Previous Page Next Page 
దీప శిఖ పేజి 26


    "ఏవిటి విజయా ?....ఇప్పుడు ఏమైందని అలా బాధ పడతావు ?" అన్నాడు గోపాలం.
    'బాధగా విచార సూచకమైన నవ్వు నవ్వి "నన్ను ఇంకా మభ్య పెట్టాలని ఎందుకు చూస్తారు?'....నాకు అంతా తెలిసింది " అంది.
    "ఏవిటి నీకు తెలిసింది ?' అన్నాడు ఉద్వేగంతో గోపాలం.
    "ఏవిటా...నా దురదృష్ట జీవితంలోని తోలి ఘట్టం " అంది.
    "ఆ!" అని నోటమాట రాకుండా ఉండిపోయాడు గోపాలం.
    "తెలిసి కూడా ఇన్నాళ్ళూ చెప్పకుండా మీరు దాచినా, మీ అన్నయ్య గారు మాత్రం వివరాలన్నీ తెలిసి గట్టిగా నన్ను హెచ్చరిక కూడా చేసి పుణ్యం కట్టుకున్నారు.' అంది విజయ తాపీగా.
    "ఏవిటి?..... నీకు కూడా ఉత్తరం రాశాడా?....ఎంతపని చేశాడు? అంటూ ఆందోళన చెందిన ఆగ్రహావేశ స్వరంతో ఒక్క కేక పెట్టి నీరసంగా గోడకి జేర్లాపడి ఉండిపోయాడు గోపాలం.
    భయంకరమైన నిశ్శబ్దం లో ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వారు కొంతసేపు వున్నారు. ఆ తర్వాత దీర్ఘంగా శ్వాస వదిలి "నేనేదైతే భయపడుతూ వచ్చానో అదే జరిగిందన్న మాట ?....సరే నీకు తెలిసింది ఎలాగా తెలిసింది , ఇంక దాని విషయం ఆలోచించడం అనవసరం . నీ బాల్యంలో జరిగిపోయిందాన్ని ఆలోచించుకుని నిరాశ నిస్పృహలతో బాధపడకు జరిగింది ఏదో జరిగింది.
    "అదెలా సాధ్యం ?.... బాధపడ వద్దంటే పోతుందా ? నాకు తెలిసి జరిగినా , తెలియక జరిగినా నా జీవితానికి సంబంధించినదే కదా ?....ఆలోచించకుండానూ బాధ పడకుండాను ఎలా ?"
    "కావచ్చు విజయా?....కాని జీవితం అనుభవించేదే కాని ఆలోచించేది కాదు, ఎంత అలోచించి మాత్రం ఏం చెయ్యగలావ్?....మనస్సు క్షోభ పెట్టుకోవడం తప్ప ?....గతాన్ని తవ్వుకోవడం కంటే భవిష్యత్తు ని నిర్మించు కోవడం మంచిది "
    "భవిష్యత్తు ? ...హు....నాకు ఒకటే భవిష్యత్తు "
    "అదేవిటి విజయా! అలా నిస్పృహగా మాట్లాడతావు ?....మనం ఇంతక్రితం భవిష్యత్తు లోకి వేసుకున్న వెలుగు బాటల్ని మరిచి పోయావా?
    "ఇంకేక్కడివి ఆ బాటలు. నేను వితంతువు ని తెలియడంతో ఆ బాటలు చెరిగి పోయాయి. వాటి మీద ప్రసరించిన వెలుగూ నశించింది."
    "లేదు విజయా లేదు. మన ఆశలూ ఆశయాలూ ఏ మాత్రమూ చలించలేదు. వాటికీ గల పుష్టి అంతా రేపులోనే ఉంది."
    "ఏమో నాకు అలా అనిపించడం లేదు."
    "ఏం ?....ఎందుకని?"
    "మీరు ఇన్నాళ్ళూ మన వివాహాన్ని వాయిదా వెయ్యకుండా వస్తే నా జీవిత రహస్యం ఇప్పుడు తెలిసినా ఇంత నిరాశ చెంది ఉండక పోయే దాన్ని. నేను వితంతువు నని తెలిసి మీరు తటపటాయిస్తూ ఇన్నాళ్ళూ వాయిదా వేశారనీ లేకపోతె ఏనాడో మన వివాహం జరిగి ఉండేదనీ అర్ధం అయ్యేసరికి నా పరిస్థితి నాకు స్పష్టంగా తెలిసి వచ్చింది.
    "నేనిన్నాళ్ళూ జాప్యం చెయ్యడానికి కారణం అది అనుకుంటూన్నావా?...కాదు విజయా.......అది కానే కాదు.......పైగా నాకు కూడా -- ఈ సంగతి ఇప్పుడే తెలిసింది. అది కూడా మా అన్నయ్య రాసిన ఉత్తరం వల్లే తెలిసింది. ఇదిగో, నీకు లాగే నాకు కూడా ఇప్పుడే అందింది. చూడు......."
    "నిజంగా?"    
    "నామాట నమ్ము విజయా?"
    "ఏమో -- వెలికి అరిచే వారు పులికి అయినా వేరువరు , ఆ భయంతో నే మీరు ఇన్నాళ్ళూ ఆలస్యం చేశారేమో అనిపించింది నాకు"
    "అలా ఎందుకను కుంటున్నావు ?....వీరేశలింగం గారి ప్రభావం. సంస్కరణ ల వాతావరణం లో పెరగడం, రామనాధం గారి వంటి ఉదాత్త మానవతా వాదితో సహచర్యం, ఇవన్ని వున్న నేనే వితంతు వివాహం చేసుకోడానికి వెనుకంజ వేస్తె, ఇంకేవైనా వుందా?...పైగా నిన్ను ప్రాణంతో ప్రాణంగా ప్రేమించి, వితంతు వైన కారణంగా ఇవాళ వదిలేస్తానా?....నా గురించి ఎందుకంత తక్కువగా ఆలోచించావు ?....గోపాలంతో నీకు ఇన్నాళ్ళు గా ఉన్న పరిచయం వల్ల ఈ మాత్రమె అర్ధం చేసుకున్నావా?....నా గురించి ఎంత అన్యాయంగా ఆలోచించావు విజయా!....నీకు ఇంతే అర్ధం అయానా? ఇంతేనా?...." అంటూ కంఠం బొంగురు పోయి కళ్ళల్లో నీళ్ళు నిలిచిన గోపాలాన్ని చూసి, కంగారుగా మంచం దిగి, తటాలున వచ్చి అతని ముఖాన్ని తన హృదయం లోకి తీసుకుని, అతని తల మీద తన గడ్డం ఆన్చి గట్టిగా ఏడుస్తూ లేదు గోపాలం ....మీరు అలా బాధపడకండి ..లేదు..... మీ విజయ అలా అనుకోలేదు " అంది విజయ.
    కల్లోలం తగ్గి తుఫాను తొలగి కెరటాల ఉదృతం అణగిన నిశ్చల గంబీర సముద్రాలు లాగ వారిరువురి హృదయాలూ నిర్మల ప్రశాంతంగా ఒక దానీలో ఒకటి కలిసిపోయి అమరానందానుభూతి లో నిశ్శబ్దంగా అలా ఉండిపోయాయి  కొంతసేపు.  
