Previous Page Next Page 
మనిషి పేజి 26


                                    23

              
    "నువ్వు జీవితంలో విజయం సాధించావా? లేక పరాజయం పొందావా?' ఈ ప్రశ్న నన్నెవరన్నా అడిగితె నేను చెప్పవలిసిన సమాధానం ఏమిటి? అని ఆలోచించాను.
    భగవంతుడు కనిపించి "ఓయీ! నీవు ఇన్నేళ్ళూ బ్రతికావు . నీ జీవితాన్ని తిరిగి నీకిస్తాను. మళ్ళీ మొదటి నుంచీ బ్రతకవచ్చు. మళ్ళీ పాపగా జీవితం ప్రారంభించి -- నీవు ఇంతవరకూ అనుభవించిన కష్టాలు, సుఖాలు, అనుభూతులు-- అన్నీ మళ్ళీ యధాతధంగా అనుభవించ వచ్చు. నువ్వు కోరుకుంటే ఈ వరం నీకిస్తాను!" అని అన్నాడను కొండి.
    అప్పుడు ఈ మానవ మాత్రుడు "అలాగే , స్వామీ! ఆనందంతో మీ వరం స్వీకరిస్తాను" అంటే అతగాడు జీవితంలో ఘన విజయం సాధించాడని చెప్పవచ్చు.
    అలాకాక ఈ మానవుడు "వద్దు, బాబోయ్ . ఈ భయంకరమైన జీవితంతో విసిగి పోయాను. మరోరకం జీవితం ఇప్పించండి వీలుంటే. ఇదే జీవితం మాత్రం వద్దు, ప్రభో!" అన్నాడను కొండి. అంటే పాపం, ఇతగాడు జీవితంలో చిత్తుగా ఓడి అలిసి, ఓపిక లేక సోమ్మసోల్లి పడి వున్నాడని అర్ధం.
    ఈ పవిత్ర భూతలం మీద ఊపిరి పీలుస్తున్న మనుష్యులందర్నీ ఈ రెండు అరల్లోకి సర్దేయవచ్చు. నేను నిక్షేపంగా రెండో అరలోకే పోయి తీరాలి మరి. బ్రతకట మంటే నాకు మహా విసుగ్గా ఉంది. మనుష్యుల కీ జీవితం మీద ఇంత తీపి ఎందుకో అనిపిస్తుంది.
    రైల్లో ప్రయాణం చేస్తుండగా ఒక ప్రయాణికుడి తో నాకు స్నేహం కలిసింది. డెబ్బై రెండు గంటల పాటు మహా విసుగు పుట్టించే రైల్వే ప్రయాణంలో అతి తేలికగా స్నేహితులు ఏర్పడతారు. అతని పేరు బలదేవ్ సింగ్. కళాకారుడు లా ఉన్నాడు. చూపులు శూన్యంలోకి ఏదో వెతుకుతున్నట్లున్నాయి. సాధారణంగా పంజాబీలు బలంగా భారీగా ఉంటారు. ఇతగాడు పల్చగా సన్నగా ఉన్నాడు. గడ్డం ముప్పాతిక మొహాన్ని కప్పింది. రోజుకో గంట దాన్ని అదుపులో పెట్టకపోతే, అతి భయంకరంగా తయారౌతుంది. రెండు రోజుల్లోనే చికాకుగా మారిన నా గడ్డాన్ని చేత్తో తడుముకుంటూ, బలదేవ్ సింగ కూడా నున్నగా క్షవరం చేయించుకొని, క్రాపు వేయించు కుంటే ఎలా ఉంటాడా అని ఆలోచిస్తున్నా. బలదేవ్ సింగ్ రెండవ ప్రపంచ యుద్దంలో పని చేశాడు. జపానీయులు బర్మాను ఆక్రమించు కున్నప్పుడు ఇంఫాల్ లో పని చేశాడు. బొంబాయి రేజిమెంటు లో ఉండగా సోఫియా అనే తురకమ్మయిని ప్రేమించాడు. ఇంఫాల్ లో ఫ్ర్రంట్ లో ఉండగా ఒకసారి జపాన్ వాళ్ళు పట్టుకుని బందీ చేయగా , అదృష్టవ శాన తప్పించుకు బయటపడి, ఎడం చెయ్యి విరగటం వల్ల వైద్యానికి బొంబాయి పంపించారు. చెయ్యి పూర్తిగా ఇప్పటికీ బాగుపడలేదు. సోఫియా నైజాం నవాబు తాలూకు ఒక ప్రిన్స్ ని పెళ్లి చేసుకుని , భర్తతో ఇంగ్లాండు వెళ్ళిపోయిందని బలదేవ్ సింగ్ కు బొంబాయి లో తెలిసింది. ఆత్మహత్య చేసుకోవటం ఇష్టం లేక మళ్ళీ యుద్ధంలోకి పోయి, చచ్చేదాకా పోట్లాడి వీరస్వర్గం అలంకరించాలను కున్నాడు. మళ్ళీ ఇంఫాల్ ఫ్రంట్ కు వెళ్లి ప్రాణాలకు తెగించి, మృత్యువు ను వెతుక్కుంటూ పోరాటం సాగించాడు. బలదేవ్ సింగ్ కు భయపడి మృత్యువు పారిపోవటం , హిరోషిమా పై అమెరికా అటంబాంబు లు వేయటం , జపాను లొంగి పోవటం జరగటం తో , బలదేవ్ సింగ్ ధైర్య సాహసాలకు అధికారులు మెచ్చి, డబుల్ ప్రమోషన్ ఇచ్చి కర్నల్ ని చేశారు. కాని తన కా అదృష్టం ఆనందం కలిగించలేదు. అర్మీలోంచి బయట పడ్డాడు. ఆ తరవాత ఈ పదేళ్ళ లో పిచ్చిగా అనేక దేశాలు తిరిగాడు. అనేకమయిన ఉద్యోగాలు చేశాడు. వ్యాపారాలు సాగించాడు. కాని ఎందులోనూ ఎక్కడా నిలకడగా ఉండలేక పోతున్నాడు. ఇంతవరకూ ఏదో సినిమా కధ చెబుతున్నట్లు చెబుతూ ఆగి, పెట్టె లోంచి విస్కీ బాటిల్ తీశాడు. ఇద్దరం భూమికి ఆరడుగుల ఎత్తున రైలుతో పాటుగా ఎగిరి పోతున్నాం.
    "చివరికి ఏం చేయదల్చు కున్నారు?'అడిగాను.
    "బ్రతకాలని పించినన్నాళ్ళు బ్రతుకుతాను. ఆ తరవాత దానంతట అదే ముగిసిపోతుంది."
    "అంటే?"
    "అంటే ఏముంది? మనం ప్రయాణిస్తున్న ఈ రైలు మరో రైలుతో డీ కొని ముక్కలై మనకి విముక్తి కలిగించ వచ్చు. పిడుగు పడవచ్చు. యుద్ధం వచ్చి మరో అటంబాంబు పడవచ్చు" అన్నాడు బలదేవ్ సింగ్.
    నేను నవ్వి ఆశ్చర్యంగా అతని ముఖంలోకి చూశాను.
    "మీకు బ్రతకాలని ఉందా ఇంకా?' అన్నాడు.
    "చావాలని పించటం లేదు అప్పుడే" అన్నాను.
    "మీరు అదృష్టవంతులు!"
    "కొంతవరకు."
    "సుఖంగా ఉంటున్నారా మరి?"
    "ఊ."
    "నేను అదృష్ట వంతుడ్నాయినా , సుఖంగా బ్రతకలేను!"
    రాత్రి తొమ్మిది గంట లయింది. భోజనాలు చేసి, మరో కాసేపు పిచ్చ పాటీ మాట్లాడి పడుకున్నాం. తెల్లవారుతుంది. డిల్లీ దగ్గిర పడుతుంది. "డిల్లీ లో ఎక్కడ దిగుతారు." అన్నాడు బలదేవ్ సింగ్.
    "నాకెవరూ తెలియదు" ఎక్కడ దిగాలో ఇంకా ఆలోచించలేదు."
    "నా దగ్గిర దిగండి."
    నార్త్ ఎనిన్యూ లో బలదేవ్ సింగ ఓ రెండు గదులు పోర్షన్ అరవై రూపాయలకు అద్దె కు తీసుకుని ఉంటున్నాడు. అతని ఆహారం వేరు, నా ఆహారం వేరు. నేను మద్రాసు కాంటీన్ లో భోజనం చేస్తున్నాను. నా దగ్గిర ఇంకా అయిదారు వందలున్నాయి. ఆరోజుల్లో డిల్లీ లో వరల్డ్ అగ్రికల్చరల్ ఫెయిర్ పెట్టారు. అందు రష్యా తరపున ఉజ్ బెక్ స్థాన్ నుండి ఒక నాట్య బృందం వారు రోజూ నాట్య ప్రదర్శన ఇస్తున్నారు. అక్కడ చిన్న ఉద్యోగం దొరికింది బలదేవ్ సింగ్ కు.
    నెలరోజులూ రోజూ బలదేవ్ సింగ్ తో ఎగ్జిబిషన్ కి వెళ్ళటం, కాలం దోర్లించటం జరుగుతుంది. కాని అన్ని లక్షల జనంలో ఉన్నా, ఏదో మహారణ్యం లో ఉంటున్నట్లు ఒంటరితనం , ఏదో శూన్యం నాలో ప్రవేశించి సమస్తం ఆక్రమిస్తున్నది.
    ఒకనాడు ఎగ్జిబిషన్ లో భీమేశు కనిపించాడు. అంతదూరంలో ఎరిగి ఉన్న ముఖం కనిపించటం నాకు టానిక్ లా పని చేసింది. వైదేహి కి మగపిల్లవాడు పుట్టాడని చెప్పాడు భీమేశు. మనిషి బాగా చిక్కిపోయిందని, ఆరోగ్యం పూర్తిగా చెడి జంకి పోయిందనీ , ఎప్పుడూ నాకోసం కలవరిస్తున్నదనీ చెప్పాడు. అది శుభవార్తో, అశుభవార్తో నాకు అర్ధం కాలేదు. ఆ క్షణం లో రెక్కలు కట్టుకొని మద్రాసులో వాలా లనిపించింది. ఉన్న డబ్బంతా కలిపితే విమానం టిక్కెట్టు కొంటానికి సరిపోయింది. ఇంక రూపాయి పైన కొద్ది చిల్లర మిగిలింది చేతిలో . విమానం మద్రాసు వచ్చేసరికి మధ్యాహ్నం మూడు గంట లయింది . అయుడున్నర గంటలో వైదేహి దగ్గిరికి జేర్చింది ఆ విమానం. బాగా అవిసి పోయినట్లుంది. వచ్చేటప్పుడు బలదేవ్ సింగ్ కు చెప్పి రాలేదు. నన్ను మోసగాడను కుంటాడెమో! విమానం దిగి, కాఫీ తాగాలని కాంటీన్ లోకి వెడుతుంటే కాలు జారింది. బెణికింది. కొద్ది టిఫిన్ కు, కాఫీకి సరిపోయాయి జేబులోని డబ్బులు. ఒక టాక్సీ ని పిలిచి ఎక్కాను. తేనాం పేటకు వెళ్లాను. వైదేహి లేదు. ఇల్లు తాళం వేసి ఉంది. పక్క పోర్షన్ ఉన్నవాళ్ళ ని అడిగాను. "అమ్మకు జబ్బు చేస్తే జనరల్ హాస్పిటల్ లో జేర్చారు." అని చెప్పి , నోట్లో తాంబూలాన్ని తుపుక్కున ఉమిసి లోపలికి పోయింది ఒక తమిళ వనిత.
    టాక్సీ వాణ్ణి జనరల్ హాస్పిటల్ కి పొమ్మన్నాను. అయిదు గంటలు కావస్తుంది. టాక్సీ వాడు అరవం లో విసుక్కుంటూ "నా టైం అయిపొయింది. డబ్బివ్వండి పోతాను" అంటున్నాడు. నా దగ్గిర పైసా కూడా లేదు. "ఇస్తాను ముందు హాస్పిటల్ దగ్గిరికి పద" అన్నాను. వాడు విసుక్కుంటూ అరవై మైళ్ళ స్పీడు లో నన్ను హాస్పిటల్ గేటు దగ్గిర గిరవాటు పెట్టి "దుడ్డు" అన్నాడు.
    "ఇక్కడే ఉండు. లోపలి నుంచి తెచ్చి ఇస్తాను" అన్నాను.
    "ఉండటానికి వీల్లేదు. ఎంత అయిందో ఇయ్యి! కావాలంటే మరో టాక్సీ పిల్చుకో!" అన్నాడు. వాడికి తెనుగు రాదు. నాకు అరవం రాదు.
    "నా దగ్గిర డబ్బు లేదు. లోపల మా ఆవిడ ఉంది. తెచ్చి ఇస్తాను" అంటూ వాడి తిట్లు వినిపించుకోకుండా లోపలికి వెళ్లాను. "వైదేహి నీ భార్య . పాప నీ బిడ్డ" అని ఎవరో చెవిలో అరుస్తున్నట్ల యింది. కాళ్ళు తడబడ్డాయి. బెణికిన కాలు బాధ పెడుతుంది. ఒళ్ళంతా చెమటతో తడిసింది. పాప ఎలా ఉంటాడో? నాలో రేగుతున్న చిత్రమైన సంక్షోభానికి కారణం మసక మసకగా గోచరిస్తుంది. "ఎంక్వయిరీ రూం" ముందు నిలబడి , "వైదేహి ఎక్కడుంది?' అని అడిగాను.
    "ఏమిటి?' అన్నాడు గుమస్తా.
    "వైదేహీ ఇక్కడుందా?"
    "చూస్తాను. ఒక్క క్షణం" అంటూ రిజిస్టర్ తిరగవేయటం ప్రారంభించాడు. అక్కడ నుంచున్న ఆ రెండు మూడు నిమిషాల్లో మళ్ళీ మోడువోయిన నా జీవితం ఆశలు తొడుగు కొని, కోర్కెల తీవెలు అల్లుకున్తున్నది.
    "రెండో అంతస్తు లో 63 వ నంబరు గది" అన్నాడు గుమస్తా.
    "అదెక్కడుంది?' అని అడిగాను.
    "రెండో అంతస్తు లో" అన్నాడు.
    పైకి వెళ్లి 63 వ నెంబరు గది దగ్గిర ఆగాను. గది ముందు డాక్టరు గారు నుంచుని ఉన్నాడు. అయన ఎవరో నాకు పూర్తిగా తెలుసు. వైదేహిని ఇంట్లో నుంచి మద్రాసు తీసుకు వచ్చిన పెద్ద మనిషి అతను. ఆమె కోసం నాశనమై పోయానని, అలా అయినందుకు తనకు రవ్వంత గూడా చింత లేదని చెప్పేవాడు. పిచ్చివాడిలా తిరిగేవాడు. అతన్ని చూడగానే వైదేహి ఉంటున్న గది అదేనని తెలుసుకున్నాను. డాక్టర్ నన్ను చూసి సాదరంగా నవ్వాడు.
    నేను తలుపుతట్టాను.
    ఒక నర్సు బయటకు వచ్చింది.
    "వైదేహి ని వెంటనే చూడాలను కుంటున్నాను" అన్నాను.
    "వీల్లేదు" అంది.
    "ఎందుకని?"    
    "ఆమెను ఇప్పుడు ఎవరూ చూడటానికి వీల్లేదు. ఆక్సిజన్ పడుతున్నాం. ఏమాత్రం అలసట కలిగినా, ఉద్రేకం వచ్చినా గుండె ఆగిపోతుంది" అంది.
    "ఏం భయం లేదు . నన్ను చూడనివ్వండి. ఆమెను చూడాలనే డిల్లీ నుంచి వచ్చాను" అంటూ తలుపు తోయ్యటానికి ప్రయత్నించాను.
    డాక్టరు గారు నాకు అడ్డం వచ్చి అవతలకి లాగి "సారధీ , నిష్కారణంగా దాన్ని చంపకండి. నాకు జీవితంలో మిగిలిన రవ్వంత ఆశ అర్పి వేయకండి. మిమ్మల్ని చూస్తె దాని గుండె ఆగిపోతుంది. ఇంక నాకు దక్కదు" అంటూ రెండు చేతుల్లోనూ తల దాచుకుని కుళ్ళి కుళ్ళి ఏడవటం మొదలు పెట్టాడు. ఇంక లోపలికి పోవటానికి ప్రయత్నించి లాభం లేదనుకొని, నిరాశ చేసుకున్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS