దుష్టుడికి , దుర్మార్గుడి కి కూడా మనస్సు, యుక్తా యుక్త విచక్షణా జ్ఞానమూ, సామాన్యుని కన్నా ఎక్కువే ఉంటయ్యి. కాని ఆ నిశ్చలమైన మనసు దుర్మార్గం వైపే కేంద్రీకరించబడి లీనమై పోతుంది.కాని మంచి వైపు ఆ మనస్సు కన్నెత్తి చూడదు. మనిషి కళ్ళు ప్రపంచాన్ని చూస్తాయి కాని దుర్మార్గుడి మనస్సులోని కళ్ళు మంచి వైపు చూడనే చూడవు. ఒకవేళ చూసినట్లు నటించినా అది మనస్సుకు నచ్చదు.
"నన్ను ఇంట్లో నుంచి వెళ్లి పొమ్మంటావా సుభా. ఇంట్లో నుంచే కాదు నీ జీవితం నుంచే తొలగి పొమ్మన్నా తొలగి పోతాను. కాని ఆ ప్రతిపాదన నీ ద్వారానే రావాలి " అన్నారు. నాకూ వళ్ళు మండిపోయింది. మంచి కయినా చెడు కయినా ఒక హద్దుండాలి. కోడె త్రాచయినా ఒక మనిషిని ఒకేసారి కాటు వేస్తుంది కాని ఆ మనిషి శరీరం మీద పది చోట్ల కాటు వెయ్యదు. కాని నీతి నిజాయితీని శాశ్వతంగా వదులుకున్న వాళ్ళు ఒకే వ్యక్తిని ఒకటికి పదిసార్లు ఇబ్బంది పెడుతూనే ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు.
"భార్య చేత అనరాని మాట అనిపించు కునేటంత పరిస్థితికి మీరెందుకు దిగజారి పోయారో నాకు అర్ధం కాదు. చదువూ, సంస్కారామూ ఉండి ఒక ప్రభుత్వ కచ్చేరీ లో ఎనిమిదేళ్ళ కు పైగా ఉద్యోగం చేసి క్రమేణా అధః పతితుడుగా ఎందుకు అయారో ఆలోచిస్తే ఆలోచనకు అందని సమస్యగానే నిల్చి పోతుంది. నేను మిమ్మల్ని ఇంటికి రావద్దని ఎన్నడూ అనలేదే. ఈ కుటుంబం మీది. ఈ కుటుంబ యజమానులు మీరు. ఈ భార్య బిడ్డల కీవితాలు మీతోనే పెన వేసుకున్నాయి. సంపాదన ఉన్నా లేకపోయినా ఈ కుటుంబ యజమాని మీరే. కాదని ఎవరన్నారు" అన్నాను.
కాసేపు ఆగి సిగిరెట్ వెలిగించారు. నేను మాట్లాడకుండా కూర్చున్నాను.
"కుటుంబ యజమాని నేనయినా గౌరవ మర్యాదలు వ్యక్తిత్వమూ నీకే ఉన్నాయి. కాని నా వ్యక్తిత్వానికి గౌరవం లేదు సుభా. కాదంటావా."
"కాదనను. ఈ సత్యాన్ని తెల్సుకున్నందుకు చాలా సంతోషం . మీ వ్యక్తిత్వాన్ని మీరు నిలబెట్టు కుంటే మిమ్మల్ని చూసి నాకన్నా ఎక్కువగా ఎవరూ సంతోషించరు" అన్నాను.
పది రోజులు గడిచాయి. ఆ నెల ఒకటో తేదీ ఆదివారం అయింది. రెండవ తేదీ సోమవారం జీతం వచ్చింది. తాను విశాఖ పట్నం వెళుతున్నానని పది రోజుల వరకూ రాననీ చెప్పి అన్నయ్య నూటా ఏభై రూపాయలూ సోమవారం సాయంత్రం ఏడు గంటల కల్లా తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు. నా జీతం లో నూట యాభై రూపాయలూ అన్నయ్య ఇచ్చిన నూట యాభై మొతం మూడు వందలూ నా పెట్టెలో పెట్టి తాళం వేశాను. తాళం చెవి నా మెళ్ళో గొల్సు లోనే ఉన్నది. ఆ రాత్రి వారు ఇంట్లోనే వున్నారు. తెల్లవారి ఉదయం కాఫీ తాగాక వారు వెళ్ళిపోయారు. రోజూ ఉదయం ఎనిమిది గంటల లోపే ఒక్కొక్కప్పుడు వెళ్ళి పోతారు. అట్లాగే ఆరోజూ వెళ్ళిపోయారు. ఉదయం తొమ్మిది గంటలకు ఇంటి యజమాని కి అద్దె ఇవ్వాలని తాళం చెవితో నా పెట్టె తాళం తీసి డబ్బు కోసం చూశాను. మూడు వందలూ లేవు. అన్నీ పది రూపాయల నోట్లు, ముప్పై కాగితాలు. నా గుండె ఝల్లు మన్నది. పెట్లో ఉన్న బట్టలన్నీ తీసి విదిలించాను. డబ్బు లేదు. అందరం కలిసి ఇల్లంతా వెతికాం. ఎక్కడా కనపడలేదు. తల బాదుకున్నాను.
"ఇంకెందుకూ వాడే ఏ మారు తాళం చేవితోనో పెట్టె తీసి ఆ డబ్బు తీసుకుని ఉంటాడు , అనుమానం లేదు.' అన్నది అత్తయ్య.
మరొక కొత్త పరీక్ష. ఏభై రూపాయలు ఇంటద్దె. వెచ్చం కొట్టు షావుకారుకి నూట పది, పాలు , పెరుగు వాళ్ళకి నలభై రూపాయలు, పని మనిషి కి అయిదు రూపాయలు. పెద్ద వాడి స్కూలు జీతం పది . అక్కయ్య ట్యూటోరియల్ కాలేజీ లో చేర్తానన్నది. ఈ మూడు వందలే చాలవే. ఎట్లాగు రా భగవంతుడా అనుకుంటుంటే ఇప్పుడు మొదటికె మోసం వచ్చిందని తలబాదుకున్నాను. ఇప్పుడు ఏం చేసేటట్లు? ఎవర్ని అడగాలి? అయినా ఎవరిస్తారు? అమ్మేందుకు ఏమున్నది?
వారి మీద ఎంతో కోపమే కాదు. అసహ్యం కలిగింది. పది పదిహేనేళ్ళ ఏ బాధ్యత లేని స్కూలు కుర్రాడి లా ఈ దొంగతనం ఏమిటి? పైగా భార్య సంపాదన విలాసాలకు ఖర్చు పెట్టటమా? ఈ మనిషి బ్రతుకేం....! ఛీ ఛీ ఏం జన్మ. పరిపరి విధాల తల్చుకుని బాధపడ్డాను.
ఇప్పుడు యింటి యజమాని తో ఏం చెప్పాలి? మెల్లిగా వెళ్లి ఆయనతో చెప్పాను. "వారు ఏదో తొందరగా అవసరం ఉండి డబ్బంతా తీసుకుని వెళ్ళి పోయారు బాబుగారూ. రాగానే అడిగి తీసుకుని అద్దె ఇవాళో, రేపో ఇచ్చేస్తాను." అయన తల పంకించి "సరేనమ్మా" అన్నాడు. జీవితం దినదిన గండంగా ఉన్నది.
మేం అనుకునేవన్నీ పెద్దవాడు విన్నాడు.
"నాన్న దొంగతనం చేశాడా అమ్మా, అసలు నాన్న ఇట్లా తయారయారెందుకూ? దొంగతనం చెయ్యటం ఎందుకూ? ఉండు రాగానే కనుక్కుంటాను" అన్నాడు. ఈ ఏడేళ్ళ వాడి దృష్టి లో వారు ఎంతో నీచంగా చూడబడుతున్నారు. పరువూ, మనిషి యందు విలువా పోయాక జీవచ్చవం లా బ్రతకడమే అవుతుంది.
ఆరోజు వారు ఎప్పుడు వస్తారో నని శలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాను. పెద్దవాడు ఏదో శలవు కావడంతో స్కూలుకు పోకుండా ఇంట్లోనే ఉన్నాడు.
పన్నెండు గంటలకు వారొచ్చారు. ఏమీ ఎరగని వాడిలా ఉన్నారు.
"పెట్లో మూడు వందలూ తీశారా" అన్నాను.
"అవును తీశాను."
"ఎందుకు తీశారు. మీకా డబ్బు మీద ఏం అధికారం ఉన్నది. మీరేం సంపాదించి భార్యా పిల్లల్ని పోషిస్తున్నారా? పైగా మీరు తాళం చెవితో పెట్టె తీసి దొంగతనంగా రాత్రి పూట డబ్బు తీశారే , సిగ్గు అభిమానమూ ఎప్పుడో వదులుకున్నారు. భార్య సంపాదన మీద ఆధారపడి ఉంటూ నికృష్ణ జీవితం గడుపుతూ, పైగా రెక్కలు ముక్కలు చేసుకుని నెలల్లా కష్టపడి సంపాదించిన నెల జీతాన్ని ఒక్క క్షణం లో మీ విలాసాల కోసం ఖర్చు పెట్టుకోటానికి దొంగతనంగా ఎత్తుకు పోయారు. ఛీ ; మీదీ ఒక బ్రతుకేనా. ఈ నెలల్లా ఎట్లా బ్రతకాలి. ఉన్న అప్పులు ఎట్లా తీరుతాయి. ఈ ఇంట్లో మీకుస్థానం లేదు. ప్లీజ్ గెటవుట్"
రౌద్ర మూర్తినే అయ్యాను. నా కళ్ళు చింత నిప్పుల్ని రాల్చాయి. కోపం, అసహ్యం వారి యందు పూర్తిగా కలిగింది. "వెళ్లి పోరేం" అన్నట్లు అయిష్టతగా చూశాను. "నాన్నగారూ, దొంగతనం పాపం. తప్పు నాన్నగారూ. ఆ డబ్బు ఎక్కడ దాచారో ఇచ్చేయండి. నేను బడికి జీతం కట్టాలి. పుస్తకాలు కొనుక్కోవాలి. రండి రండి ఆ డబ్బు ఎక్కడ దాచారు. ఆ డబ్బిచ్చేసి పది గుంజీలు తీస్తే ఈసారికి అమ్మ ఊరుకుంటుంది." అన్నాడు పెద్దవాడు.
"వాడికున్న పాటి జ్ఞానం కూడా నీకు లేక పోయిందిరా. దౌర్భాగ్యుడా . ఇందర్నీ ఏడిపించి మా ఉసురు పోసుకుని ఆ గడ్డి తినకపోతే ఏం? నీది ఒక బ్రతుకేనా. పో బైటికి" అన్నది అత్తయ్య. ఆవిడకూ ప్రాణం విసిగి పోయింది. ఏడుస్తూ కూర్చుంది.
"సుభాషిణి" పెద్దగా అరిచారు. పిడికిలి బిగించి వేళ్ళు నలుపుకుంటూ నిల్చున్నారు.
"ఎందుకట్లా అరుస్తారు."
"అరవటం కాదు. నాలో చెలరేగే సంఘర్షణ. కత్తి మీద సాములాంటి అప్పులు తీర్చు కోడానికి ఆ డబ్బు వాడాను సుభా. దొంగతనం చేసి ఆ డబ్బు తో నా బాకీలు తీచుకున్నాను. ఇంత చదువుకుని ఎందుకూ పనికి రాకుండా అయిపోయాను. నా పరిస్థితి చూసి ఎవరూ నన్ను నమ్మి ఉద్యోగం ఇవ్వరు. ఇంకెప్పుడూ ఇట్లాంటి పని చెయ్యను. సుభా -- ఇట్లాంటి దొంగతనం చెయ్యను, నన్ను క్షమించు" కళ్ళనీళ్ళు పెట్టుకుని నా చేతులు పట్టుకున్నారు. అత్తయ్య కాళ్ళు పుచ్చుకుని ఏడ్చారు.
పది నిమిషాలు ఎవ్వరం మాట్లాడలేదు.ఇంత దిగజారిపోయిన ఈ మనిషిని ఏమనాలో అర్ధం కాలేదు. అన్నీ వదులుకున్న వీరికి మతి భ్రమించిందేమో అనుకున్నాను.
'చూడండి , ఇంత చదువుకున్నారు. ఉద్యోగం చేశారు. ఇంత అజ్ఞానంగా ఎందుకు బ్రతుకుతున్నారు. మళ్ళా ఏదయినా ఉద్యోగం చేసుకొని గౌరవంగా ఎందుకు బ్రతక్కూడదు. కుదురుగా ఉద్యోగం చేసుకుని పోయిన గౌరవాన్ని ఎందుకు నిలబెట్టు కోరు? అసలు మీ ఉద్దేశ్యం ఏమిటి. సర్వం పోగొట్టుకున్నాం. ఇంకా మేం మిగిలాం. మేం ఈ మాత్రంగానైనా బ్రతకడానికి మీకు యిష్టం లేకపోతె అందరం చచ్చిపోదాం. ఈ వంశానికి ఇదొక శాపమేమో" అన్నాను.
"మీ మీద నా మనస్సు లో ఏ కల్మషమూ లేదు సుభా. మానసికంగా ఎంతో భాదపడుతున్నాను. ఎప్పుడూ ఏం చేస్తానో నాకే తెలీటం లేదు! సర్వవిధాల భ్రష్తుడి నయ్యాను. ఈ మానసిక సంఘర్షణ నా చేత అనేక దుర్మార్గాలను చేయిస్తున్నది. ఇంక కుదురుగా ఉద్యోగం చేయలేను సుభా. ఉద్యోగం చేయలేను" ఆయాసపడుతూ ఉద్రేకంగా అన్నారు.
ఆ సాయంత్రం రాధ వచ్చింది. జరిగిందంతా చెప్పాను. రాధ నిట్టూర్చి అన్నది.
"మన సంఘం లో స్త్రీకి వైధవ్యం అనేది భర్త చచ్చిపోతేనే కలుగుతుంది. భర్తతో తెగతెంపులు చేసుకున్న స్త్రీని భర్త పరిత్యక్త అంటారు. కాని నువ్వు అందుకు భిన్నంగా ఇక నుంచీ జీవించాలి. నువ్వు శారీరకంగా మానసికంగా మాంగల్యం ఉన్న విన్తంతువు గా జీవించాలి. బావతో అన్ని సంబంధాలు తెగతెంపులు చేసుకుని పూర్తిగా అతన్ని మర్చిపోయి ఇద్దరు పిల్లల్ని వృద్దిలోకి తెచ్చుకో. మీ జీవితాల నుంచి పూర్తిగా తొలగిపోమని బావతో నిష్కర్షగా చెప్పెయ్యి. మీకు కనబడకుండా ఈ విశాల ప్రపంచంలో బావ ఎక్కుడున్నా బ్రతికి వున్నంత వరకూ నువ్వు పునీ స్త్రీ వి. అతను చనిపోయాడని ఎప్పటి కయినా తెలిస్తే ఆ మంగల్యాన్ని అప్పుడే తీసెయ్యి. నిత్యమూ నిన్ను చంపుతూ ఏదో ఒక దుర్మార్గాన్ని సృష్టించే ఆ భర్తతో నువ్వు కాపురం చేసి జీవితాంతం మనస్శాంతి లేకుండా బాధపడే కన్నా నువ్వు వితంతువు కావటమే శ్రేయస్కరం . ఎంత దుర్మార్గుడైనా భర్తను ఏ స్త్రీ చంపి తనకు తానుగా వైధవ్యాన్ని సృష్టించుకో లేదు కనుక ఆ పరిస్థితి వచ్చేవరకూ చావక అన్ని విధాలా దూరంగా ఉంటమే మంచిది."
రాధ చెప్పిన మాటలు మోడు బారిన నా మనస్సుని ఎంతో కలచి వేశాయి. ఆ ప్రాణ త్యాగామేదో నేనే చేసుకుంటే బాగుండుననిపించింది. కాని పిల్లలు, వాళ్ళని ఎవరు పెంచుతారు?
ఇద్దరం కలిసి రామారావు గారింటికి వెళ్ళాము. వారి భార్య ఉన్నది. అతనింకా ఇంటికి రాలేదు. నేను ఉద్యోగంలో చేరినప్పట్నుంచీ మా పెళ్ళయి నప్పట్నుంచీ మా కుటుంబం లో జరిగే ప్రతి విషయమూ రామారావు గారికి తెల్సు. ఆయనా బాధపడి ఎప్పటి కప్పుడు తగిన సలహా సహాయాన్ని అందించేవారు. అందుచేతనే వారింటికి వెళ్లాను. అయన భార్యతో అన్ని విషయాలు చెప్పాను. ఆవిడ ఎంతో విచారపడింది.
