'ఆకలి సిగ్గుని జ్ఞాపకం చేస్తుంటే బ్రతుకులో అందరూ బాగుపడే వారే.'
రాజేశ్వరి అన్న ఆ వొక్క మాటా అతనికి యీటేలా పొడుచుకుంది. 'ఒరేయ్ బడుద్దాయి నీకు మొదటి నుంచీ సంసారం నడపడం వస్తే నీ పిన్ని యిలా ఎందు కయ్యేది నీ చేత కాని తనానికి మాటలు కూడా యెక్కువా' అంటున్నట్లుగా అనిపించింది.
'యేమైనా గానీ నువ్వు నారాయణ బాబునీ' చంద్ర మౌళి ని డబ్బు అడగడం ఛ, నీ మొగుడు వట్టి వెధవ అని చాటుకోవడమే అనిపిస్తోంది.'
'పిల్లాడి కోసంచేశాను. లేకపోతె నేనేవీ అదివరకు అందర్నీ భిక్షం అడగలేదు. మిమ్మల్ని వెధవ అనీ, చవట అనీ నేను అందరికీ చెప్పడం లేదు.'
'నీకు మాటలు వచ్చును. యివాళ డబ్బు లేదని, నీకంటికి అలుసు గానే కనిపిస్తాను. పాత రోజులు త్వరగానే మరిచిపోతాం మరి. ఈనాడు అనుకోకుండా నా అవస్థ యిలా అయిందనేగా.'
రాజేశ్వరి అహం దెబ్బ తింది! 'అంటే మీ యింటికి ఆడదాన్ని వొంటరిగా వచ్చి అన్నాళ్ళు మీ సంరక్షణ లో వుండి పోయాననీ నేనే మిమ్మల్ని పెళ్లి చేసుకో మన్నాననీ జ్ఞాపకం చేస్తున్నారా' తను మధ్యాహ్నం యెంత కష్టపడి యెంత దూరం నడిచి వెళ్ళింది. భర్తకి తిండి పెట్టాలని తనకి లేకనా......
'నువ్వు ఎలా అర్ధం చేసుకున్నా సరే' పిల్లడు గుక్క పట్టి ఏడుస్తూంటే వాణ్ణి క్రిందికి దింపేశాడు.
రాజేశ్వరి అప్రతిభురాలై పోయింది. తను అన్న మాటలు సమర్శిస్తాడని , తనని కౌగిట్లో ప్రేమగా బంధిస్తాడని, కడుపు నిండా పెట్టినందుకు అభినందిస్తాడని యేమో , యేమో అనుకుంది.
రాజేశ్వరి అంతరంగం చితికిపోయింది. సిగ్గుతో, అవమానంతో, అభిమానం గల మనిషి కావడం వల్ల చాలాసేపు బాధపడింది. శ్రీనివాస్ అన్నదాంట్లో యదార్ధాన్ని గ్రగించి అతని కాళ్ళ మీద చేతులు వేసి కన్నీరు కార్చింది.
'పోన్లే రాజేశ్వరీ యింకేప్పుడూ అడగకు. మనం ఉపవాసాలున్నా నలుగురికీ తెలియడం నాకు బాగుండదు. రాజేశ్వరికి దుఃఖం ముంచుకు వచ్చింది : ' యింకేప్పుడూ అడగను ' అంది.
* * * *
రోజులు గడుస్తుంటే రాజేశ్వరి ప్రమాణం నిలువలేదు. అతను యెన్ని ట్యూషన్లు చెప్పినా యెంత బాకీ తీర్చినా కొండలా పేరుకు పోయిన అప్పు కళ్ళకి తరిగినట్లు కనిపించడం లేదు. ఈ ఆకలితో బహుశా : శ్రీనివాస్ తన పట్ల నిర్లక్ష్యం చూపిస్తూ తానాను పరోక్షంగా ద్రోహం చేస్తున్నాడేమో....యీ విషయం . అవును రెండూ రెండు నాలుగేందుకు కాదూ?
రెండోసారి వచ్చినప్పుడు నారాయణ బాబు ప్రశాంతంగానే అడిగారు : 'బాగున్నారా అమ్మా' అని.
రాజేశ్వరి ఆయనకు కొంచెం దూరంలో చాప మీద కూర్చుంది. చాలాసేపు మౌనంగా వుండిపోయింది.
'వచ్చిన సంగతి చెప్పావు కాదు' అయన అన్నారు.
'బాబుగారూ నాకు విడాకులు యేర్పాటు చేయించండి.'
నారాయణ బాబు తెల్లబోయారు.
'అది....అది...నీకు యిప్పుడు ఏం జరిగింది?'
'అయన కృష్ణప్రియ అనే అమ్మాయి ప్రేమలో చిక్కుకున్నారు.'
'అబద్దం' నారాయణ బాబు గొంతు ఖంగు మంది.
'నిజమే బాబుగారూ. అయన జీతంలో చాలా భాగం ఆ పిల్ల కోసమే వుపయోగిస్తున్నారు'.
'ఛ! అటువంటి మాటలనకు రాజేశ్వరి. శ్రీనివాస్ సంగతి అందరికీ తెలుసును.'
'నేను అబద్దం ఆడుతున్నా నంటారా'
'అది మీరిద్దరూ వుండగా అడగవలసిన విషయం. నీకిప్పుడు బాగా జరుగుతోంది కద.'
'మొన్న సినిమా నుంచి రావడం ఆలస్యం అయింది. బస్సులు రాకపోతే చీకట్లో త్వరత్వరగా యింటికి కాలి నడకనే వచ్చాను. దారిలో పిక్కెట్టు కు కొంచెం దూరంలో ఒక సిక్కు అతను వెంట బడ్డాడు. అతన్ని తప్పించుకుని వచ్చేసరికి అయన నామీద చెయ్యి చేసుకున్నారు.'
'దేనికి?'
'ఆ సిక్కు అతనితో నేను కలిసి వెళ్ళాలనే అనుమానంతో '
'నేను కనుక్కుంటాను.'
రాజేశ్వరి ఖంగారుని అణుచుకుంది: 'వొద్దు బాబుగారూ. విచ్చిన్నం అయిపోయిన సంసారం ఒకటి కావడం యిష్టం లేదు నాకు. వోటుపోయిన పాత్ర అతుకు పెడితే దాని పూర్వపు అందం డానికి రాదు. విరిగిపోయిన మనసుల్తో జీవితం అంతా గడిపేందుకు నాకూ యిష్టం లేదు.'
'నిజంగా బుద్ది లేదు నీకు. కట్టుకున్న మగవాడిని కాదని నువ్వు సుఖ పడలేవు. మంచో- చెడో ఒకసారి దైవం నిర్ణయించిన యీ పెళ్లిని మాటిమాటి కీ విడదీసు కోవడం -- ఛ! యిదేమంత మెచ్చుకో దగిన విషయం ?' రాజేశ్వరి కి కోపంతో ముచ్చెమటలు పోశాయి.
'అయితే నేను లాయరు తోనే సంప్రదించడం మంచిదంటారా?"
'ఆ సలహా కూడా నేను యివ్వను.'
రాజేశ్వరి విసురుగా వెళ్ళిపోయింది. సమాజపు పెద్దమనిషి అనే గౌరవం లేకుండా.
* * * *
యింటికి వచ్చింది మొదలు రాజేశ్వరి మనసు అతలాకుతలమై పోతోంది. కృష్ణ ప్రియ కి పాఠం చెబుతున్నప్పుడు మధ్య మధ్య ఒకటి రెండు సార్లు పరిహాసానికి అతని నెత్తి మీద చేయి వేయడం సహించలేక పోయింది. తను అనవసరంగా తొందరపడి యిల్లు వదిలి రావడం అవివేకమే అనిపిస్తోంది. అక్కడే వుంటే రామదాసు కు తను భారం అయేది. తనను దేవదాసు ...ప్చ్ . జరిగింది తిరిగి రాదు. తను యిలా శలభం లా కొట్టాకోవలసిందేనెమో? తను నారాయణ బాబు దగ్గరికి వెళ్ళిన విషయాన్ని కడుపులోనే దాచుకుంది. ఒకటికి రెండు సార్లు : 'ఛ! యెంత పని చేశాను? యిలా వొంటి చీరతో, వట్టి అన్నంతో బ్రతుకుతానని తెలుస్తే అదేవదాసు నే చేసుకునేదాన్ని.' అనేసింది శ్రీనివాస్ యెదుట వుండబట్టలేక.
