జానకమ్మ కు , కొడుకు దగ్గరకు రావటానికి అసలు తీరడం లేదు. ఒకసారి ఆమె వచ్చి ఒకరోజున్నప్పుడు రాజు, పార్వతి తమ ఏర్పాట్లు ఎలా మార్చుకోవాలో తెలియక తికమక పడిపోయారు. ఆ ఒక్కనాటి కోసం "నిన్ను వదల్ల్లెనత్తయ్యా!" అంటూ పార్వతి జానకమ్మ పక్కలో నక్కిపోవలసి వచ్చింది. అప్పటి నుంచి ఆవిడ రాకపోతేనే మంచి దనిపిస్తుంది పార్వతికి.
సరోజ వచ్చినప్పుడు తెగించి ఆ అమ్మాయి పక్కను పడుకుంటూ , "ఇక నాకు తెలియని కొత్త సంగతులు చెప్పు, సరూ!" అంది పార్వతి , మిత్రురాలి మీద చెయ్యి వేసి.
"చిన్నప్పటి సంగతులు మరిచి పోలేదే, పారూ! నేను చెబితే విన్నావూ?' అంది సరోజ, పార్వతి మాట వినిపించుకోకుండా. ఆ నును వెలుగులో , 'పార్వతి బాధ పడుతున్నదేమో, తన మాటలకు' అనిపించిందా అమ్మాయికి.
'నేను హాయిగా ఉన్నాను. సరూ! రాజు ప్రయత్నపూర్వకంగా నన్నేప్పటికి కష్ట పెట్టలేడు. అతనే జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. తనే నష్ట పోతాడు. నేనేం ఆర్ధికంగా ఒకరి అవసరం కోరవలసిన దాన్ని కాను. ణా వల్ల పొరపాటు జరిగిందని పిస్తుంది. నీ మాటలు గుర్తొస్తాయి. అయినా అంత చిన్న చూపు చూసే మనిషి కాళ్ళ మీదపడి ప్రాధేయ పడమంటావా? నన్ను నేనంత హీన స్థితిలో చూసుకునే కన్నా మరో అన్యాయం లేదు. నువ్వూ ణా స్థితి చూడలేనప్పుడు. అసలు నేనలా చెయ్యాలేనెప్పటికి. కానీ........"
"కానీ?' అత్రుతగానే చూచింది సరోజ.
పార్వతి స్నేహితురాలి చేతిని స్పృశించింది. "కానీ...ఇంకొక విధంగా అతను సుఖించాలనుకుంటే నేనెప్పటికీ అడ్డు రాకూడదని ఈ మధ్యనే నిశ్చయించు కున్నాను, సరూ! మేము విడాకు లిచ్చుకున్నాక నువ్వు రాజును పెళ్లి చేసుకుంటావా?" అంది చివరకు కాస్త కొంటె తనంతో.
ఆ పిల్ల తల మీద ఒక మొట్టి కాయ వేసి, "రాజు అలా ఎప్పటికీ చెయ్యడు; ఒప్పుకోడు. పెంకి పిల్లలా మాట్లాడటం మానెయ్యి. నేను చెప్పినట్లు వినాలి ముందు" అంది.
"ఏమిటి?' అంది పార్వతి, పరధ్యానంగా. ఆమె ఆలోచిస్తున్న విషయం -- "రాజు పై వీళ్ళ కింత నమ్మకమెలా ఉన్నదా?" అని.
"నీకు పొరపాట ని అనిపిస్తున్నట్ల యితే రాజు అభిప్రాయాల కనుగుణం గా మారడానికి ప్రయత్నించు మరి." సంశయిస్తూనే సరోజ అంది.
"ఎందుకో నేనందరి ఉద్దేశం లో పరమ గయ్యాళినీ, శుద్ధ మూర్ఖురాలినీ అయిపోయాను" అంది పార్వతి నోచ్చుకుంటున్నట్లు.
సరోజ భాదపడి , "కాదే!" అన్నది.
"అది కాదు. కొన్నాళ్ళ క్రితం ఒకరి తృప్తి కోసం వారి సలహా తోనే ఇప్పుడు నువ్వు చెప్పినట్లు చేసి చూడబోయి, పప్పులో అడుగేశాను. అయినా నన్ను మారమంటారు, అదెంత అసంభవమైనదో ఆలోచించ కుండానే . పుట్టుకతో వచ్చే బుద్ది పుడకలతో గాని పోదన్నారే మరి, ఎవరో మహానుభావులు! ఇంకా ఆ పుడకలతో పని ఎన్నాళ్ళ కొస్తుందో కానీ......."
సరోజ నివ్వెర పోయింది. "ఛ! ఆ మాట లేమిటి?" అంది. ఇదివరలో పార్వతేప్పుడూ ఇంతలా భరించలేనట్లు మాట్లాడలేదు, ప్రియ స్నేహితురాలి దగ్గర. కోపం వచ్చినా , ఇంత తొణకని కంఠస్వరంతో అనలేక పోయేది. ఎప్పుడూ సెలయేటి శబ్దం లా గలగలమని నవ్వే కంఠం.
నిశ్శబ్దాన్ని విడగోడుతూ మళ్ళీ పార్వతి అంది: "నువ్వింత తియ్యగా మాట్లాడతావే, సరూ! నిన్నలా మాట్లాడ వద్దంటే మానుకో గలవా? నేనూ అంతే! ఒక మూర్ఖురాలిని, పతి భక్తీ లేని -- పతివ్రతా శిరోమణి ని కాని పశువుని!" ఏదో కసి ఉంది పార్వతి గొంతులో.
సరోజ వినలేక పోయిందింక . "పోరపాటయింది, తల్లీ! క్షమించు. పెద్దదానివో, చిన్నదానివో కానీ శతకోటి నమస్కారాలు. ముందు ఊరుకుంటే చాలు" అన్నది గాభరాగా.
"సరే గానీ, నువ్విలా ఎప్పుడూ కన్యగా ఉండి పోతావేమిటే?"
"ఊ" అంది సరోజ ఆ అమ్మాయి మాట పట్టించు కోకుండా , ఆలోచిస్తూ.
పార్వతి నవ్వి, సరోజ కు దగ్గరగా జరిగింది ఆరోజు అలా.
* * * *
ఎండ ముఖానికి ఫెళ్ళని తగులుతుంది. ఒళ్ళంతా చిరు చెమట. ఇంట్లో నుంచి ఇవతల పడగానే పార్వతి లో చిలిపితనం మాయమై, మనసు యదా స్థితి కి వచ్చింది.
సాయంత్రం అలా ఎక్కడికైనా షికారు వెళ్దామన్నా పాడు ఊర్లో ఒక్క వినోదమూ, విశేషమూ లేదు. స్త్రీల కళాశాల అయితే ఉంది కానీ స్త్రీల కోక క్లబ్బు కనిపించలేదు పార్వతి కి. చదువుకున్న స్త్రీలు కొద్ది మంది ఉన్నా, తీరిక దొరికితే మగతగా నిద్రపోతుంటారు. అది వాళ్ళ తప్పు కానేకాదు -- ఊరి గాలి అటువంటిదేమో ? చల్లగా ఉండి జోకొడుతుంది మనిషిని.
ఆ చల్లదనాలు, జోల పాటలూ-- ఏవీ పార్వతి దగ్గర పనికి రాలేదు. అమిత చేతనంగా ఉండే ఆ పిల్ల శరీరం ఎప్పుడూ ఏదో చేస్తుండాలని కోరుతుంది. అయినా ఇప్పుడిప్పుడు పార్వతి కీ కునుకు వస్తున్నది.
పార్వతి విసుక్కుంది. మెల్లగా మెట్లు ఎక్కింది. సుభద్ర గా రింటికి తాళం పెట్టి ఉండటం ఆశా భంగం కలిగించింది. అరుగు మీద ఒక నౌఖరు నిద్రపోతున్నాడు. అలాగే నిలిచిపోయింది, ఏం చెయ్యాలో తోచక. వెనక్కు వెడితే రాజు ఆనందిస్తాడు.
రాధాకృష్ణ గది తలుపు తీసి వుంది. రెండడుగులు ముందుకు వేసి, అతని పేరుతొ మర్యాదగా పిలిచింది. ఎవ్వరూ పలకక పోగా, తొంగి చూచింది లోపలికి. మూలనున్న మంచమూ, రేడియో ముందున్న ఫేము కుర్చీ ఆహ్వానించాయి.
పార్వతి రాధాకృష్ణ స్వభావం బాగా ఎరిగి వున్నది. అతను సామాన్యమైన బుద్ది చూపించడు-- మాటల్లో గానీ, మనసులో గానీ. అందుకే సాహసంగా లోపలికి వెళ్లి కూర్చుని రేడియో పెట్టింది.
రాధాకృష్ణ సాహిత్య లోకంలో చిన్న రచయితైనా, వాస్తవిక సమాజంలో పెద్ద బుద్ది గలవాడు. ఆ వ్యక్తీ సుహ్రుద్భావాలు , సదాచరణలు ప్రతి కళాకారుడి కి ఉండగలవని నిర్ధారణ చేసుకోవడం కష్టం. అలా నిర్ధారించు కోగలిగిన నాడు 'దేశ సౌభాగ్యం ఎన్నటికీ కొల్లగొట్ట బడదు' అని అపరిమితమైన విశ్వాసం కలుగుతుంది. రాధాకృష్ణ చాలా కొద్ది రచనలే చేశాడు అయితే నేం? వాటి నిండా ఆదర్శ భావాలు, ఔన్నత్య పదాలు శిక్షా సంస్కరణ లు. వాటిలో విధి నిషేధాలంటూ ఎక్కువ కనిపించవు.
రేడియో నెమ్మదిగా వినిపించేటట్లు పెట్టి వింటూ కూర్చుంది. గోపికా గీతం వినవస్తున్నది. ఎన్నడూ కలగని, ఏనాడూ ఎరగని దివ్యానుభూతిని పార్వతి దేహంలోని అణువణువు అనుభవించింది. పాట ఆగి. తాత్కాలికంగా ఇంకేవో వినిపిస్తున్నాయి. సాంతం వినలేక పోయింది. భావాలేవో మెదడు లోని సరిహద్దు లలో సంచరిస్తున్నాయి.
ఎంత మధురంగా ఉంది! అలా పాడుకోగలిగితేనా? పాడలేదు మరి తను. కానీ, తన మనసే పాడుతుంది.
ఎందుకో తెలియదు -- చాలా రోజులుగా ఈ 'కృష్ణ' శబ్దం ఎక్కడైనా వినిపిస్తే చాలు, ఏదో అవ్వ్యక్తమైన హాయి హృదయాన్ని చల్లగా స్పృశిస్తుంది. ఎందుకు?
ఉలిక్కిపడింది -- "రేడియో వింటున్నారా?' అన్న పలరింపు లాంటి ప్రశ్న విని.
వెంటనే నమస్కరించి, "ఇప్పుడే వచ్చాను" అంది పార్వతి నవ్వుతూ అడిగిన రాధాకృష్ణ ను చూసి.
అతను ముఖం కడుక్కు వచ్చినట్లున్నాడు -- తుండుతో తుడుచుకుంటూ మాట్లాడుతున్నాడు.
పార్వతి సుభద్ర గారి గురించి అడిగే లోగా అతను మళ్ళీ నవ్వుతూ, "ణా చీకటి గదిలో మీరెలా కూర్చో గలిగారు, పార్వతి గారూ?" అన్నాడు.
కిటికీ తలుపులన్నీ తెరిచి, మంచం మీద కూర్చున్నాడు. వెలుగు వచ్చి అతని పైనే పడింది. అప్పుడే ప్రక్షాళీతమైన ముఖం కాంతి వంతం గానూ, నిర్మలంగానూ ఉంది. అతడు తన వైపు చూడకుండా ఉంటె రెప్పవాల్చకుండా కొద్ది సేపా ముఖాన్ని చూడాలనిపించింది పార్వతికి.
"సుభద్ర గారు కోవెల కు వెళ్ళారు-- పాపతో కూడా' అన్నాడు.
"అలాగా? ప్లీడరు గారు కూడా లేనట్లు న్నారు?' అంది, ఆఫీసు గది వైపు చూస్తూ.
ఇంతలో మాట్లాడకుండా ఒక తెలుగు మాసపత్రిక తెచ్చి చేతిలో పెట్టాడు రాధాకృష్ణ.
పేజీలు తిప్పుతూ ఆశ్చర్యపోయింది పార్వతి. "అరె! మీకు ప్రధమ బహుమతి వచ్చిందే! ఇంకా చెప్పరేం?"
రాధాకృష్ణ నవ్వాడు. "వ్యాసమండీ! 'సాంఘిక సమస్యలు -- నివృత్తి సూచనలు' అని పోటీ పెట్టారు లెండి, ఈ పత్రికలో. చదువుతారా? ఇంటికి తీసుకెళ్ళండి!"
"ఇంత నేర్పుగా ఎలా వ్రాయగల రండి , మీరు?' అప్రయత్నంగా అనేసింది.
మంచం మీద కూర్చున్న వాడంతా కాస్త ముందుకు ఒరిగి , "ఏం?" అన్నాడు రాధాకృష్ణ. "మీరు చదవ లేదేమో గానీ, నాకన్నా అద్బుతంగా వ్రాసేవాళ్ళు మన భాషలో ఉన్నారు. ఆ పుస్తకాల్లో మంచివి వేదికి ఇస్తాను. పుస్తకాలే నిజమైన మిత్రులు, పార్వతి గారూ! అసూయా , ఆడంబరం లేని స్నేహితులు. అయితే పార్టీలకు , పిక్నిక్కుల కు పిలుచుకొనే అలవాటు లేదు ఈ స్నేహితులకు. మీరు ఆంగ్ల సాహిత్యం ఏమైనా చదివారా?"
"ఏదో కొంత చదివాను. షేక్ స్పియర్ నాటకాలు; టాల్ స్టాయ్, టార్జేనోవ్ వంటి వారి కవితలు చదివాను. అవైనా నచ్చలేదు. ఏమిటో? తెలుగు వాటితో నాకసలు పరిచయమే లేదు. మీవల్లే తెలుస్తున్నదిప్పుడు."
"అలా అంటే కాదండీ. ముందుగా మణిపూసల్లాటి నవలలు-- ఏ భాషలో నైనా సరే -- ఎంచుకొని చదవాలి. తర్వాత భయపడ నక్కర్లేకుండా పద్య కావ్యాలు క్రమంగా ఒంట బడతాయి. బెంగాలీ రచయితల పుస్తకాలనేకం ఆంధ్రుల అభిమానాన్ని చూరగొన్నాయి. అవి చదవండి. శరత్ భాబు పేరు మీరు వినుంటారనుకుంటాను......."
"ఆ విన్నాను. అయన రచనలు నాకు కొంచెం విసుగు." పార్వతి పెదవి విరిచింది.
రాధాకృష్ణ ఒప్పుకోలేదు. "విసుగు అనుకోకండి, పార్వతి గారూ! అది స్వల్పంగా నిరాశ. ఏదో అనుకుంటాం గానీ, జీవితం ముదురుతున్న కొద్ది అటువంటి సాహిత్యమే హృదయంలో పీఠం వేసుకుంటుంది."
"ఏమో, బాబూ! మీ మాటలు నాకర్ధం కావు. మీరు రచయితలు. మీరదృష్ట వంతులు."
ఆలోచిస్తూ, "ఇందులో అదృష్టాని కేముంది?' అన్నాడు, వినీ వినిపించనట్లుగా నిట్టూర్చి.
నల్లని మేఘ మాలిక ఒకటి అతని మొగం మీద తారాడటం చూచింది పార్వతి. ఆమె లోనూ యేవో కొత్త ఊహలు కదిలాయి. 'ఉన్నట్లుండి ఎండు కితనికీ నైరాశ్యం ?' అనిపించింది . తెలుసుకోవాలని తహతహ.
