"అక్కయ్య ఎట్లా ఉంటున్నదే? డాక్టరు కూడా చెప్పాడు. నువ్వు కొంత మానసికంగా కూడా బాధ పడుతున్నావని. నా మనస్సు నీకు తెలీంది కాదు. నావల్ల తప్పేమయినా ఉంటె దిద్దుకుంటాను. నువ్వేదో మనస్సులో తీరని వ్యధతో , బాధపడుతుంటే పైకి చెప్పకుండా ఉంటె మాకు యెట్లు తెలుస్తుంది?' అని అడిగాడు రమేష్.
వసుంధర కు ఇదంతా చిరాకు గా, వింతగా ఉన్నది. తనేదో తెలిసో, తేలికో ఎమాటయినా అంటే ఇట్లా కామాక్షి మనస్సు లో బాధపడుతున్నదేమోననుకుంది. 'నావల్ల తప్పుంటే క్షమించు వదినా. ఏమీ అనుకోకు' అనటానికి వసుంధర కు మనస్కరించ లేదు. అభిమానమూ, సిగ్గూ ముంచుకు వచ్చినాయి. రమేష్ అట్లా అంటుంటే వసుంధర ఏమీ మాట్లాడలేదు.
మళ్ళీ బ్రతిమాలుతూ అడిగాడు రమేష్ . కామాక్షి ఏమీ చెప్పలేదు.
ఆ రోజు రాత్రి అందరూ నిద్ర పోయాక పక్కనే మంచం మీద పడుకొన్న రమేష్ ను పిలిచింది కామాక్షి. వసుంధర తన గదిలో పడుకుంది.
"ఏం అక్కయ్యా, ఏమన్నా కావాలా? బత్తాయి రసం తీసి యివ్వనా?"
"ఏమీ అక్కర్లేదురా."
"మరేమిటి? మంచినీళ్ళు కావాలా? బార్లీ , జావా, పాలు కలిపి యివ్వనా?"
"ఏమీ అక్కర్లేదురా. ఈ ఇంట్లో కొచ్చినప్పట్నించీ నువ్వూ చూస్తూనే ఉన్నావు. లేని పోనీ కొత్త బాధ్యత నెత్తిన పెట్టుకున్నాను. కన్నకడుపు కు సహజంగా ఉండే ప్రేమ ఎక్కువే. కన్నతల్లి బాధ్యతలు పెంపుడు తల్లికి ఉండవు. కాని నాబోటి నిర్భాగ్యురాలి చేతుల్లో పిల్లలు ఆడుతూ, పాడుతూ ఉంటె పెంచిన మమకారం ఎక్కువగా ఉంటుంది. శకుంతల పిల్లవాడు నాకు బాగా మాలిమి అయినాడు. ఎందుకో వాడంటే నాకు అపేక్ష. ఎప్పుడూ వాడు నా దగ్గరే ఉండాలనిపిస్తుంది. వాడూ నేనంటే కిలకిలా నవ్వుతూ నా దగ్గరికి వస్తాడు. వాడికి నేనేం పెట్టి పోషించటం లేదు. ఆ సంగతి అందరికీ తెలుసు. వాడికి జ్వరం వచ్చిన పది రోజులు రాత్రింబవళ్ళు నేనే ఉపచారం చేశాను. ఈపది రోజుల్లోనూ వాడికి నాకు మరింత సన్నిహితుడుగా చేశాడు భగవంతుడు. వాడిని చూడకుండా ఉండలేని పరిస్థితికి వచ్చాను. నేనేమీ తప్పుపనీ, అమర్యాద పనీ చెయ్యటం లేదు. శకుంతల కొడుకు విషయం లో వాడి మీద ఉన్న మమకారాన్ని చంపుకోలేక పోతున్నాను. కాని ఇది వసుంధర కు గిట్టలేదు. పోనీ, మరో ఇల్లు మారదామంటావా?' అన్నది కామాక్షి.
"ఈ విషయాన్ని నేను తెలుసుకోలేక పోయాను, అక్కయ్యా. శకుంతల పిల్ల వాణ్ణి నువ్వు దగ్గరకు తీసినందువల్ల నాకేమీ బాధ లేదు. నువ్వేం కాని పని చెయ్యటం లేదు. వసుంధర కు నేను నచ్చ చెపుతాను. నువ్వేమీ అనుకోకు" అని రమేష్ మనస్పూర్తిగా అన్నాడు. అప్పటికి కామాక్షి మానసిక సంక్షోభం కొంతవరకూ తగ్గింది.
మరో నాలుగు రోజుల్లోనే కామాక్షి కి జ్వరం తగ్గింది. వసుంధర ఆఫీసు కు వెళ్లుతున్నది.
ఒక ఆదివారం నాడు శారద , వసుంధర తో వచ్చింది. శారద వాళ్ళింటికి రావడం అదే మొదటి సారి. సాధారణంగా శారద ఎవ్వరింటికి వెళ్ళదు. ఆఫీసు, ఇల్లే శారద కు శరణ్యం. తన అనాకారి తనాన్ని చూసి ఎవరయినా ఏమన్నా అనుకుంటారని శారద మనస్సులో క్రుంగి పోతుంది. వసుంధర బలవంతం మీద, అతి కష్టం మీద మొదటి సారిగా వచ్చింది. అప్పటికి కామాక్షి కి పధ్యం పెట్టారు.
శారదను కామాక్షి కి పరిచయం చేసింది వసుంధర. కాస్సేపు కూర్చుని మాట్లాడి వెళ్ళింది శారద. శారదను శకుంతల కూడా చూసింది. శారద వెళ్ళాక, "ఎవరావిడ, వసుంధరమ్మా? అంత తీసికట్టుగా ఉంది. నేనెక్కడో చూసినట్లే ఉన్నా. ఎక్కడబ్బా!" అన్నది శకుంతల.
"ఈ పేటలోనే ఉంటున్నారు. ఈ వీధి లోనే. నాలుగయిదు ఇళ్ళ అవతల. ఆవిడ బి.ఎ. పాసయింది. నాకన్న జీతం ఎక్కువ. మా ఆఫీసు లోనే ఆవిడ ఉద్యోగం చేస్తున్నది" అన్నది వసుంధర.
"ఓ యబ్బో! నీకంటే నాలుగాకులు ఎక్కువే చాడువిందన్న మాట. పాపం! ఏం కర్మో! బుర్రలో తెలివితేటలూ పెట్టి మట్టి బొమ్మను తయారు చేశాడు భగవంతుడు" అన్నది శకుంతల.
"నిన్ను పిండి బొమ్మగా, అందాలా రాశిగా తయారుచేసిన భగవంతుడే, బుర్ర లో ఏం పెట్టకుండా మట్టి బుర్రగా తయారు చేశాడు' అనుకుంది వసుంధర మనస్సు లో.
"చిత్ర విచిత్రమయిన స్వభావం గల మనుషులుంటారు శకుంతలా. పైకి అందంగా ఉన్నా తెలివితేటలూ లేనివాళ్ళు ఎంతమంది లేరు" అన్నది కామాక్షి.
"అవునే. నా మాదిరి!" నవ్వుతూ అన్నది శకుంతల.
శకుంతల యింట్లోకి వెళ్లి పోయింది.
"శారద అనాకారి రూపాన్ని చూసి ఎవ్వరూ పెళ్లి చేసుకోలేదు. శారద చాలా ఉత్తమురాలు వదినా. అంత సౌందర్యం గల ఆడదానికి బాహ్య సౌందర్యం లేకపోవడం ఒక ముఖ్యమైన లోటు. ఆవిడ హృదయ కవాటం తెరిస్తే ఆవిడ మనస్సు ఎటువంటిదో అర్ధమవుతుంది. కాని లోకం అలాంటి వాళ్ళను నమ్మదు వదినా. పైగా అంటారు కొంతమంది , చెడు తిరుగుళ్ళు తిరిగి అట్లా తయారయిందని. ఈ మాట చెప్పుకొని హృదయం తూట్లు పడేటట్లు గా ఏడ్చింది శారద" అన్నది వసుంధర.
"ఎవరికి వారు తాము చూసింది, విన్నది నిజమనే చెప్తారు కాని, హృదయం లోని అనుభూతులు ఎవరికి తెలుస్తాయి , వసుంధరా? ఆడదాని జీవితమే అంత" అని ఒక నిట్టుర్పు విడిచింది కామాక్షి. ఆరోజున రాఘవరావు తో జరిగిన సంభాషణ కామాక్షి ఇంకా మరిచి పోలేదు.
19

రామయ్య గారు వ్రాసిన ఉత్తరం చూసుకుని రమేష్ పొలం వ్యవహారం చూసుకోవటానికి ప్రసాద పురం వెళ్ళాడు. రాఘవరావు తో మాట్లాడి ఇద్దరూ కలిసి రామయ్య గారి దగ్గరకు వెళ్ళారు. లోగడ రామయ్య గారికి మాట ఇచ్చిన ప్రకారమే రాఘవరావు పొలం కొనటానికి ఒప్పుకున్నాడు. అక్కడే అగ్రిమెంటు వ్రాసుకున్నారు. రాఘవరావు వెయ్యి రూపాయలు అడ్వాన్సు ఇచ్చాడు. రమేష్ పైకం తీసుకున్నాడు. అంతా సవ్యంగానే జరిగినందుకు రామయ్య గారిని ఎంతో అభినందించాడు రమేష్. పూర్తీ పైకం కొలతలు అయినాక ఇచ్చే షరతు. గుంటూరు వెళ్లి సురేంద్ర ను కూడా చూసి, తండ్రి చేత తన వ్యవహారం సవ్యంగా చేసి పెట్టించి నందుకు కృతజ్ఞత తెలిపాడు రమేష్. ఎక్కువగా డబ్బు దగ్గరున్నప్పుడు అంతగా కాలం గడపటం మంచిది కాదని ఆ రాత్రి రైల్లో నే హైదరాబాదు వెళ్ళిపోయాడు రమేష్.
* * * *
గుంటూరు లో శ్యామసుందరి పి.యు.సి చదువుతున్నా సురేంద్ర కు రెండు సార్లు కన్నా ఎక్కువ కనుపించలేదు. ఆ కనబడ్డప్పుడయినా ముభావంగా కుశల ప్రశ్నలు వేసుకున్నారు గాని అంతర్యంగా మాట్లాడు కోలేదు. రమేష్ వెళ్ళిన మర్నాడే కాలేజీ నుంచి వస్తుండగా గవర్నమెంటు హాస్పిటల్ వద్ద శ్యామసుందరి , సురేంద్ర కు కనిపించింది. బాగా దగ్గరలో ఎదురు పడటం నుంచి ఇద్దరూ ఒక్కసారిగా చూసుకున్నారు. ఇప్పుడు శ్యామసుందరి కొంచెం సన్నగా పొడుగ్గానే ఉన్నది. గులాబి రంగు సిల్కు చీరే కట్టుకున్నది. నీలం రంగు వెల్వెట్ జాకెట్టు తొడుక్కున్నది. రెండు జడలు వేసుకున్నది. తలలో గులాబీ లు చక్కగా తురుముకున్నది. మెడలో సన్నని గొలుసు. రాళ్ళ నక్లెస్ . ఒకచేతికి నాలుగు జతల బంగారు గాజులు. ఎడమ చేతికి బంగారు గొలుసు రిస్టు వాచి. పక్కన స్నేహితురాళ్ళు ఎవరూ లేరు.
పఒకరి నొకరు చూడగానే ఎవరు ముందు పలకరించు కోవాలా అనే సంశయం లో పడ్డారు క్షణం.
ముందుగా సురేంద్ర పలకరించాడు. "కులాసాగా ఉన్నావా, శ్యామా? ఊళ్ళో ఉంటూనే నల్ల పూసవై పోయావ్!"
"కులసానే బావా. ఆదరణ లూ, అంతః కరణ లూ దూరమైనా చుట్టరికాలు దూరం కావుగా బావా?' అన్నది శ్యామ సుందరి నెమ్మదిగా.
గతుక్కుమన్నాడు సురేంద్ర. ఇంక ఎక్కువగా మాట్లాడటానికి ఆ పరిస్థితుల్లో అక్కడ బాగుండదు.
"అట్లా పార్కు కి పోదాం వస్తావా శ్యామా?" తల ఊపింది శ్యామ సుందరి. పార్కు కు వెళ్ళారు. ఇద్దరూ ఒక చివరన గడ్డి మీద కూర్చున్నారు.
"నేనంటే కోపంగా ఉంది కదూ?' అన్నాడు సురేంద్ర.
"కోపమెందు కు బావా? పరిస్థితుల్ని బట్టే నువ్వు నడిచావు గాని వేరే ఏం లేదు కదా?"అన్నది. అంత దగ్గరలో సురేంద్ర కూర్చున్నందుకు మనస్సు సంతోషంతో నిండిపోయింది. తన వైపే చూస్తున్న సురేంద్ర కనుపాపల్లో తన ప్రతిరూపాన్ని చూస్తూ కూర్చుంది శ్యామ సుందరి.
