"మీరెందుకో బాధపడుతుంటారు?' అంది.
"లోకంలో నాకన్నా ఎక్కువ దౌర్భాగ్యులు , నిరాశా జీవులు ఉన్నారు, కానీ, దురదృష్ట వంతుల్లోనే నోకడ్నీ ......." అతని గొంతులో నిస్పృహ ధ్వనించింది.
"ఎందుకలా అనుకుంటారు? మీ జీవితాన్ని స్వర్గంగా మార్చుకొనే శక్తి మీ చేతుల్లోనే ఉందేమో?"
ఈసారి రాధాకృష్ణ పార్వతి కళ్ళ వైపు చోద్యంగా చూశాడు. ఆమె మాటల్లో సలహా గానీ ఉందేమో అని అనుమానం తోచింది.
ఏమీ చెప్పలేక పోయాడు.
"మీరు మళ్ళీ పెళ్లి చేసుకోలేదెందుచేత , రాధాకృష్ణ గారూ?" ప్రశ్నించింది . "పోనీ మీరేవరిని మరిచిపోలేక ఇంకొక పెళ్లి మానుకున్నారో ఆ అదృష్ట వంతురాలి గురించి అయినా చెప్పండి నాకు."
పేలవంగా నవ్వాడు రాధాకృష్ణ. "నాదెంత అదృష్టమో అమేదీ అంతే! ఇద్దరికీ సమానంగా వియోగ బాధ లభ్యమైంది. ఆత్మ అనేది నిజమైతే ఆవిడ ఎక్కడున్నా ఈ దూరానికి బాధ పడుతుంది."
అతని ధోరణి జాలి గొలిపినా అసలు విషయాలు అడగాలని వుంది పార్వతికి.
అప్పుడే నాలుగుంపావయింది.
"సుభద్ర గారు వచ్చాడు" అన్నాడు -- వీధి వాకిలి వైపు చూస్తున్న రాధాకృష్ణ.
"ఇంత అన్యాయం ఎక్కడా చూడలేదు. అత్తయ్య గారూ! చెప్పా పెట్టకుండా వెళ్లి పోవడమే?' దేప్పింది పార్వతి.
"నీకు బడి ఉంటుందనుకున్నా నమ్మాయ్! ఇప్పుడైనా ఏమైంది? ఇద్దరం కలిసి వెళ్దాం పద" అన్నది సుభద్ర.
రాధాకృష్ణ, నవ్వుతూ, "సుభద్ర గారికి సినిమాలంటే ఇసుమంత విసుగు గానీ, దేవాలయాల కైనా, దేవీ నిలయాల కైనా తక్షణం బయల్దేరతారు." అన్నాడు.
"సుభద్ర గారి వంటి భక్తీ తత్పరులు గురించి మనం సామాన్యంగా తెలుసుకోలేము , కృష్ణ గారూ!" అంది పార్వతి, సుభద్ర చూడకుండా రాధాకృష్ణ వైపు చూసి నవ్వి.
పార్వతి కి సుభద్ర అంటే కొద్దిగా తేలిక భావం ఈ మధ్యలో ఏర్పడింది. తన మనస్సులో ఎక్కడో గూడంగా స్థిరపడిన ఆ భావాన్ని పార్వతే తెలుసుకోలేదు. ఈమె లేచి వచ్చిన స్త్రీ . తను కాస్త గౌరవనీయురాలు, అందరి వద్దా. కానీ ఈమె జీవితంలోని పరిపూర్ణత తన బతుకులో లేదు.
ఆ సంగతి కొన్ని సమయాల్లో లీలగా పీడిస్తుంది. అప్పుడా సంగతి మరిచిపోవాలనే ప్రయత్నం ప్రారంభం.
"ఎందుకండీ! మళ్ళీ మీకు శ్రమ" అంది పార్వతి.
"ఇందులో శ్రమేమున్నదీ?" అందావిడ , ముందుకు దారి తీస్తూ . "దగ్గరే గుడి. ఎంత శ్రమైనా అక్కడ తీరిపోతుంది."
"నన్నేత్తుకో!" పాప పార్వతి దగ్గరకు వచ్చి చేతులందించింది.
పాప నెత్తుకుని ముద్దు పెట్టుకుంటూ , "కాళ్ళు లాగేశాయా, రాధికా రాణీ!' అంది పార్వతి.
పాప అంటే పార్వతి కెందుకో అమితమైన ఇష్టం. సహజంగా చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకు తీపి మిఠాయిలతో పాటు పాపలంటే కూడా మోజు ఉండాలి. ఆ మాట ఎలా ఉన్నా పార్వతి కి ఇంత వరకు పిల్లల పట్ల ఒక వాత్సల్యం , ముద్దు వంటి గుణా లేవీ లేవు. అవన్నీ పాప మీద కురుస్తున్నాయి ఇప్పుడు.
పాప పార్వతి తోనే ఉంటుంది. వాళ్ళ ఇంట్లోనే ఆదుకుంటుంది. తోటలో తిరుగుతుంది రాజు కా పిల్లతో ఒక అవస్ధ అయిపోతున్నది. గుండెల మీద కెక్కి కూర్చుని, కబుర్లు చెప్పేవరకు వదలదు మరి. సమయా సమయాల గుర్తింపు అనావశ్యకం పాపకు.
సుభద్ర బలవంతంగా పాపను కిందకు దింపించింది. "పిల్లి కూనవా ఏమిటీ? ఎంత సేపని ఎత్తు కుంటుంది! మరీ గారాబాలు పోకు! నడువు!" అందావిడ, పాపను చిరు కోపంతో చూసి.
"అలా అనకండి! మా అత్తయ్య నన్నెంతో గారాబంగా పెంచింది. ఏడేళ్ళు వచ్చేవరకు కాలు కింద పెట్టనివ్వ లేదు కూడాను!" నవ్వింది పార్వతి.
పాప పార్వతి చీర కుచ్చేళ్ళు పట్టుకొని, ఆపసోపాలు పడుతూ, పొట్టు పరికిణీ ఎత్తుకుంటూ నడవ సాగింది.
పశ్చిమంగా ఉన్న కోవెలలోకి ఒక వెలుగు ఉత్తరం వైపు నుంచి వచ్చి పడుతున్నది. పారిజాతం, నందివర్ధనం పూల చెట్ల గుబురుల మధ్య ముడుచుకున్న మందారాల రక్త వర్ణాల వెనక తెల్లని గోడల దేవాలయం చిత్రకారుడి చేతికి పని కల్పించే సుందర దృశ్యానికి తీసిపోదు.
అందాలకు అధికారిజన అవతార పురుషుణ్ణి చూస్తూ తెలియని భావాల మధ్య నలిగింది పార్వతి.
ఎవరీ భగవానుడు? ఎవరీ కృష్ణుడు? ఇంత అందగాడా? కేవలం అతని రూపాన్ని ఊహించుకోవడానికి ప్రతిష్టించిన ఒక బొమ్మతోనే ఇంత అందంగా ఆగిపిస్తున్నాడే-- నిజమైనవాడు ఇంకెంత అందంగా ఉండాలో? బహుశా అతని అందం ముందు తన అందం , సరోజ అందం, రాజు అందం , రాధాకృష్ణ అందం -- అన్నీ వెలవెల బోతాయేమో ? ఈ అందానికీ , ఇతగాడి గానానికీ లొంగిపోయే గోపికలు వెంట పడ్డారని ఆ లీల లన్నీ తనకు చదివి వినిపించారు సుభద్ర గారు. అప్పుడా గోపికలతో పాటు తన మనసూ అతన్ని వెంబడిస్తూ వెదకటానికి పోయిందని ఆవిడ కేం తెలుసు? విశ్వసించలేని క్షణాల్లో నే 'ఉన్నా' నంటూ నమ్మించాడు చిత్రంగా. ఒక రోజు 'లేడు, లేడు ' అనుకుంది గట్టిగా. ఉన్నట్లే వచ్చి, చేతుల్లో వాలాడు బహుమతి రూపంలో. మట్టి బొమ్మలా వచ్చి మనసులో నిలిచిపోయాడు. ధనికురాలైన ఒక కాలేజీ అమ్మాయి ఆమె పుట్టిన రోజు సందర్భాన లేక్చరర్లందరికీ బహుమతులు తెచ్చి పెట్టింది ఎందుకో. తనకు వచ్చింది కృష్ణ విగ్రహం.
"నువ్వుంటే నాకిలాటి రక్తి రహితమైన జీవితాన్నెందుకు లభింప చేశావు, స్వామీ!" అని ప్రశ్నిస్తే జవాబు ఎక్కడ? ఆదాయాన కాబోలు -- కనిపించినట్లు, కనిపించీ, వినిపించి నట్లు వినిపించీ మాయం కావటం! 'గోప స్త్రీ పరివేష్టి తో విజయతే గోపాల చూడామణి."
పార్వతి తన వైపు చూసుకుంది. కొద్దిగా లోపలికి ప్రసరిస్తున్న సంధ్యా సమయపు సౌవర్ణ కాంతి లో సుకుమారంగా కనిపించింది శరీర భాగం.
"తానొక గోపికై ఉంటె?' అనుకుని నవ్వుకుంది పార్వతి. 'ఈ కృష్ణుడప్పుడు ఏమను కొంటాడో తనను గురించి? అంత అదృష్టమా? అతని పాదసరాగం లో ఒక రేనువయ్యే అర్హత అయినా లేకనేనేమో తనీ లోకంలో పుట్టింది!'
ఏమైనా రాను రాను కొత్తగా ఆలోచించడం అలవాడుతున్నది పార్వతికి.
సెలవుల ముందు రాధాకృష్ణ ను కలుసుకో లేకపోయింది పార్వతి. కలుసుకున్నా ఎక్కువసేపు మాట్లాడుకునే అవకాశం దొరకలేదు. అతనేదో ఆరోగ్య శాఖ మంత్రిగారు వస్తున్నారన్న సందడి లో పడిపోయాడు.
ఒకనాడతని గదికి వెళ్ళితే ఏదో పత్రిక శ్రద్దగా చదువుతున్నాడు.
"రచయితగారూ! ఏమిటంత దీక్షగా చదివేస్తున్నారు?' అంది పార్వతి.
"మీరా? రండి" అని ఆహ్వానిస్తూ , "ఈ కధ బాగున్నదని చదువుతున్నాను. 'కవిత' అనే వారి రచనలు మీరు చదివారా , ఎప్పుడైనా? ఉత్సాహ వంతమైన కధనంతో సాగుతూనే పాఠకులను ఆకట్టుకొనే నైపుణ్యం కనిపిస్తుంది. ఒక్కొక్కసారి సంఘ జీవన సంకుచితత్వాలను గంబీరంగా వ్రాస్తారు." అన్నాడు తన ధోరణి లోనే.
పెద్ద నిట్టుర్పు విడిచి, "పేరేమిటన్నారూ -- కవితా? కవితో, సవితో కానీ మీరేమిటి , కనిపించడం మానేశారు'?" అంది పార్వతి.
"మంత్రిగారు వస్తారుగా! అందుకే ఈ అవస్థాలన్నీ. ఆఫీసులో డాక్టరు సరైన వాడు కాడు. అతన్నేమీ అనలేక ఆఫీసరు తక్కిన బృందం మీద విరుచుకు పడుతుంటాడు. ఈ పరిస్థితుల్లో కాస్త జాగ్రత్త గానే ఉండటం మంచిదని మా బాధ."
రాధాకృష్ణ ఆరోజు ఇంకా ఎవరో కవుల కవితలు, కవిత రచనలు, పార్వతి చేతి కిచ్చి చదవ మన్నాడు. ఆమె అవన్నీ తెచ్చి ఇంట్లో పడేసింది.
శేఖరం చాలాసార్లు కలుసుకొని బాతాఖానీ వేసేవాడు పార్వతితో. ఆ తంతు రాజూ చూశాడు. పార్వతి వల్ల రాజుకు స్నేహితులు కాని స్నేహితులేక్కువై పోతున్నారు. ఏం చేస్తాడు, తప్పనిసరిగా భరించక? రాధాకృష్ణ తో పరిచయం అతనికి కష్ట మనిపించ లేదు. మీదు మిక్కిలి రచయిలతో సన్నిహితంగా ఉన్నంత సేపూ ఏదో హాయి అనిపించేది కూడాను.
బాగా తెలిసిన శేఖరం తో ఎల్లా మాట్లాడాలను కున్నా సాధ్యం కాదు రాజుకు. పైకి నవ్వుతూ నిగర్విలాగానే కనిపించే శేఖరం లో , కల్మషం సూచన కైనా అగుపించని అతని ముఖంలో, ఆ కళ్ళల్లో-- అహంకారం రాజుకు మాత్రం గోచరిస్తుంది సూక్షంగా. చిరునవ్వు నవ్వే పెదవులు వాటి వెనక హేయ బుద్ది. నిర్మలమైన నీటి కింద నాచు కనిపించినట్లు విచారం పుట్టి రాజు శేఖరం ఎదురుగా నిలవలేదు.
తప్పులు చేసేవాళ్ళ కు కూడా తప్పులు ఇష్టం ఉండవు. ఎందుచేత నంటే ఆ తప్పుడు పనుల్లో భాషకు, భావానికి అందని సూక్ష్మమైన వైవిద్యం ఉండబట్టి. స్థూలంగా చూస్తె అర్ధం కాని సంగతి.
పార్వతి కి సెలవులయ్యే ముందు శేఖరం కూడా కొన్ని దినాలు ఆమెకు కనుపించలేదు. శేఖరం తన ఇంటికి ఎన్నోసార్లు రమ్మని కోరాడు పార్వతిని. ఆటంకాలు వచ్చాయో, లేదో చెప్పడం కష్టం. కొన్నిసార్లు ప్రయత్నపూర్వకంగా నే పార్వతి వెళ్ళకుండా ఆగిపోయింది. శేఖరానికి ఒక పల్లెటూరి పెళ్ళాం ఉంది. ఆమె ఎమనుకొని రచ్చకీడుస్తుందో అని పార్వతి కి భయం. శేఖరం అందుకే చదువుకున్న అమ్మాయి లంటే గింజు కుంటాడు. పెళ్లై -- పెద్ద మనిషి తరహ వచ్చిన వారిలా సూటిగా చూసి సూటిగా మాట్లాడ లేకపోవటమే కాక, పక్క చూపుతో కనిపెడుతుండటం అతన్ని పూర్తిగా వదల్లేదు.
కాని శేఖరం తో కాస్సేపు ఊసుపోయేది పార్వతికి. కొన్ని నీరస క్షణాల్లో, ఒక్కో సందర్భం లో ఆతడి రాక కోసం వేచింది కూడా.
తరుముతున్నట్లు సెలవులు వచ్చేశాయి. రాజు ఇంకా పరీక్షల గడబిడ లో నుంచి తెలనేలేదు.
ఒంటరిగా , హటాత్తుగా వచ్చి పడిన పార్వతిని చూసి సగం కుంగి పోయింది జానకమ్మ. "వాడేడీ?' అంది-- వీధి మొగాన్నీ , పార్వతి మొహాన్నీ మార్చి మార్చి చూస్తూ.
"వస్తుంటే నీ కొడుకుని కాకేత్తుకు పోయిందత్తయ్యా!" అంది నవ్వి పార్వతి.
"సరిగ్గా చెప్పు, తల్లీ!"
ఆవిడ అత్రుతకు లోపల ఆశ్చర్య పోయింది పార్వతి. "అతని పిల్లలకింకా పరీక్షలు కాలేదు. ణా పిల్లల కయిపోయాయి" అన్నది హాస్యంగా, సామాను గది లోపలకు చేరుస్తూ.
"ఏమిటో ! ఈ ఎండల్లో సరిగ్గా తిండి తిని నిద్రన్నా పోతున్నాడో లేదో! ఈ నాలుగు రోజులూ హోటలు కూడె తెప్పించు కుంటాడు గావును." స్వగతం లా అందావిడ పెట్టె లో నుంచి బట్టలు తీసుకుంటున్న పార్వతి ని శూన్య దృష్టి తో చూస్తూ.
పార్వతి నడుం మీద రెండు చేతులూ వేసుకుని, "చూశావా, చూశావా! ఇంత ఎండలో పడి చెమటలు కక్కుకుంటూ నేనొస్తే నామీద జాలి లేదట గానీ ఎక్కడో తన కొడుకు ఎండల్లో ఎండి పోతున్నాడని, వానల్లో తడిసి పోతున్నాడని, చలిలో చలించి పోతున్నాడని -- అదే ధ్యాస" అంది ఎవరితోనో చెబుతున్నట్లు నిలబడి.
"మరీ మీరుతున్నావులే! స్నానం చేద్దువు గాని, పద."
"అవును మరి. నాకో అమ్మ ఉంటె ఎంతైనా ......." అక్కడికి ఆపింది పార్వతి, జానకమ్మ ను పక్క నుంచి గమనిస్తూ.
జానకమ్మ చటుక్కున వెనక్కు తిరిగి వెళ్లి పోతూ, "నా ప్రాణాలు తోడేస్తున్నారే మీరిద్దరూ" అన్నది, విసుగులోనే బాధ మిళితం కాగా.
ఆమె వెంటే స్నానానికి వెళ్ళుతూ పార్వతి బాధపడింది. 'నేనామెను కష్టపెడుతున్నాను' అనుకుంది. "ఈ మధ్యను ఒక్కొక్కప్పుడనిపిస్తున్నది- జానకమ్మ తృప్తి కోసమూ, సరస్వతి ఆనందం కోసమూ రాజుకు బానిసై పొతే సరి-- అని.
'కేవలం తన నిశ్చయం తో సరిపోదు. ఇప్పుడు రాజు అల్లాటి వాటికి కూడా విముఖుడుగా కనిపిస్తున్నాడు. అతనలా ఔతుంటే తనేం చేస్తుంది? అదేమో వెనక పాటుగా ఇంత సంఘర్షణ , ఉచితా నుచితాల ఆలోచనాను. తీరా అతనేడురుగా కనిపించేసరికి నిద్రపోతున్న వెర్రి పౌరుషం లేచి రావడం తప్పదు. తన ఆవేశం ఎందుకని ప్రశ్నిస్తే అతని నిస్సాకారపు మాటల వల్లే . ఆ అనవసరపు అహంకారం ఎందుకో , అదేన్నాల్లో చూడాలనీ ఉంది-- వీళ్ళంతా అడ్డు రానట్లయితే.
'ఐనా కొన్నాళ్ళ యి రాకేందుకో సాధ్యమైనంత మౌనాన్ని పాటిస్తున్నాడు. చిన్న విషయాల్లో జోక్యం కలగాజేసుకోక పోవడం మాటుంచి కన్నైత్తైనా చూడటం లేదు. అతనికీ బుద్ది మంతుడని పించు కోవాలనుంటుంది ,మరి!'
