Previous Page Next Page 
ఆరాధన పేజి 27


    రైలు కూతేసింది. అందరికీ చెప్పి రైలెక్కారు. పాప తండ్రిని వదలి బండి ఎక్కింది. మొదటిసారి ప్రయాణం చాలా సరదాగానే ఉంది పాపకు.
    కుమార్ మంజుహస్తాన్ని మృదువుగా నొక్కాడు. ఆ స్పర్శ ద్వారా ఆమె వెయ్యి ఏనుగుల బలాన్ని పుంజుకుంది. ప్రమీలా - భద్రం అంటుండగా రైలు కదిలింది. కుమార్ ఒంటరిగా తిరిగివెళ్ళాడు.
    దినాలు నిర్విరామంగా - సాఫీగా గడిచి పోతున్నాయి. మంజులనించి క్రమంగా ఉత్తరాలొస్తున్నాయి. ఎవరికివారు తమ దినచర్యలో మునిగి పోయారు.
    ఒకానొక శుభదినం. కుమార్ కు వైర్ వచ్చింది. ఇద్దరు అబ్బాయిలు పుట్టినట్లు.
    ఇదొహ అనుభూతి. వెంటనే వెళ్ళి చూడాలన్న కాంక్షను చంపుకుని పరీక్షలకి సిద్ధపడ్తున్నాడు. ఉన్నట్లుండి ఖాన్ దిగాడు. అతనిరాక కుమార్ ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. లోపల అడుగు పడుతూనే అన్నాడు. "మీ పెదనాన్న హార్ట్ ఎటాక్ వచ్చి-పోయారు. వారం రోజులు దాటాయి. ఇక్కడ నన్ను మళ్ళీ తీసికొంటే పనిలో చేరదామని వచ్చాను." చాల హుషారుగా చెప్పుకొని పోయాడు.
    "నీకు చాల సంతోషంగా వున్నట్లుంది-ఔనా?"
    లేదంటే అబద్ధం చెప్పినట్లవుతుంది. ఇంత కాలం వారిమాటను తీసేయక వారు చెప్పినట్లు విన్నాను, తద్వారా వారికి మనశ్శాంతి, తృప్తి లభించాయి, ఇక నాకు ఆంక్ష విధించేవారు లేరు. నేనిలా రావటం అందరికీ ఆనందదాయకం..."
    సర్జన్ మాదప్ప ఓ నెల్లాళ్ళు ఆగమని చెప్పారు. కుమార్ తో రెండురొజూ గడిపి వెళ్ళిపోయాడు.
    ఆ తర్వాత కుమార్ పరీక్షలన్నీ అయి పోయాయి. మంజువచ్చే దినాలుకూడా సమీపిస్తున్నాయి. అలసిపోయిన ప్రాణం. తనివిదీర రెండురోజులు నిద్రపోయి విశ్రాంతి తీసుకున్నా చాలనట్లే వుంది.
    నాల్గురోజులు గడిచిపోయాయి. ఆ రోజు సాయంత్రం వచ్చిన పోస్ట్ చూస్తూ కూచున్నాడు. ఒక ఫారిన్ ఉత్తరం వుంది. ఎంతో ఆత్రంగా తెరచాడు. అమెరికాలో మూడు సంవత్సరాలు- జోస్టస్ హాస్పిటల్ లో బ్రెయిన్ సర్జరీ-నేర్చుకోవటానికి స్కాలర్ షిప్ వచ్చింది. కుమార్ ఆనందానికి అవధులు లేకపోయాయి. రెండు సంవత్సరాలనుంచి ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో సర్జన్ మాదప్ప సహాయం ఎంతేనా వుంది. వారివల్లనే తనకీ స్కాలర్ షిప్ లభించింది. ఫారిన్ కు వెళ్ళి తర్ఫీదుపొంది రావాలని అందరికీ వున్నా, అందరికీ లభ్యంకాదు.
    ఉత్తరం తీసుకొని బట్టలు మార్చుకుని, సర్జన్ మాదప్ప దగ్గరకెళ్ళి తన కృతజ్ఞతలు తెల్సుకోవాలనిలోపలి కెళ్ళాడు. తయారై ఇవతలికి రాగానే కళ్యాణి హడావిడిగా మెట్లెక్కుతోంది. ఆమె ముఖం ఎరుపెక్కి కళ్ళువాచి వున్నాయి కొంగుతో ధారాప్రవాహంగా కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ "బావగారూ" అంటూ కుర్చీలో చతికిలబడింది. కళ్యాణికి నోటివెంట మాట రావడంలేదు.
    భాస్కర్ కుమార్ చెయ్యిపట్టుకుని చెబుతున్నాడు "ఎవరో కోర్టు పనిమీద స్వంత కారులో వస్తుంటే కల్యాణివికూడచూచినట్లుంటుందని అత్తమామగార్లు బయలుదేరారట. భువనగిరి సమీపంలో కారు ఒక లారీకి గుద్దుకుందట. ఇద్దరికి ఇంకా కారులోవుండే ఆ పెద్దమనిషికి బాగా గాయాలు తగిలాయట. డ్రైవరు పాపం చనిపోయాడట. ఇప్పుడే కబురు చెప్పాడొక పోలీసు....మామగారికి బాగా గాయాలు తగిలాయట. స్పృహలో లేరట. అత్తగారు కాస్త నయమేనట. స్పృహలో వున్నారు....ఇలా టాక్సీ కుదుర్చుకుని వచ్చాము...."
    కుమార్ కు ఏం చెయ్యాలో తోచలేదు. కళ్యాణిని ఓదార్చటానికి ఆమెవైపు నడిచాను. భాస్కర్ మౌనం దాల్చాడు.        కళ్యాణి గబుక్కున తలెత్తింది. "బావా-మీరు రావాలి." గాద్గదికంతో అంది. "నేనా?" కుమార్ ఆశ్చర్యాన్ని కంతులేదు.
    భాస్కర్ అందుకున్నాడు. లక్ష్మివదినకు జ్వరంగా వుంది. మూర్తి అన్నయ్య కదలటానికి వీల్లేదు. అందుకే మీ దగ్గరకు పరుగెత్తు కొచ్చాము. అక్కడి డాక్టర్ సెలవుమీద వెళ్తే యింతవరకు ఎవర్నీ వేయలేదట....కాంపౌండర్ చూసుకుంటాడుట .... మీరువస్తే...." ఇది పోలీస్ కేసు కాదా - ఎవర్నైనా గవర్నమెంటు డాక్టర్ ని..."
    కల్యాణి కుమార్ ఎదురు గా నుంచుని ఎక్కిళ్ల మధ్య అంది "ఎవరైనా రానివ్వండి...మన జాగ్రత్త మనం తీసుకోవాలి ..... వైద్యంలో లోపంవల్ల నాన్న దక్కకపోతే నాకు పరమ దుఃఖంగా వుంటుంది. అక్కయ్యే ఈ క్షణంలో ఇక్కడ వుంటే ఇంతగా తటపటాయించేవారా? మీ పాదాలు పట్టుకుంటాను..." కళ్యాణి ఒంగబోయింది.
    కుమార్ అడుగు వెనక్కువేసి సీరియస్ గా అన్నాడు. "ఒద్దమ్మా.....ఇప్పుడే వస్తాను" అతను గబగబ అడుగులేసుకుంటూ ఆసుపత్రివైపు వెళ్ళిపోయాడు. సర్జన్ మాదప్పతో చెప్పి మొబైల్ మెడికల్ వాన్ లో వచ్చేసరికి అరగంట కూడా పట్టలేదు. కల్యాణికి ఆ అరగంట ఆరుగంటల్లా వుంది.
    టాక్సీ, వాన్ రెండు భువనగిరి వైపు పరుగు లెత్తాయి.
    భువనగిరి హాస్పిటల్ దగ్గరవాళ్ళు దిగేసరికి సంజె చీకట్లు నలుమూలల వ్యాపిస్తున్నాయి. కుమార్ కల్యాణిని కలుసుకుని నెమ్మదిగా అన్నాడు. "నేను ఒక డాక్టర్ని - అంతే -బంధుత్వం-చుట్టరికం అనవసరం....నువ్వు కూడా నన్ను బావగా కొంతకాలం వరకు మర్చిపోవాలమ్మా" కల్యాణి ఒక్కక్షణం బావకళ్ళలోకి చూసింది. ఆమె అలా ఆరాధనగా చూస్తుంటే కళ్ళలో నీళ్ళు పొరలు పొరలుగా వచ్చేశాయి. కళ్ళు తుడుచుకుంటూ అందరితోపాటు లోపలికెళ్ళింది. గుమ్మందగ్గర ఒక పోలీసు నుంచుని వున్నాడు. భాస్కర్ అతడితో అంటున్నాడు... "మా అత్తమామగార్లను చూడటానికి డాక్టర్ని పిల్సుకువచ్చేము. నెహ్రూ ఆసుపత్రి వాన్ ఆగింది. అటు వెళ్ళి చూడండి..."
    కుమార్ చేతిలో స్టెతస్కోప్ చూసి "మీరేనా డాక్టరు గారు?" అంటూ ప్రక్కకు తొలిగాడు. లోపల కాంపౌండర ఒక నర్సు కూచుని వున్నారు. గాయాలకు కట్లుకట్టి ఉన్నాయి. రెండవమంచంలో కళ్యాణి తల్లి సన్నగా మూల్గుతూ పడుకుని వుంది.
    కల్యాణి తండ్రి మంచాన్ని సమీపించారు. కుమార్ కాంపౌండర్ కు తన్నుతాను పరిచయం చేసుకొన్నాడు. కళ్యాణి తల్లిమంచం దగ్గర కూచుని ఆమెకు ధైర్యం చెబుతోంది.
    అతనిమీది గుడ్డ తొలగించాడు కాంపౌండర్. గ్యాప్ లైట్ కాంతిలో దేహం తెల్లగా అతితెల్లగా పాలరాతిలా అగుపించింది. కుమార్ కనుబొమలు ముడివడినై. ఒళ్ళంతా తడిమిచూస్తున్నాడు. అంతా బాగానే వుంది. కానీ కుడిపక్క కాలర్ బోన్ విరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది- తలకట్టు విప్పి చూపించింది నర్స్. కుమార్ ముఖంలోని ఆందోళనను చూస్తుంటే బాస్కర్ కు ఎన్నో అనుమానాలు. కుమార్ గుండెను పరీక్షించాడు. ఎక్కడో భూగర్భంలో కొట్టుకుంటోంది.
    తలకు తగిలిన గాయం చూడటానికి సుమారుగా వుంది. మిగతా గాయాలన్నీ పరీక్షించి అడిగాడు. ప్రమాదం జరిగినస్థలంలో గాయాలెలా వుండినయ్? రక్తం పోతూనే వున్నదా? ఇక్కడికి తెచ్చేవరకు స్రవిస్తోనే వుందా?"
    "మేము వెళ్ళేసరికి తలమీది గాయంనించి తప్ప అన్నిగాయాలనుంచి రక్తం స్రవిస్తోనే వుండింది. డాక్టర్ గారూ-అన్ని గాయాలతో ఇక్కడికి తేవటం చాల కష్టమైంది. ఎలాగో తెలిసిన-ఉన్న మందులువాడి రక్త స్రావం తగ్గించగల్గాము-కాని చేతిదగ్గర మాత్రం ఇప్పటికీ పోతూనే వుంది. గట్టిగా కడితే ఏమౌతుందో అని భయం....చూచారుగా చర్మం-కండరాలు పీచుపీచు - ఎలా సర్దాలో, ఏం చెయ్యాలో తెలీక అలాగే కట్టుకట్టాము. ఇలాంటిది ఇంత వరకు చూడనేలేదు నేను. ఇప్పుడు రక్తం పోవటం చాలావరకు తగ్గిందనుకోండి..." కుమార్ కు అంతా అర్ధమైంది. అతనిలో రక్తంలేదు.
    "భాస్కర్ - లాబ్ టెక్నీషియన్ వాన్ లో వుంటాడు పిలువు"
    అతను వచ్చేసరికి కొంచెం రక్తాన్ని సిరెంజ్ లోకి తీసివుంచాడు కుమార్.
    "ఏ గ్రూప్ రక్తమో చూడు రవీ" అంటూ అందిచ్చాడు.
    రవి ఆ రక్తాన్ని తీసికొని వెళ్ళిపోయాడు.
    ఇలాంటి పరిస్థితిలో అతనిని కదిలించటం ప్రమాదకరం. ఇది మరీ చిన్న ఆసుపత్రి. రక్త ప్రాపం అరికట్టాలి. రక్తం ఎక్కించాలి. అంతా నిమిషాల్లో జరిగితేనేగాని ప్రాణాలు దక్కేలా లేవు. రక్తం పోకుండా ఇంజక్షన్స్ గ్రుచ్చు తున్నాడు గాయపు ద్వారం దగ్గర రక్తం త్వరగా కరుడుగడితే ఏ ప్రమాదం వుండదు అతి కష్టంతో తెగిన రక్తనాళాన్ని రెండింటిని పట్టుకో గల్గాడు. రక్తంపోకుండా మూతి కట్టేశాడు. రెక్క మీది గాయం అతి భయంకరంగా వుంది. ఎముకలు పిండి పిండైనా ఆశ్చర్య పోనక్కరలేదు.
    రవి లోపలికొచ్చాడు. "సార్-ఓ" గ్రూప్ బ్లడ్ అన్నాడు.    
    చుట్టూవున్న వ్యక్తుల్ని చూశాడు. తాము తెచ్చిన బ్లడ్ బాటిల్స్ లో ఈ గ్రూప్ లేదు. కుమార్ ఎవర్నీ ఏమే అడగలేదు. వారి యిష్టాయిష్టాలను తెలిసికోలేదు. కలియజాచి అన్నాడు.
    "మా అందరి బ్లడ్ సాంపిల్స్ తీసుకొనిచూడు' రవి తనపని ముగించుకుని వెళ్ళిపోయాడు.
    కళ్యాణి గబగబ కుమార్ ను సమీపించింది. "మీరు రక్తం సాంపిల్ ఎందుకిచ్చారు. అది సరిపోతే తప్పక ఇస్తారు.....కానీ దానివల్ల మీబలం తగ్గిపోతుంది కదా? నాన్నను ట్రీట్ చెయ్యగలరా? మీరెందుకిచ్చారు?" ఆమె కంఠం పూడుకు పోయింది.
    కుమార్ ఆమెవైపు ఆప్యాయంగా చూశాడు. వెంటనే మందలింపుగా ఉన్నాడు." మీ నాన్నగార్ని రక్షించటం నా విధి. నీవు నిశ్చింతగా వుండు."
    "కానీ.....మీరు..." ఆమె పూర్తి చేయక ముందే "కళ్యాణీ" అంటూ తల్లి బాధగా ఇవతలికి తిరిగింది. కుమార్ ను చూచి గబుక్కున శ్వాస విడిచింది. "కళ్యాణీ" నీరసంగా పీల్చింది.
    కళ్యాణి కుమార్ మౌనంగా వుండటంచూచి మరీ దిగులు పడిపోయింది. కుమార్ ఆమె ఆందోళన గ్రహించి అనునయంతో అన్నాడు. "నా రక్తం సరిపోతే నేనే ఎక్కించగలను.....కొద్దిగా నీరసంగా వుంటుంది కాని-నా స్వాధీనంలో నేనుండగలనమ్మా..."
    కల్యాణి ఓ మారు బైటికెళ్ళి తిరిగి వచ్చింది. తల్లిని సమీపించింది. ఆమె కల్యాణివైపు బెదరిపోతూ చూసింది. "కళ్యాణీ- అతను ఆ డాక్టరు గారు...మన...మన మంజుల భర్తకాదూ?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS