేశం వచ్చేసింది దయామయికి. ధర్మారావు ను రెండు చేతులతో పట్టి కుదిపి వేస్తూ, భోరున విలపించసాగింది.
    "కన్నతల్లి వయి ఉండి, నీ దాసిగా నటించి, బతకడానికి ఎంత బాధ పడిపోయానో, బాబూ!"
    "అమ్మా!" ధర్మారావు కన్నీరు కూడా కట్టలు తెంచుకుంది. "నాకూ ఒక తల్లి ఉందా. అమ్మా! నువ్వు నా తల్లివా? అమ్మా!"
    ఆ అపూర్వ సన్నివేశాన్ని నిర్నిమేషంగా తిలకిస్తూ నిలబడి పోయాడు నారాయణ స్వామి.
    "మరి ఇంతకాలం , నాకీ సంగతులన్నీ ఎందుకు చెప్పలేదు? ఏమిటీ దాపరికం లో అర్ధం?" నుదురు కొట్టుకున్నాడు ధర్మారావు. "భగవాన్! గౌతమ్ నా తండ్రి ! తండ్రి మీదనే అధికారిని నేను!" కుమిలి పోయాడు.
    "అలా అధైర్యపడకు . విషయమంతా చెబుతాను విను." అంటూ నారాయణ స్వామి, ధర్మారావు వెన్ను సవరిస్తూ దగ్గర కూర్చో బెట్టుకున్నాడు. "రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నా రోజులవి. స్వర్గ గంగా డాం దగ్గర గస్తీ దళం లో ఉద్యోగి గౌతమ్. నేనూ అక్కడే రహస్య వార్తా హరుడిని."
    "ఓ! " మధ్య లోనే అందుకున్నాడు ధర్మారావు. "రికార్డంతా నేనూ చూశాను. అయితే విష్టు నారాయణ్ శర్మ మీరేనా?"
    "ఉష్!' రహస్యం అన్నట్టు సైగ చేశాడు నారాయణ స్వామి. "అవును నేనే" అంటూ లేచి కిటికీ లో నుండి చూపులు బయటకు సారించి, చుట్టూ పట్ల ఎవరూ లేరనే విషయాన్ని మరొకసారి నిర్ధారించుకుని వచ్చాడు.
    ధర్మారావు ముఖంలో, కంఠం లో అసహ్యం ప్రతిభించింది. "ఇటువంటి దేశ ద్రోహి కుమారుడి నైందుకు చింతిస్తున్నాను. ఛీ! ఈ వార్తా ఇప్పుడు తెలియక పోయినా బాగుండేది. దిక్కుమాలిన వాడిని, అనాదుడిని అనుకోవడం లోనే ఇంతకంటే సుఖమున్నది."
    "ధర్మారావ్!" దయామయి , నారాయణ స్వామి ఒకసేరి క్రోధంతో సంభోధించారు.
    "అవును.' ధర్మారావు మాటలు, చూపులూ కూడా....కర్కశంగా మారిపోయాయి. "ఈ పాపిష్టి రహస్యాన్ని ఇన్నాళ్ళూ దాచి పెట్టిన వాళ్ళు ఇప్పుడెందుకు బహిరంగం కావించారు? ఈ కుట్ర లో నన్నూ భాగస్వామి కమ్మనేనా? అలా ఒక్కనాటికీ జరగదు. తల్లీ, తండ్రి స్వార్ధం కాదు నాకు ప్రధానం -- నా దేశం , నా ధర్మం ఇందుకు ప్రాణాలైనా ఒడ్డుతాను కాని ఒక ధర్మ దూరుడ్ని రక్షించ లేను."
    "నోర్మూయ్!" దయామయి చేయి ధర్మారావు చెంప పై చెళ్ళు మంది. ఈనాడు విపరీతావేశం తో ఉన్న ఆమె తనను తాను నిగ్రహించు కోలేకుండా ఉన్నది. "ఛీ. ఏమిటా ఆవేశం, దయామయీ? కాస్త నిదానించు" అంటూ నారాయణ స్వామి ధర్మారావు వైపు తిరిగాడు.
    ధర్మారావు నేత్రాలతో అశ్రుజలం; పెదవులపై చిరునగవు లాస్యం!
    "ఫర్వాలేదు , బాబుగారూ . అమ్మగా ఆమెకు నా పై ఉన్న అధికారం ఇది. నిజంగా ఇందులో ఎంత మాధుర్యం ఉందొ నాకు గదా తెలుసు!"
    దయామయి మాట్లాడక పోయినా, చూపు లలో అనిర్వచనీయమైన వేదన కనుపించింది.
    నారాయణ స్వామి నిండుగా నవ్వాడు. "అదీ నిజమే. కాని ముందు అసలు విషయం చెప్పనీయండి. ఎవరూ ఆవేశం ప్రదర్శించ వద్దు." తల్లీ, తనయుడూ అంగీకరించారు.
    "చూడు , ధర్మారావ్! అంతా నువ్వు చదివా నంటున్నావు. కాని ఖర్మవ శాత్తు జరిగిన విషయం మరుగున పడి, దుర్మార్గుల కధనాలతో అలా రూపొందింది. యదార్ధ విషయం విను."
    "ఉండండి , బాబుగారూ," అంటూ మౌనంగా ఏదో ఆలోచించ సాగాడు.
    "ఏం, ధర్మారావ్? నీకు నమ్మకం కలగలేదు కదూ?' నెమ్మదిగా ప్రశ్నించాడు నారాయణ స్వామి.
    ధర్మారావు మాట్లాడలేదు.
    నారాయణ స్వామి నిట్టుర్పు లోనే చిరు నగవు ను మిళితం చేసి అన్నాడు: "నిజమే , నమ్మలేని మాటే. కాని నీ ధర్మనిరతి కి నాకు చాలా సంతోషంగా ఉంది, ధర్మరావ్. మనః పూర్వకంగా చెబుతున్నాను."
    ధర్మారావు మౌనం చెదరలేదు.
    "రాజ్యలక్ష్మీ దేవీ, ఫోటోలు ఉన్నాయా? తెస్తారా" అన్నాడు నారాయణ స్వామి.
    ఆమె వెంటనే లేచి వెళ్లి తెచ్చిన ఫోటోలను ధర్మారావు కు చూపుతూ అన్నాడు నారాయణ స్వామి: "ఇవిగో, చూడు. మనమందరం ఇలా చెల్లా చెదురు కాక పూర్వం -- అంతే పధ్నాలుగు పదిహేనేళ్ళ క్రితం -- నువ్వూ, మీ అమ్మా, నాన్నా తీయించుకున్న ఫోటో ఇది. నిన్ను డేరాడూన్ లో సైనిక స్కూలు కు పంపించే ముందు తీయించు కున్నారు. చూడు."
    పరిశీలనగా చూచాడు ధర్మారావు. గౌతమ్, దయామయి, యౌవనం లో ఉన్నారు. ఆ రూపు రేఖలూ, ఠీవీ , నైర్మల్యం నేత్రానంద కరంగా ఉన్నాయి. ఏడెనిమిదేళ్ళ బాలుడు గా తాను! స్పష్టంగా రూపు రేఖలు తెలుస్తున్నాయి నిజం గా తనకు తానె ముద్దు వస్తున్నాడు!
    చిరునవ్వు తో అన్నాడు నారాయణ స్వామి. "నమ్మకం కుదిరిందా , నేను నిజమే చెప్పానని? నీకు కావాలంటే తర్వాత ఇంకా నిదర్శనాలు చూపగలను."
    "వద్దు, బాబుగారూ!" సిగ్గుపడుతూ నొచ్చుకుంటూ అన్నాడు ధర్మారావు. "ఇవన్నీ చూస్తుంటే నాకూ ఏమిటో లీలగా కొన్ని కొన్ని  మనసులో కదులుతున్నాయి. కాని, ఏమిటిది? మరీ పసివాణ్ణి కానే? అన్ని విషయాలూ-- పోనీయండి , కనీసం అమ్మ నయినా, గుర్తించ లేకపోయా నేమిటి?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS