22
ఆ మధుర క్షణాల్ని వర్ణించటం ఎవరి తరం? ఏ ఉపమానంతో, ఏ పదజాలంతో, ఏ శైలితో చెప్పటం ఎవరికి సాధ్యం? ఏదో మధుర వేదన ఘనీభవించి అడ్డు కట్టగా నిలిచి కాల వాహినిని కదలనీయలేదు. ఆమె శరీరం పులకలతో ఎర్రబడి, మనస్సు తత్తర పాటుతో తాండరించింది. ఆకాశం నెలకు కుంగి నట్లుగా, భూమి నింగికి పొంగినట్లుగా, శరీరమంతా కోర్కెల ముద్దగా నూరి, ద్రవించి కాంక్షా స్రవంతి యో ప్రవహించింది! ఆ నిర్మల నీరదాలను పైన ఆకాశం కింద భూమి మాత్రమె కప్పాయి. సౌఖ్య జ్వాలలో ఇద్దరం భస్మమై పోయి అమృతాన్ని తాగి బ్రతికాం. కాలానికీ, లోకానికీ , జీవితానికీ అతీతమైనదా అనుభవం, నరనరాల్లో నయగారాలు ఉద్బవించినట్లు, అణువణువునా సృష్టి ఒదిగి దాగినట్లు, ఒకరి ఆత్మలను ఒకరు శోధించుకొని, సిగ్గును జయించిన చీకటిలో , మృత్యువును అధిగమించిన చైతన్యం లో గతాన్ని, భవిష్యత్తు ను నాశనం చేసి, పెరిగి పెరిగి వర్తమానాన్నంతా ఆక్రమించి, ఆకాశాన్నీ అనంత విశ్వాన్నీ జయించి విశ్వరూపం ధరించి, విశ్వాన్ని కౌగలించు కున్నాం. ఆ నులివెచ్చని కమ్మదనంలో కోటి స్వర్గాలు గూళ్ళు కట్టుకు వెళ్ళాడుతున్నాయని , ఆ వణికిన పెదిమల స్పందనలో అమృతపు ఊటలు చెమర్చినాయని , ఆ కదలిక గుండెల ఉయ్యాల పై నా వ్యధలన్నీ గూడు కట్టుకు నిద్రించాయని , ఇరవై ఎనిమిది వసంతాలు ఎదిగి , ఇన్నాళ్ళు గా అపశ్రుతులు వర్షిస్తూ వికృతానాదం నింపిన ఈ జీవన విపంచి ఈనాడు శ్రుతి పెయంగా మధుర నాదాల నింపిందని , అపూర్వమైనదీ, అనిర్వచనీయ మైనదీ ఏదో జరిగిందని-- ఏమని? ఏమని చెప్పను?
అట్టి క్షణాల్ని ఒక్కసారి అనుభవించాక, మళ్ళీ జీవించ కూడదు. మేఘాల రధం పై నీలాల నింగిలో తేలిపోయిన దురదృష్ట వంతుడు ముళ్ళ కంచే మీద కారుతున్న నెత్తుటిని తుడుచుకుంటూ , గమనాన్ని ఎంతదూరం సాగించగలడు? అలానే అయింది. వద్దన్నా కాలం దొర్లిపోయింది. తెల్లవార బోతూంది.
తుళ్ళి పడింది సుమబాల.
ఏదో అలికిడి అయింది.
ఎవరో మనిషీ! స్త్రీ!
భయం లేదని అదిలించింది. "మా చెల్లెలు ఉషా బాల " అంది.
ఉషాబాల ఒక్క క్షణం నిలబడింది.
"ఫర్వాలేదు, నువ్వు వెళ్ళవే" అంది సుమబాల.
ఉషాబాల వెళ్ళిపోయింది.
"ఇంక వెళ్ళండి" అంది సుమబాల.
"ఎక్కడికి?' అన్నాను.
"ఎక్కడ్నించి వచ్చారో అక్కడికి!"
"మనం విడిపో కూడదు."
"మాట్లాడలేదు ఆమె.
"నిన్ను విడిచి నేనుండలేను."
ఏడ్చింది సుమబాల.
"మనం పెళ్లి చేసుకుందాం!"
"మీరు వెళ్ళండి. నేను ఉత్తరం వ్రాస్తాను."
"ఏం వ్రాస్తావు?'
"మీరు వెళ్ళండి దయ ఉంచి. నా ఉత్తరం చదివితే మీకాన్ని విషయాలు తెలుస్తాయి. వెళ్ళండి. ఏది ఏమైనా నేను మీదాన్ని. నన్ను నలిపి నాశనం చేసే అధికారం మీ ఒక్కరికే ఉంది. నా మాట నమ్మండి."
లోపలకు బరువుగా వెళ్ళిపోయింది సుమబాల. నేను ఆరోజే బయలుదేరి మద్రాసు చేరుకున్నాను.
మాంబళం లో మొదలియారింట్లో నా మకాం. అది దయ్యాల కొంప అని పేరు పడటంతో , అందులో అద్దె కుండటానికి ఎవరూ రావటం లేదు. రోజూ సుమబాల ఉత్తరం కోసం ఎదురు చూస్తున్నాను. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించు కున్నాను. అందుకోసం డబ్బు సంపాయించాలని ఆలోచనలు ప్రారంభించాను. జీవితంలో మొదటి సారిగా జీవితాన్ని గురించిన ఆలోచనలు నాలో మొలకలేత్తాయి. నేను బాగా జోస్యం చెప్పగలనని పేరు ఊరంతా అడవి మంటలా వ్యాపించింది. కోటీశ్వరులైన నాటు కోటు సెట్లు నాకోసం పడిగాపులు పడుతుండే వారు. రెండు నెలలు గడిచినా సుమబాల దగ్గిర నించి ఉత్తరం లేదు. ప్రాణం విసిగి ఆమెకు ఉత్తరం వ్రాశాను.
"నీకోసం బాగా డబ్బు సంపాదించాను. పెళ్లి చేసుకున్నాక , నావల్ల నీకు ఎటువంటి లోటూ కలుగ కూడదని నా ఆలోచన. నీవు మాట నిలబెట్టు కోలేదు. నాకు ఉత్తరం వ్రాయలేదు . నీ జాబు కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో నీకు తెలియదు. ఇంతటి నిరీక్షణ సుఖం కాదు. నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావో, ఈ అలకకు కారణం ఏమిటో ఎంత ఆలోచించినా నాకు తోచటం లేదు. ఈసారి వెంటనే నువ్వు జవాబు వ్రాయకపోతే నేను బయలుదేరి వస్తున్నాను."
ఈ ఉత్తరానికి తిరుగు టపాలో జవాబు వచ్చింది.
"శ్రీ సారధి గారికి,
మీకు అనవసరంగా, అన్యాయంగా లేనిపోని ఆశలు కల్పించి , మమతలు రేపి, అనురాగాలు పెంచి, చివరకు అన్యాయం చేసి పోతున్నాను. ఈ సంవత్సరపు స్నేహంలో కోపంతో, అనురాగంతో, చిలిపితనంతో , లలనతో , ఉద్రేకంతో , అసూయతో, భక్తితో రకరకాలుగా మిమ్మల్ని వేధించి బాధించాను. నా సర్వస్వాన్ని మీకు అర్పితం చేయాలను కున్నాను. కాని నా జీవితం నా చేతుల్లో లేదు. నా మనస్సు బానిసలా మారింది. అందరు నన్ను బంధించి నిప్పుల్లోకి తోస్తున్నారు. రేపు 12 వ తేదీ నా పెళ్లి. సారదీ! సారధి గారూ! నా సారదీ-- మీకు అన్యాయం చేస్తున్నాను. మన్నించండి. నన్ను క్షమించండి.. సర్వదా మీ సుఖమే మీ క్షేమమే మనః స్పూర్తిగా కాంక్షించే అభాగ్యురాలు -- మీ
మీకు కాకుండా పోతున్న
-----సుమబాల.'
సుమబాల ఉత్తరం చదివాక నా కాళ్ళనూ చేతులనూ బంధించిన సంకెళ్ళు విడిపోయినట్టు అనిపించింది. గాలిపటం దారం తెగిం తరువాత ఎంత స్వేచ్చగా ఎగురుతుందో , అంత విశృంఖలంగా మళ్ళీ బ్రతికే అవకాశం దొరికిందని మనస్సు ఉత్సాహంతో ఎగిరి గెంతింది. నాకు తెలుసు, దారం తెగిన గాలిపటం ఎంతో దూరం ఎగర లేదని! ఎగిరి ఎగిరి ఎక్కడో పతనమై రాలి పోతుందని!
ఈలోగా మరో కధ నడిచింది.
నేను ఉంటున్న ఇంటికి ఎదురుగుండా ఒక ఇంట్లో రిటైరైన తాసిల్దారు ఉంటున్నాడు. అయన గాక ఇంకా ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారో నేను గమనించలేదు. ఒకనాడు ఆ ఇంట్లో నించి ఓ స్త్రీ నా గదిలోకి సరాసరి వచ్చి ఏడుస్తూ నుంచుంది. తానొక అభాగ్యురాలినని, ఒక బ్రోకరు తనను ఆ తాసిల్దారు గారికి అమ్మినాడని, ఆ ముసలాయన తన్ని నానా బాధలూ పెడుతున్నాడని చెప్పింది.
"నేను నీకేం సహాయం చేయగలను?" అని అడిగాను.
"ముందు ఈ నరకం లో నుంచి నన్ను బైట పడనీండి . నాకు దోవ చూపెట్టండి" అంది.
ఆ అమ్మాయి పేరు వైదేహి.
ఆనాడే ఆ ఇంటి పెద్ద మనిషితో పోట్లాడి నా గదికి వచ్చింది వైదేహి. ఆకస్మికంగా అలా నా జీవితంలో ప్రవేశించిన స్త్రీ, నా జీవిత గాధలోని ప్రధాన పాత్రల్లో ముఖ్యమైనది ఔతుందని నేనా క్షణంలో అనుకోలేదు. కేవలం జాలి దలిచి, దయతో, చంటి బిడ్డను లాలించినట్లు ఆమెను ఆహ్వానించాను.
పెట్టె తెచ్చి నా గదిలో పెడుతూ "మీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేనండీ" అంది.
వైదేహీ కళ్ళల్లోకి చూశాను. కృతజ్ఞత కరిగి ఆమె కను పాపాల్ని కడిగింది.
"ఈ దయ్యాల కొంపలో ఉండగలవా నువ్వు?'
"నేనే ఒక దయ్యాన్నని సాధించే వాడుగా మా ఇంటాయన " అంటూ సన్నగా నవ్వింది వైదేహి.
ఆనాటి నుంచీ కారేజీ తెప్పించే వాణ్ణి . ఇద్దరం కలిసి భోజనం చేసేవాళ్ళం. ఇల్లంతా నా స్వాధీనం లోనే ఉంది. పక్క గదిలో నిద్రపోయేది వైదేహి. నే నుంటున్న కొంపను చూసి చాలా మంది భయపడేవారు. కాని నాకు ఎన్నడూ ఎలాటి దయ్యమూ కనిపించలేదు. వైదేహి ఆ ఇంట్లో ప్రవేశించిన నాడు ఏదో ఏడుపు వినిపించింది సన్నగా. గడియారం అర్ధ రాత్రి దాటి అరగంట కొట్టింది. కాసేపు వినిపించి దూరమైనట్లు పలచబడి ఏడుపు ఆగిపోయింది.
నాకు కొంచెం అనుమానం కలిగింది. మరునాడు ఉదయం వైదేహి తో , "రాత్రి ఏది ఏడుపు వినిపించింది. బహుశా దయ్యం వచ్చి ఉంటుందేమో" అన్నాను .
వైదేహీ నవ్వుతూ , "నేనే దయ్యాన్నయ్యే. మరో దయ్యం ఏం వస్తుంది ఈ కొంపకు?" అంది.
ఇలా పది రోజులు గడిచాయి. రోజూ ఇలాగే ఏడుపు కాసేపు వినిపించటం -- తరవాత దూరమైనట్లు పలచబడి మాయమై పోవటం జరుగుతుండేది ఒకనాడు దీని అంతు తేల్చు కుందామని నిశ్చయించు కున్నాను. రాత్రి నిద్రపోకుండా కూర్చున్నాను. మళ్ళీ అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఏడుపు వినిపించింది. కొంచెం సేపు అతి జాగ్రత్తగా విన్నాను. గాలో, పిశాచమో -- దాని సంగతి తేల్చు కుందామని లేచాను. శబ్దం దూరమవుతుంది. ఆటే నడిచాను. ఇంకా దూరమైంది. అలాగే ఆ చీకట్లో నడుస్తూ ఆ శబ్దాన్ని వెంబడించాను. అది దొడ్లో కి పోయి నూతి దగ్గర ఆగింది. నూతి కేసి కళ్ళు పొడుచుకొని చూశాను. ఒక స్త్రీ మూర్తి నీడలా కనిపించింది. నా ఒళ్ళు క్షణకాలం జలదరించింది. దగ్గిరికి వెళ్లాను.' "ఎవరు నువ్వు?' అని గర్జించాను.
ఆ స్త్రీ మూర్తి ఒక్కసారిగా తుఫాను లా నా మీదికి కోరిగింది. నేను పెనుగులాడుతూ ఆమెను గుర్తు పట్టాను.
ఆమె వైదేహి.
"ఎందు కేడుస్తున్నావ్?" అడిగాను.
"చావటానికి ధైర్యం లేదని" అంది.
ఆమెను లోపలికి తెచ్చి , మంచం మీద పడుకో బెట్టాను. నన్ను బల్లిలా పసిపిల్ల లాగా కరుచుకుంది, కదలనీయ కుండా , ఊపిరి ఆడకుండా.
"కదలకండి. నన్ను వదిలి వెళ్ళిపోకండి. నాకేదో భయంగా ఉంది" అంది వెక్కి వెక్కి ఏడ్చింది.
ఆమె కన్నీరు నన్ను బానిసని చేసింది.
ఆ చీకటి, ఆ ఏకాంతం , స్వర్గాన్ని ఎరుగున్న శరీరాలు, నులివెచ్చని కమ్మదనం లోని మత్తు మా ఇద్ద్దరినీ ఏకం చేశాయి. జరగకూడనిది జరిగిపోయింది. ఆకాశం వంగి వంగి విరిగిపోయింది. భూమి ఎండి ఎండి భస్మమై పోయింది. కరిగిపోయిన యౌవనంతో మలినమైన సౌన్దరుం లాగా, వైదేహి రేగిన కురులతో , కమిలిన చెక్కిళ్ళ తో , తడిసి మూతబడిన కను దోయితో , అణు మాత్రం చిట్లి తియ్యని బాధను చెమర్చే పెదిమలతో , కొలది పాటి తెరుచుకున్న నోటితో , విశృంఖలంగా చెదిరిపోయిన వేణీ భారంతో, వాడి దీనంగా చూస్తున్న చేమంతులతో , క్రమం తప్పిన దుప్పటి మీద సృష్టి తనకిచ్చిన బాధ్యతను , శరీరం తనను పెట్టిన బాధను-- వదిలించు కున్నాననే పరిపూర్ణమైన తృప్తి తో విశ్రాంతి తీసుకుంటున్న స్త్రీ మూర్తి, వైదేహి దేవతలా కనిపించింది. చేయరాని నేరాన్ని చేసినట్లు, క్షమించరాని పాపాన్ని ఒంటికి పులుము కున్నట్లు, కావాలని సంకెళ్ళు తగిలించు కున్నట్టు, హృదయం లో ఉష్ణ రుదిరంతో పాటు వెల్లువై ప్రవహించే అనురాగ వాహినికి , మానవతా లాలనకు బానిసనైనట్లు; నాపై నాకే తెలియని ద్వేషం, జుగుప్స , అసూయ, జాలి , అసహ్యం విజ్రుంభించి , పాపానికి దూరంగా పోలేక , పాప కారణ మైన స్త్రీ కి దూరంగా , శాశ్వతంగా వెళ్లి పోవాలని నిశ్చయించు కున్నాను.
మూన్ లైటు బల్బు నీలి కాంతుల్ని ఆమె శరీరం పై తెరలు తెరలుగా జారుస్తున్నది. ఆమె మంచం ప్రక్కనే కుర్చీలో కూలబడి, సడలిపోయిన జీవన మాధుర్యపు మత్తులో ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమెను తదేకంగా చూస్తూ కళ్ళు తుడుచుకున్నాను.
కనురెప్పలు పొడిపొడిగా చేతికి తగిలాయి. హృదయం లో నిక్షిప్తం దాగి ఒకోసారి రేగుతూ సంక్షోభంతో నన్ను ఊపుతున్న విషాద నీరదాలు ఎందుకు పొరలి రావో, కనుల నుండి కారి ఎందుకు నేల రాలవో, ఎందుకు విముక్తి కలిగించవో నాకు తెలియదు.
గడియారం మూడు గంటలు కొట్టింది. మత్తు పొర ఇంకా వైదేహి ని వదల్లేదు. ఆమెను చూడటానికి భయం వేసింది. తెల్లవారుతుంది. ఆమెతో ఎలా మాట్లాడాలో ఊహ కందని సంగతి.
లేచాను. సూటు కేసు సర్దుకున్నాను. బయలుదేరాను, హంతకుని లాగా అడుగులో అడుగు వేసుకుంటూ.
"నన్ను మోసం చేయకు, సారదీ!" అంది వైదేహి.
పట్టుబడ్డ దొంగలాగా ఆగాను.
పట్టుబడలేదు.
వైదేహి నిద్రలో కలవరిస్తున్నది. 'నిన్ను మోసం చేస్తున్నావో లేక నన్ను నేనే మోసం చేసుకుంటున్నానో ఎలా చెప్పను, వైదేహీ?' అనుకున్నాను. సందు చివరి దాకా నడిచి అటో రిక్షా లో సెంట్రల్ స్టేషన్ లో పడ్డాను. డిల్లీ ఎక్స్ ప్రెస్ రెడీగా ఉంది. నాకు తెలియకుండానే నన్ను భారత రాజధానికి జేర వేస్తున్నదా పోగల బండి. ఎందుకోసం మద్రాసు వదిలి పెట్టావో, ఎందుకోసం ఒకనాడు విజయవాడ ను వదిలి పెట్టానో, మళ్ళీ ఈనాడు ఏ మహార్ధం కోసం ఉత్తర భారతానికి-- తెలుగు దేశాన్ని వదిలి, వందలాది మైళ్ళు ప్రయాణం చేసి తరలి పోతున్నానో ! ఇంక మిగిలిన ఒక్క సంవత్సరం లో ఇంకెన్ని పాపాలు చేయాబోతున్నానో ఆలోచిస్తూ, వద్దన్నా చిగురిస్తున్న ఆశలను నలిపి నాశనం చేస్తూ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం చేస్తున్నాను.
నా ప్రయాణం ఎలా అర్ధ హీనమైనదో, నా జీవన యాత్ర కూడా అలాగే శుష్క వ్యాపారం లా కనిపించింది.
