30
ధర్మారావు అమిత గంబీర్యాన్ని చూచిన దయామయి అతడితో మాట్లాడడానికే జంకు తున్నది నిత్యం కర్తవ్య మూడుడులా కూర్చుంటున్న అతడిని చూచి కలవరపడింది దయామయి.
ఆఖరికి ఒకనాడు ప్రశ్నించింది ; "ఏం, అలా ఉంటున్నావు?"
"ఏమీ లేదు." పరధ్యానంగా అన్నాడు.
"సత్య కోసమా?' నిశితంగా చూస్తూ అడిగింది.
అదిరిపడి తలెత్తి చూచాడు. "ఎందుకమ్మా, ఇలా బాధించు తున్నావు నన్ను, ఇక్కడి కొచ్చిన దగ్గర నుంచీ?"
"ఓహో! అయితే అంత బాధ పడుతున్నావన్న మాట?' నిష్టూరం కంటే కోపం అధికంగా ధ్వనించింది.
"అమ్మా, దయఉంచి నన్నేమీ విసిగించకు. ఎన్నో సమస్యలు చుట్టూ ముట్టాయి నన్ను." విసుగుదలగా అంటూ అక్కడి నుంచి లేచాడు.
"పోనీ, ఏమిటా సంగతి? చెప్పరాదూ?"
"ఎందుకులే. ఈ ఆఫీసు గొడవలతో సతమతం నాకేలానూ తప్పదు. నీకు కూడా ఎందుకా చికాకులన్నీ? నేనోసారి అలా పోయి వస్తాను.' అంటూనే మరి ఆమె మాటలకు చూడకుండా వెళ్ళిపోయాడు.
అర్జునరావును కలుసుకొని ఏమైనా మాట్లాడాలను కున్న అతడు తిరిగి మనస్సు మార్చుకుని ఒక ధ్యేయం అంటూ లేకుండా చేతులు తిప్పినట్లు వదిలేశాడు స్టీరింగు ను. పోయి పోయి ఊరి చివర కారు ఆపి ఇలా దిగాడో, లేదో అలా ఎదురుగా కారు వచ్చి ఆగడం, అందులో నుండి సత్యాదేవి దిగుతుండడం చూచి ఆశ్చర్య పోయాడు.
ఇద్దరూ కొన్ని నిముషాల పాటు అలా నిర్నిమేషదృక్కులతో ఒకరి నొకరు చూచుకున్నారు.
సత్య వదనం లో ఆమెకు తెలియ కుండానే విచార మేఘాలు ఆవరించి, కనులు భారంగా కిందికి వాలిపోయాయి.
"నిర్భాగ్యుణ్ణి , సత్యా!" అన్నాడు హీన స్వరంలో ధర్మారావు. "నన్ను అపార్ధం చేసుకో వద్దు. నిస్సహాయుణ్ణి . పరిస్థితుల ప్రాబల్యం అటువంటిది.
శుష్క హాసంతో జవాబిచ్చింది సత్య. "మిమ్మల్ని అపార్ధం చేసుకోవడమనేది , ఇప్పుడు కాదు ఎప్పుడూ జరుగదు. ఆశ్వానికి శక్తి ఉన్నంత మాత్రాననే పరుగిడగలదా? కళ్ళెం ఎవరి చేతిలో ఉన్నదో వారికి లోబడి ఉండాలి."
"నీ శాంతి స్వభావానికి, ఆలోచన కూ నా ధన్యవాదాలు. సత్యా."
ఇద్దరూ కొద్ది దూరంలో కూర్చున్నారు.
కొంతసేపటికి ధర్మారావు నిర్లిప్త స్వరంతో అన్నాడు: "గౌతమ్ పారిపోయాడు."
సత్య నుండి నీరసంగా వచ్చింది సమాధానం. 'అవును. కేసు నమోదు అయింది. అతడు పట్టుబడిన తర్వాత నేనే అతడికి వ్యతిరేకంగా ప్రభుత్వం తరపున వాదించవలసి ఉంటుంది. చూడండి, ఎంత అందంగా ఉందొ వ్యవహారం?"
"అయితే మీరయన చర్యను సమర్ధిస్తున్నారా?"
"నేనాయన చర్యల పై విమర్శా చేయడం లేదు; సమర్ధనా చేయడం లేదు. వ్యక్తిగతంగా నాకు అయన మీద అభిమానం అంతే."
"......."
"మీకు కూడా అయన పై గౌరభిమానాలే కదా?' అండి తిరిగి.
నిట్టూర్చాడు . "ఏమో, సత్యా! నేనెటూ మాట్లాడలేని స్టితిలో ఉన్నాను."
అతడు మరీ నిరాశగా ఉండడం గ్రహించిన సత్య సంభాషణ ను మార్చే ప్రయత్నించింది.
"మా నాన్నగారు వస్తున్నారు. మిమ్మల్ని పరిచయం చేయాలని ఎన్నాళ్ళ నుండో కలలు కన్నాను."
"నా పై నీకు గౌరవం ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను" అంటూనే అటు తిరిగి ఆమె ముఖం వాడిపోయి ఉండడం చూచిన ధర్మారావు కలవర పడుతూ , "అదేం? అలా ఉన్నావేమిటి?" అని ప్రశ్నించాడు.
"నాన్నగారు నాన్నగారు గా, నాకోసం రావడం లేదిప్పుడు."
"మరి?"
"మీకు శత్రువు గా, మీ చర్యలను అరా తీయడానికి అధికారి హోదాలో వస్తున్న కొత్త ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తో కలిసి వస్తున్నారు."
నవ్వడానికి ప్రయత్నించాడు ధర్మారావు. 'ఆయనకు ప్రభుత్వం సైన్యం లో ఉద్యోగి గా నియమించారు కదా? అక్కడి కి వెళ్ళే ముందు ఒక్కసారి మిమ్మల్ని చూడడానికి వస్తున్నారేమో? ఎందుకు వృధాగా ఆరాట పడతారు?"
"లేదు. మీకు తెలియదు. కేసు రికార్దంతా మీరూ చూశారను కుంటాను. గౌతమ్ ను అప్పుడు పట్టి అప్ప చెప్పింది మా నాన్నగారేనట. ఇద్దరూ ఒక్కచోటే ఒకే హోదా ఉన్న ఉద్యోగాలు చేశారట. అందుకు అతడి విషయం లో ప్రభుత్వాని కేమైనా సహకారి గా వస్తుండవచ్చు."
కొద్ది సేపు మౌనం తరువాత -- "అవును నేనూ విన్నాను." అన్నాడు భారంగా తిరిగి అంతలోనే చిరునవ్వు తెచ్చి పెట్టుకొని , "మరి నా అధీనంలో ఉండగా ఒక ఖైదీ , అందునా దేశ ద్రోహి పారిపోతే అధికారులు తనిఖీ చేయకపోతే ఎలా ?' అన్నాడు.
సత్య ముఖంలో కళ లేదు. "ఏమో! నాకు భయంగా ఉంది. మా నాన్నగారు కొంచెం ఇటువంటి ఆదర్శాల కూ, వాటికీ వ్యతిరేకం."
"పోనీ, సత్యా, భయమెందుకు? జరిగేదేదో జరుగుతుంది. నా మార్గం న్యాయ సమ్మతమూ, ధర్మ పూర్ణమూ అయినప్పుడు కలత చెంద వలసిన అవసరమే లేదు. మరి వెళ్దామా?"
"ఊ."
31
గౌతమ్ విషయమే ఆలోచిస్తూ తల తిరిగిపోతుండగా ఇంట్లో ప్రవేశించిన కుమారుని చూచి , "ఏం ఇంత ఆలస్యం?" అని అడిగింది దయామయి.
"ఏమి లేదమ్మా."
"మళ్ళీ సత్య తోనేనా, షికార్లు?" పిడుగు పడింది.
ఓర్పుగా చెప్పాడు ధర్మారావు. "షికార్లు కాదమ్మా. క్షమించు నీకు ఇచ్చిన మాట మీరాను. కాని, నువ్వనుకున్న విధంగా మాత్రం కాదు. నన్ను నమ్ము."
"........"
"ఒక ముఖ్యమైన కేసు విషయం లో అత్యవసరంగా మాట్లాడు కోవలసి వచ్చింది తప్పని సరి."
"సరే. భోజనానికి రా. వ్యవహార విషయంలో కాదని నేనెప్పుడూ అనలేదు. ఏదో మాట్లాడకుండా ఎలా గడుస్తుంది, ఒక చోట ఉద్యోగాలు చేసేవారికి?"
అంతటి చికాకు పరిస్థితిలో కూడా ధర్మారావు లోలోన సంతోషించాడు. దయామయి సంస్కారానికి, . ఆమెకు అన్నీ తెలుసు! మూర్ఖంగా పట్టుపట్టి కూర్చోదు. మరో మూర్కురాలేవరైనా అయితే ఉద్యోగం మానేయమని ఉండును!'
ఇటువంటి తర్క వితర్కాలు రేగినప్పుడల్లా -ఆనాటి రాత్రి రాజ్యలక్ష్మీ ' అని వినిన ఆమె నామాంతరం, ఆమెతో నారాయణస్వామి సంభాషణా, ఆమె గౌతమ్ ను కలుసుకొని తనతో లేదనడం -- అన్నీ ధర్మారావు మనసులో మెదిలి అయోమయమై పోతుంది.
భోజనం దగ్గర కూడా పరధ్యానంగా ఉన్న అతడిని చూచి దయామయి కలవర పడింది . మళ్ళీ ప్రశ్నించింది -- "అలా ఉంటున్నావెం, బాబూ?' అని.
"ఏమీ లేదమ్మా" అంటూనే భోజనం ముగించి లేచిపోయాడు.
అర్ధ్రరాత్రి వేళ మెలుకువ వచ్చిన దయామయి , ధర్మారావు గదిలో ఇంకా లైటు వెలుగుతూనే ఉండడం చూచి లేచి వెళ్ళింది. వాలు కుర్చీలో పడుకుని, ఇంటి పై కప్పు వైపు చూస్తూ దీర్ఘాలోచనా నిమగ్నుడై ఉన్న ధర్మారావు ఆమెను గమనించనే లేదు.
"ఏమిటో నీ ధోరణి నాకేమీ అర్ధం కావడం లేదు. ఏదో మహా ప్రమాదం జరిగినట్టు ఎండుకల్లా దిగాలు పడిపోయి కూర్చుంటావు? సత్య విషయం కాదంటావు! మరి ఏమిటి?"
ఆమె తల్లి కాకపోయినా, తల్లి ని మించిన అధికారమే చేయడం అలవాటు. ధర్మారావు కూడా అందుకు అలవడిపోయినా , ఈనాడు విసువుదల ఆ హద్దును కొంచెం దాటించింది.
"ఏమిటో నా సమస్యలు నాకున్నాయి. ఏమిటీ -- ఏమిటీ అని వేదింఛి తెలుసుకొని నువ్వు చేయ గలిగిందేమిటి?"
దయామయి కోపం తెచ్చుకోలేదు. "చెబితే ఏమైనా చేయగలుగుతానేమో? నీకేం తెలుసు? పోనీ, చెప్పరాదూ?"
మతి పోయినట్టు చూచాడు ధర్మారావు.
అర్ధయుక్తంగా నవ్వింది దయామయి. "చూడు బాబూ! ఈ దాసీ ఏం చేయగలదు అనుకుంటున్నావా? దీపం వెలగడానికి, పరిసరాలు కాంతి వంతం చేయడానికి ఎన్నెన్ని కావాలి! ఆ జ్యోతి నిశ్చలంగా నిలిచి వెలగడానికి ఒక ప్రమిద కావాలి. అధరువు గా తైలం కావాలి. కొడి గట్టకుండా ఎగ తోయడానికి చిన్న పిల్ల కావాలి. ఆ ప్రమిద మట్టిదే కావచ్చు: ఆ పుల్ల చీపురు పుల్లె కావచ్చు. కాని వాటి కృషి ఎంతో!"
తల తిరిగి పోయింది ధర్మారావు కు. కుర్చీ నుండి లేచి ఆమెకు దగ్గరగా వెళ్ళాడు. "నిజమే నమ్మా. నువ్వు కల్ప వృక్షానివి. నా బుద్ది హీనత వల్ల నేనే ఎప్పటి కప్పుడు నిన్ను గుర్తించలేకుండా ఉన్నాను."
"ఏమిటి? అసలు సంగతి చెప్పు."
"చేబుతానమ్మా. ఈ ఖైదీల విషయం లో నేనొక మహా యత్నం చేస్తున్నాను. ఫలిస్తుందనే కలలు కన్నాను."
"ఆ విషయం నాకూ తెలుసు."
"కాని ఇప్పుడా ప్రయత్నాల కు పెద్ద ఆటంకం ఏర్పడిందమ్మా. ఒక ఖైదీ పారిపోయాడు. ఈ సంఘటన నా చేతలకూ, కాళ్ళకూ సంకెళ్ళు వేసి, నా నోటిని మూసివేసింది."
"అలాగా? ఫర్వాలేదు. ఖంగారు పడకు. పరిస్థితులు అవే సర్దుకుంటాయి. ఈనాడు నువ్వు వచ్చాకనే దొంగలు పారిపోవడం కొత్తగా జరగలేదుగా ? పంజరం లో పక్షులు ఎప్పుడూ పారిపోవడానికే ప్రయత్నిస్తుంటాయి. "
"అది నిజమే. కాని, ఇప్పటి పరిస్థితులు అంత తేలికగా తోసి వేయవలసినవి కాదమ్మా. దేశం చాలా విపత్కర పరిస్థితిలో ఉంది. దేశ ద్రోహి , దీర్ఘకాలంగా కారాగారం లో అణిచి పెట్టబడిన వ్యక్తీ ఇప్పుడు పారిపోయాడు."
"దీర్ఘకాలంగానా! ఎవరతడు?"
"గౌతమ్ అని నేను చెబుతుంటాను! అతడే."
"ఆ!" కెవ్వు మన్నది దయామయి. నీరస పడినట్లు అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని పోయింది.
తానెంత తెలివి తక్కువ పని చేశాడో అప్పుడు గ్రహించాడు ధర్మారావు. అయినా ఏమీ ఎరగనట్టే "ఏమిటమ్మా? అలా అయిపోయావేమిటి?"అని అడిగాడు.
"ఏముంది నాయనా?" నిస్పృహ నీరసాలతో విలపించింది. "ప్రమిద ఉన్నదని గర్వంగా చెప్పానే కాని, అది చిల్లు ప్రమిద అనీ, అందులో తైలం నిలవదని గుర్తించ లేక పోయాను."
కొన్ని క్షణాల పాటు ఆమెను పరిశీలనగా చూచిన ధర్మారావు సూటిగా ప్రశ్నించాడు. "అమ్మా, నిజం చెప్పు. నువ్వు గౌతమ్ ను ఎరుగుదువా?"
"దయామయి ఉలికి పడలేదు. బరువుగా నిట్టూర్చింది. "ఎరుగుదును, బాబూ, ఎరుగుదును. కాని, ఏం చెప్పను? ఏమనీ నేను చెప్పలేను. అయ్యో! ఎంత పని జరిగింది? భగవాన్!"
ఏడుస్తూ నుదురు కొట్టుకుంటూ కూర్చున్న ఆమె నుండి ఇక ఇప్పట్లో ఏ సమాధానం రాదని గ్రహించాడు ధర్మారావు. ఆవేశం తగ్గేవరకూ ఒంటరిగానే వదిలి వేయడం మేలని భావించాడు అతడు.
