Previous Page Next Page 
అర్పణ పేజి 25


                              
                                    21
    హటాత్తుగా చిన్ననాటి మిత్రుడు -- అది వరకు ప్రాణానికి ప్రాణమైన మిత్రుడే అగుగాక -- జీవితపు మార్గాలన్నింటా తిరిగి తిరిగి కలుసుకొని, "అదేమిటోయ్, ఇంత మారిపోయావు?' అని అడిగితె వెర్రి నవ్వు నవ్వాలి. "ఈ చెట్టు ఎందుకింత పెద్ద దయింది? ఇంతలా ఒరిగి పోయిందేం? గోడ్డ్డుపోయినట్లు ఒక్క చిపురూ ,ఒక్క పువ్వూ కనిపించదేం?' అని అడిగినట్టే. ఈ మధ్యలో ఎన్ని సుడిగాలులు? ఎన్నెన్ని వడదేబ్బలు? ఆ మాట కొస్తే అడిగిన మిత్రుడికీ అల్లాంటి వన్నీ అనుభవం లో ఉండనే ఉంటాయి. అల్లాంట ప్పుడు ఈ అడగడం ఒకరకం సంప్రదాయిక గుణం అనుకోవాలి.
    కొన్ని దినాలుగా తనపట్ల తనెలా ఉంటున్నదీ ఆలోచించని పార్వతి కి శేఖరం తనలో మార్పును సూచించ గానే బాధ కలిగింది. తనెందుకు మారాలి? ఎవరి కోసం మారాలి? ఎప్పటికీ మారదు. అలా కాకూడదు. ఓడిపోకూడదు -- ముఖ్యంగా రాజు ఎదట.
    తను ఏవిధంగా మారి కనిపించింది? అదొక్కటి చెప్పలేదు శేఖరం. కానీ మనసుకు తెలుస్తున్నది -- తనేందుకో నిరాశ పడిపోతున్నది. ఎదిరించే వాదించే స్తైర్యం , ఇస్టానుసారం నడుచుకొనగలిగే ధైర్యం సన్నగిల్లుపోతున్నాయి. ఎందుకలా అయిపోతున్నది తను?
    ఎంత ఆలోచించినా ఊహ మాత్రపు విషయం అస్పష్టంగా తప్ప సుస్పష్టంగా కనిపించడం లేదు పార్వతికి. రాజును గురించి ఎమనుకోవాలను కున్నా ముందుకు వెళ్ళలేక పోతున్నది. అది బలహీనత అనుకోవటానికి ఆస్కారం లేదు. పిరికితనం అనుకోవటానికి అసలు వీలులేదు.
    నాలుగురోజులూ ఎవరి కోసం అగాలన్నట్లు ముందుకు పోయాయి. ఎన్ని రోజులు గడుస్తున్నా ఇవే ఆలోచనలు.
    పార్వతి తనను చూసుకుంది. తనలో ఏం లోటు? లోటు అని చెప్పలేని లోటు ఉందా? అదేవరికీ తెలియనవసరం లేదే? నిర్లక్ష్యంగా బతకాలి అంతే. ఎవరి కోసం బతకాలి? తన కోసం.
    ఒకవిధమైన గర్వ రేఖతో ఆ అమ్మాయి పెదాలు నవ్వుకున్నాయి.
    కానీ అన్నిటి కంటే ప్రధమంగా గుర్తించ వలసింది పార్వతి పట్టించు కోలేదు.
    ఆమె హృదయపు అరలలో ఏ మూల నుండో మబ్బులా వ్యాపిస్తున్న నైరాశ్యానికి ఎదురు తిరగాలనుకుంది.

    ఆ రోజు కాలేజీ లో చదువుకుంటున్న ఒక అమ్మాయి ఎక్కడో ప్రమాదవ శాత్తు ప్రాణాలు కోల్పోగా పార్వతి కి సెలవ దొరికింది అందరితో పాటు.
    మధ్యాహ్నం రాజు ఇంట్లోనే ఉన్నాడు. అంతా గమనిస్తున్నాడు.
    పార్వతి ఎప్పుడూ లేనంత అందంగా అలంకరించు కుంది. నాగరికమైన అలంకరణ కోసం ఆమె పడే అవస్థ అంతా చూస్తూనే ఉన్నాడు రాజు.
    ఏదో అజ్ఞాత కారణం వల్ల చాలా నెలలుగా పార్వతి అదొక మాదిరిగా ఉండటం చూసి, తగిన శాస్తి అవుతున్న దనుకున్నాడు.
    అనుకోకుండా హటాత్తుగా పార్వతి లో వచ్చిన సంచలనానికి కారణం ఊహించుకోవటం కష్టమైందతనికి.
    సరిగ్గా మునపటి పార్వతి లాగే కనిపించింది. ఆమెలోని జడత్వామంతా ఒక్క క్షణం లో వదిలినట్లు కళ్ళు కొంటెగా, చంచలంగా తిరుగుతున్నాయి. పెదాలు మరీ పెంకితనంగా ఉన్నాయి.
    "ఎక్కడికి?' అన్నాడు పట్టలేక.
    "అలా వెళ్ళాలి" అంది. కాశ్మీరు సిల్కు చీర అంచు అందంగా ఉందొ లేదో చూసుకుంటూ. పార్వతి ఎవరి కేలా ఉన్నా తనకు తాను అప్సరస లా కనిపించింది అద్దంలో.
    "సుభద్రగారింటి కెనా?"
    "అవును."
    రాజు అధికారం చూపించక మానడేప్పుడూ.
    "వెళ్ళద్దు, నువ్వక్కడికి!" అన్నాడు.
    ఎత్తు మడమల జోళ్ళు ఎక్కించు కొంటూ, "పుల్లమ్మ గారి మాటలే ఇంకా నమ్ముతున్నావా, రాజూ? సుభద్ర గారు చాలా మంచి వ్యక్తీ. ఇక్కడి కొచ్చినప్పుడు చూశావుగా?" అని, అతని వైపు చూడకుండానే వెళ్ళిపోయింది పార్వతి.
    నిజానికి సుభద్ర ను చూడటమే కాదు; ఆమెతో మాట్లాడాడు కూడా రాజు. మాట్లాడటమే కాదు; ఆమెలోని ఆత్మీయతా భావాన్ని స్పష్టంగా చదివాడు.
    కానీ, పార్వతీ ఆనందాన్ని చూస్తూ సహించే శక్తి అతని కెప్పుడూ లేదు. ఆమె ఒక్కొక్కసారి సంతోషంగా ఎందుకు కనిపిస్తుందో, అమితోత్సహంగా ఎందుకుంటుందో అర్ధం కాదు. తను అందనివ్వ కుండా చెయ్యాలనుకున్న ఆనందం -- తనకు లేనిది -- ఆమెకు ఆ మాత్రమైనా ఎందుకందాలి? ఎలా పొందుతున్నదని? అదీ అతని సమస్య. నిరంతరం పీడించే సమస్యే. దానితో మనో వికలత.
    రాజు చాలాసేపు శూన్యంలోకి పరీక్షిస్తూ కూర్చుండి పోయాడు. ఎవ్వరూ లేనప్పుడు -- ముఖ్యంగా పార్వతి  లేనప్పుడు- రాజు ముఖం స్వాభావికమైన మంచితనం తోనూ, సహజమైన అందంతో నూ ఉంటుంది. పార్వతి ఎదట అయి ష్టంగా , విసుగుగా ముఖం మారుస్తాడు. నటిస్తాడు. ఆమె తన నుంచి ఆశించిన దేదైనా -- చివరకు అందమైనా సరే -- లభించేటట్లు చేయ్యకూడదని కోరిక. అలాగే పార్వతికి రాజులోని అందాలు కనిపించడం లేదు. ఏ ప్రలోభంలో ముందు వెనుకలు ఆలోచించకుండా పట్టు పట్టిందో , అదే రాజు నుంచి మరింత దూరం చేసింది. తను దేన్నీ, ఎందుకోసం చేస్తున్నదో తెలియని ఉద్రేకం తప్ప మరొకటి లేదు అప్పుడు పార్వతి లో. ఇప్పుడు పార్వతి ని అయోమయం లో పడేసే విషయం అదే.
    ఏకాంతం లో ఉన్నప్పుడు రాజుకు అప్పుడప్పుడు నవ్వు వస్తుంది. ఏమిటి ఈ నాటకం? అనిపిస్తుంది. దేవుడు పార్వతిని తన కోసం పుట్టించి బలవంతంగా కట్టబెట్టి నట్లున్నాడు. చిన్నప్పటి నుంచీ ఆమె అంటే తన కిష్టమనేది లేదు. ఇష్టం ఉంటె కదా, తర్వాత ప్రేమ సంగతంటూ రావడం? అలా అనుకుని రాజు నిట్టురుస్తుంటాడు.
    నుదుటి మీద వేలుతీసి టేబిల్ దగ్గరికి వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు. స్కూలు పుస్తకాలు , పేపర్లు చూసుకోవడం లో మునిగి పోయిందతని మనసు కొద్ది సేపట్లో.
    హైస్కూల్లో రాజుకు మంచి గౌరవ స్థానం ఉంది. విద్యార్దుల మొదలు సహోద్యోగుల వరకు అంతా అభిమానిస్తారు.
    రాజు అదంతా అవసరం లేనట్లే ముభావంగా తన పని తను సాఫీగా చేసుకుంటూ పోతాడు. కాలేజీ లో పార్వతి ఎంత నిర్లిప్తంగా ఉంటుందో, స్కూల్లో రాజు అంత గంబీరంగా ఉంటాడు. ఒకరిద్దరు కిట్టని వాళ్ళు-- కంటకాల్లాంటి వాళ్ళు-- ఉన్నా లేకపోయినా ఉద్యోగ నిర్వహణ రాజు విషయం లో పెద్ద బరువు కాకుండా  హాయిని కలిగిస్తుంది.    
    రీసెస్ వేళ మాస్టర్ల గదిలో కూర్చుని సీతాకోక చిలకల లాగా తిరిగే ఆడపిల్లలను చూస్తుంటాడు కిటికీ లో నుంచి అప్పుడప్పుడు , అప్పుడతనికి ముందుగా సరోజ గుర్తు వస్తుంది. తర్వాత చిన్నప్పటి మిత్రులందరి తో గెంతడాలు, సరోజ , పార్వతులతో జగడాలు పెట్టుకుంటూ చదువుకోవడాలు ఒకటి రెండు క్షణాల్లో మూడు నాలుగు నిమిషా లో వనోయవనిక మీద సుమనోహర చిత్రాలు అవుతాయి.
    సరోజ చిలిపి చూపులూ, ఒక్కోసారి హాస్యంతో మాట్లాడే మాటలూ జ్ఞప్తి వస్తే, రాజు అదోకలా బాధపడేవాడు.
    ఇప్పుడా అందాలు తనవి కావు-- అనుకోవటానికి తన మనసు కూడా ఎదురు తిరుగుతుంది. 'అంత మటుకు సరోజ ఎవరినీ ప్రేమించలేదు' అనుకుంటాడు ఉన్నట్లుండి రాజు, అదో మహా భాగ్యంలా.
    సరోజ చదువు పూర్తీ కావటానికి ఏడాది పైన ఉంది. ఆ తర్వాత నే ఆ పిల్ల చిరకాల వాంచితం నెరవేరింది. నెల్లాళ్ళ క్రితం ఒక రోజు సరోజ ఊడి పడింది హటాత్తుగా. రాజుకు ఆనందం కలిగిందంటే అదేటు వంటిదో చెప్పడం అసాధ్యం. కానీ, పార్వతి సంతోషానికి పట్టపగ్గాలు లేవు. ఒక్క గుక్క లో ప్రపంచంలోని యావద్విషయాలూ స్నేహితురాలితో మాట్లాడేసింది.
    పసిపిల్లలాటి పార్వతి మనస్తత్వం ఇంకా పోనందుకు ఆశ్చర్యపడింది సరోజ. పార్వతిని ఆపాటికి అణుకువైన గృహిణిగా ఊహించుకుని వచ్చింది మరి-- చిన్న వయసులోనే ఒక విధమైన అనుభవం సంపాదించుకున్న సరోజ. ఆమె భావన తారుమారైంది.
    రాజు, పార్వతుల నడత స్పష్టంగా చూసింది, వాళ్ళ అతిధి గా ఉంటూనే.
    అయినా ఒక్క విషయం లో పార్వతి మారిందన్న సంగతి తెలుసుకుంది సరోజ.
    మొదట్లో లాగా సరోజ దగ్గరైనా తన విషయాలేవీ పైకి రానివ్వడం లేదు పార్వతి. సరోజ గట్టిగా అడిగినా, రాజునే కోపగించుకుంటున్నట్లు నటించినా కూడా ఆ విషయంలో తమ చాలా నిర్లక్ష్యంగా ఉన్నట్లు మాటలు తప్పించి ఊరుకునేది.
    సరోజ అంతతో ఆగకుండా మితిమీరిన చనువు వల్ల అడగరాని వని అనుకోదగినవి కూడా అడిగింది.
    నవ్వుతూ, "అతని కేం? అతనొక రాజు నువ్వేప్పుడో అన్నట్లు నేనొక రాణిని. కావలిస్తే నువ్వు ఆస్థాన వైద్యురాలుగా ఉండిపో, ఇక్కడే! ఒకవిని కూడా ఎక్కడైనా సంపాదిస్తాను." అంది పకపకమని పార్వతి.
    పార్వతి అలా నవ్వడం చాలా అరుదైంది. ఆత్మీయులు, ఆదరించే వారు దగ్గరుంటే ఆనందానికి లోటు ఉండదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS