గాభరాపడుతూ, వేగంగా కనురెప్పల నాడిస్తూ. 'అవుతే మీరు వివాహితులా?...' కళ తప్పిన ముఖంతో తడబడుతూ అంది.
'వివాహంజరిగి రెండు సంవత్సరాలైంది.'
'ఆఁ...' అని తెల్లముఖం వేసింది. 'క్షమించండి! నేను వేరే విధంగా ఊహించుకున్నాను.' ఆమెకు కన్నీరే తరువాయిగా ఉంది.
'ఎందుకండీ అంత కంగారు పడిపోతారు? నేను యింకా అవివాహితున్నే!' నీరజ కళ్ళలోకి చిలిపిగా చూస్తూ చిరునవ్వుతో అన్నాడు సుందరం.
నీరజ ముఖకవళికలు మారిపోయాయి. సంతోషంతో సుందరాన్ని చూస్తూ 'అబ్బ! నన్ను హడలగొట్టేశారు! మీరెంత చిలిపి వారండీ!' అంది.
'పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఎలా చదువుతున్నారు?' నీరజ కళ్ళలోని మెరుపు లను గమనిస్తూ అన్నాడు సుందరం.
'బాగానే చదువుతున్నాను' అని మళ్ళీ 'నన్ను మీరు' అని సంబోధించకండి. ఆ పిలుపును సన్నిహితులకు నిషేధించారు.'
'అంటే!'అర్ధం కానట్లు నటిస్తూ చిలిపిగా అన్నాడు సుందరం.
'పోండి...మీరు నన్ను వేళాకోళం పట్టి స్తున్నాడు' నిండుగా, హాయిగా నవ్వింది నీరజ.
'నీరజా! నీ హృదయాన్ని నే నెప్పుడో అర్ధం చేసుకున్నాను. మరి నా గురించిన వివరాలు ఏమీ తెలుసుకోనక్కరలేదా?'
'అవసరంలేదు.' తన చూపులతో సుందరాన్ని కలవరపెడుతూ అంది.
'త్వరపడుతున్నావేమో?'
'లేదు. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను.' నీరజ కళ్ళు సంతోషంతో మెరిసిపోతున్నాయి. సుందరం ఆ మెరిసే కళ్ళల్లో తన ప్రతిబింబాన్ని వెదుకుతున్నాడు. వాకిట్లో రిక్షా ఆగిన చప్పుడు వినిపించి యిద్దరూ దూరంగా జరిగి కూర్చున్నారు.
సుందరరామయ్యగారు లోపలికి వచ్చారు. ఆ తర్వాత రిక్షావాడు ఒకటొకటే సామాన్లనన్నింటినీ లోపలికి చేరవేశాడు.
'అమ్మా! రేపటి పుట్టినరోజు పండుగకు డాక్టరుగారిని ఆహ్వానించావా?' ఆప్యాయంగా కూతుర్ని చూస్తూ ప్రశ్నించారు.
'ఆహ్వానించాను. వస్తామన్నారు.'
'నీవు ఆహ్వానించాక రాకుండా ఎలా ఉంటారమ్మా?' చిరునవ్వుతో అన్నారు సుందరరామయ్యగారు.
'నాన్నారూ! రేపటికి కావలసిన చీరె కొనుక్కోవాలి. వెళ్ళొస్తాను? రెండూ తెచ్చే అర్ధం సూచించే విధంగా సుందరం వైపు చూస్తూ అంది నీరజ.
మౌనంగా ఆమె ననుసరించాడు సుందరం-
'ఈడు-జోడు చక్కగా ఉంటుంది' సుందరరామయ్యగారి పెదిమల కదలికవల్ల పై మాటలు మెల్లిగా వెలువడ్డాయి.
.jpg)
* * *
సుందరం రెండురోజులుగా సుందర రామయ్య గారియింటికి వెళ్ళడం లేదు. ఆయన గారి ఆరోగ్యం మళ్ళీ చెడిపోయింది. అయినా మునుపుటంత బాధ కలుగనందువల్ల అశ్రద్ధ చేశారు.
ఒకరోజు రాత్రి పదకొండుగంటల తర్వాత సుందరరామయ్యగారు బాధతో మెలికలు తిరిగిపోసాగారు. బాధ భరించలేక పెద్దగా మూల్గడం ప్రారంభించారు. నీరజ నిద్రపోతున్నదల్లా వారు మూల్గుతున్న శబ్దానికి లేచింది. తండ్రి పరిస్థితి ఆమెకు ఎంతో భయాన్ని కలిగించింది. ఆ సమయంలో ఏం చేయాలో తోచలేదు. వంటమనిషి వెళ్ళిపోయి కూడా చాలాసేపైంది. ఆలస్యం చేస్తే ప్రమాదం ముంచుకు రావచ్చనే భయంతో అక్కడికి దగ్గరలోఉన్న టాక్సీ స్టాండు వైపు పరుగెత్తింది.
టాక్సీని సుందరం రూముముందు ఆపి తలుపు తట్టింది. గాఢనిద్రలో ఉన్నాడేమో తలుపు తెరవలేదు అతను మరొకసారి దగ్గరగా పిలుస్తూ తలుపు తట్టింది నీరజ.
తలుపుతీసిన సుందరం నీరజను చూసి ఆశ్చర్యపోయాడు-
ఇంత రాత్రపుడు వచ్చావేం?' ఆందోళన పడుతూ ప్రశ్నించాడు.
'నాన్నగారికి చాలా సీరియస్ గా ఉంది. భయంతో ఏమీ తోచక టాక్సీలో తీసుకువచ్చాను.' టాక్సీని చూపిస్తూ అంది.
సుందరం టాక్సీవద్దకు త్వరగావెళ్ళి సుందరరామయ్యగారిని చూశాడు. స్పృహ కోల్పోయి శ్వాస పీల్చుకోలేక ఉక్కిరి బిక్కిరౌతున్నారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఊహించి నీరజవైపు తిరిగి 'నీరజా... మీ నాన్నగారికి వెంటనే ఆక్సిజన్ యివ్వాలి. ఆలస్యంచేస్తే ప్రమాదం, త్వరగా వెళ్ళాలి' అని నీరజకు టాక్సీలో కూర్చోమని సంజ్ఞ చేస్తూ తను ముందు సీట్లో కూర్చొని గాంధీ హాస్పిటలుకు పోనివ్వవలసిందిగా డ్రైవరుకు చెప్పాడు.
ఏర్పాట్లన్నీ చకచక జరిగిపోయాయి. సుందరానికి బాగా పరిచయమున్న డాక్టరే డ్యూటీలో ఉండడంవల్ల పని తేలికగా జరిగిపోయింది.
'నీరజా .... ఇక భయంలేదు. ప్రమాద పరిస్థితి దాటిపోయింది' బిక్కముఖం వేసుకొని తండ్రివైపు దీనంగా చూస్తున్న నీరజతో అన్నాడు సుందరం.
'నాకెందుకో భయంగా ఉంది. ప్రమాదం తప్పిపోయినట్లేనా?' రెండు కన్నీటి బిందువులు లైటు కాంతికి మెరుస్తూ ఆమె కనుకొలుకుల్లో క్రిందికి జారడానికి సిద్ధంగా ఉన్నాయి.
సుందరరామయ్యగారిని ప్రత్యేక రూములో ఉంచే ఏర్పాటు చేశాడు సుందరం. బాధ తగ్గడంవల్ల హాయిగా శ్వాస పీలుస్తూ మత్తుగా నిద్రపోతున్నారు వారు. ఆ గదిలో నీరజ, సుందరం తప్ప మరెవ్వరూ లేరు.
నీరజ పరిస్థితి సుందరానికి ఎంతో జాలి కలిగించింది. ఆమె రెండు భుజాలపై చేతులువేసి దగ్గరకు తీసుకొని ఆమె కళ్ళనుండి జారడానికి సిద్ధంగా ఉన్న కన్నీటిని చిటికిన వ్రేలితో చిమ్మగొట్టి 'నీరూ ... నేనుండగా నీకెందుకంత భయం? నాన్న గారు ఒకటి రెండు గంటలలో నీతో మాట్లాడుతారు.' లేడి కళ్ళలా బెదిరిపోతున్న ఆ కళ్ళల్లోకి లాలనగా చూస్తూ అన్నాడు సుందరం.
అతని భుజంపై తల ఆనించి మూగబాధ ననుభవిస్తూ తన తండ్రికి ఆరోగ్యాన్ని కలిగించే భారాన్ని అతనిపై వదిలింది. అలా ఎంతసేపు గడిచిందో ఏమో? మత్తుమందు వల్ల కలిగిన మైకం నుండి తేరుకున్న రోగి కేకలు ప్రక్క గది నుండి వినపడడంతో సుందరం, నీరజలకు, బాహ్య స్మృతి కలిగి యిద్దరూ ఒకరి నుండి మరొకరు దూరంగా జరిగి నిల్చున్నారు. నీరజ ముఖంలోని ఆవేదనను చూడలేక 'నీవు ధైర్యంగా ఉండాలి నీరూ....! లేకపోతే నేనిక్కడి నుండి వెళ్ళిపోతాను.' బెదిరిస్తూ అన్నాడు సుందరం.
ఆ మాటతో వేటగాణ్ణి చూసిన లేడి లాగ గజ, గజ వణికిపోయింది నీరజ. 'అలాగే ధైర్యంగా ఉంటాను. దయచేసి మీరు మాత్రం ఎక్కడికీ వెళ్ళవద్దు.' దీనంగా సుందరం వైపు చూస్తూ అంది.
తెల్లవారింది ఉదయం ఏడు గంటలకు సుందరరామయ్యగారికి తెలివి వచ్చింది.
'అమ్మా నీరజా! నేనెక్కడున్నానమ్మా?' ఆస్పత్రిని ఆశ్చర్యంతో నలువైపులా పరికించి చూస్తూ అడిగారు సుందరరామయ్యగారు.
'సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో నాన్నారూ!' అని జరిగిన విషయమంతా వివరంగా చెప్పింది నీరజ.
'అలాగా తల్లీ! నిన్నెంత బాధపెడుతున్నానమ్మా!' అని సుందరం వైపు తిరిగి 'బాబూ సుందరం. నీ ఋణం ఎలా తీర్చుకోవాలో అర్ధం కావడంలేదు. రాత్రే కనక నీవు లేక పోయినట్లైతే అమ్మాయి ఒంటరిగా ఎన్ని యిబ్బందులు పడవలసి వచ్చేదో? ఈ మొండి వ్యాధితో అనవసరంగా నేను బ్రతికి ఉండి మిమ్ములను యిబ్బంది పెడుతున్నాను.'
'అవేం మాటలండీ? ప్రత్యేకంగా మీ కోసం ఏ బాధలూ పడడంలేదు. ఈ వృత్తిలో యిటువంటివి మా కలవాటే! లేనిపోని ఆలోచనలతో బాధపడకండి. హాయిగా విశ్రాంతి తీసుకోండి.' అని నీరజ వైపు తిరిగి 'నీరజా....ఇక నీవు యింటికి వెళ్ళి స్నానం అదీ చేసి వచ్చేయి. నేను కూడా రూముకు వెళ్ళి నిత్యకృత్యాలు తీర్చుకొని వస్తాను. ఇక మీ నాన్నగారికే భయమూ లేదు.' అని నీరజవైపు చూస్తూ అన్నాడు సుందరం.
'నాన్నారూ నేను వెడుతున్నాను. ఈ విషయం రాత్రి మామయ్యగారికి చెప్పడానికి వీలులేక పోయింది. నేను స్నానం చేసి మామయ్యగారికి ఈ విషయం తెలిసి వారిని తీసుకువస్తాను.' అని వెళ్ళిపోయింది నీరజ.
'అలాగే వెళ్ళి రా తల్లీ!' అని విశ్రాంతిగా కళ్ళుమూసుకొని పడుకున్నాడు సుందరరామయ్యగారు.
పదిగంటలకల్లా నీరజ, శ్రీపతి, అన్నపూర్ణమ్మగార్లతో వచ్చింది. ఆ తర్వాత డ్యూటీ డాక్టరు గారిని కనుక్కొని తండ్రికి ఆహారం యిచ్చింది.
'అమ్మాయి వచ్చి చెప్పింది. కబురు వినేసరికి కాళ్ళు చేతులు ఆడలేదనుకో! కారణమేమీ లేకుండానే మా యింటి నుండి వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడు! నీరజ గుండె ధైర్యం గలది కాబట్టి నిన్ను ఆ విధంగా రక్షించగలిగింది. మీ చెల్లెలు లాంటి అమాయకురాలే అయినట్లైతే ఏం జరిగిఉండేదో?' మందలిస్తున్నట్లుగా అంటూ ఆయనగారి పరిస్థితికి జాలి పడ్డారు శ్రీపతి గారు.
