Previous Page Next Page 
మల్లెలు ఎర్రగులాబీలు పేజి 25


    'చివరకు క్యాన్సర్ పై రాత్రింబవళ్ళు పరిశోధన జరిపిన ఆ డాక్టరు మరికొందరి డాక్టర్ల సలహాలు సేకరిస్తూ అతనికి ఆపరేషన్ చేస్తాడు. సమయానికి నిద్రా హారాలు లేకుండా పరిశోధన జరపడంవల్ల ఆ రోగికి ఆపరేషన్ చేసిన అరగంటకే ఆ డాక్టరు మరణిస్తాడు. రోగి జీవిస్తాడు. ఒకప్రక్క భర్త జీవించాడన్న సంతోషం, మరొకప్రక్క తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమెకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టు కున్నాడన్న బాధ, ఆ నాయిక ర=హృదయాన్ని తల్లడిల్లజేస్తుంది.
    'నిజంగా ఎంత చక్కనికధ. మన పవిత్ర భారతవారియొక్క హృదయాందోళనను సుస్పష్టం చేస్తుందీ కధ.'    
    పై విధంగా ఆలోచిస్తున్న రామానికి 'జ్యోత్స్న' గుర్తుకు రావడం జరిగింది.
    'ఎవరీ, జ్యోత్స్న? ఎవరికీ విసుగు కలిగించని చక్కని శైలితో పాశ్చాత్య నాగరిక తను ఖండిస్తూ మన నాగరికత, సభ్యతా సంస్కారాలలో ఉన్న విశిష్టతను సుస్పష్టం చేస్తూ సున్నితంగా బుద్ధి చెబుతూన్న ఆ వ్యాసాలు నా కెంతో నచ్చుతున్నాయి. సుందరాన్నికూడా చదవమంటాను. ఎంతో కృషి చేస్తేగాని అటువంటి వ్యాసాలు తయారవవు. సాగర మధనంతో అమృతం ఉద్భవించినట్లు మన ప్రాచీన సాహిత్యాన్ని అవరోధనచేసి ఈ వ్యాసాల నందిస్తున్నారు 'జ్యోత్స్న'గారు వోహ్! అటువంటి ధార్మిక, సాంస్కృతిక మతవిషయిక ప్రబోధాలు ఈ పరిస్థితులలో ఎంతైనా అవసరం. కధలద్వారా నైతే తన ఆశయం తేలికగా నెరవేరవచ్చన్న ఆశయంతో కధలలో ఆ సారాన్ని నింపుతూ చక్కని కధాకధనంతో పఠితలు తన కధలను ఆకర్షించే విధంగా వ్రాస్తున్నారు. ఈ రోజు చదివినకధ ఎంతో బాగుంది. ప్రారంభించిన వారెవరూ చివరి వరకూ చదవకుండా ఒదిలిపెట్టరు; ఈ విధంగా ఆలోచిస్తూ ఎప్పుడో నిద్రపోయాడు రామం.
    మరురోజు లారీ మాట్లాడి, పూల మొక్కలు కొని వాటిని, మిగత ఆస్పత్రి పరికరాలనూ ఆ లారీలో తనవెంట ఊరికి తీసుకువెళ్ళాడు.

                            *     *    *

    తన తండ్రి అనారోగ్యాన్ని తలపోస్తూ పరధ్యానంగా నడుస్తూ ఉంది నీరజ. ఆమె మెడికల్ కాలేజినుండి యింటికి బయలుదేరింది. రోడ్డును క్రాసు చేస్తున్న సమయంలో ఎవరో తనచేతిని పట్టుకొని లాగడం ఆమెకెంతో క్రోధావేశాన్ని కలిగించింది. కాని వెంటనే తన తొందరపాటుకు పశ్చాత్తాప పడింది.
    ఆ యువకుడు ఆమెను ప్రక్కకు లాగి ఉండకపోతే వెనుకగా వస్తున్న ఎంబాసిడర్ కారుక్రింద ఆమే పడి ఉండేది. కృతజ్ఞత నిండిన చూపులతో అతనిని చూస్తూ 'థ్యాంక్సండీ! నన్ను కారు ప్రమాదంనుండి కాపాడారు.' తడబడుతూ అంది నీరజ.
    'మరీ అంత పరధ్యానంగా నడుస్తే ఎలా గండీ? అసలే ప్రమాదాలసంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూ ఉంది.' చిరునవ్వుతో అన్నాడా యువకుడు.
    'మా నాన్నగారి ఆరోగ్యం బాగాలేదండీ. వారినిగురించి ఆలోచిస్తూ నడుస్తూన్న నాకు కారుచప్పుడు వినిపించలేదు.' సిగ్గు పడుతూ అంది.
    'మీ నాన్నగారికేం జబ్బండీ?' నీరజ ముఖంలోకి చూస్తూ అడిగాడు ఆ యువకుడు.
    నీరజ కారుక్రింద పడబోవడం ఎవరో యువకుడు ఆమెను యివతలికి లాగి రక్షించడం అక్కడున్న వారి దృష్టిని ఆకర్షించింది. నలుగురూ తమవైపు వింతగా చూస్తూ ఉండడం గమనించిన నీరజ 'మా యిల్లు యిక్కడికి దగ్గరేనండీ! ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం...'
    'అలాగే పదండి.' నీరజను అనుసరిస్తూ అన్నాడు యువకుడు.
    ఇద్దరూ పాత్ వేమీద మెల్లిగా మాట్లాడుకుంటూ నడుస్తున్నారు.
    'ఇంతకూ మీ పేరు చెప్పారు కాదు.' అతనిని ప్రశ్నించింది నీరజ.
    'నన్ను సుందరం అంటారు!'
    'మీరేం చేస్తున్నారు?'
    'గాంధి హాస్పిటల్ లో హౌస్ సర్జనుగా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరంతో పూర్తవుతుంది.'
    'వోహ్! మీరు డాక్టర్లా?' సంభ్రమాశ్చర్యాలతో ప్రశ్నించింది నీరజ.
    'ఎందుకండీ అంత ఆశ్చర్యపడుతున్నారు? నాలో డాక్టర్లకుండవల సిన లక్షణాలు లేవా?'
    'అబ్బే! అదేమీ లేదండీ! డాక్టర్లకు ప్రత్యేక లక్షణాలు ఏముంటాయి? వెదుక బోయిన తీగ కాలికి తగిలినట్లైందని ఆశ్చర్యపడుతున్నాను.'
    వారిద్దరూ యిల్లు చేరారు. అధునాతన సౌకర్యాలతో చూడ ముచ్చటగా ఉంది ఆయిల్లు. ఇంటిచుట్టూ ఉన్న ఖాళీస్థలంలో చక్కని పూదోటను పెంచింది నీరజ.
    వీరిద్దరూ వెళ్ళేసరికి సుందరరామయ్య గారు మంచంలో పడుకొని ఆయాసంతో బాధపడుతున్నారు. ఈ మధ్య దగ్గుకుతోడు ఆయాస మొకటి క్రొత్తగా ఎక్కువై వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంది.
    తన కూతురివెంట ఎవరో అపరిచిత యువకుడు రావడం సుందరరామయ్యగారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అతనిని అంతకు ముందు ఎప్పుడూ చూసిన గుర్తుకూడా లేదు. 'ఎవరై ఉంటారబ్బా!' అని ఆలోచిస్తూ ప్రశ్నార్ధకంగా తన కూతురివైపు చూడసాగాడు.
    'నాన్నారూ! ఈ రోజు పెద్దగండం తప్పిపోయింది. సమయానికి వీరు రక్షించక పోతే నేను కారుక్రింద పడిపోయేదాన్ని సుందరాన్ని తండ్రికి చూపిస్తూ అంది నీరజ.
    'ఎంతపని జరిగిందమ్మా? దెబ్బలేమైనా తగిలాయా?' కూతురివైపు ఆదుర్దాగా చూస్తూ, ఆయాసంతో బాదపడుతూ ప్రశ్నించారు సుందరరామయ్యగారు.
    'ఏమీ తగలలేదండీ నాన్నారూ!'
    'బాబూ నిల్చున్నావేం? అలా కూర్చో!" కృతజ్ఞత నిండిన చూపులతో చూస్తూ అవి అక్కడఉన్న కేన్ చేర్ చూపించారు. సుందరం కూర్చున్నాడు.
    హఠాత్తుగా వచ్చిన దగ్గు తెరవల్ల బాధతో మెలికలు తిరిగి పోసాగారు సుందర రామయ్యగారు. ఊపిరాడక రెండుమూడు క్షణాలు ఉక్కిరిబిక్కి రయ్యారు.
    మెల్లిగా తేరుకొని 'బాబూ! దేవునిలా వచ్చి మా అమ్మాయిని కాపాడావు. నీ ఋణం ఎలా తీర్చుకోగలం?' నీరసంతో అని బాధ భరించలేక కళ్ళు మూసుకున్నారు.
    'నాన్నారూ! ఈపూట మరీ ఎక్కువైనట్లుందే? డాక్టరు గారు మళ్ళీ రాలేదా?' ముఖంలో బాధ ప్రస్ఫుటమౌతూ ఉండగా ప్రశ్నించింది నీరజ.
    'అవునమ్మా! బాధ భరంచలేకుండా ఉన్నాను. డాక్టరు గారు ఈరోజు రానేలేదు.' జీవితంపై నిరాశ నిస్పృహలు వారిముఖంలో కొట్టవచ్చినట్లు కనుపిస్తున్నాయి.
    'నీరుకూడా డాక్టరే! హౌస్ సర్జన్ చేస్తున్నారు. ఈ సంవత్సరంతో పూర్తవుతుంది.'
    'అవుతే జాగ్రత్తగా నా రోగాన్ని పరీక్షించి చూడరూ?' ఆశగా సుందరం ముఖంలోకి చూస్తూ అడిగారు సుందర రామయ్యగారు. డక్టరనే పదం వారి చెవిన పడగానే నన్నని సంతోషరేఖలు వారి ముఖంలో కనుపించాయి.
    సుందరం సుందరరామయ్యగారి ముఖం లోకి జాలిగా చూస్తూ 'మీకున్న బాధ లేమిటో ఒక్కక్కటి వివరంగా చెప్పండి. అని కాగితంముక్కపై వ్రాసుకోవడానికి ఉద్యుక్తుడయ్యాడు.
    ఉన్నబాధలన్నీ వివరంగా చెప్పారు సుందర రామయ్యగారు. వాటన్నింటినీ జాగ్రత్తగా వ్రాసుకొని పరిశీలించి 'మరి నేను మందులు వ్రాసిస్తాను. వాడతారా?' ప్రశ్నించాడు సుందరం.
    'అంతకన్నానా బాబూ! ప్రస్తుతం మందిస్తున్న డాక్టరుగారిపై నాకు పూర్తిగా నమ్మకం పోయింది. డబ్బు వదులుతూందేకాని వ్యాధిమాత్రం తగ్గుముఖం పట్టడంలేదు.'
    'మీరు వాడినమందుల చీట్లు ఒక్కసారి యిస్తారా?'    
    'అలాగే!' అని కూతురివైపు తిరిగి' 'అమ్మా....ఆ చీట్లన్నీ అల్మారా పై అరలో ఉన్నాయి. తీసుకురా తల్లీ!' అన్నారు బాధతో.
    ఆ చీట్లన్నీ చూసిన సుందరం అంతా అర్ధం చేసుకున్నాడు. ఒక నిర్ణయానికి వచ్చి 'మంచిదండీ నేను రేపటినుండే వైద్యం మొదలు పెడతాను. ఈ యింజక్షన్లు, మందులు తెప్పించండి' అని నీరజవైపు తిరిగి 'వస్తానండీ!' అంటూ గుమ్మంవైపు నడిచాడు.
    'మెనీ, మెనీ, థ్యాంక్సండీ!' అని అతనిని వీధివరకు సాగనంపడానికి వెళ్ళింది నీరజ.
    గేటువద్ద ఆగిన సుందరం 'మీ నాన్న గారి పరిస్థితి ఏమంత బాగాలేదు, అయినా ఫర్వాలేదు. కొద్దిరోజుల్లోనే కోలుకుంటారు మీరుమాత్రం ధైర్యంగా ఉండండి.' అని నీరజ కళ్ళల్లోకి ఆప్యాయంగా చూస్తూ, 'ఇంతకూ మీరేం చదువున్నారు? మాటల సందడిలో అడగడమే మర్చిపోయాను చిరు నవ్వుతో అన్నాడు.
    'సెకండియర్ మెడిసిన్ లో ఉన్నాను.'
    'నో.....నా ప్రొఫెషనే! ఇంకేం? కలిసి పోగలం' సంతోషంతో అని వెళ్ళిపోసాగాడు.
    కనుచూపు మేర దాటిపోయేంత వరకు అతనినిచూసి, దీర్ఘంగా నిట్టూరుస్తూ వెనుకకు తిరిగి వచ్చింది నీరజ.

                                                   *    *    *

                                   11

    సుందరం వైద్యంతో సుందరరామయ్య గారు వారంరోజులలో కోలుకున్నారు. లేచి తిరుగుతూ సాయంకాలం పూట నెమ్మదిగా అలా బయటికి వెళ్ళి రాగలుగుతున్నారు.
    సుందరాన్ని వారు ఎంతగానో పొగడసాగారు. వారికి అతనిపైన సదభిప్రాయం ఏర్పడింది. అతను కూడా ఈ వారం రోజులలోనే వారికి సన్నిహితుడయ్యాడు. రోజుకు ఒకసారి తప్పకుండా వచ్చి చూసి వెడుతున్నాడు.
    ఒకరోజు సాయంత్రం సుందరరామయ్య గారు బజారుకు వెళ్ళిరావాలనే ఉద్ధేశ్యంతో బయలుదేరారు. ఎదురుగా సుందరం వస్తూ ఉండడం చూసి ఆగిపోయారు.
    'ఎక్కడికో బయలుదేరినట్లున్నారే!' లోపలికి వస్తున్న సుందరం ప్రశ్నించాడు.
    'అబ్బే! ఎక్కడికీ లేదు బాబూ! రేపు అమ్మాయి పుట్టినరోజు. చిన్న పార్టీ యిస్తానంటూ ఉంది. ఏవో సామాన్లు కావాలనీ, వాటిని తీసుకురమ్మని లిస్టొకటి యిచ్చింది. వెడదా మనుకుంటూండే సరికి నీవొచ్చావు.' వారి ముఖంలో సంతోషం వెల్లివిరుస్తూ ఉంది.
    'మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు కులాసాగా ఉంటుందా? మిమ్ములను చూసి పోదామనే వచ్చాను.'
    'కులాసాగానే ఉంటుంది బాబూ. నీచేతి చలవవల్ల బాగయ్యాను. చిన్నవాడివైనా నాకు ఆరోగ్యాన్ని త్వరగా ప్రసాదించ గలిగావు.' వారి కళ్ళల్లో కృతజ్ఞత కనుపించసాగింది.
    'నే చేసిందేముందండీ! నా స్థానంలో  మరొకరున్నా అంతమాత్రం చేయలేక పోరు. నాపైగల అభిమానంతో మీరలా అంటున్నారు. మీ అమ్మాయిగారు కనుపించడంలేదు, ఎక్కడికి వెళ్ళారు?'
    'రేపటి తన పుట్టినరోజు పార్టీకి స్నేహితులను పిలవడానికి వెళ్ళింది. బహుశా ఈపాటికి వస్తూ ఉండవచ్చు.'
    'మంచిది. నే వెళ్ళొస్తానండీ! నేను చెప్పిన మందులు మాత్రం జాగ్రత్తగా వాడుతూ ఉండండి' లేచి వెళ్ళబోతూ అన్నాడు సుందరం.
    'అదేమిటి బాబూ! అమ్మాయి యిప్పుడే వస్తుంది' అని సుందరరామయ్యగారు అంటూ ఉండడం నీరజ రావడం ఒక్క సారే జరిగింది.
    'వో....డాక్టరు గారు వచ్చినట్లున్నారే ఒక్క నిముషంలో వస్తాను. కూర్చోండి అని లోపలికి వెళ్ళింది నీరజ.
    'అమ్మా నీరజా...! నేనలా బయటికి వెళ్ళొస్తాను. రేపటికి కావలసిన సామాన్లు తీసుకురావాలి. అని సుందరాన్ని చూస్తూ కూర్చో బాబూ! అమ్మాయి యిప్పుడే లోపలనుండి వస్తుంది' అని వెళ్ళిపోయారు సుందరరామయ్యగారు.
    లోపలినుండి వస్తూన్న నీరజను చూసిన సుందరం విస్తుపోయాడు. సిమెంటుకలరు టెర్రీకాటన్ చీరె. అదేరంగు జాకెట్టు, మెడలో సన్ననిరాళ్ళ నెక్లెసు. ఎడమచేతికి ఖరీదైన రిస్టువాచీ, చలిస్తూ ఉన్న ఆ కాటుకకండ్లు అపర రతీదేవిలా ఉంది ఆమె.
    రెప్పవేయకుండా కొన్నిక్షణాలు చూశాడు ఆమెను. అతను అలా చూడడంతో సిగ్గుతో మొగ్గైంది నీరజ. మెల్లిగా వచ్చి అతనికి ఎదురుగా కూర్చుంది.
    ఆమె అందానికి ముగ్ధుడౌతూ 'ఈరోజు మీరు ఎంతో అందంగా ఉన్నారు.' అని ఆమె కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ అన్నాడు సుందరం.
    ఆ చూపులు నీరజ హృదయాన్ని కలవర పరచి ఆమెకు గిలిగింతలు పెట్టాయి. సుందరంతో ఆమెకు పరిచయం కలిగి నప్పటినుండి నీరజ హృదయంలో ఒకవిధమైన సంచలనం కలగ నారంభించింది. ఆమె ప్రమేయం లేకుండానే ఆమె మనసు పదే, పదే అతనిని గురించి ఆలోచిస్తూ ఉంది. రాత్రిళ్ళు సరీగా నిద్రపట్టడంలేదు.
    'రేపే నా పుట్టినరోజు. మీరు తప్పకుండా రావాలి?!' చిరునవ్వుతో అంది.
    'అలాగే వస్తాను.' అని ఒక చిన్న తమాషా చేయాలనే ఉద్దేశంతో 'ఒంటరి గానే రావాలా?' ఆమె ముఖంలోకి పరిశీల నగా చూస్తూ అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS