Previous Page Next Page 
నీళ్ళు రాని కళ్ళు పేజి 26


    ఒక రోజున ఈ జరిగిపోయిన సంఘటనలన్నీ తలచుకుంటుంటే జీవితం ఇంత తారుమారయిందా అని కడుపులో ఏమిటో దేవినట్లయింది. అక్కయ్య రెండు ఉత్తరాలు రాసినా బావ సమాధానం రాయలేదు. దాని మనస్తత్వం చాలా వరకూ మారినా బావకు మొట్టమొదటి అభిప్రాయం ఏ మాత్రం మారలేదు.
    సిగరెట్ కాలుస్తూ కుడి అరిచేతి లోనిరేఖల్ని చూసుకుంటున్నారు.
    "చేతిలో మంచి రేఖలున్నా బుద్దికీ రేఖలకూ సంబంధం లేదేమో" అన్నాను.
    "లేదు సుభా. జీవిత రేఖ మంచిదే. కాని పెళ్ళయ్యాక నా అదృష్టమే నన్ను తిప్పి కొట్టింది. ఈ జరిగేదంతా కేవలం నా తప్పే కాదు. దురదృష్టపు క్రీ నీడలు ప్రతి సంఘటన లోనూ నా మీద పడుతూనే వున్నయ్యి." అన్నారు.
    "లేదు. మీలోని కాంక్షకూ, కుట్ర మనస్తత్వానికి కారణం నేనూ కాదు నా కర్మా కాదు. మీ స్వార్ధం, దుడుకు తనం. ఎంతో తేలికగా ఎవరి డబ్బయినా సరే కాజేసి వాడుకోవాలనే కుటిల మనస్తత్వం . మీ దురదృష్టాన్ని నేనూ, పిల్లలూ పంచు కోవటం నుంచే మీకు జైలు కూడా తప్పింది. మీలో చెలరేగిన ప్రతి సంఘర్షణకూ మీరే కారణం. వాటి పరిణామాలు మేము అనుభవిస్తున్నాం."
    వారికీ బాధ కలుగుతుందని తెల్సు. కాని ఎంత కాలమని వారి కోసం నా మనస్సు ని సరిపెట్టుకుని ప్రతీ దారుణమైన సంఘటనకీ తలవంచి కూర్చునేది? ఎదురు తిరగాలనే మనస్తత్వం కాకపోయినా వారేమయినా బాగుపడతారేమోననే  ఆశతో వారి మనస్సుకు సూటిగా తగిలేటట్టుగా మాట్లాడుదామనే నా ఉద్దేశం.కాని తాత్కాలికంగా ఎప్పటి కప్పుడు వారు తమ ఓటమి ని ఒప్పుకున్నా తెలు కొండి లాంటి వారి మనస్తత్వం వంకర తిరిగి కుడుతూనే వుంటుంది.
    "సుభా, నీ సంపాదన తో నన్ను పోషిస్తున్నాననే ధీమాతో ఇట్లా మాట్లాడుతున్నావా లేక నాకేదో హితబోధ చేద్దామనే ఉద్దేశంతో సంపాదన పరురాలివి కనుక వయస్సు కు మించిన పెద్దరికపు ధోరణి లో మాట్లాడుతున్నావా" అన్నారు.
    పేలవంగా నవ్వి నిట్టుర్చాను. సుమతీ శతకం లో పద్యాలూ, వేమన శతకం లో పద్యాలూ ఎన్నో గుర్తుకొచ్చాయి. ఇంక జీవితంలో తెల్సుకోవలసింది ఒక్కటే కాని అంత దూరం పోదల్చు కోలేదు.
    "ధీమాగా హితబోధ చేద్దామనే ఉద్దేశ్యం నాకు లేదు. కాని ఒక్కటి మాత్రం సత్యం, మీకన్నా వయస్సులో అయిదేళ్ళు చిన్నదాన్ని. కాని అనుభవాలు జీవితంలో కొన్ని సంఘటనలూ నన్ను పెద్దదాన్ని చేశాయి. మీ అనురాగ వాహిని లో తల మున్కగా స్నానం చేస్తూ ఆశల్నీ ఆశయాల్నీ చిగురింప చేసుకుందామని ఉవ్విళ్ళూరిన నేను. మీరు చేస్తున్న ఘాతుక కృత్యాలతో తలమునిగి తాటి ప్రమాణాన ఉండి అన్ని ఆశయాల్ని సుడి గుండాల్లో విడిచి పెట్టానే గాని ఒక్క కోరికనూ తీర్చుకోనేలేదు. ఇప్పుడు నేను అన్ని కష్టాల్ని అనుభవించిన ముది వగ్గును" అన్నాను.
    వారు మాట్లడకుండా బైటికి వెళ్ళి పోయారు. ఆరోజుల్లా ఇంటికి రాలేదు. అందుకూ నేనూ బాధపడలేదు. అక్కయ్య నన్ను కేకలేసింది.

 

                                 
    "తను చేసిన ప్రతి తప్పునూ, నేరాన్నీ నువ్వు సమర్ధనీయంగా సరిపెట్టడం లో అయన మనస్సు చిన్న బుచ్చుకుని లోపల్లో పల కుమిలి పోతున్నాడు. నీ మాటలు ఆయన్ని మరీ బాధపెట్టి మరో దుర్మార్గం చెయ్యటానికి దోహదం చేస్తున్నాయేమో . ఆ దృష్టి లో ఆలోచించావా సుభా" అన్నది.
    ఇన్నాళ్ళ కు గాను, ఇన్నేళ్ళ కు గాను అక్కయ్య నోరు మెదిపి వారి విషయం లో ఈ అభిప్రాయానికి వచ్చింది. కోరికలంటే ఏమిటో తెలియని అక్కయ్య అన్ని కోరికల్ని అవగాహన చేసుకుని అన్ని ఊహల్ని ఆ కోరికలకి జత చేసి తన మనస్సులో దాచుకున్నది. దాని ఊహలకూ, కోరికలకూ సార్ధకత ఎప్పుడైనా దాని జీవితంలో కొత్త అనుభవాలూ, కొత్త కష్టాలూ ఏమీ లేవు. నా పరిస్థితి అందుకు పూర్తిగా విరుద్దం. కావలసిన సుఖాలు కాసినీ ఎన్నో కష్టాలలో కార్పణ్యాలతో, ఆర్ధిక ఇబ్బందులలో, అప్పుల్లో-- ఆస్థి అమ్మకాలతో కలగా పులగంగా కలిసి పోయాయి ఇన్నీ కలిసి ఏర్పడిన ఈ రాశిని జల్లెడ పడుతూ కూర్చున్న నేను అక్కయ్య అభిప్రాయాలకు నవ్వుకున్నాను-- లేకపోతె నేనుండే ఈ పరిస్థితికి నవ్వటానికి గాని సంతోషపడ్డానికి గానీ ఆస్కారమే లేదు.
    "మీ మరిది మరో కొత్త దుర్మార్గం చెయ్యటానికి పధకం వేస్తున్నారంటావా అక్కయ్యా."
    "తెలిసీ తెలియని నా పిచ్చి మనస్సుకు అలాంటి అనుమానం కలిగింది సుభా. ఎందుకంటె శనగపప్పూ బెల్లం లా డబ్బుల్ని తినేసిన అయన ఆకలి ఈ పరిస్థితుల్లో ఎట్లా తీరుతుందని నా ఉద్దేశ్యం. ఈ డబ్బు కావాలనే ఆకలి చేత, కొట్ల వెంట పడి అడుక్కుతినే అలగా జాతి బిచ్చగాళ్ళ లా డబ్బు ఎట్లా ఎక్కడ దొరుకుతుందా అని వెయ్యి కళ్ళతో వెతుకుతూ ఉంటాడేమో" అన్నది అక్కయ్య.
    కాసేపు ఆలోచించాను. అక్కయ్య చెప్పింది నిజమే. కాని ఈసారి ఆ డబ్బు ఎట్లా సంపాదిస్తారు? ఏమో ఎవరి కెరుక? మళ్ళీ అట్లాంటి పన్లె చేస్తే? "అక్కయ్య ఈసారి అమ్మేందుకు ఇల్లేక్కడిదీ, మనం ఉంటున్నది అద్దె ఇల్లు. స్వగృహం కాదు" అన్నాను. అక్కయ్య పకపక నవ్వింది. ఇదివరకు అక్కయ్య నవ్వితే దాని ముఖం లో చూపులో వెకిలితనం ప్రస్పుటంగా కనిపించేది. కాని ఈ నవ్వులో ఎంతో హుందాతనం, మనష్యుల్నీ వాళ్ళ మనస్తత్వాల్నీ అంచనా వేయగల తెలివి తేటలూ కనిపించాయి.
    "స్వగ్రుహిణి వి నువ్వుండగా మరిది గారికి లోటేం ఉన్నది సుభా. కార్యసాధన అయన వంతు. కర్తవ్యం నీ వంతు. ఇక నుంచీ అయన చేసిన అప్పులు నీ జీతం లో తీర్చాలి. భర్త కావాలో, ఉద్యోగం కావాలో నిర్ణయించు కోవలసిన పరిస్థితి వచ్చింది. ఈ సారి చేసే అప్పులు పెద్ద మొత్తంలో లేకపోయినా నీ జీతానికి సరిపోయేవి గానే ఉంటయ్యి." అన్నది అక్కయ్య. ఆలోచిస్తే దాని కున్న దూరదృష్టి నిజంగానే నాకు లేకపోయింది.
    "ఇంత తెలివితేటల్ని సంపాదించుకున్న దానివి నీ కాపురమన్నా ఒక ఒడ్డున పడితే అమ్మ ఎంతో సంతోషిస్తుంది. ఆ ప్రయత్నం చేయ్యరాదా అక్కయ్యా" అన్నాను.
    "ఇంకొక రెండేళ్ళు పోనివ్వు. నేను మెట్రిక్ తప్పక పాసవుతాను. వారు నన్ను అప్పుడయినా తప్పక ఆదరిస్తారనే నమ్మాకం నాకున్నది. ఆ కారు మబ్బులు విడిపోతయ్యి " అన్నది. నా మనస్సులో ఆనందం తొణికిసలాడింది.  

                                     15
    వంద రూపాయలు ఇవ్వటానికి అన్నయ్య వచ్చినప్పుడు అమ్మ వెనక అక్కయ్య నిల్చునేదే కాని అన్నయ్యతో మాట్లాడేది కాదు. ఈసారి అన్నయ్య వచ్చినప్పుడు అక్కయ్య పలకరించింది.
    "తమ్ముడూ నీ డబ్బు ఎటువంటిదయినా, నువ్వు ఎట్లా సంపాదిస్తున్నా మనస్పూర్తిగా నువ్వు అభాగ్యురాలైన అమ్మకూ, భర్త ఆదరణకు నోచుకోని నాకూ సహాయం చేస్తున్నావు. అందుకు నేను సర్వదా కృతజ్ఞుత తెలుపుకోవాలి. మనసారా కృతజ్ఞత తెలుపు కుంటున్నాను. కాలగమనం గత చరిత్రల్నీ మార్చి వేసి నట్లే. కొందరి జీవితాలనూ, అద్రుష్టాన్నీ మనస్తత్వాన్నీ , గుణగుణాల్నీ కూడా మార్చివేస్తుంది. అందుకు ఉదాహరణ చెడుగా చెప్పాలంటే మన సుభాషిణి భర్త శ్రావణ కుమార్. మంచిగా చెప్పాలంటే నేనూ. నా వెకిలి తనమూ, తెలివి తక్కువ తనమూ నీకు తెలియంది కాదు, కాని నా జీవితం తిరగబడింది. నేనిప్పుడు ఇంట్లోనే ధర్డు ఫారం పుస్తకాలు చదువుతున్నాను. ఈ వేసవి గడిచాక ట్యూటోరియల్ కాలేజీ లో చేరి మెట్రిక్ పరీక్షకు చదవాలని కోరిక. చదివి పాసవగలననే ధైర్యం . నమ్మకం వుంది. ఈ రెండు సంవత్సరాలు ఈ బాధ్యత కూడా నువ్వే తీసుకుని తగిన ధన సహాయం చెయ్యాలి. మెట్రిక్ పాసయాక నేనే నీ సహాయంతో వారి దగ్గరకు వెళ్ళిపోతాను. నా చదువుకు సహాయం చెయ్యి. నువ్వు నాకు తమ్ముడి వైనా ముకుళిత హస్తాలతో ప్రార్ధిస్తున్నాను" అన్నది అక్కయ్య. అందరం ఆశ్చర్యంతో విన్నాం. అన్నయ్య కూడా ఎంతో విభ్రాంతి తో విన్నాడు. ఆనందంతో వాడి కళ్ళు చెమర్చాయి.
    "నాది దుర్మార్గపు సంపాదనయినా రాణింపు కు వస్తున్నదంటే నా మనస్సు సంతోషంతో ఊగిపోతున్నది అక్కయ్య. ఇలాంటి సంపాదన నిలవదంటారు, రాణింపుకు రాదంటారు. కాని నా విషయం లో ఆ సిద్దాంతాలు తారుమారయ్యాయి. నీకోసం మరొక రెండు గంటలు కష్టపడతాను. పై నెల నుంచీ నెలకు నూటయాభై ఇస్తాను. సరేనా" క్షణం ఆగకుండా వెళ్ళిపోయాడు అన్నయ్య. అక్కయ్య ముఖం ఆనందంతో విప్పారింది.
    అక్కయ్య అడగం గానే అన్నయ్య నెలకు యాభై రూపాయలూ ఇవ్వటానికి అంత తేలిగ్గా వప్పుకున్నాడంటే ఆ వ్యాపారమూ ఉద్యోగమూ ఏమిటో తెలియక వార్ని అడిగాను.
    "ఈ ఊళ్ళో పేరు మోసిన పెద్ద మనుష్యులు రెండు లాడ్జింగు లూ, బ్రాకెట్ కంపెనీలు , జూద గృహాలూ నడుపుతూ వీలుని బట్టి దొంగనోట్ల చెలామణీ చేస్తూ ఉంటారు. అట్లాంటివి నడపాలంటే అర్ధ బలమే కాక అంగబలమూ , చాకు లాంటి కుర్రాళ్ళూ కావాలి. మన వాణీ నాధం ఈ వ్యవహారాల్లో అరి తేరిన వాడు. వాటి మేనేజ్ మెంట్ చూస్తూ ఉంటాడు. నెల జీతమే కాక కొంత కమీషన్ ఉంటుంది. ఏం ఎందుకదిగావ్ . నన్నూ అందులో చెరమంటావా?" నా సలహా ఏదో కావలసినట్లుగా చూస్తూ అన్నారు. వాడు చేసే దారుణ క్రుత్యాల్నీ, గడుపుతున్న పాప పంకిలమైన జీవితాన్నీ తల్చుకుని అసహ్యించుకున్నా అక్కయ్యనూ, అమ్మను మాట తప్పకుండా పోషిస్తున్నాడంటే వాడి నిజాయితీ కి మెచ్చు కున్నాను. ఆ దృష్టి తో చూస్తె వీరికన్నా వాడే ఎంతో నయమను కున్నాను. అన్నయ్య చర్యల్ని సమర్చించలేకపోయినా వాడు ఎవరికీ ద్రోహం చెయ్యలేదు. వీరో! ఆలోచిస్తే తల దిమ్మెక్కి పోతుంది. మీ ఉద్యోగం సంగతీ, వ్యాపారం సంగతీ, చెయ్యబోయే దారుణ కృత్యాల సంగతీ, నాకు చెప్పనక్కర్లేదు. మంచి మంచి అనుభవాల్ని పునశ్చ రణ చేసుకున్నా మనస్సుకు ఆనందంగా ఉంటుంది. చరిత్ర హీనుల జీవితాలు చెద పురుగుల్లాంటివి . ఇతరుల మనస్సునీ, హృదయాల్నీ కొట్టి పారెయ్యటం తప్ప ఈ చెద పురుగుల వల్ల ఉపయోగం ఏ మాత్రం లేదు" అన్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS