18
చింతల బస్తీ లో కొత్త యింట్లోకి వచ్చాక కామాక్షి కి క్షణం తీరిక ఉండటం లేదు. ఇంటి వారి పిల్లాడు ఎప్పుడూ యిక్కడే ఉంటాడు. వాడికి కామాక్షి నీళ్ళు పోయాలి. అన్నం పెట్టాలి. చొక్కా తొడగాలి. రాత్రి పూట కూడా కామాక్షి పక్కలోనే పడుకుని నిద్ర పోయేవాడు. బాగా ఆదమరిచి నిద్తపోయాక గాని మెల్లిగా బుజాన వేసుకుని ఇంటి వారి కోడలికి పిల్లవాడిని ఇచ్చేది కాదు.
వసుంధర ఇప్పుడు తరచుగా శారద ఇంటికి వెళ్ళుతుంది. ఇద్దరిళ్ళూ చాలా దగ్గర. నాలుగిళ్ళ కు అవతలనే. శారద మాత్రం యింకా వీళ్ళింటికి రావడం లేదు.
ఇంటి వారి కోడలు పేరు శకుంతల. ఇరవై రెండు, ఇరవై మూడేళ్ళు ఉంటాయి. ఇద్దరు పిల్లల్నీ ఆవిడ సముదాయించు కోలేదు . రమేష్ వాళ్ళు రాక మునుపు అంతకు ముందు అద్దె కున్న వాళ్ళకూ, శకుంతల కూ క్షణం పడేది కాదు. ఆవిడకు నలుగురు పిల్లలు. ఈ పిల్లలు ఆ పిల్లలు చేరి ఇల్లంతా ఒక కొలిక్కి తెచ్చేవారు. అమితమైన అల్లరి చేసేవాళ్ళు. దానితో పెద్దవాళ్ళ కు మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఈసారి పిల్లలు లేనివాళ్ళ కు అద్దె కివ్వాలను కుంది శకుంతల. ఆవిడ కోరిక ఈడేరింది. ఇంటాయన మాజీ హైదరాబాదు సంస్థానం లోనే తాలూకా లో గుమస్తా చేసి ఫించను పుచ్చుకున్నాడు. ఆయనకు భార్య పోయింది. కొడుక్కు స్వంత వ్యాపారం. ఒక బట్టల కొట్టు, ఒక ఫ్యాన్సీ షాపు ఉన్నాయి. కోడలు శకుంతల పుట్టిల్లు మధిర. వాళ్ళు యింట్లో మాట్లాడుకునే తెలుగు బాష చాలా యాసగా ఉంటుంది. ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక కొంచెం కొంచెం విమర్శగా మాట్లాడటం నేర్చుకున్నారు. కాని యాస కనుపిస్తూనే ఉంటుంది.
శకుంతల చాలా బాగుంటుంది. డబ్బపండు లాంటి శరీరచ్చాయ. కనుముక్కు తీరు చక్కగా ఉంటుంది. నిండయిన విగ్రహం. ఎంతమందిలో ఉన్నా ఇట్టే అందరి దృష్టీ ఆకర్షిస్తుంది. కాని చదువు శూన్యం. అయిదో క్లాసు వరకూ చదివింది. అందుచేత చదువుకున్న ఆడవాళ్ళంటే చాలా గౌరవం. వాళ్ళను ఎంతో గౌరవంగా పిలిచి మాట్లాడుతుంది. ఎంత పెద్ద అధికారి అయిన మగవాడు చదువు కున్నవాడంటే ఆమెకు ఎక్కువ గౌరవం లేదు. మగవాళ్ళు చదువుకోక ఏం చేస్తారంటుంది. చదువుకున్న ఆడదంటే నే శకుంతల కు ఆశ్చర్యమూ, గౌరవము నూ.
"ఏం వసుందర మ్మ , పెద్దగా చదివావ్. సర్కారు లో నౌక్రీ చేస్తుండావ్ . ఎంత జాతకురాలివి!" అంటుంది వసుంధర ను చూసి. వసుంధర ఆమె అమాయకత్వానికి నవ్వుతుంది.
"నా చదువుకే అట్లా అంటున్నావ్. ఇంకా పెద్ద చదువులు చదివిన ఆడవాళ్ళను చూస్తె మూర్చపోతా వనుకుంటా' అంటూ కవ్విస్తుంది వసుంధర.
"నా కధంతా తెల్దు. రోజూ కచ్చేరీ కి పోతుండావు కద. జీతం తెస్తుండావ్. దునియా మీద ఆడది సర్కార్ నౌక్రీ చేసి జీతం పుచ్చుకుంటుంటే అది గొప్ప కాదా వసుంధరమ్మా?" అంటుంది.
వసుంధర, కామాక్షి తోనూ, రమేష్ తోనూ అంటుంది. "శకుంతల నోరు విప్పకుండా చక్కగా ముస్తాబయి ఉంటె ఏ ఐ.పి.ఎస్ ఆఫీసరు గారి భార్యో , ఏ కాలేజీ లెక్చరరో అనుకోవచ్చు. అంత చక్కగా తెలివితేటలూ గా ఉంటుంది. చూడ ముచ్చటైన విగ్రహం. నోరు విప్పితే బండారం బయట పడుతుంది."
"గత జన్మ లో అందాన్ని ఆరాధించింది. కాని చదువుకున్న వాళ్ళను హేళన చేసింది. అందుకే పాపం చదువు అబ్బలేదు. కాని మనస్సు మంచిది గానే తోస్తున్నది." అన్నది కామాక్షి.
"కాదే, అక్కయ్యా. ఆవిడ గత జన్మలో త్రిబుల్ ఎమ్మే. ఎప్పుడూ చదువుతో పుస్తకాల పురగయి ఉంటుంది. బుర్ర వేడెక్కి, విసుగెత్తి పొరబాటున సరస్వతీ దేవిని తూలనాడి ఉంటుంది. ఇంకేం? ఈ జన్మలో చదువు ఇట్లా శూన్య మయింది. అంతా పూర్వ జన్మ సుకృతం." అనేవాడు రమేష్.
ఆ ఇంట్లోకి వచ్చిన నేల రోజులకే వాళ్ళకు శకుంతల విషయమూ, పిల్లల విషయమూ ఒక పెద్ద చర్చనీయాంశం అయింది.
"వసుంధరమ్మా , అంతమంది మొగొళ్ళ లోనూ నువ్వూ కూచుంటావు గదా! సిగ్గేయ్యదూ?" అనేది శకుంతల.
"మనమేం తప్పు పని చెయ్యటం లేదు కదా, సిగ్గేయ్యటానికి? గవర్నమెంటు పని చేస్తున్నాం. జీతం తీసుకుంటున్నాం . జీతం తీసుకుంటున్నప్పుడు ఆఫీసు పని చెయ్యాలి కదా?"
"మరయితే దసరా కూడా పోతావా?"
"దసరా అంటే?"
"అదే. సర్కీటు."
"సర్కీటంటే క్యాంపు పోవటమా?"
"అదేనమ్మా, అదే."
"అక్కర్లేదు. ఆఫీసులో పనే."
"మరయితే సెలవు పెడితే పూరాగా జీతం ఇస్తారా?"
"అంతా ఇస్తారు."
ఇట్లా శకుంతల మాట్లాడితే వసుంధర నవ్వుకునేది. కామాక్షి వసుంధర ను కేకలు వేసేది.
"ఏమిటి, వసుంధరా, మరీ అట పట్టించావ్? ఏదో పాపం వెర్రి బాగుల్ది. తెలీని విషయాలు అడిగి తెలుసు కుంటుంది. డానికి అంత ఆశ్చర్యం ఎందుకు?" అనేది కామాక్షి.
"ఫో వదినా. మొన్ననేం జరిగిందో తెలుసా?"
"ఏమయింది?"
"అ మూడు రోజులూ కూడా ఆఫీసుకు పోతారా అని అడిగిందావిడ" అన్నది వసుంధర పమిట చెంగుతో నోరు కప్పుకుని నవ్వుతూ. కామాక్షి కి కూడా నవ్వు వచ్చింది.
"పాపం, అమాయకురాలు!" అన్నది కామాక్షి.
ఇట్లా ఆ ఇంట్లో కాలక్షేపం జరుగుతున్నది. ఇంత తెలిసీ తెలియని మనిషీ, పిల్లవాణ్ణి మాత్రం కామాక్షి వద్దకు పంపించి ఊరుకునేది, ఒకళ్ళ సంరక్షణ తప్పినా తప్పిందే అనుకుని.
శకుంతల కు ఎక్కువగా సిగ్గు బిడియాలు కూడా తెలివు. రమేష్ వాళ్ళ గుమ్మం ముందుగా పోతున్నా ఆ రెండేళ్ళ పిల్లాడి కీ పాలిస్తూ కూర్చునేది. అది ఆవిడ స్వభావం. డబ్బంటే తగని కాంక్ష. బాగా డబ్బుండాలని శకుంతల ఉద్దేశ్యం. తొందరగా చెయ్యి జారదు. కాని ఆడంబరాలకు బాగా ఖర్చు పెడుతుంది. ఏ కాలమూ తనొక్కడానికే రోజూ పావలా పూలు కొంటుంది. చక్కగా మాల కట్టుకుని అంత పెద్ద చెండూ, సవారంతో జడ వేసుకుని, తలలో తురుముకుంటుంది. చక్కగా పౌడరు పూసుకుని మంచి మంచి చీరెలూ, రవికలూ కట్టుకుంటూ, తీరిగ్గా పిల్లాడికి పాలిస్తూ కూర్చుంటుంది. పాలివ్వటం కాగానే "అత్తయ్య దగ్గరకు పోరా" అంటుంది. వాడు గబగబా నడుస్తూ కామాక్షి భుజాల మీద వాలతాడు.
శకుంతల కు కామాక్షి అంటే ఎంతో అభిమానం, జాలి.
"కామాక్షమ్మ , ఎంతో చక్కని పుటక నీది. దైవం అన్నీ ఇచ్చాడు. ముత్తేమంత అయిదో తనం లోనే మబ్బు గప్పాడు. లేకపోతేనా, దొరసాని లా ఉండేదానివి." అనేది. కామాక్షి మొదట్లో ఆ మాటలకు మనస్సు లో తన రాతను తలుచుకుని బాధపడ్డా, తరువాత శకుంతల ఆ మాటలు అన్నప్పుడల్లా ఆమె మంచి మనస్సు కూ, బోళా తనానికి జాలిపడేది.
"ఏ దొరసాని లా ఉంటాను, శకుంతలా?"
"అబ్బో! ఆ దొరసాన్ల పేర్లు నాకేం తెల్దు. వూరికేనే అనేశాను" అనేది శకుంతల.
ఒకరోజున శకుంతల పిల్లాడికి జ్వరం తగిలింది. మర్నాడు కూడా తగ్గలేదు. కామాక్షి ఎప్పుడూ తన పక్కలోనే కూర్చోవాలని మారాం చేసేవాడు. అట్లాగే పాపం కామాక్షి వాడి పక్కలోనే పడుకుని, వాడికి కావలసిన పాలూ, పళ్ళ రసమూ , మందులు పట్టేది. మందు కూడా కామాక్షి ఇస్తేనే తాగేవాడు. వారం రోజులకు గాని జ్వరం తగ్గలేదు. ఈ వారం రోజులూ కామాక్షి వాడికి సేవ చేసేసరికి తను మూల పడ్డది. శకుంతల భర్తా, మామగారూ తమ పిల్లవాడికి సేవ చేసినందుకు ఎంతో సంతోషించి కామాక్షి ని ఎంతో అభినందించారు. వాడు మంచం దిగగానే కామాక్షి సుస్తీ పడ్డందుకు ఎంతో నొచ్చుకున్నారు. శకుంతల ఎప్పుడూ కామాక్షి ని గురించే అనుకునేది.
ఇదంతా వసుంధర కు గిట్టలేదు.
"ఎవరో కన్నమ్మ పిల్లాడికి జ్వరం వస్తే, నిద్రాహారాలు మాని నువ్వే వాళ్లకు చాకిరీ చెయ్యటం ఎందుకు చెప్పు వదినా? వాళ్ళ పిల్లాడి మంచి చెడ్డలు వాళ్ళకి కాకపొతే మనకా? కన్నవాళ్ళ కు మాత్రం ఆపేక్షలు లేవా చెప్పండి? కన్న కొడుక్కు జ్వరమొస్తే శకుంతల ఉపచారం చేసుకోలేదూ? మీ కోసమే ఆవిడ పిల్లల్ని కన్నదా?" అన్నది వసుంధర.
కామాక్షి మనస్సు చివుక్కు మన్నది, పుణ్యానికి పొతే పాపం ఎదురయిందని. ఆ పసివాడు తనకు మాలిమి అవటంనుంచీ, తనే కావాలని వాడు ఏడవటం చేతా తను వాడికి ఉపచారం చేసింది గాని తనకు యింట్లో పని లేక కాదు. ఏ జన్మ లో చేసుకున్న దుష్కృతం నుంచో ఈ జన్మ లో తనకీ వ్రాత వ్రాశాడు ఆ పరమాత్ముడు. పసిపిల్లల సంరక్షణ ఎట్లా చెయ్యాలో, వాళ్ళ ముద్దూ ముచ్చట లూ ఎట్లా చూసి సంతోషించాలో తనకు ఇంత వరకూ తెలీదు. తనకా యోగ్యత లేకపోయినా, భగవంతుడు ఈరీత్యా తనకా అవకాశం కలిగించాడు. కాని, ఇది వసుంధర దృష్టి లో తప్పుగా కనిపించింది. ఇవన్నీ ఆలోచించుకుంటూ పడుకుంది కామాక్షి. జ్వరం బాగా ఉంది. రమేష్, డాక్టరు వద్ద మందు తెచ్చాడు.
