Previous Page Next Page 
దీప శిఖ పేజి 25


                                 10
    అన్నయ్య రాసిన ఉత్తరం చూసి విద్యుద్ఘాతం తగిలినట్టు అట్లాగే మ్రాన్పడి ఉండిపోయాడు గోపాలం , విజయా వితంతువా!....రామనాధం గారి సీల్డు కవరులో ఆ సంగతి ఉందా?.....అయినా ఆ కవరు అన్నయ్య కి ఎలా అందింది?....అది తను ఏదో పుస్తకం లో ....ఆ ...భక్త చింతామణి లో భద్రంగా దాచాడు కదూ? ...ఓహో! అర్ధం అయింది . ఆ పుస్తకం తను అన్నయ్య సంచిలో పెట్టినప్పుడు దాని సంగతి జ్ఞాపకం లేదు. అందుకే ఆ పుస్తకం తో పాటు కవరు కూడా అన్నయ్య దగ్గరికి చేరింది------
    సరే-- ఏదో ఒకటి అయింది?
    ఇప్పుడేమిటి .?.....
    విజయ బాల వితంతువయితే తన కర్తవ్యం ఏమిటి? అమెను వివాహం చేసుకోవడమా, మానడమా.....చేసుకున్నట్లయి తే అన్నయ్య రాసినట్లు ఈనాటితో తనకి అన్నయ్య తో ఉన్న సర్వ సంబంధాలు తెగిపోతాయి. తన ముఖం ఇంక ఈ జన్మలో సనాతనపరాయణుడైన అన్నయ్య, చూడడనేది మాత్రం తధ్యం. తను అన్నయ్య ని కాదని "లా" చదవడం, గృహ ప్రవెశానికీ వెళ్ళాక పోవడం, శేషయ్య తరపున వకాల్తా నామా పడెయ్యడానికి అంగీకరించకపోవడం వీటితో అసలే అన్నయ్య తో అంతంత మాత్రంగా ఉన్న తన అనుబంధం, ఈ దెబ్బతో పూర్తిగా విచ్చిన్నం అయిపోతుంది....ఆ ...సందేహం లేదు.
    మరయితే ఏవిటి చెయ్యడం?
    విజయ ని పెళ్లి చేసుకొనడం మానేస్తే ? తననే నమ్ముకుని ఉన్న ఆమెని, ఇవాళ వితంతువని తెలిసిన కారణంగా , అన్నయ్య తో విరోధం వస్తుందనే భయంతో వదిలెయ్యడం న్యాయమే! రామనాధం గారికి తను ఇచ్చిన మాట ఏం గాను.....?... ఇన్నాళ్ళూ సంస్కరణ గురించి నచ్చ చెప్పి తను ఇవాళ తన దగ్గరికి వచ్చేసరికి జంకిపోయి వెనకడుగు వేస్తె అంతకంటే నీచమైన పని ఇంకేమైనా ఉంటుందా ?....అవన్నీ అలా వుంచి తను విజయ ని పెళ్లి చేసుకోకుండా ఉండగలడా అని?.....ఇన్నాళ్ళూ ఆమెనే మనసారా ప్రేమించి, ఆమె కోసమే ఇన్ని రోజులు నుండి వేచి యున్న తాను, ఆమెను కాకుండా ఇంకొకళ్ళ ని పెళ్లి చేసుకో గలడా? తను విజయని మరిచి పోగలడా? అసలది ఎలా సంభవం ? అయినా తను ఇలా ఆటా ఇటా అంటూ సందేహిస్తున్నాడేవిటి? విజయ మీద తనకి స్థిరమైన ప్రేమ ఏర్పడలేదా? ఇందుకేనా రామనాధం గారు ముప్పయి ఏళ్ళు వచ్చి ఆలోచనలూ అభిప్రాయాలూ స్థిర పడేదాకా ఆగమన్నది? కాదు-- తన ప్రేమ స్థిరమైందే- అవును -- చాలా రోజుల నుంచి, "వెళ్లి పలకరించకుండా ఇప్పటికే తను విజయ మనస్సు ని చాలా క్షోభ పెట్టాడు. ముందు ఆమె ఎంతో బాధపడుతూ ఉంటుంది. డానికి తోడు తను వివాహం చేసుకోనని తెలుస్తే యింకేమైనా ఉందా? హృదయం బ్రద్దలయి పోయి కుప్పకూలి పోదూ?...విజయ -- తన విజయ జీవితం క్రుంగి పొతే తను చూడగలడా....అందులో తను కారణంగా ?....విజయ లేకుండా తను మాత్రం బ్రతక గలడా?....ఉహు.....ఒక్కనాటికి అలా జరగదు.తను విజయని వాదులు కోలేడు..ఏమైనా విజయ నే..విజయ నే....పెళ్లి చేసుకుంటాడు.....ఆవును అదే తన నిర్ణయం .........ఆ నిర్ణయం విజయ కి చెప్పాలి. ఇప్పుడే చెప్పాలి. ఔను ఇప్పుడే చెప్పాలి --" ఇలా అనుకుని రూమ్ కి తాళం వేసి వెంటనే  బయలుదేరాడు గోపాలం.
    వీధి గేటు తలుపులూ అన్నీ బార్లా తీసి వున్నాయి. ఇంట్లో ఎవరూ ఉన్న అలికిడి వినిపించడం లేదు. నెమ్మదిగా హాల్లోకి అడుగు పెట్టాడు గోపాలం . సోఫాలూ, కుర్చీలు నిస్సహాయంగా అతని కేసి చూశాయి . వంటింట్లో కూడా విజయ వున్న అలికిడి వినిపించడం లేదు. నిశ్శబ్దంగా వున్న ఆ హల్లో నిలబడడానికి గోపాలానికి భయం వేసింది. విజయ ఏమైంది........తలుపులన్నీ బార్లా తీసేసి ఎక్కడికి వెళ్ళింది?....కాస్సేపు ఏం తోచక అలాగే వుండిపోయి , ఆ తర్వాత హాలు దాటి ఇవతలికి అడుగు పెట్టబోతున్న గోపాలానికి పక్క గదిలో ఎవరో నిశ్శబ్దంగా ఏడుస్తున్న ధ్వని సన్నగా వినిపించింది , చెవి ఆన్చి విన్నాడు అవును!... సందేహం లేదు.
    గదిలోకి అడుగు పెట్టాడు.
    మంచం మీద బోర్లా పడుకుని తలగడా ;లో మొహం దూర్చి ఎక్కెక్కి ఏడుస్తోంది విజయ.
    ఆ స్థితిలో ఆమెను చూసేసరికి గోపాలం హృదయం ద్రవించి పోయింది. అతనికి కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. గొంతు కంతా నెప్పిగా అయిపోయి చాలాసేపటి వరకూ నోట్లోంచి మాట రాలేదు. అతి ప్రయత్నం మీద గుటక వేసి నెమ్మదిగా "విజయా" అని పిలిచాడు గోపాలం.
    ఉలిక్కిపడి తల యెత్తి చూసి వెంటనే తిరిగి తలగడ లో మొహం దాచేసుకుని బిగ్గరగా ఏడవసాగింది విజయ . గోపాలానికి ఏం అర్ధం కాలేదు. ఇంకొంచెం దగ్గరికి వెళ్లి "విజయా! ఎందుకు బాధ పడుతున్నావు?' అంటూ సానునయంగా పలకరించాడు గోపాలం.
    సమాధానం లేదు.
    ఆరోజున తనతో విజయ అలా నిష్టూరంగా మాట్లాడిన తర్వాత, తను విజయ దగ్గరికి రావడం ఇదే ప్రధమం. ఇన్నాళ్ళ నుంచి తను ఇటు రాలేదు. విజయని పలకరించలేదు. అందుకేనేమో విజయ బాధ పడుతుంట!... మరి ఇప్పుడు తను వచ్చాడు కదా -- ఇంకా విచారించడం దేనికి?....వచ్చినా వివాహం చేసుకొనే ఉద్దేశం తో వచ్చాడో లేదా ఇంకా ఒకటి రెండేళ్ళు ఆగాలి అని గడువు పెట్టడానికి వచ్చేడో-- ఆమెకి ఎలా తెలుస్తుంది ?.... అవును, ఇంతకీ వివాహ సమస్య ని అపరిష్కృతం గా ఉంచడానికి వీలులేదు. అందువల్ల విజయ కి భయ సందేహాలు ఎక్కువై మరింత మానసిక వేదన కలుగుతోంది -- అందులో ఆమె బాల వితంతువ ని తెలిశాక అసలు ఉదాసీనం వహించకూడదు , అనక ఎటు నుంచి ఎటు వస్తుందో ?....ముందు వివాహం అయిపోవడం మంచిది. మొదట పెళ్ళంటూ అయిపోతే ఆ తర్వాత ఎవరికి ఏ సంగతి తెలిసినా ఫరవాలేదు. అందుకే విజయతో మాట్లాడి ఇప్పుడే పెళ్లి విషయం స్థిరం చేస్తాను. రామనాధం గారికి మాట ఇచ్చిన దాని కంటే ఒకటి రెండేళ్ళు ముందు విజయ ని తను పెళ్లి చేసుకుంటాడు -- అవును-- ఏం?.... చేసుకుంటే ?.....
    ఇలా అనుకుని ఆవేశాల అదుపు తో పూడుకు పోయిన గొంతుని సంభాళించుకొని "విజయా!....ఇటు చూడు....నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడటానికి వచ్చాను" అన్నాడు గోపాలం--
    విజయ తల ఎత్తకుండా అలా మౌనంగా ఏడుస్తూనే ఉంది.
    "నిన్నే విజయా!" అన్నాడు గోపాలం బాధగా -- గోపాలం కంఠం లో వినిపించిన ఆవేదన స్పందన కి తలఎత్తి చూసింది విజయ.
    "ఎందుకలా విచారిస్తావు ?...ఏం జరిగిందని?' అన్నాడు గోపాలం.
    విజయ సమాధానం ఏం చెప్పలేదు, శూన్యంగా చూస్తూ ఊరుకుంది.
    "ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా?' అని నవ్వుతూ ఒక్క క్షణం ఆగి " ఆరోజున నువ్వు ఎన్నాళ్ళ అండీ ఈ నిరీక్షణ అంటూ అడిగావు జ్ఞాపకం ఉందా ?....ఇప్పుడు మన వివాహం జరగడానికి ఏవిటి అభ్యంతరం అంటూ విసుక్కున్నావు కూడా. ఇంకా నిరీక్షించవలసిన అవసరం కాని, విసుక్కోవలసిన అగత్యం కాని లేదని చెప్పడానికే నేను వచ్చాను" అన్నాడు గోపాలం.
    అతని మాటల్లో అర్ధాన్నీ అంతర్యాన్నీ గ్రహించలేక గుడ్లప్పగించి చూస్తూ వుండి పోయింది విజయ. తెరిచిన ఆ కళ్ళల్లోంచి ధారగా కారి బుగ్గల మించి జారిపోతున్నాయి కన్నీళ్లు.
    "కన్నీళ్లు తుడుచుకొని స్థిమిత పడు. మన వివాహం విషయం మాట్లాడుకుందాం" అన్నాడు గోపాలం నవ్వుతూ.
    విజయ కన్నీళ్లు తుడుచుకోలేదు. అతని మాటలు వినడం పట్ల ఆసక్తి కనపరచ లేదు.
    తన మాటలు విని ఎంతో ఉత్సాహం గా లేచి కూచుంటుందని ఆశించాడెమో అలా ఏం జరక్క పోవడంతో నిరుత్సాహ పడ్డాడు గోపాలం.
    కొంచెం సేపు ఒకరి కేసి ఇంకొకరు చూస్తూ ఇద్దరూ మౌనంగా వుండి పోయారు.
    "విజయా! మన పెళ్ళికి ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటావు?" అన్నాడు గోపాలం.
    విజయ ఏం జవాబు ఇయ్యలేదు.
    "నిన్నే విజయా!....ఈ నెలలో పెట్టించనా?"
    విజయ తల అడ్డంగా ఊపింది.
    "మరెప్పుడు పెట్టించమంటావు."
    "అసలు మన వివాహమే వద్దు. "అంది దృడంగా ఒక నిశ్చయానికి వచ్చిన కంఠం తో.
    గోపాలం అదిరి పడ్డాడు.
    "ఏవిటి విజయా నువ్వు అంటున్నది."
    "పెళ్లి విషయం ఎత్తవద్దు అంటున్నాను" అంది లోపల నించి కెరటాలు కెరటాలు గా వస్తూన్న దుఃఖాన్ని అతిప్రయత్నం మీద ఆపుకొని పైకి ఎంతో తాపీగా ఉన్నట్లు ప్రవర్తిస్తూ.
    "ఏం?....ఓహో!....ఇన్నాళ్ళూ నేను వాయిదా వేస్తూ వచ్చానని కోపం కాబోలు !....అలా వాయిదా వెయ్యడానికి ఓ కారణం వుంది"
    "ఆ కారణం ఏమిటో ఇప్పుడు తెలిసింది " అంది నీళ్ళు నిండిన కళ్ళు, గోపాలానికి కనిపించకుండా ,ముఖం పక్కకు తిప్పుకుంటూ.
    "నీకు తెలిసిందా!" ఒక్క అరుపు అరిచాడు గోపాలం. విజయేం జవాబు చెప్పలేడు ముని వేళ్ళతో కింది పెదిమ నొక్కుకుని వచ్చే దుఃఖాన్ని అతి ప్రయత్నం మీద ఆపుకుంటూ , ముఖం పక్కకి తిప్పుకొని ఉండిపోయింది అలాగే.
    వెంటనే గోపాలం సర్దుకుని "సరే, అయిందేదో అయింది. ఇంకా ఆలశ్యం ఎందుకు ?....ఈ నెలలోనే మన వివాహం జరిగేలాగ ఏర్పాటు చేస్తాను , ఏమంటావు ." అన్నాడు.
    "అసలు పెళ్ళే వద్దు " అంది విజయ దృడ స్వరంతో.
    "ఏం? ఎందుకని ?....ఏ కారణం వల్ల వద్దు అంటున్నావు?"
    "మీరు ఏ కారణం వల్ల అయితే ఇన్నాళ్ళూ ఆలశ్యం చేస్తూ వాయిదా వేస్తూ వచ్చారో ఆ కారణం వల్లే నేనూ ఇవాళ వద్దు అంటున్నాను .
    "విజయా!"
    "ఆవేశ పడకండి. మీరిన్నాళ్ళూ ఎందుకు అనుమానిస్తూ వచ్చారో నాకు ఇవాళ తెలిసింది. కాని ఈ రహస్యాన్ని మీ హృదయం లోనే దాచుకుని నాకు తెలియపరచకుండా ఇన్నాళ్ళ నుంచీ జీవిత సౌధానికి నేను నిచ్చెనలు వేసుకుంటూ అమాయికంగా ఆనందిస్తు ఉంటె ఎందుకూరుకున్నారు? ఆ రోజునే విజయా ఇదీ సంగతి అంటే నేనిన్ని ఆకాశ హర్మ్యాలు నిర్మించుకోక పోదునే?....నేనివాళ ఇంత నిరాశతో కుంగి పోక పోదునే ?....నన్నెందు కింత మోసం చేశారు మీరు ?"
    "నిన్నా ...మోసం చేశానా?....ఏవిటిది విజయా?"
    అవును ఇప్పుడే అర్ధం అయింది నాకు జీవితం అనే సౌధానికి పైన కప్పూ కింద పునాది లేదని"
    "ఎందుకింత నిస్పృహ విజయా! ...ఇప్పుడే మైందని ?" అంటూ దగ్గరగా వచ్చి అనునాయంగా తల నిముర బోయాడు .
    "ఉండండి నన్ను తాకకండి."
    గోపాలం ఆమె మాట వినిపించు కోకుండా నుదుటి మీద చిందర వందర గా పడి ఉన్న ముంగురుల్ని సర్దాడు. అతని స్పర్శ లోని అనురానుభూతి కి వివశ యై అరమోడ్పు కన్నులతో ఒక్క క్షణకాలం తనని తాను మరిచిపోయి నిశ్చలంగా ఉండిపోయింది విజయ. ఆ వెంటనే ఆనందాల లోకం నుంచి ఉలిక్కిపడి లేచి అతని చేతిని మృదువుగా తీసేస్తూ "ఈ ఆనందాన్ని అందుకోలేని ఆభాగ్యురాలిని నేను" అంది దుఃఖంతో పూడుకు పోయిన కంఠం తో --


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS