Previous Page Next Page 
ధర్మ చక్రం పేజి 25


                                  29

                 
    ఆదమరిచి నిద్రిస్తున్న నారాయణస్వామి అడిరిపాటుతో లేచాడు. తనను పట్టి కుదిపి వేస్తూ నిద్ర లేవగోడుతున్న గౌతమ్ ను చూచి కొన్ని నిమిషాల పాటు కొయ్యబారి పోయాడు. అనేక భావాల ఆవేశంతో గౌతమ్ కు మాటలు కరువయ్యాయి.
    'శర్మా!'
    "గౌతమ్!"
    ఇద్దరూ ఒకరినొకరు కౌగలించుకుని అమాయకంగా, అబలలుగా విలపించారు.
    "ఏమిటి గౌతమ్? ఏమిటీ దారుణం? జైలు నుంచి పారిపోయి వచ్చావా?' కొంత సంబాళించుకున్నాక ప్రశ్నించాడు నారాయణ స్వామి.
    "అవును. ఎన్నో కారణాలున్నాయి. ముందిది చెప్పు. ధర్మారావు నా కొడుకేనా?"    
    "..........."
    "చెప్పు, శర్మా త్వరగా చెప్పు. నా చెవులలో అమృతం పొయ్యి. ఆ ఉత్తముడు నా కుమారుడే నని చెప్పు." నారాయణ స్వామిని పట్టి ఆవేశంతో కుదుపి వేశాడు గౌతమ్.
    "అవును. నీ కుమారుడే."
    "శర్మా! శర్మా! " పట్టరాని ఆనందంతో చుట్టి వేశాడు గౌతమ్. "ఏమైపోయారో , ఇక నావారు లేరేమోనని నిరాశ చేసుకొని జీవచ్చవం లా బతుకుతున్న నాకు తిరిగి జీవితం పై ఆశా, కోరికా చిగురించాయి, శర్మా. నీ ఋణం ఎలా తీర్చుకోను?"
    కొద్దిసేపటి కి అన్నాడు నారాయణ స్వామి! "సరే, ఎలానూ వచ్చావు, కూర్చో . చెబుతాను, స్థిమితంగా.
    ఇద్దరూ కూర్చున్నారు. నారాయణ స్వామి చెప్పసాగాడు.
    "నువ్వూ తరచూ జైలు నుంచి పారిపోయి వస్తుంటే ప్రమాదమని ఇక మా జాడ నీకు తెలియకుండా జాగ్రత్త పడ్డాను. ఇక్కడ ఈ అనాధ శరణాలయం స్థాపించి, నారాయణ సారధి  గా పేరు మార్చుకుని ధనికుడు లాగా నటించడం మొదలు పెట్టాను."
    "నారాయణ స్వామి కదూ?" అడిగాడు గౌతమ్.
    నవ్వాడు నారాయణ స్వామి. "అది నీ కుమారుడు పెట్టిన పేరు. నోరు తిరగక 'నారాయణ స్వామి' అనేవాడు. అదే సార్ధక మయింది."
    గౌతమ్ నేత్రాలు అశ్రుసిక్త మయినాయి. "ఇంత ప్రేమగా పెంచుకు వచ్చావా నా కుమారుడిని? నీ ఋణం ఎలా తీర్చుకోను , శర్మా? మరి నీవు వివాహం చేసుకోలేదా?"
    "లేదు, గౌతమ్." నిట్టూర్చాడు నారాయణ స్వామీ. "ఒక దేశం కోసం, ఒక న్యాయం కోసం వ్యక్తీ సుఖాలను విస్మరించాలి మరి! నీ భార్యనూ, కుమారుడి నీ అజ్ఞాతం గా ఉంచి రక్షించాలి. నీవు దేశ ద్రోహివి కావనీ, దేశ భక్తుడి వనీ ఏనాటి కైనా నిరూపించాలి. ఇదే నా దీక్ష. అందువల్ల సంసార జంజాటం లో పడలేదు."
    భారంగా -- విశ్వసించాడు గౌతమ్.- "దైవం ఎందుకిలా పగపట్టాడు, శర్మా, మన పైన? చూడగా అన్యాయానికే సుఖం ఎక్కువను కుంటాను."
    "నిజమే, గౌతమ్. అనాది నుండీ అన్యాయానికే, బలం , సుఖం . న్యాయానికి లభించేది విశిష్టమైన ఆదరణా, మనశ్శాంతి మాత్రమె. కాని ఎప్పటి కైనా గౌరవమూ, గుర్తింపూ నీతి న్యాయాలకే కదా?"
    "అవును. త్వరగా చెప్పు."    
    "చెప్పడాని కేముంది? నిన్ను జైలులో ఉంచిన అనంతరం ఇది ప్రారంభించాను. ప్రారంభించిన కొన్నాళ్ళ కు ధర్మారావు ను, ఎక్కడో దొరికిన అనాధ బాలుడుగా తెచ్చి చేర్చాను. మరి కొంత కాలానికే ఎవరో అనాధ లాగా రాజ్యలక్ష్మీ గారు వచ్చి సేవికగా కుదిరారు. అలాగే అష్ట కష్టాలు పడి నెట్టు కొచ్చాను, కేవలం ధర్మారావు కోసం. బుద్ది మంతుడు. చెప్పినట్టు విన్నాడు. ఎమ్. ఏ పాసయ్యాడు. వెంటనే ఈ ఉద్యోగం వేయించాను. నువ్వెక్కడున్నా, ఎలా ఉన్నా పిల్లవాడి భవిష్యత్తు ఇంత బాగున్నదంటే మరి, నీ న్యాయ మార్గం వల్లనే కదా?"
    దీర్ఘంగా ఆలోచిస్తూ తల పంకించాడు గౌతమ్.
    "ధర్మారావు మీద ప్రత్యెక శ్రద్ధ చూపుతున్నట్టు ఎవ్వరూ పసి గట్టకుండా అందరికీ చదువులు చెప్పించడానికి-- ఒకటేమిటి, అన్ని విషయాల లోనూ ఎంతో క్లిష్ట సమస్యలతో బాధపడ్డాను. అయితేనేం? ఫలితం దక్కింది. అదే పదివేలు."    
    "ధర్మారావు కు నేను తండ్రినని తెలియదా? ఏమీ చెప్పలేదా?"
    "లేదు. నీవు తండ్రి వనీ తెలియదు; తల్లి కూడా తెలియదు. నీలాగే అతడిదీ కొంత తొందర స్వభావం. ఆవేశాన్ని అణుచుకోలేడు. అందుచేత అనువైన సమయం కోసం నిరీక్షిస్తూ ఎప్పటికప్పుడు విషయాన్ని గోప్యంగానే ఉంచుతున్నాను."
    "అయితే ధర్మారావు ను ఆ జైలు కే ఉద్యోగానికి పంపడం లో అర్ధం ఏమిటి?"
    "ఏమీ లేదు. పెద్ద పధకం వేసి ఈ పని చేయలేదు. ఇలా దూరంగా ఉంటె దూరంగానే ఉంటున్నాము. సమస్య కు పరిష్కారం లేదు. నిన్ను చూచే అవకాశమూ ఉండడం లేదు. అందువల్ల ఒకచోటే అయితే, మనిషి మనిషి  అండగా ఉండవచ్చు. ధర్మారావు అధికారులతో పరిచయం ఉంటుంది. అదీకాక అతడి స్వభావానికీ, ఇటువంటి ఉద్యోగానికీ సరిపడుతుంది."
    "అదే ఇప్పుడు కొంప ముంచింది.' ఆవేశంగా అరిచాడు గౌతమ్.
    "ఏమిటి? ఏం జరిగింది?" అయోమయంగా ప్రశ్నించాడు నారాయణస్వామి.
    "ఆ సత్య సుయోధన్ కూతురు."
    "అయితే?"
    "అంతటి క్లిష్ట దశలోనూ గౌతమ్ వదనం లో హాస చంద్రికలు వెలుగొందాయి. "సత్యాదేవీ, ధర్మారావు స్నేహితులు, ప్రేమికులూ అయ్యారు!' అన్నాడు.
    నారాయణ స్వామి కూడా చిరునవ్వు నవ్వాడు. "అవునట. విన్నాను. అయితేనేం? సత్యాదేవి చాలా ఉత్తమురాలట. తండ్రి గుణాలు లేవట. తండ్రి దగ్గర పెరగనే లెదట. పినతండ్రి ఇంట్లో గదా, ఉంటున్నది?"
    'అంతమాత్రాన తండ్రి అధికారం ఉండదా? విషయం అతడి వరకూ వెళ్లి ధర్మారావు పుట్టు పూర్వోత్తరాలూ అరా తీస్తున్నాడట."
    వెర్రి గుడ్లు పడిపోయాయి నారాయణ స్వామికి.
    "వార్డెను, కాంట్రాక్టరు -- ఇద్దరూ నాయనా, భయానా ధర్మారావు ను బెదిరించి చూశారు. ఇక వాళ్ళ ఆటలు సాగకపోయేసరికి పోయి సుయోధన్ ను శరణు చోచారుట. ధర్మారావుకు ఎప్పుడేమి ముప్పు వాటిల్లు తుందో తెలియదు."
    "అయితే ఈ విషయం చెప్పడానికే వచ్చావా?చాలా మంచి పనే చేశావు. లేకుంటే నాకింకా ఈ విషయాలన్నీ తెలిసేవి కావు."
    "సరే. వెంటనే వెళ్లి ధర్మారావు ను హెచ్చరించు. విషయాలన్నీ చెప్పి వేయవలసిన అవసరం ఆసన్న మాయిందను కుంటాను మరి నే వెళ్తాను."
    "ఎక్కడికి?"
    ఒక్కసారి ఇద్దరి కళ్ళూ కలిశాయి. ఎన్నో భావాలు, ఏవో మూగ బాధలు!
    "ఎక్కడికని చెప్పను , శర్మా?' లోకం లోని బాధ దైన్యాలన్నీ మేళవించి పలికింది ఆ గొంతు. "విజయనికో, వీర స్వర్గానికో పోతున్నాను. రెండు ముఖ్యమైన వార్తలు చదివాను, నాలుగు రోజుల క్రితం పత్రికలో. స్వర్ణ గంగా నది లో విపరీతంగా పేరుకొన్న ఇసుక మేటలను తవ్వుతుండగా , సైనికాధి కారులు ఉపయోగించే పుల్ ప్రూప్ రికార్డు సూట్ కేసు ఒకటి దొరికిందిట. అది వెనుకటి యుద్ద సమయం లోని దని నిపుణుల చె గుర్తించ బడిందని , పై అధికారులకు పంపే టందుకు అక్కడ ఇంజనీరు ఆఫీసులో ఉంచినది తెల్లవారే సరికి మాయమయిందనీ దర్యాప్తు జరుగుతున్నదని వార్త."
    ఊపిరి బిగబట్టి , చెవులు దొరగించి వింటున్నాడు నారాయణ స్వామి.
    "ఆనాటి ఘర్షణ లో సుయోధన్ రికార్డు కేసును వరద తో పరవళ్ళు తొక్కుతున్న స్వర్ణ గంగ లో కి విసిరి వేయడం నీకు గుర్తింది కదూ?"
    "ఉంది."
    "ఇది అదేనని నా అనుమానం. అదిగాని బయటపడితే నా నిర్దోషిత్వం నిరూపితమయి నట్లే. ఇక రెండవ విషయం. యుద్ద తంత్రం లో నిపుణుడైన సుయోధన్ ను ప్రభుత్వం వారు ఈ అత్యవసర ష్టితిలో దేశానికి సాయపడమని కోరుతూ సైన్యం లో ఉన్నత పదవి ఇవ్వదలిచారట!"
    "ఏమిటీ?"
    "అవును. ముఖ్యంగా అందుకే ఇప్పుడు నేను వచ్చింది. ఈ పరిస్థితులలో ఈ కృతఘ్నుడు ఇంత బాధ్యతా యుత స్థానం లో ఉండడానికి వీలులేదు. ఈ దారుణానికి అడ్డు పడాలనే నిశ్చయించు కున్నాను. తేల్చు కుంటాను ఈ దెబ్బతో, న్యాయానికి గల విలువ ఎంతో! ధర్మదేవత కు ఇప్పుడైనా నోరు వస్తుందేమో చూస్తాను!"
    "అవును, ధర్మ యుద్ధం ప్రారంభమే అయింది. ఇక నేనేమీ అని నిన్నాటంక పరచ దలుచు కోలేదు. క్షేమంగా విజయుడవు కావాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను. ఇక్కడ నేను జాగ్రత్తగా చూస్తాను."
    "క్రుతఘ్నుడి ని, శర్మా. ఇంతకాలం నీమీద ఉంచిన బాధ్యత అంతా ఒక ఎత్తు; ఇప్పుడు ప్రత్యేకంగా ఒకటి. ధర్మారావు ను కంటికి రెప్పలాగా కాచుకోవాలి.  రాజ్యలక్ష్మీ ని ఆఖరి సారిగా కలుసు కోలేక పోయాననే నా బాధ."
    "ఫర్వాలేదు. నేను ఉన్నంత కాలం ఆ ఇద్దరికీ నిశ్చింత."
    "నేను నిరాధారంగా ఉన్నాను. మరి నాకు ఏమిచ్చి పంపుతావు?"
    మారు మాట్లాడకుండా బీరువా నుంచి  కొంత డబ్బు, ఒక రివాల్వరు తీసి ఇచ్చాడు నారాయణ స్వామి. "ఇదిగో , ఆ జైలు దుస్తులు మార్చేసుకో" అంటూ తన దుస్తులు తీసి కట్టబెట్టాడు.
    ఇద్దరూ ఒక్కసారి ఒకరినొకరు తనివి తీరా చూచుకుని విడిపోయారు!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS