Previous Page Next Page 
మొగలి పొదలు పేజి 27


                                   13
    నెల రోజులకే శ్రీనివాస్ రంగులో, నడక లో , ప్రవర్తన లో అన్నిట్లో మార్పు వచ్చేసింది. ఒక చాయ తగ్గి సంస్కారహీనంగా శరీర భాగంలో పటుత్వం తగ్గి పోయినట్లు ముప్పై నిండని శ్రీనివాస్ అంతలోనే నలభై దాటినట్టు కనిపిస్తున్నాడు.
    స్కూలు నుంచి రాగానే అతను గది గుమ్మం లో అడుగు పెట్టి వింతగా చూస్తున్నాడు. బాబు తల్లి గుండెల్లో నిద్ర పోతున్నాడు హాయిగా.
    అతని మనసు చివుక్కు మంది, 'ఈ ప్రశాంతిని వాడికి దూరం చేశానేమో'
    శ్రీనివాస్ కలత పడిన మనసుతో పక్క మీద అలాగే కూర్చుండి పోయాడు. చప్పుడు విని మెలుకువ వచ్చిన రాజేశ్వరి అతన్ని చూస్తూనే నిర్ఘాంత పోయింది. తను వున్న రోజుల్లో అందాన్ని చిదిమి దీపం పెట్టొచ్చు అనేది. ఆ అందం కరిగిపోయి యిలా బికారి లా కనిపిస్తున్న భర్తని చూడగానే వుప్పేనలా ముంచుకుని వచ్చింది దుఃఖం. అతని పాదాలు తడిపేస్తూ ఏడుస్తూంటే 'యెందుకు ? యిప్పుడు నిన్నేం అన్నానోయ్.' అన్నాడు.
    అతని గొంతు చాలా నీరసంగా పలుకుతోంది.
    'నన్ను క్షమించండి పాపిష్టిదాన్ని మిమ్మల్ని కష్ట పెట్టాను. నేను యింతకు మించిన నరకం అనుభవించాను.'
    'పోన్లే . అవన్నీ ఫాస్ట్. జరిగినదంతా మరిచిపోదాం. కొత్తగా బ్రతుకుదాం. నిన్ను నేనే విషయాలూ అడగను. నీ యిష్టం యెలా అవుతే అలా వుండు. నా జీవితం పూర్తిగా శిధిలం అయిపొయింది. నన్ను ప్రశాంతంగా గడపనీ. బాబుకి తల్లిగా నీ బాధ్యత మరిచి పోకు.'
    'నన్ను నారాయణ బాబు పంపారు. మీరు నన్ను యేలుకుంటారో లేదో అనుకున్నాను.'
    'యిప్పుడు నువ్వేం తప్పు చేశావనీ.'
    'మీకు చంద్ర మౌళి గారు చెప్పే వుంటారు.' రాజేశ్వరి భుజాలు తడుముకుంటోంది.
    'నేను నిన్ను అడగ లేదోయ్ ఆ విషయాలు.'
    'దేవదాసు వచ్చాడు యీ వూరు. అప్పుడే నేను పబ్లిక్ గార్డెన్స్ కి మనసు బాగో లేక వెళ్లాను. అక్కడి నుంచి వచ్చే బస్సులు తక్కువై పోయాయి. వర్షం వస్తుంటే తప్పనిసరిగా రిక్షా లో రావడం చంద్రమౌళి గారు చూశారు'
    శ్రీనివాస్ యెంత నిగ్రహించు కున్నా దేవదాసు పేరు అతన్ని పెట్రోలు పోసి మంట పెడుతోంది కడుపు ;లో. యెంతటి సంస్కారం వున్నా తన మనసు వొప్పుకోవడం లేదు అలా తన భార్య మరొకడితో వొకే రిక్షా లో రావడం. బస్సు లో సీట్లు లేకపోతె కూర్చోవడం తను అభినందిస్తాడు. ఆడది మరీ అలా శిక్ష అనుభవిస్తూ నిలుచునే బదులు యెవరి పక్కన అయినా వో ఘడియ కూర్చోవడం యే మాత్రం తప్పుగా అనిపించదు. కానీ దేవదాసు విషయం వేరు. రాజేశ్వరి మనసులో అప్పుడప్పుడు మోజు కొద్ది తొంగి చూసే మనిషి, తన పినతల్లి ని వారం రోజులు తన యింట వుంచుకున్న ఆ వ్యక్టంటే శ్రీనివాస్ కి పరమ అసహ్యం. ఇంకేవీ మాట్లాడలేదు. అతనికి కోపం వచ్చిందని రాజేశ్వరి కి బాగా తెలుసు. ఉన్నంత లో తింటూ గోప్యంగా వుండడమే మంచిదని పించింది.
    రాజేశ్వరి కి యిప్పుడు ధైర్యం కూడా లేదు తను ఉద్యోగం చేస్తానని అనేందుకు. పసివాడి ధోరణి లో అప్పుడప్పుడు పశ్చాత్తాపం దోబూచులాడుతూనే వుంది 'ఎందుకొచ్చిన వాదాలు పెంచుకున్నాను' అని-- తిండికి కటకటలాదిపోయే సమయాల్లో మరోరకంగా అనుకునేది. అమ్మ పిలుస్తుంటే ఈ దరిద్రం లో చిక్కుకున్నా నేవిటి అని?

                          *    *    *    *
    రెండురోజులు నాటక సమాజంలో గొంతు ఎరువు యిచ్చేందుకు శ్రీనివాస్ వెళ్ళిపోయాడు. అతనికి అడ్వాన్సు గా అరవై రూపాయలు కూడా యిచ్చారు. పిల్లాడికి పాల డబ్బా, రాజేశ్వరి కి సిల్కు చీరా కొన్నాడు.

                                
    దేవదాసు హటాత్తుగా ఊడి పడడం రాజేశ్వరి గుండెల్లో రైళ్ళు పరుగులు పెట్టాయి. యెంత చెప్పినా వినలేదు.
    'నువ్వు యెన్నైనా చెప్పు అలా చీటికీ, మాటికీ అనుమానించే మనిషితో నువ్వేం సుఖ పడతావు.'
    'లేదు దేవదాసు. అయన నిరాశ్రయంగా వున్నప్పుడు చోటు చూపించారు. నేను నీతో తిరగడం అసలు నాకే బాగులేదు' దేవదాసు పాకెట్టు విప్పి మంచి ఖరీదైన రెండు వాయిల్ చీరలు యిస్తుంటే అంది: 'నాకు యివి వొద్దు. నా కాపురం కూలగొట్టుకొను. నువ్వు యిచ్చే కానుకలు తిరస్కరిస్తున్నానని అనుకోకు. స్నేహంగానే అంటున్నాను. ఆయన్ని వంచించి నేను బాగుపడేది యేవీ లేదని గ్రహించాను.'
    'అవన్నీ వట్టి కబుర్లు రాజేశ్వరీ ఇల్లు చూస్తె యింత కటిక చీకట్లో, తిండి చూస్తె......'దేవదాసు ప్రాణానికి యిల్లు అలా కనిపోస్తోంది.
    'ఏదో ఆ సమయంలో అలా చెప్పుకోవలసి వచ్చింది. నాకు యిప్పుడేవీ లోటు లేదు. నన్ను ఆశ పెట్టి ఏవేవో కబుర్లు చెప్పకు. నాది అసలే చంచలమైన మనసు.'
    దేవదాసు వూహ లోకాల్లోకి పంపిస్తున్నాడు. అంతకంతకు రాజేశ్వరి మనసు పటుత్వం తప్పిపోతోంది. 'పిల్లడిని రాజులా చూసుకుంటాను. నువ్వు నా దగ్గర వుండిపో.'
    రాజేశ్వరి చెవులు మూసుకుంది. 'ఒద్దు దేవదాస్' నాకింకేవీ చెప్పకు రాజేశ్వరి మాటలు అపెయగానే దేవదాసు బయటికి వెళ్ళిపోయాడు.
    అనుకున్న రోజుకు ముందుగానే శ్రీనివాస్ రావడం. బజారు నుంచి వచ్చిన దేవదాసు రాజేశ్వరి యెదుట వంట యింట్లో కూర్చుని దీర్ఘంగా చర్చించడం -- శ్రీనివాస్ హృదయం భగ్గుమంది.
    'బాగున్నావా,' దేవదాసు పలకరింపు గా అన్నాడు.
    'ఆ.'
    రాజేశ్వరి తలెత్తి స్థాణువై పోయింది. చాలాసేపు తను ఒక్కడే మాట్లాడుతూ విసుగు వచ్చి దేవదాసు బయటికి వెళ్ళిపోయాడు. శ్రీనివాస్ కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి.
    'వీడేప్పుడు వచ్చాడు?'
    'మొన్న.'
    'యీ రెండు రోజులూ యెక్కడ వున్నాడు?'
    'పగలు యిక్కడే'
    'రావద్దని చెప్పక పోయావా?'
    'అంత కుసంస్కారం నాకు లేదు.'
    దండెం మీద వ్రేలాడుతున్న చీరలు చూసి అవగాహన చేసుకున్నాడు. 'మనమధ్య ఏదో పైశాచిక శక్తి అవరించుకుంది. నా మనసుని నేను మభ్య పెట్టుకోలేను. పిన్ని సంగతి తెలిసి నువ్వు దేవదాసు కి అంత గౌరవం యిస్తున్నా వంటే.....'
    'అతను మా వూరి వాడు'
    'చూడు రాజేశ్వరీ! బ్రతుకంటే అట కాదు. గాజుపాత్ర లాంటి యీ జీవితాన్ని అపురూపంగా నే చూసుకోవాలి. నువ్వు ఏదో వ్యామోహం లో కొట్టుకు పోతున్నావు. నీ యిష్టం? నీకూ నాకూ మధ్య యింక సరిపడదు. నేను అనుమానం మనిషిని అను, నాకు సంస్కారం లేడను, నీ యిష్టం వచ్చిన పేరు పెట్టి పిలు. నువ్వింక యీ యింట్లో వుండడం, ఆ దేవదాసు నీకోసమే ప్రత్యేకం రావడం నేను సహించలేను.'
    నిబ్బరంగా అంది. 'మీది మొదటి నుంచీ పాడు బుద్దే. నేను నిజంగా చపల మనిషిని అయితే దేవదాసును చేసుకునేదాన్ని అని అనకపోయేదాన్ని. ఆఫీసులో పని చేయడం యిష్టం వుండదు మీకు. ఘోషా స్త్రీల మాదిరి పరదాల మధ్య బ్రతకలేను నేను.'
    'నేను నిన్ను అలా శాసించ లేదు.'
    'మీరు చీటికీ మాటికీ అనుమానిస్తున్నారు.'
    'నువ్వు నారాయణ బాబు తో ఎన్ని అబద్దాలు ఆడావు.'
    రాజేశ్వరి తొణకలేదు! నేనేమీ చెప్పలేదు.'
    'అయితే ఆయనే కల్పించారా?'
    'అదేమో'
    'అప్పుడు కాదు యిప్పుడు అంటున్నాను. నా కడుపులో చిచ్చుపెట్టావు. నా ప్రశాంతి ని భగ్నం చేశావు. నా గొంతులో సీసం కాల్చి పోస్తున్నావు. నీకు మంచి బుద్దులు రమ్మంటే యెలా వస్తాయి?
    'మీ అమ్మ లాగే వొక మొగుడు కాకపొతే మరొకడు. డబ్బు కావాలి మీకు. సాంఘిక నియమాలు అక్కర్లేదు.'
    రాజేశ్వరి చెంపలు వుక్రోషంతో అదిరిపోయాయి! 'అవును మంచి బుద్దులు మీ పిన్ని దగ్గర నేర్చుకుంటాను.'
    'యిడియట్' మా పిన్ని కాలి గోరికీ పోలవు నువ్వు. ఆవిడ సంగతి నీకేం తెలుసును?'
    'అంతే- అంతే మీరు అలా సమర్ధించక ఏం చేస్తారు. మనపిల్ల యెప్పుడూ పతివ్రతే అనుకుంటుంది తల్లి.'
    'నీలా మొగుడు బ్రతికి వుండగా పిన్ని మరో వెధవ తెచ్చిన చీర కట్టుకోలేదు.'  
    'అవును ఎలా కట్టుకుంటుంది? చీరలు మార్చుకున్నట్టు మనుషుల్ని మార్చు కుంటూ వెళ్ళింది గానీ.'
    'నీతో నాకు వాదన అనవసరం తెగిన సంబంధాన్ని యింక సాగే ప్రయత్నం చేయడం నాకు యిష్టం లేదు. రెండు సార్లు క్షమించాను. రాజమండ్రి వెడతానని తిరుమల గిరిలో కాపురం పెట్టినపుడు, పిల్లడిని మీ అమ్మకి చూపోస్తానని రాకమండ్రి లో వారం రోజులు దేవదాసు తో షికార్లు కొట్టినప్పుడు , రాజేశ్వరి మనసు పరుగులు పెట్టింది అప్పుడు.......
    రాజేశ్వరి వరుసగా వారం పది రోజులు వొంట్లో బాగులేక పోయేసరికి శ్రీనివాస్ పిచ్చి వాడి మాదిరి అయిపోయాడు. చంద్రమౌళి నాటక సమాజం డైరక్టర్. అంతే కాకుండా మిలటరీ ఆఫీసులో యిప్పుడు సీనియర్ ఆఫీసర్ కూడా అయ్యాడు. అతని కున్న పేరు ప్రఖ్యాతలు అందరికీ, తెలిసినవే. శ్రీనివాస్ కంఠస్వరం అంటే అతనికి తగని ప్రేమ. అందుకే అతన్ని 'ఏమోయ్' అంటూ ఆప్యాయంగా సంబోధించి అంతస్తుల తారతమ్యాలు, కుల మత భేదాలు మరిచిపోయి నిష్కల్మషంగా మాట్లాడతారు భార్య భర్తలు యిద్దరూ. శ్రీనివాస్ కి అతనంటే పంచ ప్రాణాలు. గౌరవంగా 'యేమోయ్' అనుకున్నా సన్నిహితానికి యేమాత్రం లోటు లేదు. చంద్రమౌళి భార్య చదువుకుని కొన్నాళ్ళు  వుద్యోగం చేసి అతనితో డిల్లీ, కలకత్తా, పూనా, బొంబాయి లాంటి ప్రదేశాలు చూసి నవీన పద్దతిలో తనను తాను మలుచుకున్న యిల్లాలు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS