"శాంతీ!" మెల్లగా పిలిచాడు రాజా. అంతలో టాంగా కుదిర్చిన గోవిందరావు కూడ శాంతి దగ్గరికొచ్చాడు.
రాజా పిలుపు విని కళ్ళెత్తి చూచింది శాంతి.
"శ్రీహరి మీకొక విషయం చెప్పమని వ్రాశాడు. ఇంతవరకు మరిచేపోయాను. ఒక్కసారి యిలా రండి."
"ఫర్వాలేదు. చెప్పండి" అంది శాంతి.
"కాదు. అలా రండి. చాలా మాట్లాడాలి" అంటూ కొద్ది అడుగులు దూరంగా నడిచాడు రాజా. ఒక్కసారి గోవిందరావు వైపుచూచి తప్పని సరిగా రాజా దగ్గరకు నడిచింది శాంతి. కోపంతో గోవిందరావు కనుబొమలు ముడిపడటం యిద్దరూ గమనించారు.
"ఏమిటి?" అడిగింది శాంతి, రాజాను.
"చూడండి, శాంతీ. గతంలో జరిగిన సంఘటన మరిచిపోండి. ఇప్పుడు నాకు శ్రీహరి ఎంత ఆత్మీయవ్యక్తో మీరూ అంతే. నేను చెప్పబోయే విషయాన్ని స్నేహపూర్వకమైన సలహాగా భావించి గౌరవించగలరని తలుస్తాను. అందులో నా స్వార్ధ మేమీ లేదు."
ఆశ్చర్యంగా కళ్ళెత్తింది శాంతి. "అదేమీటండీ, అలా మాట్లాడతారు? నాకు మీపై అమిత గౌరవమని వెనుకొకసారి చెప్పాను. చెప్పండి. అన్నయ్య ఏం వ్రాశాడు?"
"తప్పకుండా నామాటకు విలువ యిస్తారా?" ఇంకా సందేహంగానే అడిగాడు రాజా.
"ఏమిటంత సందిగ్ధ విషయం!" ఆశ్చర్యం ప్రకటించింది శాంతి. "నేను మాట తప్పను. మీరు చెప్పేదాన్ని మనఃపూర్వకంగా గౌరవిస్తాను. హృదయపూర్వకంగా ఆచరించగలను. స్నేహితుడుగా మీపై నాకు చాలా గౌరవమే. కాని, ఒక్కటి. విశ్వభారతిలో నా కళాభ్యాసం గురించి కాదుగదా? ఆ విషయమైతే మాటివ్వలేను. అక్కడ నాకెంతో ప్రశాంతంగా, హాయిగా వుంది. తిరిగి ఈ పట్నాల రొదలో పడలేను."
"ఆ విషయం కాదు" అన్నాడు రాజా గంభీరంగా.
"అయితే చెప్పండి. ఇక సందేహించవద్దు."
"క్షమించాలి. చిన్న అబద్ధం ఆడవలసివచ్చింది. శ్రీహరి చెప్పమానలేదు. నేనే చెప్పబోతున్నాను" అంటూ కొద్దిసేపు ఆగాడు. ఆత్రంగా అతడు చెప్పే విషయానికై ఎదురు చూస్తూంది శాంతి. విసుగుదలను సూచిస్తూ వెనుకనుంచి గోవింద రావు దగ్గాడు.
ఒక్కసారి అటు చూచి తిరిగి శాంతివైపు తిరిగి మొదలు పెట్టాడు రాజా. "గోవిందరావు పరాయి వ్యక్తి. అతనితో మీరు ఒంటరిగా తిరగడం హిందూ ధర్మం నిరసిస్తుంది."
శాంతి మాట్లాడలేదు. కాని కోపంతో ఆమె బుగ్గలు రక్తవర్ణము లయ్యాయి.
గమనించిన రాజా అన్నాడు: "కోపం వద్దు, శాంతీ. శ్రీహరికీ, నాకూ గల స్నేహానురాగాల చనువుతో, మీపై అభిమానంతో చెప్పుతున్నాను. ఇందులో మీ క్షేమాభిలాషేకాని నా స్వార్ధం కానీ, గోవిందరావు పై నిందగానీ లేదు. అతడికేం, పురుషుడు! కాని మీ విషయం అలాగ కాదు. ఎంత చదివినా, ఎన్ని నేర్చినా హిందూ స్త్రీ కొన్ని కట్టుబాట్లలో వుంటేకాని గౌరవం దక్కదు. మీకింకా చిన్నతనం: తెలియదు."
కోపంగా తలెత్తింది శాంతి. "అందరూ ఎందుకిలా నాకు నీతులు బోధిస్తారు? నేనేం చిన్న పిల్లను కాను. అతడు నాకు క్రొత్తకాదు. స్నేహితుడు!"
"తొందరపడకండి, శాంతీ. మన అంతఃకరణాలు నిర్మలమై నంతమాత్రాన సరిపోదు. లోకం దృష్టిలో చులకనైపోతారు. ఈ సాయంత్రం కలకత్తా అతడితో తిరిగి చూచి, రాత్రి హోటల్లో అతడితో వుండి రేపు విశ్వభారతికి వెళ్తారు. దాని పరిణామా లెలా వుంటాయో ఒక్కసారి ఊహించండి. విశ్వభారతిలో మీ అధ్యాపకులూ, అధికారులూ విషయం తెలిస్తే యిక మిమ్మల్నక్కడ వుండనిస్తారా?"
చలించే నేత్రాలతో అయోమయంగా చూచింది శాంతి. కంపితగాత్రంతో అంది: "మరి గోవిందరావుకు కోపం వస్తుందేమో?"
శాంతిని పరిశీలనగా చూస్తూ గంభీరంగా నవ్వాడు రాజా. "మీపై కోపం తెచ్చుకోగలంత చనువుంటే ఫర్వాలేదు. పరిస్థితి కూడ ఊహించుకుని సమాధానపడగలడు."
శాంతి మాట్లాడలేదు.
"పదండి. అతనితో నేను మాట్లాడతాను" అని గోవిందరావు ఉన్నవైపు దారి తీశాడు రాజా.
"సరే, ఏమైతేనేం? ముందు మీకు మాట యిచ్చానుగా?" శాంతికూడా అనుసరించింది.
తృప్తిగా నవ్వాడు రాజా. "ఆమాత్రం గౌరవముంచినందుకు చాలా సంతోషిస్తున్నాను."
"మిస్టర్, రావ్. వెరీ సారీ. టాక్సీని పిలుస్తాను. విశ్వభారతికి తక్షణం వెళ్ళిపోవాలి" అన్నాడు గోవిందరావుతో రాజా.
అర్ధంగానట్లు చికాగ్గా పెట్టాడు గోవిందరావు ముఖం. 'ఏమిటీ పీడ' అన్నట్టు చూచాడు శాంతివేపు.
తల వాల్చి మెల్లగా సమాధానమిచ్చింది శాంతి. "అన్నయ్యనుండి ఒక కబురు తెలిసింది. అందుకే వెళ్ళిపోదాం. కొంచెం పనుంది."
గోవిందరావు సందిగ్ధంగా చూచాడు. "అన్నయ్య నీకెందుకు వ్రాయలేదో?"
రాజా చెప్పాడు సమాధానం. "అతడూ, నేనూ ప్రాణస్నేహితులం. ఆ తేడాలేమీ లేవు. పాపం మీ కార్యక్రమం పాడైనందుకు విచారిస్తున్నాను. కాని వేరు దారి లేదు."
ఆ మాటలతో గర్భితమై ఉన్న అవహేళనను గోవిందరావు గ్రహించాడు. పళ్ళు కొరుక్కుంటూ ముఖం ప్రక్కకు త్రిప్పుకున్నాడు. రెండూ పురుషహృదయాలే. ఒకరి హృదయ గత భావాలు ఒకరికి తెలుసునని ఇద్దరికీ తెలుసు. కాని తప్పనిసరిగా పైకి నటిస్తూ భాష ఉపయోగిస్తున్నారు.
"అయితే, శాంతీ, వెళ్ళిపోదామా?" అన్నాడు కోపం అణగద్రొక్కుకుంటూ.
"వెళ్ళాలి." మెల్లగా అంది శాంతి, ఎదలోని ద్వైదీభావాలను మరుగునపరుచుతూ.
ఇక చర్చ కొనసాగించకుండా టాక్సీ పిలిచాడు రాజా. అతడుకూడా టాక్సీ ఎక్కుతూంటే "మీరూ వస్తున్నారా?" అని అడగకుండా ఉండలేకపోయాడు గోవిందరావు.
"అవును. చెప్పానుగదా, పని ఉన్నదని?" అన్నాడు రాజా తాపీగా, ప్రశాంతంగా.
తాను వేరే టాక్సీలో పోవాలన్నంత కోపం వచ్చింది గోవిందరావుకు. కాని శాంతిని వదలలేక తప్పనిసరిగా అహంకారం అణుచుకొని కూర్చున్నాడు.
మరునాడు ఉదయం శాంతినికేతనం నుండి వచ్చేముందు శాంతిని కలుసుకున్నాడు రాజా. "శాంతీ, బహుశః నాపై ఆగ్రహం కలిగి ఉండవచ్చు. కాని పూర్తిగా మీ క్షేమం కోరినవాడిని. భగవత్సాక్షిగా చెపుతున్నాను. ఇప్పుడు మీకు తెలియకపోయినా ఈ సంగతి, యిందలి ఆంతర్యం ముందు ముందు మీరే గుర్తించగల రని ఆశిస్తున్నాను. ఎంతో పని ఉంటే తప్ప బయటకు వెళ్ళకండి. ఎవ్వర్నీ తేలికగా నమ్మకండి. చనువుగా యిలా చెప్పినందుకుమాత్రం ఏమీ అనుకోవద్దని ప్రార్ధన. మీ హృదయమొక సుధాభాండం. అందువల్ల మీకు లోకమే సుధాకలశంగా కన్పించవచ్చు. కాని అది యదార్ధ దూరం."
నిశ్చలంగా నిలబడిన శాంతి గంభీరవదనంలో ఏ భావమూ వ్యక్తం కాలేదు.
"వెళ్తాను మరి. శ్రీహరి దగ్గర్నుంచి ఉత్తరాలేమైనా వస్తున్నాయా?"
"క్షేమంగా చేరినట్లు వ్రాశాడు. పదిహేను రోజులైంది. మళ్ళీ ఉత్తరమే లేదు. నాన్నగారు వ్రాస్తున్నారు. అంతా క్షేమమేనట. ధవళేశ్వరంలో అన్నయ్య డ్యూటీలో చేరాడట. ప్రతి సాయంత్రం యింటికి వెళ్ళిపోతున్నాడట. స్కూటర్ కొన్నాడట ఈమధ్య అందుకే."
"ఓహో. నాకసలు ఉత్తరమే లేదు. అడ్రస్ యిస్తారా? ఇంటి అడ్రస్ కొక ఉత్తరం వ్రాశాను. అందిందో, లేదో? జవాబే లేదు. ఆఫీస్ అడ్రస్ యివ్వండి." జేబులో తడుముకున్నాడు కాని డైరీ దొరుకలేదు.
చెట్లక్రింద నిలబడి మాట్లాడుకుంటూండడంవల్ల యిద్దరి దగ్గరగా కాగితమూ, కలమూ లేవు.
"నేను తర్వాత వ్రాస్తానులెండి. అన్నయ్య క్కూడా వ్రాస్తాను మీకు వ్రాయమని. ఎందుచేత వ్రాయలేదో మరి? నాకంటే మీపైనే మక్కువ అన్నయ్యకు" అంటూ నవ్వింది.
విధిగా నవ్వాడు రాజాకూడ. "సరే, సెలవు. ఏ విషయంలోనూ తొందరమాత్రం వద్దు, శాంతీ" అంటూ వెళ్ళిపోయాడు రాజా.
గోవిందరావు విషయమై అతడేమైనా తరచి అడుగుతాడేమోనని భయపడ్డ శాంతి అసలు రాజా ఆ ప్రసక్తే తేకపోవడం చూచి ఆశ్చర్యపోయింది. వెనుక ఎగ్జిబిషన్ లో 'రవీంద్ర' చిత్రం గూర్చిన రకరకాల ప్రశంసలూ, గోవిందరావు మాటలూ తప్పనిసరిగా గుర్తుకు వచ్చాయి. 'రాజాకు అసూయ లేదు' అనుకొంది మరొకసారి.
