28
సామానంతటితోనూ దిగిన కుమారుడు శ్రీహరిని చూచి ఆశ్చర్యపోయాడు బలరామయ్య. "ఏమిట్రా యిదంతా?" అని ప్రశ్నించాడు. విషయం విని తారామండలానికి లేచాడు. "ఎవడినడిగోచ్చావోయ్, నువ్వు?" అన్నాడు నిప్పులు కురిసే నేత్రాలతో.
శ్రీహరి నిర్ఘాంతపోయాడు. "అదేమిటి, నాన్నా? మీకు దగ్గర్లో వుందామనీ, ఎవరమూ దగ్గర లేకపోతే మీ మనస్సు బాగుండదనీ."
"నా మనస్సు కేమొచ్చిందిప్పుడు?" అదే తీవ్రత కంఠంలో.
"......." శ్రీహరి తలవాల్చి నిలుచున్నాడు.
"పసిపిల్లను అక్కడ ఒక్కత్తి నీ వదిలి, నేనేమైపోతున్నాననొచ్చావ్? వారానికీ, పది రోజులకూ దాన్ని నువ్వు చూస్తూంటే నాకు తృప్తిగా వుండేది. దాన్నెవరు చూస్తారు?" బాధగా అన్నాడు బలరామయ్య.
"శాంతికేమీ ఫర్వాలేదు, నాన్నా. అక్కడ దానికేమీ లోటులేదు. చెప్పే వచ్చాను. కొన్నాళ్ళు చూచి, పోనీ బాగుండకపోతే మళ్ళీ వెళ్ళిపోతాను."
"సరే, కానీయ్. ఇప్పుడేమనుకుని ఏం లాభం? ఈ పనిచేసేముందు నాకు తెలియపరచవలసింది."
"పొరపాటే, నాన్నా."
కుమారుడు వచ్చాడని అటువచ్చిన లక్ష్మీదేవి అంది: "ఆయన ధోరణి ఎప్పుడూ అంతే, నాయనా. రా లోపలికి. 'అంత దూరంనుంచి ఎంతప్రేమతో యిలా వచ్చాడో' అన్న ఆలోచన లేదు. ఆప్యాయంగా వుండేవాళ్ళు అలుసు, ఏమైపోయారో కూడా అక్కర లేనివాళ్ళకోసం అర్రులు చాచడం. దా, లోపలికి. మంచి చెడ్డలూ, సాధక బాధకాలూ నీకు తెలిసినట్టు ఎవరికి తెలుసు? బంగారు తండ్రివి."
బలరామయ్య కొంచం మెత్తబడ్డాడు. "నేను మాత్రం ఏమన్నాను, లక్ష్మీ? వాడి సంగతి నాకు తెలియదా? శాంతి ఒక్కత్తీ వుంటుందని."
"చాలిద్దురూ. అంత దూరంనుండి ప్రయాణం చేసి వచ్చినవాడికి వీధిలోనే నివ్వాళులు. రా పెదబాబూ. ఎప్పుడు భోజనం చేశావో, యేమో!"
'మక్కువలకూ, మమతలకూ మధ్య సంఘర్షణ!' తనలో తను నవ్వుకున్నాడు శ్రీహరి.
తర్వాత పద్మ అంది: "నామూలాన మీరు నాన్నగారి చేత మాటలు పడ్డారు. క్షమించండి."
"లేదు, పద్మా. నేనూ అదే ఆలోచనలో వుండగా నీ ఉత్తరం వచ్చి నా ఊహకు బలమిచ్చింది. నువ్వేం బాధపడకు."
"శాంతి ఏమంది?"
"క్రొత్తగా విశేషమేమీ లేదు."
"నేను ఉత్తరం వ్రాస్తే జవాబైనా యివ్వ లేదు."
"ప్చ్. ఏం చేస్తాం? నాటకాలూ, సంగీతాలూ! దనైకసలు మనం గుర్తు వుండే అవకాశాలే తక్కువ. కానీయ్. ఎవరేమంటేనేం? నా బాధ్యత నేను నెరవేర్చుతున్నాననే తృప్తే నాకు చాలు. శాంతి దానంతటదే మారాలి కాని మనం ఏమి చెప్పీ దానిని మార్చలేం."
"రాజా బాగున్నాడా?"
"బాగానే వున్నాడు. కాని లోలోపల చాలా బాధపడుతున్నాడు, పద్మా. రాజా విషయమే నాకు బాధగా వుంటుంది. నిర్మలంగా గడిచిపోయే అతని జీవితంలో నేనే అనవసర ఆశలు రేపి అశాంతి కలిగించాను. నేను ఎదుట లేకపోతే అయినా కొంత మరిచిపోతాడేమోననే ఉద్దేశ్యం కూడ కలిగింది."
"ఒకటి చెప్పనా?"
"ఏమిటి?"
"మా చెల్లెలు జయకూడా సౌదర్యవతి. సంగీతం వచ్చు. అతడికి తగినదే."
నిర్జీవంగా నవ్వాడు శ్రీహరి. "రాయబారం జరపమంటావా? లాభం లేదు. నాకు ముఖం చెల్లదు. ఇక్కడికీ జరిగిన అవమానాలు చాలు."
"అలాగంటారని నాకూ తెలుసు. కాని మా నాన్న ఉత్తరం వ్రాశారు. అందుకని చెప్పాను."
"వేరే ఎక్కడైనా చూడవచ్చులే."
29
బందిఖానానుండి విముక్తి అయినంత సంతోషంగా, వైజయంతీ ముఖంగా పయనించుతున్నంత ఆనందంగా ఉంది మనోరమ. ఎక్కడా నేలమీద నిలబడటం లేదు. అనుమతి తీసుకొని శాంతికూడా వెళ్ళింది మనోరమను స్టేషన్ లో దిగబెట్టే ఉద్దేశ్యంతో. మనోరమ బావ శేఖర్ కూడ చాల సరదా మనిషి. శాంతితో చాల ఆదరంగా మాట్లాడాడు.
"కలకత్తాలో ఒక స్నేహితుడు చిన్న టీపార్టీ ఏర్పాటు చేశాడు, అక్కడికి వెళ్ళి, తర్వాత స్టేషన్ కి. మీకభ్యంతరం ఉండదు కదూ, శాంతీ?" అడిగాడు శేఖర్.
శాంతి తటపటాయిస్తూ మనోరమ వైపు చూచింది. శాంతి తరఫున మనోరమ అంది: "అభ్యతరం ఉండదు."
టాక్సీ బంగళా ముందు ఆగగానే శాంతి ఆశ్చర్యపోయింది. "మీ స్నేహితుని పేరూ....." అంటూ నాన్చేసింది.
"రాజశేఖరం ఎమ్. ఎమ్ సి. మెటీరియా లజిస్ట్" అన్నాడు శేఖర్.
"ఆఁ!" ఆశ్చర్యపోయింది శాంతి.
"రాజా మీ స్నేహితుడా?" ఆశ్చర్యపోయింది మనోరమకూడ.
శేఖర్ మరింత అచ్చెరువందాడు. "ఇంతకూ మీకెలా తెలుసతడు?"
మనోరమ వివరించింది.
"ఓహో! అమెరికా వెళ్లకముందు రెండేళ్ళిక్కడ ఉద్యోగం చేశాను కదూ? అప్పుడైన స్నేహం. చాలా ఉత్తముడతడు" అన్నాడు శేఖర్.
లోపలినుండి రాజా వచ్చాడు, "హల్లో! స్వాగతం, సుస్వాగతం!" అంటూ. అంతలోనే శాంతినీ, మనోరమనూ చూచి బొమ్మలా నిల్చునిపోయాడు. శేఖర్ పరిచయం చేశాడు.
"ఓ! శాంతిగార్ని చూడడానికి వెళ్ళినప్పుడు మనోరమగార్నొకసారి చూచాను. కాని ఫలానా అని తెలియదప్పుడు. రండి. లోపలికి రండి."
ఇష్టాగోష్ఠి చాలా సరదాగా జరిగింది.
"అయితే త్వరలో కళ్యాణపత్రిక పంపిస్తా నన్నమాట!" అన్నాడు రాజా, శేఖర్ని హాస్యంగా.
శేఖర్ నవ్వాడు. "అదెలానూ జరుగుతుంది. మరి నువ్వెప్పుడు బదులు తీర్చుకుంటావ్? మా అందరి ఆహ్వానాలూ అందుకు కూర్చోవడమే నేమిటి? నీ ఊహాసుందరి నిజ జీవితంలో ఎక్కడైనా దర్శనమిచ్చిందా?"
రాజా విషయాలన్నీ తెలిసున్న శేఖర్ అసలు విషయం తెలియక హాస్యం పట్టించాడు. కాని అది వినగానే, నవ్వుతూన్న రాజా ముఖం గంభీరమైపోయింది. శాంతి వదనం ఉదాసీనమైంది. మనోరమ పరీక్షగా శాంతీ, రాజాల ముఖాలు తిలకించసాగింది. తన మాటకు అందరూ నవ్వులతో ఇంటిని ప్రతిధ్వనింపజేస్తారన్న ఉద్దేశ్యంలో ఉన్న శేఖర్ పూర్తి విరుద్ధమైన గంభీరవాతావరణాన్ని చూచి ఆశ్చర్యపోయాడు.
"ఛ! నా నిట్టంతా వ్యర్ధమైపోయింది" అన్నాడు.
రాజా ప్రయత్నపూర్వకంగా నవ్వుతూ, "విందుకు వేళౌతోంది. ఏర్పాట్లు చూస్తాను. కాస్సేపు మీరు విశ్రాంతి తీసుకోండి" అంటూ వెళ్ళిపోయాడు.
శాంతి పూలమొక్కలు చూచే మిషతో లేచి మెల్లగా వరండాలోకి జారుకుంది.
శేఖర్ నివ్వెరపోయాడు. "అతడిలా అభిమాన పడతాడనుకోలేదు. నాకు చెప్పుకోదగిన స్నేహితుడు. ఆమాత్రం చనువు ఉందనుకొని అడిగాను" అన్నాడు మనోరమతో మెల్లగా.
"అదికాదు. అందుకు కారణం........." విషయమంతా చెప్పుకొచ్చింది మనోరమ.
విని బాధపడ్డాడు శేఖర్. "చూడగానే శాంతి చాల తెలివైనదిగా భావించాను. అంతటి వ్యక్తి నెలా తృణీకరించగలిగింది?"
"దైవ నిర్ణయం" అంటూ నిట్టూర్చింది మనోరమ. "ఏమిటో చాలా చిత్రంగా ఉంటుందావిడ మనస్తత్వం. ఇంతటి వ్యక్తిత్వంగల రాజాను తృణీకరించింది. అసలు వివాహానికర్ధం లేదంది. ఇప్పుడిప్పుడు గోవిందరావనే అనాకారిని ప్రేమించానంటుంది. ఏమిటో మరి ఆవిడ మనస్సు?"
శాంతి అటు రావడంతో సంభాషణ ఆగిపోయింది.
ఎందుకు వచ్చిన అతిధులందరూ కలిసి పదిమంది. వారిలో బెనర్జీ, మోహన్ లు రాజూ, శేఖర్ల కిద్ధరికీ కూడా స్నేహితులు. అందరూ శేఖర్నీ, కాబోయే వధువైన మనోరమనూ అభినందించారు. శేఖర్ తన అమెరికా అనుభవాలు క్లుప్తంగా వర్ణించాడు. అతిథులంతా వెళ్ళిపోయాక బెనర్జీ, మోహన్ లు మిగిలిపోయారు. పూర్వపు స్నేహం పురస్కరించుకొని అనేక విషయాలపై చనువుగా మాట్లాడుకున్నారు. క్రమంగా స్వవిషయాలపైకి మరలింది చర్చ.
"రాజా ఇదివరకులా లేడు. ఏమిటో పూర్తిగా మారిపోయాడు" అని నిట్టూర్చాడు మోహన్.
"అవును" అన్నాడు బెనర్జీ. "ఫలానా అని తెలియదు కాని ఏదో మాత్రం జరిగింది. ఆఫీసూ, ఇల్లూ తప్ప ఓ షికారు లేదు, సినీమా లేదు. అసలు ఎప్పుడో తప్ప నవ్వనే నవ్వడు. బాగా చిక్కిపోయాడు కూడ. చిత్రాలు గీయటం పూర్తిగా మానేశాడు. అలా ఒంటరిగా కూర్చుని గంటలు గంటలు గడిపేస్తున్నాడు. ఏమిటో తెలియదు."
శాంతి నేరస్థురాలిలా తల వంచుకుంది. విషయమంతా విని ఉండటంవల్ల శేఖర్ రెట్టించలేదు. సంభాషణను ప్రయత్నపూర్వకంగా మరో విషయంపైకి త్రిప్పేశాడు.
మోహన్, బెనర్జీలు వెళ్ళిపోయాక శేఖర్ సిగరెట్ పీలుస్తూ వరండాలోకి వెళ్ళాడు. రాజా అనుసరించాడు. నిజానికి ఇద్దరూ ఒంటరిగా మాట్లాడుకోవడానికి శేఖర్ అలా చేశాడు.
"చూడు, రాజా. నాకు మనోరమ అంతా చెప్పింది. నువ్వు శాంతి విషయంలో యిలా దిగజారిపోవడం నాకు చాలా బాధగా ఉంది."
"వాళ్ళిద్దరూ అంత స్నేహితులా? శాంతి చెప్పేసిందా!" ఆశ్చర్యపోయాడు రాజా.
"ఆట పోనీలే, మంచిదేగా? కాని ఆ అమ్మాయి తిరస్కరించినంతమాత్రాన మరి లోకమే లేదన్నట్టు కూర్చోవడమేమిటి నువ్వు? మరో ప్రయత్నం చేయరాదూ?"
నీరసంగా నవ్వి ఊరుకున్నాడు రాజా.
"బాగా ఆలోచించుకో. నువ్వు కోరినటువంటి వ్యక్తులింకా ఉండకపోరు. నిరుత్సాహపడకు. మనస్సు మార్చుకోవడం కొద్దిగా కష్టమే అనుకో" అంటూ ఆప్యాయంగా రాజా భుజం తట్టాడు శేఖర్.
లోపల ఏకాంతంగా మిగిలిన స్నేహితురాళ్ళ మధ్య కూడా అదే సంభాషణ సాగుతూంది.
"మనూ, మీ బావ ముందు నువ్వు బొత్తిగా వెల వెల బోతున్నావ్! అందం విషయంలో నువ్వతడి కెంతమాత్రం సరిపోలవు" అంది శాంతి.
తేలికగా నవ్వేసింది మనోరమ. "మా మధ్య అటువంటివాటికి ఆస్కారం ఉండదు. అలా కలిసిపోయాం."
"మరి గోవిందరావు విషయంలో యేమేమో చెప్పావ్? నా అందానికి తగడన్నావు?"
"అబ్బబ్బ! అది వేరు సంగతి, శాంతీ. వివాహమైతే కాలేదు కానీ, మావి చిన్నప్పటినుంచీ కలిసిపోయిన జీవితాలు. పసితనంలో అందమంటే ఏమిటో తెలియదు. గుణాన్ని ప్రేమించే ఎవరి కైనా దగ్గరౌతాం అప్పుడు. అటువంటిదే మా ప్రేమ. ఆ పెనవేసుకుపోయిన అంత రాత్మల్ని ఏ కారాణాలూ విడదీయలేవు. ఇక తీయవు కూడా. కాని నేను ఆ రోజు నీకు చెప్పి నది పరిణత హృదయులూ, పరిపక్వ వయస్కులూ అయినవారి విషయంలో సంభవించే, సంభవించగల వాస్తవిక సమస్యలు. ఇప్పటికీ నేను నీకు అదే సలహా యిస్తాను. తిరిగి ఒక్క సారి రాజా విషయం ఆలోచించుకో. మీ ఇద్దర్నీ ఒకచోట చూస్తూంటే నేత్రానందకరంగా ఉంది."
"మనోరమా! ఇదేమన్నా బజారులో కొనుక్కొనే వస్తువేమిటి, ఏది నచ్చుతుందో మార్చి మార్చి చూచుకోవడానికి?" కినుకగా అంది శాంతి. మనోరమ మరి మాట్లాడలేదు.
రైలుబండి కదిలిపోతూండగా మనోరమ మరొక్కసారి హెచ్చరించింది, శాంతిని-"గోవిందరావు విషయంలో మరొక్కసారి ఆలోచించి మరీ నిర్ణయించుకో, శాంతీ" అంటూ.
శాంతి "అలాగే" అంటూండగా బండి కదిలి పోయింది.
రాజాతో కలిసి తిరుగుముఖం పట్టిన శాంతి, "శాంతీ!" అనే పిలుపు విని వెనుకకు తిరిగింది గోవిందరావు!
"ఇలా వచ్చారేం?" అనడిగింది.
"ఒక స్నేహితుడు వస్తానన్నాడు. కాని రాలేదు. మీరెందు కొచ్చినట్టు?" అని తిరిగి ప్రశ్నించాడు.
"తెలుసుగా, మీకు? మనోరమ యివ్వాళ వెళ్ళిపోయింది. వీడ్కోలు యిచ్చేందుకొచ్చాను" అంది శాంతి.
"ఓ! అవును. మరిచేపోయాను" అన్నాడు గోవిందరావు. కాని అతడెందుకో అబద్ధమాడుతున్నట్లు అన్పించింది శాంతికి, రాజాకు కూడ.
"ఓ. మీరూ ఇక్కడే వున్నారే? గుడీవినింగ్" అన్నాడు గోవిందరావు, రాజాను అంతవరకు చూడనట్టు.
"గుడీవినింగ్" అన్నాడు రాజా చిరుహాసంతో. మౌనంగా స్టేషనుదాటి బయటికి వచ్చాడు.
"ఇప్పుడు శాంతినికేతన్ వెళ్ళడానికే చాలా ఆలస్యమైపోతుంది. ఇక మీ యింటికి వస్తే యింకా ఆలస్యమైపోతుంది. మేం యిటే వెళ్ళిపోతాం, రాజశేఖరంగారూ. మీరు యింటికి వెళ్ళిపోండి" అంది శాంతి.
ఒక్కసారిగా రాజా చలించాడు. అతడేదో చెప్పేలోగా గోవిందరావు వెళ్ళి టాంగా పిలుస్తున్నాడు.
"అదెందుకు? టాక్సీ పిలవండి" అంది శాంతి.
చాలా తగ్గు స్వరంలో అన్నాడు గోవిందరావు: "రేపు సెలవేగా మనకు? కలకత్తా చూచి రేపు వెళ్ళచ్చులే."
"రేపా!" విస్మయంతో అడిగింది శాంతి.
"అవును. ఇవ్వాళ నీ హోటల్లోనో వుండచ్చు."
శాంతి రకరకాల ఆలోచనలతో ఏమీ మాట్లాడలేకపోయింది. కాని పూర్తిగా కాదని మాత్రం అనలేకపోయింది. 'మళ్ళీ అక్కడకు వెళ్తే గోవిందరావుతో స్వేచ్చగా మాట్లాడగల అవకాశం ఉండదు. ఇవ్వాళ పూర్తిగా అతడితో అన్ని విషయాలూ మాట్లాడి నిర్ణయించుకుంటే ఆతర్వాత అన్నీ యింటికి తెలియజేయవచ్చు. బహుశః గోవిందరావు కూడా అదే ఉద్దేశ్యంతో వుండి వుండవచ్చు' అనుకొని అంగీకార సూచకంగా మౌనం దాల్చింది. గోవిందరావు టాంగా బేరమాడసాగాడు. కాని రాజా హృదయంలో తీవ్ర సంచలనం రేగింది. 'శాంతి ఎంతో తెలివైనదీ, నిగ్రహం ఉన్నదీ. నేను కలుగజేసుకోవడం దేనికి లె'మ్మనుకున్నాడు. కాని మనస్సు సరిపెట్టుకోలేకపోయాడు. 'ఎంత తెలివిగల వాళ్లైనా ఒక్కోసారి గ్రుడ్డిగా ప్రవర్తిస్తారు. చూస్తూ యిలా ఊరుకోకూడదు. ఆమె నా శ్రీహరి చెల్లెలు. అంతేకాని, యిందులో నా స్వార్ధచింతన ఏమీ లేదు' అనుకున్నాడు.
