Previous Page
మనిషి పేజి 27


    "ఏం జబ్బు?' అని అడిగాను.
    డాక్టర్ కళ్ళు తుడుచుకుంటూ "మీరు వెళ్ళినప్పటి నుంచి నలత గానే ఉంటుంది. మండులిస్తే పుచ్చుకునేది కాదు. 'ఈ మందులు నన్ను బ్రతికిస్తా యంటారా? అయినా నేనెందు కోసం ఎవరి కోసం బ్రతకాలి? ' అనేది. 'వైదేహి నాకోసం నువ్వు బ్రతకాలి. మన బిడ్డ కోసం బ్రతకాలి. ఈ పాడు మద్రాసు వదిలి -- అన్నట్టు మాకు మగపిల్ల వాడు పుట్టాడు. మా ఇద్దరి ప్రేమనూ భగవంతుడు ఇలా శాశ్వతం చేయాలను కున్నాడు. మద్రాసు వదిలి పోదాం. నైజాం లో ఎక్కడన్నా మంచి ఊరు చూసుకొని ప్రాక్టీసు పెట్టుకుందాం. సుఖంగా బ్రతకవచ్చు. మన బిడ్డను పెంచి పెద్ద చేసుకుంటూ, వాణ్ణి చూసుకుంటూ శేష జీవితాలు గడుపు కొందాం'-- అన్నాను. మొదట విని నవ్వి ఊరుకునేది. ఆ నవ్వు ఏడుపులా ఉండేది. చివరికి అంగీకరించింది. అంతా సిద్దం చేసుకున్నాం. నా దగ్గిర కాంపౌండ'రు చేసిన కుర్రాడోకడు తాళ్ల గోకవరం లో ప్రాక్టీసు పెట్టాడు. "ముందిక్కడకు రండి, డాక్టరు గారూ. నిదానంగా మంచి ఊరు చూసుకోవచ్చు" అని వ్రాశాడు. మొన్న ఫస్ట్ కి వెళ్లి పోవలిసింది. కాని, అంతలో ముంచుకు వచ్చింది. తుమ్మినప్పుడూ, చీదినప్పుడు కడవలు కడవలు నెత్తురు పడటం మొదలు పెట్టింది. తరవాత ఊరికినే నెత్తురు కారుతుండేది. మనిషి పాలిపోయింది. ఫీట్లు వస్తూ విరిగి పడి పోతుండేది. భయం వేసింది. పది రోజుల క్రితం ఉన్నట్టుండి కొయ్యబారి పోయింది. నాకు పులుసు పోస్తున్నది పోస్తున్నట్లే ఒరిగిపోయింది! హాస్పిటల్ లో జేర్పించాం. మూడో రోజులు తెలివి వచ్చింది. డాక్టర్ ని బ్రతిమి లాడాను , ;ఎలాగైనా బ్రతికించండి-- నా ఇంటికి నిలబెట్టండి' అని. అయిదారు వందలు ఖర్చు పెట్టాను. నన్ను చూసి నవ్వింది. దగ్గిరికి రమ్మంది. మంచం మీద కూర్చోమంది. నా కళ్ళ వెంట నీరు వద్దన్నా పొంగి పొర్లి ప్రవహించటం మొదలు పెట్టింది.అది దాని అమృత హస్తాలతో , నా చెక్కిళ్ళ ను తుడుస్తూ " ఇంక నాకేం భయం లేదు. మీకోసం బ్రతుకుతాను. మీ బిడ్డ కోసం బ్రతుకుతాను. మిగిలిన కాలమంతా మీ పాదాల ముందే పడి ఉంటాను. మీ ఋణం తీర్చుకోకుండా ఎలా మరణిస్తాను డాక్టరు గారూ?' అని నన్ను ఓదార్చింది. డాక్టర్లు కూడా ధైర్యం చెప్పారు. కాని ఇవాళ మళ్ళీ తెలివి తప్పింది. 'నన్ను ఏం చేయదలచు కుందో అది" అని బావురు మంటూ ఏడుస్తూ నన్ను కౌగలించు కున్నాడు డాక్టరు గారు.
    ఇద్దరం కలిసి ముందుకు నడిచి కిందకు దిగాం. నా కళ్ళు బయర్లు కమ్మాయి. కాళ్ళు తెలిపోతున్నాయి. తల తిరిగి పోతున్నది. బెణికిన కాలు విరిగి పోయేలా పటపట లాడుతున్నది , తూలీ పడ్డాను. కళ్ళు మూతలు పడ్డాయి. తెరవాలని పించలేదు. తెలివి ఇంకా తప్పిపోలేదు. తప్పిపోతే బావుండునని కళ్ళు అలాగే మూసుకొని, అలాగే అచేతనంగా పడుకుని, అంధకారం లా కనిపించకుండా పారిపోతున్న భవిష్యత్తు ను వెతుక్కుంటూన్నాను. డాక్టర్ని పిలవటానికి ఈ డాక్టరు ముద్ద అయి, వైదేహి రూపం దాల్చి , సుఖాల కుప్ప లాగా, సృష్టి కి ప్రాణి ని బంధించే జీవశక్తి లాగా ప్రళయట్టహాసం చేశాయి! క్రూరమైన కోర్కెలు నాగులై నన్ను కొరుక్కు తింటున్నాయి. సెగలుచిమ్మే తృష్టలు నన్ను దహించి వేస్తున్నాయి. ఆకాశం విరిగి పడుతుందనే భయము, భూకంపం వచ్చి విముక్తి కలిగిస్తుందనే బాధ నా హృదయం లో మూలుగు తున్నాయి. ఈ జీవన స్రవంతి ప్రవహించి ప్రవహించి ఎన్నో నిమ్నోన్నతాల నదిగమించి ఒకనాడు సాగర సంగమం చెందవలసిందే! ఈ ఇరవై తొమ్మిది వసంతాల సుదీర్ఘ జీవితంలో నూ, ప్రపంచానికి నన్ను కదలనీకుండా కట్టిన బంధం లేదు. కావాలని దరిద్ర్ర్యాన్ని , ప్రమాదాలనీ, అవమానాలను, ఆకలిని, మంటల్ని తెచ్చుకున్నాను.  ప్రతి క్షణం ఏ అమృత మూర్తి కోసం నిరీక్షిస్తూ, ఏ దివ్య రూపాన్ని పోల్చుకుంటూ ఉత్కంట తో, ఉత్సాహంతో ఎదురు చూశానో, ఆమె కరుణించి ముంగిట నిల్చి, నా తలుపు తట్టినప్పుడు ఆమెను తరిమి వేయాలని పించటమా? ఆమె నుంచి పారిపోవాలని పించట మా? పారిపోవటమా? ప్రాణిని జీవితానికి పెనవేసే ఏ అనురాగ బంధాన్ని నేను తిరస్కరించానో, అదే బంధం నన్నిప్పుడు కదలనీయకుండా కట్టి వేస్తున్నది. బ్రతకాలని పిస్తున్నది. వైదేహి వండి వడ్డించిన అన్నం తింటూ చిరకాలం జీవించాలనిపిస్తున్నది. వైదేహి కన్న బిడ్డను ముద్దిడి సేద తీర్చు కోవాలని పిస్తున్నది. ఏ మహా పర్వదినాన అస్తమిస్తున్న అరుణ బాణుడు, పాలిపోయిన నా పెదవుల పై కడసారి చిందిన చిరునవ్వుల హారతిని స్వీకరించి తుది సారిగా దీవించి, దిగంతాల కు తరలి పోదామని ఎదురు చూశానో, ఆ పండుగ రోజు వచ్చినప్పుడు , ఆ అమృత ముహూర్తం ఎదురైనప్పుడు ఎందుకిలా పారిపోతున్నాను? ఎందుకిలా నా పెదిమలు నవ్వలేక వణుకు తున్నాయి? మృత్యువు నుంచి దూరంగా పారిపోవాలని రెక్కలు విరిగిన మనస్సు వెర్రెత్తి పోతున్నది. ఏ అమృత మూర్తి పావులను, పుణ్యాత్ము లను, పతితలను , పతివ్రతలను అదే మందహాసం తో ,అదే ఆదరంతో ఆహ్వానించి , అక్కున జేర్చి విశ్రాంతి నిస్తుందో ఆమె నిప్పుడు అసహ్యించు కుంటున్నాను. ఏ దుర్భర విషాదానికి ద్రవించని 'నా హృదయం, ఏ కఠోర శాపానికి భయపడని నా మనస్సు , ఏ మహాగ్ని గుండం లోను భస్మం కాని నా బ్రతుకు, ఈనాడిలా ఎందుకు అల్పమైన స్పందనకే కరిగిపోతూ ఈ చిరు గాలికే వణికి పోతూ , నిష్కారణంగా భస్మమై పోతున్నదో!
    భగవాన్! ఏ మహార్దాన్ని సాధించటానికి ఈ జగన్నాటకానికి, సూత్రదారుడవై నీవు సృష్టించిన బిడ్డల్ని నీవే హింసిస్తూ , లాలిస్తూ , నవ్వించి, ఏడ్పించి , బ్రతికించి, చంపుతున్నావో, నాకు అర్ధం కాని అంధకారం , ప్రభూ! ఈ విచిత్ర జీవన తరంగిణి ఎందుకిలా ప్రవహిస్తూ ఏ గమ్యాన్ని జేరుతుందో , నీవు గాక ఇంకెవరు భాష్యం చెప్పగలరు/ శ్రుతి తప్పిన ఈ జీవన విపంచి పగిలేవరకు ఎందుకిలా అపశ్రుతులు వర్షించి, పగిలి రాలిపోతున్న ఈ తరుణం లో శ్రుతి సేయమైన అమృత దారాల్ని ఎందుకిలా గుమ్మరిస్తున్నదో, నీవు గాక ఎవరు చెప్పగలరు? బ్రతికిన న్నాళ్ళు ప్రపంచానికి దూరంగా, ప్రాణ స్నేహితులకు దూరంగా , శరీరంలో దాచుకున్న స్వర్గాన్ని సమర్పించిన సౌందర్యానికి దూరంగా మెలిగి, ఈనాడు శిఖరాగ్రం నుంచి రాలిపోతున్న ఈ క్షణాల్లో మళ్ళీ లోకాన్నంతా కౌగలించు కోవాలని , కన్నీటితో నా పాపాన్నీ, శాపాన్నీ క్షాళనం చేసుకోవాలని ఎందుకీ వ్యధిత హృదయం తపిస్తున్నదో నీవు గాక ఇంకెవరు చెప్పగలరు భగవాన్! ఆరిపోతున్న ఈ జీవన జ్యోతి ఎన్నడు ఎవరికీ వెలుగు నిచ్చింది కాదు. మహా సముద్రాల మీదను, మహారణ్యల మీదను చల్లటి వెన్నెల వెల్లువలా కురిపించే  నీ వివేకం యౌవనంతో ఆత్మ హత్య చేసుకునే సౌందర్య వికాసంతో సృష్టి కి ప్రాణం పోసిన నీ విలాసం , పిడికేడు లేని ఈ మానవ హృదయంలో అనంత లోకాలను నిక్షిప్తంగా దాచి, అనంత కోటి అనుభూతులకు నిలయంగా చేసే నీ నైపుణ్యం నాకెలా తెలుస్తాయి , మహా శిల్పి! ఎవరు నీవు?
    నన్ను దీవుస్తున్న ఏలికవా?
    నన్ను శపిస్తున్న పిచాచానివా?
    కన్నీటితో నా చెక్కిళ్ళు తడిశాయి. నాలో కన్నీరు లేదని, ఆ శక్తి నా హృదయానికి లేదని, బహుశా గడిచిన జన్మల లోనేనా కన్నీరంతా పొరలి రాలిపోయిందని నాకు తెలుసు. నా చెక్కిళ్ళ ను తడిపినవి డాక్టర్ గారి కళ్ళు. "పది నిమిషాల్లో వస్తారు డాక్టరు గారు" అంది నర్సు.
    నేను లేచాను. "పడతారు' అంటూ నా భుజం పట్టుకుంది నర్సు. 'అవసరం లేదు. ఏదో తల తిరిగింది కాసేపు. నేను బాగానే ఉన్నాను. మీరు వెళ్ళండి" అంటూ లేచాను. నర్సు వెళ్ళిపోయింది. "సారధీ, ఎక్కడికి వెళుతున్నారు?' అని అడిగాడు డాక్టరు గారు.
    "ఎక్కడికి? అని ఎదురు ప్రశ్న వేశాను. తెల్లబోయి "మీరు వెళ్ళకండి. ఉండండి. రేపు ఉదయానికి వైదేహి తప్పకుండా కళ్ళు తెరుస్తుంది. చూసి వెళ్దురు గాని" అన్నాడు డాక్టరు గారు.
    "వెళతానండీ , పనుంది. వెళ్లాలి " అన్నాను.
    అంతలో గడియారం సాయంత్రం ఏడు గంటలు కొట్టింది. టాక్సీ వాడు గంతులు వేస్తూ, రంకెలు వేస్తూ వచ్చి నా చొక్కా పట్టుకున్నాడు. డాక్టరు గారు నన్ను తప్పించాడు. నాలుగింటి నుంచి డబ్బు లేకుండా టాక్సీ ఎక్కి తిరుగుతున్నావని, తప్పించుకు పోవటానికి చూస్తున్నావని అరవం లో అరుస్తున్నాడు.
    "తప్పించుకు పారిపోవాలని కాదు. నా దగ్గిర డబ్బు లేకపోయింది" అన్నాను.
    "డబ్బు లేకుండా గాడీ ఎలా ఎక్కావ్?" అన్నాడు డ్రైవర్.
    డాక్టరు గారు తన జేబులోంచి తీసి డబ్బిచ్చి పంపారు వాణ్ణి. మిగిలిన నోట్లన్నీ నా జేబులో కుక్కాడు. తిరిగి ఇవ్వబోయాను.
    "ఇది మీ డబ్బే. వైదేహి పేర మీరు బాంకు లో వేసిందే" అన్నాను.
    నేను డబ్బు జేబులో పెట్టుకొని, మరో టాక్సీని పిలుస్తున్నాను.
    "రాత్రి మా ఇంట్లో పడుకోండి" అన్నాడు డాక్టరు గారు.
    క్షమించమని టాక్సీ లో బయలుదేరి స్టేషన్ కి వచ్చాను. మెయిలు సిద్దంగా ఉంది. బెజవాడ టిక్కెట్టు తీసుకున్నాను. నన్ను బెజవాడ తీసుకు పోతున్నది మళ్ళీ రైలు బండి. ఇవాళ ఏప్రిల్ ఇరవై తొమ్మిదో రోజు . నాకు ఇరవై తొమ్మిదేళ్ళు వచ్చాయి. కధలో చివరి రంగంలో చివరి ఘట్ట మేమో ఇది. రైలు పడిపోతుందని అనుకున్నాను. పడిపోలేదు. మామూలుగానే విజయవాడ జేరింది. మెయిలు బండి.
    ఇంతటితో సారధి వ్రాస్తున్న కధ ఆగింది.

                                   (సమాప్తం) 


 Previous Page

WRITERS
PUBLICATIONS