30
"చిరంజీవి శాంతికి, పద్మ వ్రాసేది.
శాంతీ, ఇదివరలో నేను వ్రాసిన ఉత్తరం నీలో వీసమంతైనా మార్పు తేకపోవడం ఆశ్చర్యంగ ఉంది. మీ నాన్నగారికి జబ్బేమీ లేదు. ఆనాటికానాడు దిగజారి పోతున్నారు. పోనీ నీ మనస్సు మార్చుకోకపోయినా, ఒక్కసారి చూచి వెళ్ళితే బాగుంటుంది. మీ అన్నయ్య వచ్చేటప్పుడైనా ఆయనతో నీకు రావాలనిపించలేదా? నువ్వింత కఠినాత్మురాలవా, శాంతీ? నీ పంతాలూ, సుఖ సంతోషాలూ తప్ప నీకు ఆగ్త్మీయుల మనోవాంఛలతో, సుఖ దుఃఖాలతో నిమిత్తం లేదా?
నన్ను నేను పొగడుకోవడం కాదుకానీ, ఒక్క సంగతి నీకు తెలియడానికి చెప్పుతున్నాను. కలకత్తాలో నా సంసారాన్ని వదిలేసి ఇక్కడ అత్తా మామగార్ల సంరక్షణకై నాలుగు నెలల పాటు ఉండిపోయాను. సంక్రాంతి పండగకు రమ్మని మావాళ్ళు వస్తే వెళ్ళలేదు. నేనుకూడా దగ్గర లేకపోతే ఈ వృద్ధుల ప్రేమార్ధ్ర హృదయాలు మరింత నలిగిపోతాయి. కాని, శాంతీ, ఒక్క విషయం గుర్తుంచుకో. నేను కోడల్ని, నీవు కూతురివి. నీ తల్లిదండ్రులపై నీకే యింత ప్రేమ లేదా? మీ పెద్దన్నగార్ని చూడ. ఆయన చిరకాలంగా కంటున్న బంగారు కల యథార్ధమై దానంతటది పాదాల చెంతకు వచ్చింది; జర్మనీ పంపడానికి సెలెక్టయ్యారు. కాని తల్లిదండ్రుల విషయ మాలోచించి ఆ అమూల్యావకాశాన్ని తృణప్రాయంగా వదిలేశారు. ఈ సంఘటనతో పోల్చిచూస్తే నీ ప్రవర్తన ఎంత నిరంకుశంగా ఉందో ఒక్కసారి పరిశీలించి నీకై నీవే ఆత్మవిమర్శ చేసుకో, శాంతీ. ఒక్కోసారి ఆలోచిస్తూంటే ఈ కుటుంబ మేమైపోతుందా అనే భయంకూడ ఆవరిస్తూంది నన్ను.

శాంతివనంలో నిరంతరం శాంతి వృక్షాల దగ్గరే మౌనంగా గడిపివేస్తూన్న ఆ ముసలాయలో ఎంత మూగ బాధ ఉందో అర్ధం చేసుకో ఈమధ్య చిన్నన్నయ్యకు పెళ్ళి సంబంధాలు వస్తున్నాయి. అందరం వెళ్ళి చూచి వచ్చాము. కాకినాడలో ఒక ప్లీడరుగారమ్మాయి చాలా బాగుంది. బి.ఎ. పాసైంది. పేరు శ్యామల. అన్నివిధాలా మనకు తగినవారు. అందరకూ నచ్చింది. కాని, శాంతీ, నాకే భయంగా ఉంది-అంత చధువుకున్న పిల నీలాగే వుంటుందేమో, ఈ కుటుంబంలో యిమడగలడో, లేదోనని. సంసారం నిర్వర్తించలేదేమో నన్పిస్తూంది. అయినా మీ చిన్నన్నయ్యకు చదువుకున్న పిల్లే కావాలట. అందుచేత ఈ సంబంధమే కుదరవచ్చనుకుంటున్నాను.
నారాయణ వివాహం సరి. ఈ సందడిలో నాన్నగారి హృదయభారం తగ్గుతుందని ఆశించాను. కాని, శాంతీ, పొరపడ్డాను. ఆయన మనోవేదన మరీ ఎక్కువైంది. ఒక్కో పిల్లనూ చూచి రావడం, 'అందరూ కన్న కుమార్తెలకు జీవితమార్గా లేర్పరచుకుంటున్నారు. నాకా అదృష్టం లేదు' అంటూ కుమిలిపోవడం. సున్నిత హృదయాన్నిలా క్షోభపెట్టడం భావ్యం కాదు, శాంతీ.
జీవితానికొక అర్ధమూ, ఆదర్శమూ ఉండాలి. రాచబాటను వదిలేసి నిన్ను నువ్వే సుడిగుండా లలో బంధించుకుంటున్నావు. ఏమిటిది? ఒక్కసారి ఆలోచించుకో. పోనీ, రాజా యిష్టం లేకుంటే మరొకరు. అంతేకాని యథార్ధంనుండి పారిపోకు. ఆశాజనకమైన వార్తకోసం ఎదురు చూస్తూంటాను.
పద్మ."
చిరాకే అనిపించినా ఇదివరకులా ఆ ఉత్తరాన్ని తీసిపారేయలేకపోయింది శాంతి. అది మెదడుకు కొంత ఆలోచన కల్పించింది. 'బొత్తిగా చదువు సంధ్యలు లేక వదిన యిలా ముసలివాళ్ళలా ఆలోచిస్తుంది. చక్కగా చిన్నన్నయ్యకు కాబోయే వధువు బాగా చదువుకుందట. ఆమె యిలాగుండదు. నాలాగే, నాకంటే ఎక్కువగా ఉంటుంది; ఉండాలి. అలాగైతే బలే సరదాగా గడిచిపోతుంది.' అలా ఆలోచిస్తూనే వదినకు ఉత్తరం వ్రాసింది శాంతి.
"వదినా,
నాన్నగారికీ, అమ్మగారికీ, నీకూ, అన్నయ్యకూ నమస్కారాలు. మీరందరూ తెలివితక్కువ ఆలోచనలతో బాధపడడమే కాకుండా అందుకు నన్ను కారణంగా ప్రతిష్ఠించి ఎందుకు సంతృప్తి పడతారో తెలియడం లేదు. నేను వివాహం చేసుకోవడం లేదనే నాన్నగారి బాధకని, చేసుకున్నా అక్కడ ఆయన దగ్గర ఉండననీ, దూరం గానే వెళ్ళిపోవాలనీ ఆయనకు తెలియదా? నా సుఖ స్వేచ్చ స్వాతంత్ర్యాలకంటే పరాధీన జీవనమే మీకిష్టమా?
సరే, ఏదైనా కానీ, కారణం, నేనూ మనస్సు మార్చుకున్నాను. వివాహం చేసుకోవాలనే అనుకుంటున్నాను. విషయాలన్నీ తర్వాత సమక్షంలో. అంతవరకూ ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచు.
శాంతి."
ఆచేత్తోనే శ్రీహరికీ, రాజాకుకూడ వ్రాసింది. ముక్తసరిగా క్షేమసమాచారం వ్రాసి శ్రీహరి అడ్రస్ యిచ్చింది రాజాకు వ్రాసిన ఉత్తరంలో. శ్రీహరికి క్షేమవార్తలు తెలుపుతూ, "రాజాకు నీ అడ్రస్ యిస్తూ ఇప్పుడే వ్రాశాను. ఈమధ్య కలుసుకోవటం తటస్థించింది. నువ్వతడి కసలు ఉత్తరాలే వ్రాయడం లేదన్నాడు. ఇక మంచి వ్రాస్తావుకదూ?" అంటూ ముగించింది.
శ్రీహరి దగ్గరినుంచి తిరుగు టపాలోనే జవాబు వచ్సింది. "రాజా నా స్నేహితుడు. వ్రాయడం, వ్రాయకపోవడం నా యిష్టా యిష్టాధారం. ఇంతకూ అతడూ, నువ్వూ ఎందుకు, ఏవిధంగా కలుసుకోవలసి వచ్చింది? ఆరోజు నేను నీకు చెప్పిన విషయం మరిచావా? ఎవ్వరితోనూ అనవసరమైన అతి చనువులు వద్దని చెప్పడం అప్పుడే మరిచావా? రాజాకూ, నీకూ మధ్య ఉత్తరాలు ఎప్పటినుండి? నామూలంగా మినహా నీకూ, అతడికీ వ్యక్తిగతాను బంధ స్నేహాలేమీ లేవుకదా? మరి, ఈ అతి చనువులు ఎందుకు?
శాంతీ! ఒక్కసంగతి. నిన్ను నేనెప్పుడూ ఆజ్ఞాపించలేదు. నీ యిష్టమే చెల్లుతూ వచ్సింది. కాని ఇప్పుడు నిర్కొహమాటంగా చెప్పుతున్నాను. నువ్వు ఇకమీదట రాజాను కలుసుకోవద్దు, రాజాతో మాట్లాడవద్దు. అతడికి ఉత్తరాలు అసలే వ్రాయవద్దు. నాపై ఏమాత్రం గౌరవ మర్యాదలు ఉన్నా తప్పకుండా నా ఈ మాటమేరకు కట్టుబడి ఉండగలవు.
శ్రీహరి."
ఆశ్చర్యపోయింది శాంతి ఆ ఉత్తరం చూచి. ఏమిటో అన్నయ్య ఆంతర్యం బోధపడలేదు. 'తనపై అపనమ్మకమా? రాజాపై అవిశ్వాసమా? లేక యిద్దరికీ ఏమైనా విరోధం వచ్చిందా? అటువంటిదేమీ ఉండకూడదే! చిన్నన్నయ్యది అటువంటి స్వభావమేకాని శ్రీహరి అన్నయ్య అసలు ఎవరితోనూ పరుషంగానైనా మాట్లాడడు. మరి ప్రాణప్రదమైన రాజా వంటి స్నేహితునితో విరోధం తెచ్చుకుంటాడా? ఏమో! అయినా ఏమిటిది? ఏ పని చేసినా, చెయ్యబోతున్నా ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా సలహాలివ్వడం. ఛ! ఆ రాజా ఏమైనా నాకు చుట్టమా? నాకేంపని వ్రాయడానికి?' విసుగ్గా ఉత్తరం టేబుల్ మీదకు గిరవాటేసింది శాంతి.
'ఆ వేళ గోవిందరావుతో మాట్లాడడానికి రాజా నక్షత్రకుడుమల్లే అడ్డుపడ్డాడు. అతడూ, తనూ కలుసుకొని హృదయం విప్పి మాట్లాడుకొనే అవకాశమే కలగడంలేదు. ఇంకెలా?' కిటికీ దగ్గర నిల్చుంటే వృక్షాగ్రభాగాన పూసిన చంపక పుష్పాలు అందుకో చూద్దామన్నట్టు మనస్సును కవ్విస్తున్నాయి. ధనుర్మాసం గడిచిపోయింది. ఎండా తీవ్రంగానే ఉంది.
ఆలోచనలతోనే తరగతికి వెళ్ళింది శాంతి. అప్పటికే విద్యార్ధులంతా కూర్చుని ఉన్నారు. ఆచార్యులు నితీంద్రబోస్ కూడా వచ్చేశారు తరగతిలోకి. శాంతిని చూడగానే దగ్గరకు పిల్చారు ఆయన.
"నువ్వు క్రొత్తగా వేసిన బుద్దిని చిత్రం చూచాను. నీ చిత్రకళ చాలా అభివృద్ధి పొందింది. కాని యింకా శ్రద్దగా కృషి చెయ్యాలి. రేఖాకృతులివ్వడం, షేడింగ్స్ తేవడంలో ప్రవీణురాలవయ్యావు. కాని మనోగత భావాలను వదనంలో, నేత్రాలలో ప్రతిబింబింప చేయడం యింకా నీకలపడలేదు. ఇంకా మంచి కృషి అవసరం."
వినయంతో ఆ వచనాలను విని మౌనంగా చిత్రం తీసుకుని వెళ్ళి విద్యార్ధులలో కూర్చుంది శాంతి. తదితర విధ్యార్ధులనుకూడ ఒక్కొక్కరినే పిలిచి వారు గీసిన క్రొత్త చిత్రాలపై తమ అభిప్రాయాలను తెలియపరచి, సూచన లిచ్చి బోధన ప్రారంభించారు బోస్. ప్రఖ్యాత చిత్రకారుల గురించీ, వారి వారి చిత్రాలలో ప్రదర్శితమయ్యే భావ రూప వైవిధ్యాల గురించీ అనర్గళంగా సాగుతూంది ఉపన్యాసం. కాని, శాంతి మనస్సు ఎక్కడా ఆ పాఠంపై లగ్నం కావడంలేదు. ఎలాగో కొద్దిసేపు ఓపికపట్టి అధ్యాపకుడు వెళ్ళిపోగానే ఎవరితోనూ మాట్లాడ కుండా చరచరా లైబ్రరీ వైపు దారి తీసింది శాంతి. పూర్తిగా నమ్మకం లేకపోయినా గోవిందరావు అక్కడ కనపడగలడనే ఆశ ఏ మూలో ఉంది. కాని అతడు దారిలోనే ఎదురుపడ్డాడు. "మీకోసమే వస్తున్నాను" అంటూ అతడితో మరో యిద్దరు ఉన్నారు. అందుచేత శాంతి ఏమీ మాట్లాడలేదు.
"వచ్చే నెలలో సాంస్కృతికోత్సవాలు. 'చిత్రాంగద' నృత్య నాటికలో మీరు నటిస్తారు కదూ?"
సంతోషంగా తల ఊపింది శాంతి, అంగీకార సూచకంగా.
"అయితే, ఇదిగో, ఈ పుస్తకం చదవండి. పోర్షన్ బాగా రావాలి. మీకు యిష్టమైతే మరొక నాటికలోకూడా మీకు పాత్ర యిస్తాం."