'శ్రీనివాస్ మొదట్లో చాలా తేలికగా తీసుకున్నాడు. మనిషీ, మగవాడూ, ఉప్పూ కారం తింటుండే అతనిలో అహం పైకి వచ్చేసి మించిన మంచితానాన్ని మరుగు పరిచేస్తోంది.
'చూడు రాజేశ్వరీ . నీకు దేవదాసు ను చేసుకోవాలనుంటే నేను వద్దని యెప్పుడూ అనలేదు. కోర్టు వుంది. ఆనాడు ఏ ముహూర్తాన అన్నారో కోర్టుకి మనలో యెవరూ యెక్కినా అని. నీకు తోచినట్లుగా చెప్పేసి విడాకులు తీసుకో. ఆ తరువాత ఎవరిని చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు.'
'అంటే మీ వుద్దేశ్యం?'
'నీకు తోచినట్లుగా చేసి కనీసం నీ ఆత్మనీ తృప్తి పరచాలని?'
'వుంటే యిలా జీవితం పొడుగునా సాధించవు.'
'ఎందుకిలా చేస్తున్నారు మీరు?'
'నీ యిష్టాన్ని అర్ధం చేసుకోవడం కోసం .'
'అంటే మిమ్మల్నే కాకుండా మరొకరిని చేసుకుంటా ననుకున్నారా?'
'తప్పేం వుంది. మీ యిళ్ళల్లో అటువంటివి అంత తప్పుగా తోచవు. మేము హిందువులం. మాకు కొన్ని నియమాలు వుంటాయి.'
'మీకే యిష్టం లేదు. అసలు విషయాన్ని దాచేసి నాతొ తెగతెంపులు చేసుకుందాం అనుకుంటున్నారు.'
'నాకేం ఆ ఉద్దేశ్యం లేదు, నాకు ఎవరూ లేరు మోజుగా చేసుకుందాం అనుకోవాలన్నా.'
'నేను దేవదాసు విషయం అన్నాననేగా దేప్పుతున్నారు.' ఇక ఆ తరువాత రెండు మూడు రోజులు యిద్దరి మధ్యా మాటలు లేవు.
రాజేశ్వరి పేర కవరు రావడం శ్రీనివాస్ కి ఆశ్చర్యం వేసింది. ఉత్తరాన్ని జాగ్రత్తగా అందించాడు.
రాజేశ్వరి కి,
ఆశీస్సులు. నువ్వు యేవీ సుఖపడడం లేదని తెలుసి యెంతో బాధపడ్డాను. అంతకుమించి చేయగలిగింది యేముంది కనుక? మీ బాబాయి పోయారు. మగవాడిని చాకచక్యంతో స్వంతం చేసుకోవాలి. మన మతం లో ఆ శ్రీనివాస్ ని చేరమను. మనవాళ్ళ సహాయం నీకు దొరుకుతుంది. అసలు యెందుకిలా చేశావు? తినడాని కైనా సరిగా లేని ఆ జీవితంలో నువ్వు అనుభవిస్తున్నది యేమిటి? ఉన్న ఆస్తిలో కడుపు కదలకుండా నా బిడ్డను పోషించుకునే శక్తి నాకు వుందని చెప్పు. వెంటనే వచ్చేయి.
మీ అమ్మ
పద్మావతి.
శ్రీనివాస్ కి,
ఆశీర్వచనములు. యిన్నాళ్ళూ నా బిడ్డకు రక్షణ యిచ్చావు. నా కృతజ్ఞతలు. డానికి తెలిసో తెలియకో నిన్ను కష్టపెట్టి వుండవచ్చు ను. తిండి లేక అల్లాడి పోతున్న నా బిడ్డను నేను పోషించు కోగలను. వెంటనే పంపు.
--పద్మావతి.
శ్రీనివాస్ అడిగాడు : నీకు వెళ్లాలని వుందా.'
'అవును వెడతాను. అమ్మ పిలుస్తుంటే నాకిక్కడెం బాగులేదు.'
'సరే నీ యిష్టం.'
'ఇవాళే వెడతాను.'
'అలాగే'
శ్రీనివాస్ స్టేషన్ లో టిక్కెట్టు కొని పిల్లాడిని తీసుకున్నాడు.
'రైలు వచ్చే వేళ అయింది పిల్లాడిని యివ్వండి,' రాజేశ్వరి అంది.
'సారీ యిదోక్కటే నేను చేయను.'
'పిల్లాడు పాలు లేకుండా వుండడు.'
'అవన్నీ నేను చూసుకుంటాను.'
'పిల్లాడిని యివ్వరన్న మాట.'
'నువ్వు బెంగ పెట్టుకోకు. నాకు వాడిని కూడా దూరం చేయకు. మొదటి నుంచీ యేకాకి బ్రతుకే అయిపొయింది నాది.'
రాజేశ్వరి వాదించలేదు. రైలు రాక ముందే శ్రీనివాస్ స్టేషన్ బయటికి వచ్చేశాడు.
* * * *
చంద్రమౌళి నెమ్మదిగా అన్నాడు: 'మొన్న పబ్లిక్ గార్డెన్స్ లో మీ ఆవిడనీ, అతన్నీ చూశాను. ఆవిడ వూళ్ళో లేరని ప్రభావతి అంది. ఎప్పుడు వచ్చారు?'
శ్రీనివాస్ కాళ్ళ క్రింద భూమి గిరగిరా తిరిగిపోయింది. అతను గాలిలోకి తేలి పోతున్నట్లుగా అన్నాడు: 'వారం అయింది వచ్చి' యింక యెక్కువ మాటలు పెరగనీయ లేదు.
నారాయణబాబు దగ్గరికి వెళ్లి యెప్పటి కప్పుడు జరిగింది చబుతూనే వచ్చాడు. సమాజం బాధ్యతలకి యే మాత్రం భంగం రావడం శ్రీనివాస్ కి యిష్టం లేదు.
'నువ్వు ఆవిడ తల వెంట్రుకలు కోపంతో కత్తిరించావుట. చదువుకున్నవాడివి కదా యిదెం పని? నారాయణబాబు మెత్తమెత్తగా చివాట్లు వేస్తుంటే తెల్లబోయాడు శ్రీనివాస్.
'తనే ఫాషన్ కి చివర్లు కత్తిరించుకుంది. నేనా పని చేయలేదు. వొట్టు నన్ను నమ్మండి.'
'నువ్వు అనుమానించి కొట్టావట కదూ.'
'మాటి మాటికీ దేవదాసును చేసుకుంటే....అని బాధపడుతుంటే మాటలన్నాను కానీ యెన్నడూ చెయ్యి చేసుకోలేదు.'
'తిండికి మొహం వాచిన పిల్ల అప్పు అడగడం లో తప్పేం వుంది? మరి నువ్వు తాగడానికీ, తినడానికీ యెక్కడి నుంచి వస్తోంది?' శ్రీనివాస్ చిత్రంగా చూశాడు. 'తాగే కులం లో పుట్టినా నేను డానికి అలవాటు పడలేదు. పార్టీలో స్నేహితుల బలవంతం చేస్తే ఆరోజే మొదటి సారీ, ఆఖరు సారీ రుచి చూశాను. ఈ సంగతి చెబితే మనశ్శాంతి కోసం అలా చేయడం లో తప్పు లేదని తను సమర్ధించింది. ప్రమాణం గా చెబుతున్నాను. నేను మరి ముట్టుకోలేదు.'
'రాజేశ్వరి అన్నీ అబద్దాలే చెప్పిందంటావా.'
'నన్ను నేనెలా ఋజువు చేసుకో గలను?' శ్రీనివాస్ ప్రాధేయ పూర్వకంగా అన్నాడు: 'నారాయణ బాబూ ఆనాడు నేను రైలు టికెట్టు కొని యిచ్చాను. కానీ తను దేనికో వెళ్ళలేదు. రాజమండ్రి , తిరుమల గిరిలో కాపురం పెట్టింది నాకు పరిచయం వున్న వాళ్ళింట్లో. ఎందుకలా చేసిందో యెలా బ్రతుకుతోందో అర్ధం కావడం లేదు.'
'నీ దగ్గరికి కృష్ణ ప్రియ అనే ఆడపిల్ల వస్తోందట. డానికి సంజాయిషీ ఏం చెబుతావు?'
నారాయణ బాబు వేసే ప్రతి ప్రశ్నకీ సిగ్గుపడుతూనే వున్నాడు. అసలు రాజేశ్వరీ యిన్ని అబద్దాలు యెందుకు చెప్పింది? నెమ్మదిగా అన్నాడు: 'కృష్ణ ప్రియ ఎమ్.పి.సి స్టూడెంటు . ఆ పిల్లకూ ఎవరూ లేరు. నేను కొంతమంది బీద విద్యార్ధులకి ఫ్రీగా చెబుతాను. అందులో తనూ ఒకతే.'
'నీకు ఆ పిల్ల అంటే ప్రతేకం అభిమానం యేవీ లేదన్న మాట.'
'ఆ పిల్లే కాదు నారాయణ బాబూ ! ప్రతి ఆడపిల్లా యేకాకిగా బ్రతుకు తోందంటే నా మనసు కుతకుత లాడుతుంది. కారణం మీకు యిదివరకే చెప్పాను. పిన్ని ప్రతి ఆడపిల్లలో నాకు కనిపిస్తుంది. ఏ ఆడపిల్లను చూసినా మనసు జాలిగా నిట్టురుస్తుంది.'
'ఇంతకూ మించి నీకూ ఆ పిల్లకూ......'
'ప్రమాణ పూర్తిగా యే సంబంధం లేదు బాబుగారూ.'
'ఆర్యసమాజం లో చేసే పెళ్ళిళ్ళు సక్రమంగా నలుగురికి ఆదర్శ ప్రాయంగా వుండాలి. ఈ సమాజంలో కులమతాలు, వుండవు. ఆపదలో ఆదుకోవడమే దీని ముఖ్యోద్దేశ్యం. మాటి మాటికీ మీ కులం అని రెట్టించే వాడివట. అది నిజమేనా.'
'నేను అలా వోకసారే అనవలసివచ్చింది. దేవదాసు ను చేసుకుంటానంటే మా యిళ్ళల్లో ఆడపిల్లలు అలా అనరు అన్నాను.'
'పాలు త్రాగే పిల్లాడిని తల్లికి దూరంగా చేయడం తప్పు కాదంటావా?"
'మీరూ అంతే అర్ధం చేసుకున్నారా?' శ్రీనివాస్ ముఖం పాలిపోయింది. 'రాజేశ్వరీని నేను ప్రాణం లా చూసుకున్నాను. తను బాబు కోసం అయినా నన్ను వదులు కోదు. యీ గట్టి నమ్మకంతో వాడిని నా దగ్గర వుంచు కున్నాను. కానీ తను మాతృప్రేమనే మరిచి పోయింది.'
'యిప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు?'
'తిరుమల గిరిలో చంద్రమౌళి యింటికి మైలు దూరంలో గవర్నమెంటు స్కూలు పక్కన వుంటోంది. ఎలాగైనా రాజీకి తీసుకు వచ్చి కాపురం చక్కగా చేయాలి. యివి చేతులు కావు. బాబు ని గాని, దాన్ని గానీ వదులుకోలేను బాబుగారూ.'
'అలాగే నా శాయశక్తు లా ప్రయత్నం చేస్తాను.'
'కృతజ్ఞుడిని' శ్రీనివాస్ కళ్ళు నీళ్ళతో తడిశాయి.