    
                                    11       
            
    శంకరం తనూ మాటామాటా అనుకుని, అభిప్రాయ భేదం వచ్చి బరువైనా గుండె తో తను అతని స్నేహ సౌధం తాలుకు మెట్లు దిగి వచ్చేశాక , హాస్పిటల్ దరిదాపులికి కాని, శంకరం తటస్థ పడే ప్రదేశాలకి కాని వెళ్ళడం మానుకున్నాడు శేషయ్య. పొలం పనుల్లో కూడా చాలా భాగం రంగయ్య లాంటి పెద్ద పాలేర్ల కి అప్పగించి ఎప్పుడో కాని పొలం వెళ్ళకుండా ఎక్కువ కాలం ఇంట్లోనే గడపసాగాడు. అవసరం ఉండి వచ్చిన మనుష్యులతో ముక్తసరిగా ఒకటి రెండు మాటలు మాట్లాడి త్వరగా వాళ్ళని పంపిచేసి , రోజు మొత్తంలో చాలా భాగం చేతులు వెనక కట్టుకుని దీర్ఘాలోచనలో పడమటింట్లో పచార్లు చేస్తున్న తండ్రి పరిస్థితి ఏమిటో అర్ధం కాక వాసు తికమక పడసాగాడు.    ఒక్కొక్క రోజున రాత్రి పదీ పదకొండు గంటలకి మెళుకువ వచ్చి చూస్తే వాసుకి భయం  వేసేది. కోడి దీపం వెలుతురూ లో , ఇటూ అటూ  పచార్లు చేస్తున్న నన్న నీడ , రాక్షసుడి లాగ విపరేతమైన పెద్దిగానూ, గోడ మీద ఎదుగుతూ తరుగుతూ పడుతూ వుంటే భయంతో వాసుకి ఒళ్ళు జలదరించేది. ఇలా పచార్లు చేస్తుండగా , ఓ ఒంటిగంటా, రెండూ ఆ ప్రాంతానికో , పొరుగురు పేషెంట్స్ ని చూడడాని కని వెళ్ళి తిరిగి వస్తూన్న డాక్టరు గారి బండి మువ్వలా చప్పుడు వీధిలో వినిపించి నాన్న, తటాలున వెళ్ళి కిటికీ తలుపులు తెరిచి బండి వీధి మొగ తిరిగే దాకా చూడ్డం , ఆ తర్వాత నీరసంగా  నిట్టురుస్తూ వచ్చి శరీరాన్ని మంచం మీద చేరేయ్యడం -- ఇదంతా చూస్తే వాసుకేం అర్ధం అయేది కాదు. రెండు మూడు రోజుల నుంచి మౌనం గానూ,  పరధ్యానం గానూ అదోలా ఉంటున్నాడు నాన్న. ఎందుకో తెలియడం లేదు అడుగుదాం అంటే భయం.
    ఇలా ఇంకొకటి రెండు రోజులు చూసి ధైర్యం చేసి అడిగాడు వాసు. శేషయ్య దగ్గర్నుంచీ సమాధానం ఏం రాలేదు సరికదా పైగా కసురుకున్నాడు పెద్ద వాళ్ళ గొడవలు నీకెందు కని. ఆ మర్నాడు చిన్న గుడ్డ సంచిలో ఇరవై, వంద రూపాయాల నోట్లు పెట్టి సంచి మూతి తాడుతో  బిగించి వాసుచేతికి ఇచ్చి "ఈ సంచి డాక్టరు గారికి ఇచ్చేసిరా--- అయన ఏం అడిగినా నువ్వేం మాట్లాడకు--- మా నాన్న ఇమ్మన్నాడు అని చెప్పు. అంతే - ఏవైనా వెనక్కి మాత్రం పట్రాకు. అక్కడే పెట్టేసి వచ్చెయ్యి" అని హెచ్చరిక చేసి మరి పంపాడు శేషయ్య.
    పది నిమిషాల కల్లా వాసు తిరిగి వచ్చి "డాక్టరు గారు ఇంట్లో లేరు. మునసబు గారి ఇంటికి వెళ్ళారుట. అత్తయ్య మణి ఉన్నారు. అయన వచ్చాక ఇవ్వమని సంచీ ఇచ్చాను. అత్తయ్య మడి కట్టుకోవడం మూలాన మణి తీసుకుంది  " అని చెప్పాడు.
    "మొత్తం మీద ఇచ్చేసి వచ్చావు కదా మంచి పని చేశావు. ఊ-- అయితే మునసబు ఇంటికి వెళ్ళి మంతనాలు సాగిస్తున్నాడన్న మాట ......కానియ్యి" అంటూ తల పంకించాడు శేషయ్య.
    మిట్ట మధ్యాహ్నం వేళ ప్రత్యేకంగా పని గట్టుకుని వీరాచారి వచ్చి "డాక్టరు గారు మన బడి పంతులుతో ఎవన్నారో తెలుసా?  ....తను ఈ ఊరు రాకముందు ఈ ఊళ్ళో జనం దిక్కు లేని చావు చచ్చేవారుట .....నా మాత్రలు జ్వరాలు తగ్గించడానికి ఉపయోగపడేవట.....తను వచ్చి వైద్యం చెయ్యబట్టి కాని మీ వాసు దక్కేవాడు కాదుట! మీరు ప్రార్ధించారు కనుక కాని లేకపోతే ఏ పట్నమో  వెళ్ళి ప్రాక్టీసు  పెట్టుకుని ఉండేవారుట! .....మీ ప్రార్ధనని మన్నించి ఈ ఊళ్ళో ఉండిపోయినందుకూ మీకు రకరకాలుగా సహాయం చేసినందుకూ మీకు ఏ కోశానా కృతజ్ఞత లేదుట మీకూ మీ జనానికి ఆయన లేని లోటు ఏదో ఆయన వెళ్ళిపోతే గాని తెలియదుట" అంటూ పితూరీ చేశాడు శేషయ్యా తో'.
    శేషయ్య అంతా విని చిరాకుగా "అయితే ఏమంటావు?" అన్నాడు.    
    వీరాచారి కొంచెం తగ్గి "ఆహా!...... అయన మీదే ఈ ఊరు అంతా ఆధారపడి ఉందనీ అయన లేకపోతే దిక్కు లేదని అనుకుంటూన్నాడు. ఎలా ఉందొ చూడండి అంటున్నా-- " అన్నాడు నసుగుతూ.
    "అవును అయన అన్న మాటలో అబద్దం ఏముంది? అయన తప్ప మనకీ అరణ్యం లో దిక్కేది?" అన్నాడు శేషయ్య సూటిగా.

                               
    దాంతో వీరాచారి నోరు కట్టడింది. ఆ  తర్వాత ఇంకా విషయం ఎత్తకుండా , కాస్సేపు ఇదీ అదీ మాట్లాడి వెళ్ళిపోయాడు. వీరాచారిని పంపించేశాక శేషయ్య ఆలోచించసాగాడు. "శంకరం వ్యవహారం ఇంతదాకా వచ్చిందన్న మాట !...... తను తప్ప ఇంకీ  ఊరికీ మందులిచ్చే దిక్కు లేదూ?.....తను రాక ముందు కాలం ఆగి పోయిందేవిటి>,,,,,ఇవాళ రెండు అరుకు నీళ్ళు ఇచ్చేవాడు తను వచ్చాడు కనుక వీరచారి సంచి కట్టు వైద్యం వెనక బడింది , తనది సూది మందులూ, అరుకు నీళ్ళూ ఇచ్చే ఎల్.ఎమ్.సి. వైద్యమేగా?...ఆపరేషన్ లు కూడా చేసే ఎమ్.బి.బి.ఎస్ వస్తే తన గతి ఏమౌతుంది ?.....ఒళ్ళు పొగరు ...ఒళ్ళు పొగరా అని ....ఇలా కాదు -- ఆ అహంభావమేదో తగ్గించాలి . నేనే తగ్గిస్తాను . ఎవర్నో కాదు-- మా వాసునే మెడిసిన్ కి పంపించి ఈ ఊళ్ళో ప్రాక్టీసు పెట్టించి మరీ తగ్గిస్తాను. దాంతో ఆబ్బాయి గారి పస తేలుతుంది - శేషయ్య తో పంతం అంటే ఏమిటో అర్ధం అవుతుంది . హు ........"    
    ఇలా అలోచించి వాసుని పిలిచి "నీకు తప్పకుండా క్లాసు వస్తుందా?" అని అడిగాడు.
    "ఆ.. అనుమానం లేకుండా వస్తుంది ."            
    "వస్తే నువ్వు ఏం చదవచ్చు."    
    "ఏదైనా చదవచ్చు. ఇటు బియే, కాని అటుఆనర్స్ కాని...'
    "అది సరేనయ్యా -- నీ గ్రూప్ కి మెడిసిన్ చదవచ్చా అని "        
    "అహా....చదవాలని ఉంటే మెడిసినూ చదవచ్చు."
    "అయితే -- నీ రిజల్ట్స్ రాగానే మెడికల్ కాలేజీ కి దరఖాస్తు పెట్టు "
    వాసు తెల్లబోయి "మరి ఇన్నాళ్ళూ బి.యే ...అంటూ వచ్చారు కదా ?" అన్నాడు.
    "పిచ్చి పిచ్చి ప్రశ్నలు వెయ్యక చెప్పినట్లు చెయ్యి -- అర్ధం అయిందా" అన్నాడు శేషయ్య గట్టిగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS